ఇవి కష్టాల బారులు
సాయంత్రం వరకు తెరుచుకోని ఏటీఎంలు
అయినా ఆశతో క్యూ కట్టిన జనం
మొరాయించిన సర్వర్లు.. కొద్దిసేపటికే మూత
బ్యాంకులకు రెండోరోజూ అదే తాకిడి
వృద్ధులు, వికలాంగులు, మహిళల పాట్లు
జన్‌ధన్ ఖాతాలపై బడాబాబుల గురి
తిప్పికొడుతున్న బ్యాంకు అధికారులు
{పభుత్వ సంస్థల్లో పాత నోట్ల స్వీకరణపై వెసులుబాటు
స్వీకరణ గడువు 14 అర్ధరాత్రి వరకు పొడిగింపు
గురువారం అర్ధరాత్రికే తెరుచు కోవాల్సిన ఏటీఎంలు శుక్రవారం సాయంత్రానికి గానీ తెరుచుకోలేదు.. వాటిలో కూడా చాలావరకు సర్వర్లు మొరాయించడంతో మూతపడ్డాయి.. ఫలితంగా రెండోరోజూ జనం బ్యాంకులకు పోటెత్తారు. చల్లర చికాకులూ వీడ లేదు.. రోజువారీ అవసరాలకు డబ్బుల్లేక కొందరు.. దండిగా పెద్దనోట్లున్నా చెల్లుబాటు కాక ఇంకొందరు కటకటలాడిపోయారు. పనులన్నీ మానుకొని గంటల తరబడి బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల వద్ద నిలువుకాళ్లపై నిరీక్షించారు. మరోవైపు చిల్లర వ్యాపారాలతోపాటు పెద్ద పెద్ద షాపుల్లోనూ పాత నోట్లు తీసుకోకపోవడం.. బ్యాంకుల నుంచి వచ్చిన రూ.2వేల నోట్లకు చిల్లర లేకపోవడంతో వ్యాపారాలు 60 నుంచి 70 శాతం పడిపోయాయి.
ఎవరి గోల వారిదన్నట్లు.. నల్లడబ్బున్న బడాబాబులు, ఏవో అవసరాల కోసం పెద్దమొత్తంలో డబ్బులు తెచ్చి ఇళ్ల వద్ద పెట్టుకున్నవారు.. చిరుజీవుల వెంట పడ్డారు. పాత నోట్ల మార్పిడికి వెంపర్లాడారు. బాబ్బాబు.. మా డబ్బు మీ అకౌంట్‌లోజమ చేయించండి.. అని వేడుకోవడం పలు చోట్ల కనిపించింది. పేదలకు ఉద్దేశించిన జన్‌ధన్ అకౌంట్లలోనూ పెద్ద నోట్లను జమ చేయించేందుకు పలు చోట్ల ప్రయత్నాలు జరిగినా.. అధికారులు అడ్డుకట్ట వేశారు. మొత్తం మీద రెండు మూడు రోజులుగా పేద ధనిక అన్న తేడా లేకుండా అందరికీ పైసాలో పరమాత్మ కనిపిస్తున్నాడు.
14వ తేదీ వరకు పొడిగింపు
పెట్రోల్ బంకులు, పాలబూత్‌లు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పాత పెద్ద నోట్ల చెలామణీ గడువును కేంద్రం పొడిగించింది. వాస్తవానికి ఈ నెల 11 వరకే ఈ కేంద్రాల్లో పాత నోట్లను స్వీకరిస్తారని మొదట ప్రభుత్వం స్పష్టం చేసినా.. పరిస్థితి ఇంకా పూర్తిగా చక్కబడకపోవడంతో ఈ గడువును ఈ నెల 14వ తేదీ అర్థరాత్రి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇది కాస్త ఊరటనిచ్చినప్పటికీ పెద్ద నోట్లకు చిల్లర లేక ఆయా కార్యాలయాలు, బంకుల్లో వాటిని తీసుకునే పరిస్థితి లేక ప్రజలు నరకం చూస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, మీసేవా కేంద్రాలు, రైతుబజార్లు, సూపర్‌బజార్లు, పెట్రోల్ బంకుల్లో చిల్లర సాకుతో పాత నోట్లను తీసుకోవడం లేదు.