రియల్టీ కుబేరులు! | Mangat Prabhat Lodha named Indias richest real estate tycoon | Sakshi
Sakshi News home page

రియల్టీ కుబేరులు!

Published Tue, Dec 10 2019 4:33 AM | Last Updated on Tue, Dec 10 2019 1:05 PM

Mangat Prabhat Lodha named Indias richest real estate tycoon - Sakshi

మంగళ్‌ ప్రభాత్‌ లోధా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలోని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లో అత్యంత ధనికుడిగా మాక్రోటెక్‌ డెవలపర్స్‌ (గతంలో లోధా డెవలపర్స్‌) అధినేత మంగళ్‌ ప్రభాత్‌ లోధా నిలిచారు. ఈయన సంపద విలువ రూ.31,960 కోట్లు. దేశంలోని రియల్టీ కుబేరుల్లో లోధా వరుసగా రెండు సార్లు అగ్రస్థానంలో నిలిచినట్లు ‘హురున్‌– గ్రోహే’ సంస్థలు ఇండియాపై సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. లోధా ప్రస్తుతం బీజేపీ ముంబై శాఖ అధ్యక్షుడు కూడా. గతేడాదితో పోలిస్తే లోధా కుటుంబ సంపద 18 శాతం వృద్ధి చెందింది. 100 మందితో కూడిన ఈ జాబితాలో మిగతా 99 మంది రియల్టీ టైకూన్స్‌ సంపదలో లోధా కుటుంబ సంపద వాటా 12 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలియజేసింది.

100 మంది సంపద 2,77,080 కోట్లు..
దేశంలో అగ్రస్థానంలో ఉన్న 100 మంది రియల్టీ టైకూన్స్‌ సంపద  విలువ రూ.2,77,080 కోట్లుగా అంచనా. గతేడాదితో పోలిస్తే ఇది 17 శాతం వృద్ధి చెందినట్లు ‘హురున్‌– గ్రోహే ఇండియా ద రియల్‌ ఎస్టేట్‌ రిచ్‌ లిస్ట్‌– 2019’ నివేదిక తెలియజేసింది. ఈ వంద మంది జాబితాలో 37 మంది ముంబైవాసులే. ఢిల్లీలో 19 మంది, బెంగళూరులో 19 మంది ఉన్నారు. ఈ పారిశ్రామికవేత్తల సగటు వయసు 59 ఏళ్లు. ఆరుగురు మాత్రం 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు. ముగ్గురు 80 ఏళ్లు పైబడిన వారు.  

8 మంది మహిళలకు చోటు..
ఈ జాబితాలో తొలిసారి 8 మంది మహిళలకు స్థానం దక్కింది. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ స్మిత వీ స్రిశ్న మహిళల్లో టాప్‌లో ఉండగా.. మొత్తం జాబితాలో 14వ స్థానంలో నిలిచారు. ఈమె సంపద  రూ.3,560 కోట్లు. తర్వాతి స్థానాల్లో డీఎల్‌ఎఫ్‌కు(కమర్షియల్‌) చెందిన రేణుక తల్వార్‌(సంపద రూ.2,590 కోట్లు) పాయ్‌ సింగ్‌ (రూ.2,370 కోట్లు), ఎమ్మార్‌ ఈజీఎఫ్‌ ల్యాండ్‌ శిల్పా గుప్తా (రూ.730 కోట్లు), సూపర్‌టెక్‌ సంగీత అరోరా (రూ.410 కోట్లు), గోపాలన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎం వసంత కుమారీ (రూ.310 కోట్లు), వాటికా కమర్షియల్‌ విభాగం కాంచన భల్లా (రూ.300 కోట్లు) నిలిచారు.

మై హోమ్‌.. యంగ్‌ టైకూన్స్‌

దేశంలోనే యువ ధనిక రియల్టీ టైకూన్స్‌గా హైద రాబాద్‌లోని మై హోమ్‌ గ్రూప్‌నకు చెందిన జూపల్లి రామురావు, జూపల్లి శ్యామ్‌రావు చోటు దక్కించుకున్నారు. వీళ్ల వయ స్సు 33 ఏళ్లు. వీరి సంపద విలువ రూ.740 కోట్లు. ఈస్ట్‌ ఇండియా హోటల్స్‌కు చెందిన పృథ్వీరాజ్‌ సింగ్‌ ఒబెరాయ్‌... వృద్ధ రియల్టీ టైకూన్‌గా నిలిచారు. ఈయన వయస్సు 90 ఏళ్లు. ఈయన సంపద రూ.3,670 కోట్లు.

రామురావు, శ్యామ్‌రావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement