ఎల్ అండ్ టీ లాభాలకు డిజిన్వెస్ట్‌మెంట్ జోష్
ముంబై: ఇంజనీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్‌అండ్ టీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2013-14, క్యూ1)లో రెట్టింపునకుపైగా నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.967 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.459 కోట్లు మాత్రమే. అయితే, క్యూ1లో డిజిన్వెస్ట్‌మెంట్ రూపంలో రూ.1,392 కోట్ల రాబడులు రావడంతో లాభాలు ఈ స్థాయిలో పెరిగేందుకు దోహదం చేసిందని కంపెనీ పేర్కొంది.
గ్రూప్ రియల్టీ వ్యాపార అనుబంధ కంపెనీలు(సబ్సిడరీలు), జాయింట్ వెంచర్ కింద ఉన్న అభివృద్ధి ప్రాజెక్టుల్లో వాటాలను ఏప్రిల్-జూన్ వ్యవధిలో విక్రయించడం ద్వారా రూ.1,382 కోట్ల అదనపు నిర్వహణ ఆదాయం సమకూరినట్లు తెలిపింది. కాగా, క్యూ1లో కంపెనీ నికర ఆదాయం రూ.18,975 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.17,241 కోట్లుగా ఉంది. 10 శాతం వృద్ధి నమోదైంది.
ఆర్డర్ల జోరు...
తొలి త్రైమాసికంలో కంపెనీ రూ.33,408 కోట్ల విలువైన ఆర్డర్లను చేజిక్కించుకుంది. ఇందులో విదేశీ ఆర్డర్ల విలువ రూ.14,574 కోట్లు కావడం గమనార్హం. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, హైడ్రోకార్బన్, హెవీ ఇంజనీరింగ్ విభాగాల్లో ఆర్డర్లను దక్కించుకున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఈ ఏడాది జూన్ 30 నాటికి గ్రూప్ ఆర్డర్ బుక్ విలువ రూ.1,95,392 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. గతేడాది ఇదేకాలంతో పోలిస్తే 13 శాతం పెరిగింది. ఇందులో విదేశీ కాంట్రాక్టుల వాటా 26 శాతంగా ఉంది.
క్యూ1లో దేశీయంగా సెంటిమెంట్ కొంత మెరుగైనప్పటికీ.. వ్యాపార పరిస్థితులు, పెట్టుబడులు ఇంకా మందకొడిగానే కొనసాగాయని ఎల్‌అండ్‌టీ అభిప్రాయపడింది. అధిక వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం వంటివి ప్రతికూలాంశాలుగా నిలిచాయని పేర్కొంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం పెట్టుబడుల పెంపునకు, అదేవిధంగా విధానపరంగా చేపడుతున్న చర్యల ప్రభావం రానున్నరోజుల్లో ప్రతి ఫలించే అవకాశం ఉందని పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 0.7 శాతం క్షీణించి రూ.1,645 వద్ద స్థిరపడింది.