market rates
-
AP: ‘ధర’హాసం.. రైతులకు ఎమ్మెస్పీ కంటే మిన్నగా మార్కెట్ రేట్లు
సాక్షి, అమరావతి: కనీస మద్దతు ధర కూడా లభించక ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం మూడున్నరేళ్లుగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. తద్వారా వ్యవసాయ, వాణిజ్య పంట ఉత్పత్తులు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు మించి రికార్డు స్థాయి రేట్లు పలుకుతున్నాయి. ధర తగ్గిన ప్రతిసారి ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుని, అధిక ధరకు పంట కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారులు కూడా అదే ధరకు కొనాల్సిన పరిస్థితి కల్పించింది. దీంతో వ్యాపారుల మధ్య పోటీని పెంచగలిగింది. ప్రత్యేకంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, మార్కెట్లో ధరలు పడిపోయినప్పుడల్లా పంటలు కొనుగోలు చేస్తోంది. ఫలితంగా మార్కెట్లో ఆయా ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోంది. పత్తి, మిరప, వేరుశనగ, సజ్జలు, మొక్కజొన్నకు ఎమ్మెస్పీకి మించి లభిస్తోంది. పొగాకు సహా ప్రధాన వ్యవసాయ, వాణిజ్య పంటలైన జొన్నలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుము, పసుపు, ఉల్లి, టమాటాకు మద్దతు ధర కల్పించింది. మార్క్‌ఫెడ్, మార్కెటింగ్ శాఖల ద్వారా మూడున్నరేళ్లలో 4.27 లక్షల మంది రైతుల నుంచి రూ.7,157 కోట్ల విలువైన 20.18 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రస్తుత సీజన్లో పత్తి, మొక్కజొన్న, సజ్జ, వేరుశనగను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచి పత్తి, మిరప, మినుము, వేరుశనగ, సజ్జలు, మొక్కజొన్న, పెసల ధరలు రికార్డు స్థాయిలో ఉండగా పసుపు, శనగ, సన్‌ఫ్లవర్ సీడ్ ధరలు ఎమ్మెస్పీకి కాస్త అటూ ఇటుగా ఉన్నాయి. రికార్డు స్థాయి ధరలు అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్‌తో మిరప రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఎమ్మెస్పీ క్వింటా రూ.7 వేలు కాగా కర్నూలు మార్కెట్లో గరిష్టంగా రూ.37 వేలు, గుంటూరు యార్డులో రూ.30 వేలకు పైగా ఉండటం గమనార్హం. నల్లతామర పురుగుతో గతేడాది మిరప దెబ్బతినగా ఈ దఫా ఆ ప్రభావం పెద్దగా లేదు. మార్కెట్లో ధరలు రికార్డు స్థాయిలో ఉండడంతో రైతన్నలు మంచి లాభాలను ఆర్జించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పత్తి పొడుగు పింజ రకం ఎమ్మెస్పీ క్వింటాల్ రూ.6,380 కాగా రూ.7,659, మధ్యస్థ పింజ రకం ఎమ్మెస్పీ రూ.6,080 కాగా రూ.7,359 పలుకుతోంది. ఈ సీజన్లో గరిష్టంగా రూ.9,500 పలికింది. మిగిలిన పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. అపరాలకు కూడా ప్రస్తుత సీజన్లో మంచి రేటు లభిస్తోంది. మినుము ఎమ్మెస్పీ రూ.6,600 కాగా ప్రస్తుతం రూ.8,400కిపైగా పలుకుతోంది. పెసలు ఎమ్మెస్పీ రూ.7,755 కాగా ప్రస్తుతం రూ.8 వేలు దాటింది. కందులు ఎమ్మెస్పీ రూ.6,300 కాగా ప్రస్తుతం రూ.7,500 పలుకుతోంది. మొక్కజొన్న ఎమ్మెస్పీ రూ.1,860 కాగా మార్కెట్లో రూ.2,600 ఉంది. వేరుశనగ ఎమ్మెస్పీ రూ.5,850 కాగా ప్రస్తుతం రూ.7 వేలు పలుకుతోంది. సజ్జలు ఎమ్మెస్పీ రూ.2,350 కాగా ప్రస్తుతం రూ.2,600 చొప్పున గరిష్ట ధర లభిస్తోంది. ఉల్లి ఎమ్మెస్పీ రూ.770 కాగా ప్రస్తుతం మార్కెట్లో రూ.1,000 నుంచి రూ.1,200 వరకు పలుకుతోంది. మార్కెట్ ఆశాజనకం మార్కెట్ చాలా ఆశాజనకంగా ఉంది. మిరప, పత్తి, మొక్కజొన్న, అపరాలు, సజ్జలు మినహా చిరుధాన్యాలు ఎమ్మెస్పీ మించి ధర పలకడం శుభ పరిణామం. నిరంతరం సీఎం యాప్ ద్వారా ధరలను పర్యవేక్షిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతులకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
చైనా పోన్జీ స్కీముల తరహాలో.. హైదరాబాద్‌లో మోసాలు.. డెవలపర్ల సంఘం హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: మార్కెట్ రేటు కంటే తక్కువ ధర అని సామాన్య ప్రజలకు ఆశ చూపిస్తూ.. తనది కాని స్థలంలో ఆకాశ హార్మ్యాలను నిర్మిస్తానని నమ్మబలుకుతూ కొనుగోలుదారులను నట్టేట ముంచుతున్న బిల్డర్లకు కంచె వేయాలని డెవలపర్ల సంఘాలు ముక్త కంఠంతో కోరాయి. అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) కింద విక్రయాలను చేపడుతున్న ప్రాజెక్ట్‌లకు అనుమతులను, రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సూచించా రు. బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలు ఆయా ప్రాజెక్ట్‌లకు రుణాలను మంజూరు చేయవద్దని కోరాయి. నిర్మాణ రంగానికి భద్రత, భరోసా కల్పించకపోతే గ్లోబల్ హైదరాబాద్ ఎదుగుదలకు యూడీఎస్ డెవలపర్లు విరోధంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ఎండీఏ, రెరాలకు శాశ్వత కమిషనర్లను నియమించడంతో పాటు ఉద్యోగుల సంఖ్యను పెంచాలని, ప్రజలలో విస్తృతమైన అవగాహన చేపట్టాలని సూచించారు. శుక్రవారం క్రెడాయ్, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ సంఘాల సమావేశం జరిగింది. ► గతంలో చైనా కంపెనీలు పోన్జీ స్కీమ్‌లతో ఎలాగైతే అమాయక కస్టమర్ల నుంచి కోట్ల రూపాయాలను కొల్లగొట్టాయో.. అదే విధంగా యూడీఎస్ విక్రయాలతో కొందరు డెవలపర్లు తయారయ్యారని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణా రావు ఆరోపించారు. ప్రారంభ దశలోనే ఆయా డెవలపర్లను ఆడ్డుకోకపోతే సామాన్య, మధ్యతరగతి ప్రజల పెట్టుబడులు గాల్లో కలిసిపోతాయని తెలిపారు. గత ఏడాదిన్నర క్రితం ఒకట్రెండు యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసిన కస్టమర్లు నిర్మాణ పనులు ప్రారంభం కాక, కట్టిన డబ్బులూ వెనక్కి ఇవ్వకపోవటంతో రోజూ డెవలపర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. సంఘటిత నిర్మాణ రంగానికి యూడీఎస్ ఒక కేన్సర్ మహమ్మారి లాగా తయారవుతోందని... దీన్ని ప్రాథమిక దశలోనే నిర్మూలించాలి. లేకపోతే ఝాడ్యం ముదిరి బ్రాండ్ హైదరాబాద్‌ను దెబ్బ తీస్తుందని పేర్కొన్నారు. ► హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, రెరా నిబంధనల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేయడమే పరమావధిగా యూడీఎస్ ప్రాజెక్ట్‌లు చేపట్టడుతున్నారు. మార్కెట్ రేటు కంటే 50 శాతం తక్కువ ధరకు ఆఫర్ చేస్తుండటంతో కస్టమర్లు ఆశ పడుతున్నారు. ముందు వెనకా ఆలోచించుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. నిర్మాణ అనుమతులు రాకపోయినా, ఆయా స్థలానికి న్యాయపరమైన సమస్యలు ఎదురైనా లేదా సంబంధిత భూమి కన్జర్వేషన్ జోన్ లేదా 111 జీవో పరిధిలో ఉన్నా నిర్మాణ అనుమతులు రావు. కస్టమర్ల పెట్టుబడులకు భరోసా లేదు. భవిష్యత్తులో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలకు తామూ బాధ్యత వహించాల్సి వస్తుందని కొనుగోలుదారులకు అర్థం కావట్లేదు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా కొనుగోలుదారులు మోసపోయామని తెలుసుకొని వినియోగదారుల ఫోరంకు, రెరాకు వెళ్లినా లాభం ఉండదు. సివిల్ కోర్ట్‌కు పోతే ఎన్నేళ్లు పడుతుందో బహిరంగ రహస్యమే. ► గృహ కొనుగోలుదారులకు భద్రత, రక్షణ కల్పించాలనే ఉద్దేశంలో రెరా చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ, మన రాష్ట్రంలో రెరా అమలు అంతంత మాత్రంగానే సాగుతోందని క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి అన్నారు. హైదరాబాద్ మార్కెట్లో 60–70 శాతం కొనుగోళ్లు అంతిమ గృహ కొనుగోలుదారులు, 30–40 శాతం పెట్టుబడిదారులుంటారు. ఇలాంటి చోట కస్టమర్ల పెట్టుబడులకు భద్రత కల్పించాల్సిన రెరా చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అక్రమ పద్దతిలో నిర్మాణాలు, విక్రయాలు చేపడుతున్న డెవలపర్లను ఎలా నియంత్రించాలనే అంశంపై ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు డెవలపర్ల సంఘాలు ప్రభుత్వంతో కలిసి వస్తాయని తెలిపారు. ► రెరాలో డెవలపర్లే కాదు కొనుగోలుదారులకు శిక్ష ఉంటుంది. భవిష్యత్తులో ఏమైనా జరిగితే కోర్ట్‌కు వెళ్లినా లాభం ఉండదు. రెరాలో నమోదు కాని ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేయాలన్న ప్రాథమిక నిబంధనలను మరిచిపోయి తక్కువ ధర అని ఆశ పడి యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసినందుకు మీకు జరిగిన నష్టాన్ని వినియోగదారుల ఫోరం, రెరా న్యాయం చేయవని క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ డీ మురళీకృష్ణా రెడ్డి తెలిపారు. సామాన్య, మధ్యతరగతి నుంచి ముందస్తు సొమ్ము వసూలు చేసి.. అక్రమ డెవలపర్లు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. ఎవరు చేస్తున్నారో చెప్పరు! యూడీఎస్, ప్రీలాంచ్లలో కొనుగోలు చేయొద్దని, కష్టార్జితాన్ని బూదిదపాలు చేసుకోవద్దని కొనుగోలుదారులకు డెవలపర్ల సంఘాలు సూచిస్తుండటం ప్రశంసించదగ్గ పరిణామమే. కానీ, ఆయా ప్రాజెక్ట్‌లను ఎవరు చేపడుతున్నారో తెలపమని విలేకరులు ప్రశ్నించగా.. ప్రమోటర్ల పేర్లు బయటకు రాకుండా ఏజెంట్లతో దందా నడిపిస్తున్నారని సమాధానం ఇచ్చారు. వాట్సాప్, ట్విటర్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సాధారణంగా సంఘటిత డెవలపర్లకు ఏజెంట్లకు 1.5–2 శాతం కమీషన్ ఇస్తుంటే.. యూడీఎస్ డెవలపర్లు మాత్రం 5–10 శాతం కమీషన్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో వివరాలు ఉన్నాయని, కానీ, చర్యలు తీసుకోవటంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. ఆడిట్ బుక్స్ పరిశీలిస్తే తతంగం బయటపడుతుందని పేర్కొన్నారు. డెవలపర్ల సంఘాల దృష్టికి వచ్చిన యూడీఎస్ ఏజెంట్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి, ట్రెడా జనరల్ సెక్రటరీ సునీల్ చంద్రారెడ్డి తదితరలు పాల్గొన్నారు. ► జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెరా కార్యాలయాలలో ఇన్ఫర్మేషన్ గైడెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. గృహ కొనుగోలుకు ముందు కొనుగోలుదారులు ఆయా కేంద్రాలను సంప్రదిస్తే.. వారికి మార్గనిర్ధేశనం చేయాలని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు సూచించారు. దీంతో అమాయక ప్రజలు మోసపోకుండా ఉండటంతో పాటు ప్రభుత్వం, నిర్మాణ సంస్థలతో నమ్మకం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. కన్జర్వేషన్ జోన్, 111 జీవో పరిధిలోనూ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని దీంతో హైదరాబాద్ అభివృద్ధికి విఘాతం ఏర్పడుతుందని తెలిపారు. హైదరాబాద్ గ్రోత్ రేట్‌ను అంచనా వేయకుండా నిర్మాణ రంగంలో ఏమాత్రం అనుభవం లేకుండా ఆకాశంలో మేడలు కడతామని ఆశచూపిస్తూ అమాయకులను కలలను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ► చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకొని కొందరు డెవలపర్లు అక్రమంగా ప్రాజెక్ట్‌లు, విక్రయాలు చేపడుతున్నారు. తక్కువ ధర అని ఆశ చూపుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. సంఘటిత నిర్మాణ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డెవలపర్లపై కూడా ఉందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) ప్రెసిడెంట్ సీ ప్రభాకర్‌రావు అన్నారు. అందుకే యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన చేపట్టనున్నామని పేర్కొన్నారు. ► నోయిడా, గ్రేటర్ నోయిడాలో విక్రయించిన యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో ధర మార్కెట్ రేటుతో సమానంగా విక్రయించారు. అయినా సరే అక్కడ నిర్మాణాలు పూర్తి చేయలేకపోయారు. అలాంటిది మన దగ్గర మార్కెట్ రేటు కంటే సగం ధరకే యూడీఎస్ స్కీమ్‌లో విక్రయాలు చేపడుతున్నారు. మరి, ఇక్కడెలా నిర్మాణాలు చేయగలరనేది కొనుగోలుదారులు ప్రశ్నించుకోవాలని ట్రెడా ప్రెసిడెంట్ ఆర్ చలపతిరావు అన్నారు. చిన్న వస్తువును కొంటే ఐఎస్ఐ మార్క్ ఉందా? బ్రాండెడేనా అనా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకునే ఈ రోజుల్లో.. లక్షల్లో వెచ్చించే గృహ కొనుగోలు సమయంలో డెవలపర్ చరిత్ర, నిర్మాణ అనుమతులు, రెరా నమోదు వంటి కీలక అంశాలు పరిశీలించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. రిస్క్ లేని చోట పది గజాలు తక్కువైనా మంచిది గడువు లోగా నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశం చేసే వీలుంటుందని పేర్కొన్నారు. ఓపెన్‌స్పేస్, పార్క్‌లు, సెట్‌బ్యాక్స్, పర్మిషన్స్, అంతస్తుల సంఖ్య.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కొనుగోలుకు ముందే పరిశీలించుకోవాలని సూచించారు. ఎకరం రూ.50 కోట్లు ఉంటే 50 అంతస్తులు, రూ.40 కోట్లు ఉంటే 40 ఫ్లోర్లు.. ఇలా ఎంత రేటు ఉంటే అన్ని అంతస్తులు నిర్మిస్తామని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే కొనుగోలుదారులు రేటు తక్కువ చూపించేందుకే ఈ అసత్య ప్రచారమని తెలిపారు. -
Gold Price : బంగారం మరింత ప్రియం
బంగారం ధర మరోసారి పెరిగింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము 24 రూపాయలు పెరిగింది. నిన్న గ్రాము బంగారం ధర రూ. 4,351 ఉండగా ఈ రోజు ధర రూ. 4,375కి చేరుకుంది. మొత్తంగా పది గ్రాముల బంగారం ధర ఈ రోజు రూ. 43,750లుగా ఉంది. ఒక పెట్టుబడిగా ఉపయోగించే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర క్యారెట్‌కి రూ. 26 వంతున పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,730కి చేరుకుంది. నిన్న ఈ బంగారం ధర రూ. 47,470గా ఉంది. -
పడిపోయిన ‘పప్పు’!
ఖమ్మం వ్యవసాయం : పప్పు పంటల దిగుబడి గణనీయంగా తగ్గింది.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించక.. పెట్టిన పెట్టుబడులు రాక.. కూలీల ఖర్చులు పూడక.. సాగు వేల నుంచి వందల ఎకరాలకు పడిపోయింది. ధర వచ్చేంత వరకు పంట నిల్వ చేసుకున్నా.. వచ్చే పరిస్థితి కనిపించక రైతులు దిగాలుపడుతున్నారు. పప్పు పంటల సాగుపై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. రబీలో నీటి వనరులున్న ప్రాంతాలు.. సాగర్ ఆయకట్టు పరిధిలో ఆరుతడి పంటలనే సాగు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆరుతడి పంటల కిందకు వచ్చే పప్పు దినుసుల పంటలే కాకుండా మొక్కజొన్న పంటకు రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. దాదాపు అన్ని మండలాల్లో ఆయా పంటలను సాగు చేస్తారు. ఇదిలా ఉండగా.. మధిర డివిజన్ పప్పు దినుసుల పంటలకు రాష్ట్రంలోనే పెట్టింది పేరు. ఇక్కడి వ్యవసాయ పరిశోధనా స్థానం వివిధ రకాల పెసర రకాలను పండిస్తుంది. కాగా.. వ్యవసాయ శాఖ ఖరీఫ్‌లో పప్పు దినుసుల సాధారణ సాగును 10,335 హెక్టార్లుగా, రబీలో 2,357 హెక్టార్లుగా నిర్దేశించింది. కానీ.. సాధారణ సాగు లక్ష్యాన్ని కూడా పంటల సాగు చేరుకోలేకపోయింది. 2014 నవంబర్, డిసెంబర్లో పప్పు దినుసుల పంటలకు బాగా డిమాండ్ వచ్చింది. కందుల ధర క్వింటాల్‌కు ఏకంగా రూ.13వేలకు చేరింది. పెసల ధర క్వింటాల్‌కు రూ.9వేల మార్కును తాకింది. మినుముల ధర కూడా దాదాపు అంతే ఉంది. పప్పు దినుసుల పంటలు ఆఫ్రికన్ దేశాల నుంచి మన దేశానికి కూడా దిగుమతి చేసుకున్నారు. దీంతో ఈ పంటకు డిమాండ్ పెరగటంతో 2015–16లో కేంద్రం పత్తి సాగును తగ్గించి, దాని స్థానంలో పప్పు పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పెసర, కంది పంటలు సాగు చేయాలని విస్తృత ప్రచారం చేసింది. 2015–16లో పెసర సాధారణ సాగుకు 5 రెట్లు పెరిగింది. ఏకంగా 26 వేల ఎకరాల్లో ఉమ్మడి జిల్లాలో సాగు చేశారు. ఇక కంది పంటను దాదాపు 10 వేల ఎకరాల్లో సాగు చేశారు. తీరా పంట చేతికందే సమయానికి ధర గణనీయంగా పడిపోయింది. పంటను మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. అప్పుడు పండించిన పంట నిల్వలు ఇంకా ప్రభుత్వం వద్దే ఉన్నాయి. అప్పటి నుంచి ఆయా పంటలకు ధర రాకపోవడంతో రైతులు వాటి సాగుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. 2017–18లో ఖరీఫ్‌లో వర్షాలు అనుకూలించకపోవటం.. వేరే పంటలకు అవకాశం లేక దిక్కుతోచని స్థితిలో అక్కడక్కడ పెసర పంట చేశారు. ప్రస్తుత రబీలో సాగర్ నుంచి ఆరుతడి పంటలకు నీటిని విడుదల చేసినా.. రైతులు పప్పు పంటలను సాగు చేయకుండా మొక్కజొన్నకు ప్రాధాన్యం ఇచ్చారు. ‘మద్దతు’ లభించని దుస్థితి.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పప్పు దినుసుల పంటకు లభించని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది కేంద్రం పెసలకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,575, కందులకు రూ.5,450, మినుములకు రూ.5,400 ప్రకటించింది. ఈ ధరలు ప్రైవేటు మార్కెట్లో లేవు. పెసల ధర రూ.3,500 నుంచి రూ.4వేలకు మించి లేదు. కందులు, మినుముల ధర కూడా అంతే ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ధరలకన్నా ప్రైవేటు మార్కెట్లో రూ.1,400 నుంచి రూ.2వేల వరకు తేడా ఉంది. పెట్టుబడులు కూడా.. ప్రకృతి విపరీత్యాల వల్ల పప్పు దినుసుల దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ఎకరాకు కేవలం రెండు, మూడు క్వింటాళ్లకు మించటం లేదు. ఎకరాకు పెట్టుబడులు రూ.15వేలకు మించుతున్నాయి. ధర చూస్తే కనీసం మద్దతు స్థాయిలో కూడా లేకపోవడంతో రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. పెట్టుబడిలో సగం కూడా రాని పరిస్థితి. ‘వేల’ నుంచి ‘వందల’కు.. గత పరిస్థితులు ప్రస్తుతం కనిపించటం లేదు. ఉమ్మడి జిల్లాలో 20 వేల నుంచి 30 వేల ఎకరాల వరకు పెసర పంట సాగు చేసేవారు. అటువంటిది.. 10 వేల ఎకరాల లోపునకు పడిపోయింది. రబీలో దారుణంగా 600 ఎకరాలకు పడిపోయింది. కంది, మినుము సాగు కేవలం 300 ఎకరాలకు పరిమితమైంది. నిల్వలు పేరుకుపోవటంతోనే.. కంది పప్పు ధర హోల్‌సేల్‌లో కిలో ఒక్కింటికి రూ.40 చొప్పున విక్రయిస్తుండగా, రిటైల్‌లో రూ.55 నుంచి రూ.65 వరకు విక్రయిస్తున్నారని, పెసర పప్పు హోల్‌సేల్ ధర రూ.60 వరకు ఉండగా.. రిటైల్ ధర రూ.70 నుంచి రూ.75 వరకు ఉందని విశ్లేషిస్తున్నారు. పంట నిల్వలు పేరుకుపోవటంతోనే ఈ పరిస్థితి నెలకొందని వ్యాపారులు చెబుతున్నారు. పంట సాగు తగ్గించాం.. పెసర, కంది పంటలకు తగిన ధర లేదు. కనీసం పెట్టుబడులు కూడా రావటం లేదు. దీంతో సాగు తగ్గించాం. ఏటా నాలుగెకరాల వరకు పెసర, కంది పంటలను సాగు చేసేవాన్ని. ఇప్పుడు రెండెకరాల్లో మాత్రమే పంటలు వేశా. – నున్నా వెంకటేశ్వర్లు, అనంతసాగర్, నేలకొండపల్లి మండలం కంది వేసి నష్టపోయా.. కంది పంట వేసి నష్టపోయా. రెండున్నర ఎకరాల్లో పంట వేస్తే.. నాలుగు క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. క్వింటాకు రూ.3,800 ధర మాత్రమే పెట్టారు. మద్దతు ధర లభించలేదు. మొత్తంగా రూ.25వేలకు పైగా నష్టపోయా. – బైరి శ్రీను, వెంకటగిరి, ఖమ్మం రూరల్ మండలం -
ధరహాస్యం
అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి..! మార్కెట్ మాయాజాలం కష్టం అన్నదాతలకు లాభం దళారులకు ధరల్లో వ్యత్యాసం రైతుల నష్టం సుమారు రూ.100 కోట్ల నష్టం పత్తికొండకు చెందిన హనుమన్న అనే రైతు గత ఏడాది ఖరీఫ్‌లో మూడు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. ఆరు క్వింటాళ్ల పంట వచ్చింది. దీనిని నవంబర్‌లో ఆదోని వ్యవసాయ మార్కెట్‌కు తీసుకెళ్లగా క్వింటాకు రూ.3500 ధర లభించింది. ఇదే రైతు ఖరీఫ్‌లో విత్తనం వేసేందుకు వేరుశనగ కొనుగోలు చేయబోగా క్వింటా ధర రూ.7వేలు చెప్పారు. షాక్ తిన్న రైతు వేరుశనగను కొనలేక కంది పంట సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. రైతులు పండించిన పంట మార్కెట్లోకి వచ్చినప్పుడు ధరలు ఎలా ఉన్నాయి. రైతుల పంట లేనప్పుడు ఎలా ఉన్నాయో దీని ద్వారా స్పష్టమవుతోంది. కర్నూలు(అగ్రికల్చర్): వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి, రేయింబవళ్లు కష్టించి పండించిన పంటలు మార్కెట్‌కు వచ్చినప్పుడు గిట్టుబాటు ధర ఉండడం లేదు. పంట లేని సమయంలో ధరలు చుక్కలను చూపుతున్నాయి. పంట ఉత్పత్తులు వచ్చిన సమయంలో దళారులు ప్రవేశించి తక్కువ రేటుకే వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా కొనుగోలు చేసిన వాటిని గోదాముల్లో నిల్వ చేసి.. రైతుల దగ్గర వ్యవసాయ ఉత్పత్తులు ఖాళీ అయినప్పు డు ధర పెంచేస్తున్నారు. కష్టం, పెట్టుబడి రైతులది..లాభాలు మాత్రం దళారులు దండుకుంటున్నారు. జిల్లా లో మార్కెటింగ్ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని రకాల పంట ఉత్పత్తులకు ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వేరుశనగ ధ ర చుక్కలనంటుతోంది. కంది, పత్తి, మొక్కజొన్న, వాము, పొద్దుతిరుగుడు తదితర అన్ని రకాల పంటలు దానితో పోటీపడుతున్నాయి. రైతులను ముంచిన వేరుశనగ.. గత ఏడాది ఖరీఫ్‌లో వేసిన వేరుశనగ అక్టోబర్‌లో మార్కెట్లోకి వచ్చింది. అక్టోబర్ నుంచి జనవరి వరకు క్వింటాలు అత్యధిక ధర రూ.4500 మించలేదు. రైతులకు సగటున లభించిన ధర రూ.3000 నుంచి రూ.3500 వరకే. రైతుల దగ్గర వేరుశనగ ఖాళీ అయిన తర్వాత అంటే ఫిబ్రవరి నుంచి ధర పెరగడం మొదలైంది. నేడు దాని గరిష్ట ధర రూ.6,300కు చేరింది. దీన్ని బట్టి చూస్తే రైతులకు నష్టం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. అక్టోబర్ నుంచి జనవరి వరకు ఒక్క కర్నూలు మార్కెట్ యార్డుకే 3.50 లక్షల క్వింటాళ్లు వచ్చింది. ఇప్పటి ధరతో పోలిస్తే క్వింటాలుపై రైతులు రూ.2 వేలు నష్టపోయారు. అలాగే జనవరి వరకు పత్తికి క్వింటాలు ధర రూ.3500 మించలేదు. నేడు రూ.4500 నుంచి రూ.5 వేలకు చేరింది. జిల్లాలో వాము భారీగానే పండిస్తారు. జనవరి వరకు వాము ధర క్వింటాలుకు రూ.11 వేలు మించలేదు. ప్రస్తుతం వాము ధర క్వింటాలుకు దాదాపు 15 వేలకు చేరింది. రైతులు పండించిన కంది మార్కెట్‌కు వచ్చినప్పుడు క్వింటాలు ధర రూ.4500 నుంచి రూ.5 వేల వరకు ఉంది. నేడు కంది ధర రూ.6,600కు చేరింది.