ధరహాస్యం
అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి..!
మార్కెట్ మాయాజాలం
కష్టం అన్నదాతలకు
లాభం దళారులకు
ధరల్లో వ్యత్యాసం
రైతుల నష్టం సుమారు
రూ.100 కోట్ల నష్టం
పత్తికొండకు చెందిన హనుమన్న అనే రైతు గత ఏడాది ఖరీఫ్‌లో మూడు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. ఆరు క్వింటాళ్ల పంట వచ్చింది. దీనిని నవంబర్‌లో ఆదోని వ్యవసాయ మార్కెట్‌కు తీసుకెళ్లగా క్వింటాకు రూ.3500 ధర లభించింది. ఇదే రైతు ఖరీఫ్‌లో విత్తనం వేసేందుకు వేరుశనగ కొనుగోలు చేయబోగా క్వింటా ధర రూ.7వేలు చెప్పారు. షాక్ తిన్న రైతు వేరుశనగను కొనలేక కంది పంట సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. రైతులు పండించిన పంట మార్కెట్‌లోకి వచ్చినప్పుడు ధరలు ఎలా ఉన్నాయి. రైతుల పంట లేనప్పుడు ఎలా ఉన్నాయో దీని ద్వారా స్పష్టమవుతోంది.
కర్నూలు(అగ్రికల్చర్):
వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి, రేయింబవళ్లు కష్టించి పండించిన పంటలు మార్కెట్‌కు వచ్చినప్పుడు గిట్టుబాటు ధర ఉండడం లేదు. పంట లేని సమయంలో ధరలు చుక్కలను చూపుతున్నాయి. పంట ఉత్పత్తులు వచ్చిన సమయంలో దళారులు ప్రవేశించి తక్కువ రేటుకే వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా కొనుగోలు చేసిన వాటిని గోదాముల్లో నిల్వ చేసి.. రైతుల దగ్గర వ్యవసాయ ఉత్పత్తులు ఖాళీ అయినప్పు డు ధర పెంచేస్తున్నారు. కష్టం, పెట్టుబడి రైతులది..లాభాలు మాత్రం దళారులు దండుకుంటున్నారు. జిల్లా లో మార్కెటింగ్ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని రకాల పంట ఉత్పత్తులకు ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వేరుశనగ ధ ర చుక్కలనంటుతోంది. కంది, పత్తి, మొక్కజొన్న, వాము, పొద్దుతిరుగుడు తదితర అన్ని రకాల పంటలు దానితో పోటీపడుతున్నాయి.
రైతులను ముంచిన వేరుశనగ..
గత ఏడాది ఖరీఫ్‌లో వేసిన వేరుశనగ అక్టోబర్‌లో మార్కెట్‌లోకి వచ్చింది. అక్టోబర్ నుంచి జనవరి వరకు క్వింటాలు అత్యధిక ధర రూ.4500 మించలేదు. రైతులకు సగటున లభించిన ధర రూ.3000 నుంచి రూ.3500 వరకే. రైతుల దగ్గర వేరుశనగ ఖాళీ అయిన తర్వాత అంటే ఫిబ్రవరి నుంచి ధర పెరగడం మొదలైంది. నేడు దాని గరిష్ట ధర రూ.6,300కు చేరింది. దీన్ని బట్టి చూస్తే రైతులకు నష్టం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. అక్టోబర్ నుంచి జనవరి వరకు ఒక్క కర్నూలు మార్కెట్ యార్డుకే 3.50 లక్షల క్వింటాళ్లు వచ్చింది.
ఇప్పటి ధరతో పోలిస్తే క్వింటాలుపై రైతులు రూ.2 వేలు నష్టపోయారు. అలాగే జనవరి వరకు పత్తికి క్వింటాలు ధర రూ.3500 మించలేదు. నేడు రూ.4500 నుంచి రూ.5 వేలకు చేరింది. జిల్లాలో వాము భారీగానే పండిస్తారు. జనవరి వరకు వాము ధర క్వింటాలుకు రూ.11 వేలు మించలేదు. ప్రస్తుతం వాము ధర క్వింటాలుకు దాదాపు 15 వేలకు చేరింది. రైతులు పండించిన కంది మార్కెట్‌కు వచ్చినప్పుడు క్వింటాలు ధర రూ.4500 నుంచి రూ.5 వేల వరకు ఉంది. నేడు కంది ధర రూ.6,600కు చేరింది.