వైఎస్ జగన్‌కు సమస్యలు విన్నవించుకుంటున్న పత్తి రైతులు
కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో రైతు చాకలి శేషన్న 3.7 ఎకరాల పొలంలో పత్తిని సాగుచేశారు. అనూహ్యంగా మొన్న కురిసిన వర్షాలకు.. మొక్కబాగానే ఎదిగింది. ఎకరాకు సుమారు 30 నుంచి 35వేల రూపాయల పెట్టుబడికూడా పెట్టారు. శేషన్న భార్య, ఇద్దరు కొడుకులు, కోడళ్లు.. మొత్తం కుటుంబంలోని ఆరుగురు పెద్దవాళ్లు... ఇదే పొలంమీద తన ఆశలు పెట్టుకున్నారు. కాని గులాబీరంగు పురుగు వారిని నట్టేటాముంచేసింది. పత్తికాయలోకి పురుగు చొరబడి మొత్తం తినేసింది. ఇప్పుడు 3.7 ఎకరాలకు కనీసం 4 క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదు. దీన్ని మార్కెట్‌కు తరలించి అమ్ముదామంటే క్వింటాలుకు కేవలం రూ.1500 నుంచి రూ.2 వేలు మాత్రమే ఇస్తున్నారు. కూలీకూడా గిట్టే పరిస్థితి లేకపోవడంతో పొలంలోనే వదిలేయాలని ఆ కుటుంబం నిర్ణయించుకుంది.
సాక్షి, కర్నూలు: ఈ ఏడాది రబీ పంటగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సుమారు 6.37 లక్షల హెక్టార్లలో పత్తిని పండిస్తే అందులో అత్యధికంగా 2.57 లక్షల హెక్టార్లమేర కర్నూలులోనే సాగుచేశారు. నంద్యాల బెల్టు మొదలుకుని.. ఇటు కర్నూలు పశ్చిమప్రాంతానికి వచ్చే కొద్దీ పత్తిసాగు విస్తృతంగా ఈ పంట వేశారు. గడచిన నాలుగేళ్లుగా అష్టకష్టాలు పడ్డ రైతులు.. గత ఆగస్టులో కురిసిన భారీవర్షాలతో పెద్ద ఆశలే పెట్టుకున్నారు. మొదట్లో మొక్కలు బాగా ఎదిగాయి. మంచి దిగుబడుల కోసం రైతులు.. మరింత జాగ్రత్తగా పత్తి తోటలను సాకారు. కాని అంతలోనే గులాబీరంగు పరుగు.. పత్తిపంటలను నాశనం చేసేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ ఇది ఒకేసారి పాకింది. సాధారణ వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసినప్పుడు పంటలను నష్టపరిచే పురుగుల, తెగుళ్లను గమనించి ఆమేరకు వెంటనే కార్యాచరణ ప్రణాళిక తయారుచేయాలి. కాని ఈసారి మాత్రం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పూర్తిగా నంద్యాల ఉప ఎన్నికల్లో మునిగిపోయారు. లింగాకర్షక బుట్టలను వెంటనే రైతులకు అందించి పత్తి పొలాల్లో పెట్టి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాని ప్రభుత్వం ఎక్కడా ఆ పని చేయలేదు. ఈ ఏడాది సబ్సిడీ మీద కూడా ఈ బుట్టలను సరఫరా చేయలేదని రైతులు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని లక్షల హెక్టార్లలో పంట నాశనం అయిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు భారీగా నష్టపోయారు.
మరోవైపు ఉల్లిరైతు కంట కన్నీళ్లు ఆగడంలేదు. రాష్ట్రంలో అత్యధికంగా ఈ పంటను కర్నూలు రైతులు సాగుచేస్తున్నారు. తర్వాత కడప, అనంతపురం జిల్లాల్లోకూడా ఉల్లిసాగు కనిపిస్తోంది. రైతులనుంచి సరుకు పూర్తికాగానే.. ఒకేసారి రిటైల్ దుకాణాల్లో ధరలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రిటైల్ దుకాణాల్లో ఉల్లి ధర కిలో దాదాపు రూ.50లు పలుకుతోంది. కాని ఇక్కడ రైతులకు దక్కే ధర కిలో 3 నుంచి 4 రూపాయలు మాత్రమే. గతేడాది గిట్టుబాటు ధరలు కూడా రాకపోవడంతో.. రైతులు పొలాల్లోనే ఉల్లిని వదిలేసిన సందర్భాలు ఉన్నాయి.
మొక్క జొన్న రైతు పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. ప్రస్తుతం క్వింటాలుకు 1180 రూపాయల చొప్పున కొనుగోలుచేస్తున్నారు. కనీస మద్దతు ధర రూ.1420లు ప్రకటించినప్పటికీ.. రైతుకు మాత్రం ఆ ధర కూడా దక్కడంలేదు. కొంతమంది టీడీపీ నేతలు రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వాటిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించి.. క్వింటాలుకు దాదాపు 250 నుంచి 300 రూపాయలవరకూ సంపాదిస్తున్నారని కొంతమంది రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోని రాష్ట్రంలో అత్యధికంగా 37వేల హెక్టార్లలో మొక్కజొన్నను సాగుచేస్తున్నారు. ఈ రబీ సీజన్‌లో ఒక్క కర్నూలు జిల్లాలోనే 64752 హెక్టార్లలో కందిని పండిస్తున్నారు. ప్రభుత్వం రూ.5450 మద్దతు ధర ప్రకటించినప్పటికీ.. రైతు మాత్రం రూ.3500కు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ రబీ సీజన్‌లో పంట వచ్చాక.. ఈ ధరైనా ఉంటుందా, లేదా అని రైతుల ఆందోళన చెందుతున్నారు. శనగ రైతుల పరిస్థితి కూడా అలానే ఉంది. రాష్ట్రంలోనే అధికంగా కర్నూలు జిల్లాలో 1.4 లక్షల హెక్టార్లమేర పంటను సాగుచేస్తున్నారు. కూలీ డబ్బులు గిట్టుబాటు కావాలన్నా.. కనీసం రూ.6వేలు ధర ఉండాలన్నది రైతుల డిమాండ్. కాని ప్రస్తుతం 4400 రూపాయలు కనీస మద్దతు ధరగా ఉంది. గడచిన సీజన్‌లో రూ.3 వేలకే తెగనమ్ముకున్న రైతులు.. ఈసారి ధరపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పత్తికొండ, కోడుమూరు ప్రాంతంలో ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌కు రైతులు తమ కష్టాలు చెప్పుకున్నారు. దళారుల కారణంగా ఎలా నష్టపోతున్నదీ పలు సందర్భాల్లో వివరించారు. పంట పొలాల పరిశీలన సమయంలో, మార్గమధ్యలో అర్జీలద్వారా రైతుల నుంచి వైఎస్ జగన్ సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కోడుమూరులో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో కొన్ని కీలక హామీలను వెల్లడించారు. ప్రతిఏటా మే మాసంలో పెట్టుబడి సహాయం కింద రూ.12500 ఇస్తామన్న ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తంచేశారు. పంటలకు గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వం నుంచి రూ.3వేల రూపాయలను స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామని స్పష్టం చేశారు. దీన్ని వల్ల ప్రభుత్వానికి నష్టంవచ్చినా ఫర్వాలేదని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. విపత్తుల సమయంలో రైతులను ఆదుకునేందుకు వీలుగా రూ.2వేల కోట్లతో ఒక విపత్తు నిధిని కూడా ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. దీంతోపాటు కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని కూడా కలుపుతామన్నారు వైఎస్ జగన్. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రైతులు... వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు తమలో భరోసా నింపాయని చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment