జీఎస్‌టీ లేకుండా ఇల్లు కొంటారా? | Want to find a house without GST? | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ లేకుండా ఇల్లు కొంటారా?

Published Sat, Oct 20 2018 1:42 AM | Last Updated on Sat, Oct 20 2018 1:42 AM

Want to find a house without GST? - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అమల్లోకి వచ్చాక కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించడం కంటే పాత నిర్మాణాలను పూర్తి చేయడం మీదే నిర్మాణ సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. మరి, నిర్మాణంలో ఉన్న గృహాలు కొనడం బెటరా? లేక రెడీగా ఉన్నవి కొనడం ఉత్తమమా?

గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌ల్లో కొంటే ముందుగా కలిసొచ్చేది.. నిర్మాణ ఆలస్యమనేది ఉండనే ఉండదు. అపార్ట్‌మెంట్‌ నిర్మాణం కోసం గానీ, వసతుల ఏర్పాట్ల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. రెరా అమల్లోకి వచ్చాక డెవలపర్లు నిర్మాణ గడువును పెంచేశారు. గతంలో ఒక ప్రాజెక్ట్‌ నిర్మాణ గడువు మూడేళ్లుగా ఉంటే ఇప్పుడది 5–6 ఏళ్లకు పొడిగించారు. ఎందుకంటే రెరాలో గడువు ముగిసిన ప్రాజెక్ట్‌ డెవలపర్లకు జరిమానా, జైలు శిక్షలు వంటి కఠిన నిబంధనలున్నాయి.

 నిర్మాణం పూర్తయిన ప్రాజెక్ట్‌లల్లో కొనుగోలు చేస్తే కలిగే మొదటి ప్రయోజనం.. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) కట్టాల్సిన పన్లేదు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లకు 12 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే నిర్మాణంలో ఉన్న వాటి కంటే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల  ధర కాస్త ఎక్కువగా ఉంటుంది సుమీ!

చూసిందే కొంటాం: ఫ్లాట్‌ విస్తీర్ణం, గదుల విస్తీర్ణం, అపార్ట్‌మెంట్‌ వ్యూ, నిర్మాణ నాణ్యత, వసతుల ఏర్పాట్లు, శానిటరీ, టైల్స్‌ ఉత్పత్తుల ఎంపిక వంటివి కళ్లతో ప్రత్యక్షంగా చూసి కొనుగోలు నిర్ణయాన్ని తీసుకునే వీలుంటుంది. అదే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ విషయం ఈ అవకాశంలో ఉండదు. మోడల్‌ ఫ్లాట్‌ లేదా లే అవుట్‌ ఎలివేషన్‌ చూసి ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. రెడీగా ఉన్న ప్రాజెక్ట్‌ల్లో కొంటే నిర్మాణంలోని నాణ్యత పరిశీలించిన తర్వాతే కొనుగోలుకు వీలుంటుంది.
ఏరియా అభివృద్ధి: రెడీగా ఉన్న ప్రాజెక్ట్‌ల్లో కొంటే మరొక ప్రయోజనం.. ప్రాజెక్ట్‌ ఏరియా అభివృద్ధి ప్రత్యక్షంగా తెలుస్తుంది. పరిసర ప్రాంతాల్లోని మౌలిక వసతులు ఎలా ఉన్నాయి? రవాణా సదుపాయాలు, భద్రత పరిస్థితి ఏంటి? నిత్యావసరాలు ఎంత దూరమున్నాయి? పని ప్రదేశాలు, షాపింగ్‌ ప్రాంతాలు వంటివి గృహ ప్రవేశం చేయకముందే తెలిసిపోతాయి.
అద్దె కలిసొస్తుంది: రెడీగా ఉన్న ప్రాజెక్ట్‌ల్లో కొంటే.. కొనుగోలు చేసిన వెంటనే గృహ ప్రవేశం చేసేయవచ్చు. అదే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లో కొంటే నిర్మాణం పూర్తయ్యే వరకూ అద్దె, నెలవారీ వాయిదా రెండూ చెల్లించాల్సి వస్తుంది. అదే రెడీగా ఉన్న గృహమైతే.. అద్దె భారం తప్పుతుంది. ఒకవేళ సొంతంగా మీరుండేందుకు కాకుండా పెట్టుబడి కోసం రెడీగా ఉన్న గృహాలు కొనుగోలు చేస్తే గనక ఆపై నెల నుంచి అద్దె వస్తుంటుంది. ఏటేటా విలువ పెరుగుతుంటుంది కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement