భవిష్యత్తు రియల్టీకి
సాక్షి, హైదరాబాద్: ‘భవిష్యత్తు రియల్టీ’ అనే సొంతింటికి 2017లో పునాది పడింది. స్థిరాస్తి రంగంలో పారదర్శకత, విశ్వసనీయతే లక్ష్యంగా మొదలైన ఇంటి నిర్మాణానికి పెద్ద నోట్ల రద్దుతో తొలి అడుగు పడింది. స్థిరాస్తి రంగ అభివృద్ధి, నియంత్రణ బిల్లు (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), బినామీ ప్రాపర్టీ చట్టాలతో జోరందుకుంది. మౌలిక రంగ హోదా, క్రెడిట్ లింక్ సబ్సిడీ (సీఎల్‌ఎస్‌ఎస్) వంటి వాటితో ప్రోత్సాహకాలూ అందాయండోయ్! ఇకిప్పుడు ఇంటి నిర్మాణమే తరువాయి! రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (రీట్స్), ఎలక్ట్రానిక్ ప్రాపర్టీ పాస్ బుక్ (ఈపీపీబీ), అద్దె గృహల చట్టాలతో 2018 నుంచి ‘భవిష్యత్తు రియల్టీ’లో పారదర్శక అడుగులు మొదలవుతాయి!!
గృహాల విభాగం: ప్రారంభాలు 50% అమ్మకాలు 30% డౌన్!
2017లో నివాస సముదాయాల విభాగానికి ఏమాత్రం కలిసిరాలేదు. పెద్ద నోట్ల రద్దుతో మొదలైన రియల్ కష్టాలు, రెరా, జీఎస్‌టీలతో పీకల్లోతుకు చేరాయి. దీంతో కొత్త ప్రాజెక్ట్‌ల సంగతి దేవుడెరుగు ఉన్న వాటిని విక్రయించేందుకే డెవలపర్లకు చుక్కలు కనిపించాయి. ఈ ఏడాది తొలి మూడు త్రైమాసికాల్లో 94 వేల యూనిట్లు ప్రారంభమయ్యాయి. 2016లో ఇదే సమయంతో పోలిస్తే 50 శాతం తక్కువ. అయితే 2017 చివరి త్రైమాసికంలో మాత్రం కాసింత సానుకూల వాతావరణం కనిపించింది. చివరి 3 నెలల్లో 18 వేల కొత్త యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఇక విక్రయాలు పరిశీలిస్తే.. 2017 క్యూ1–క్యూ3లో 1.60 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
2016 క్యూ1–క్యూ3తో పోలిస్తే అమ్మకాలూ 30 శాతం తగ్గాయి.
♦ 2017లో నివాస విభాగంలో కనిపించిన కొత్త అంశమేంటంటే.. అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీకి రెక్కలొచ్చాయి. ఇంతకాలం అధిక సప్లయి కారణంగా ఇన్వెంటరీ పెరుగుతూ ఉండేది కానీ, 2017లో కొత్త ప్రాజెక్ట్‌లకు బ్రేకులు పడటంతో ఇన్వెటరీ అమ్మకాలు పెరిగాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే మరీనూ! 2016 క్యూ3తో పోలిస్తే 2017 క్యూ3లో దేశవ్యాప్తంగా అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ 8 శాతం తగ్గింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 22 శాతం తగ్గింది. ఆ తర్వాత చెన్నైలో 18 శాతం, బెంగళూరులో 16 శాతం, పుణెలో 7 శాతం, ముంబై, ఎన్‌సీఆర్‌ల్లో 6 శాతం తగ్గుదల నమోదైంది.
ఆఫీస్‌విభాగం : 2016తో పోలిస్తే 7% తగ్గుదల!
ఈ ఏడాది దేశంలోని 8 ప్రధాన నగరాల్లో సుమారు 30.57 మిలియన్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. 2016లో ఇది 32.87 మిలియన్ చ.అ.లుగా ఉంది. అంటే ఏడాదిలో ఆఫీస్ స్పేస్ విభాగం 7 శాతం తగ్గింది. ఈ ఏడాది హైదరాబాద్‌లో మొత్తం 10 అతిపెద్ద డీల్స్ జరిగాయి. ఇందులో 1.4 మిలియన్ చ.అ. డీల్ కూడా ఉంది. 2019 ముగింపు నాటికి దేశంలో ఆఫీస్ అసెట్స్ విభాగం 6 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా. 2017లో కో–వర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ పెరిగింది. 7 ప్రధాన నగరాల్లో సుమారు 12 లక్షల కో–వర్కింగ్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. స్టార్టప్స్, ఎంఎస్‌ఎంఈలు ఆయా స్థలాలను ఆక్రమించాయి.
రిటైల్ విభాగం :47 లక్షల చ.అ. స్థలం రిటైర్డ్ ఔట్!
ఈ ఏడాది కొత్తగా 64 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. నిర్మాణంలో ఆలస్యం, నిధుల లేమి వంటి ఇతరత్రా కారణాల వల్ల ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మాల్స్ 2018 ముగింపు మరో 1.1 కోట్ల చ.అ. మాల్స్ స్థలం అందుబాటులోకి వస్తుంది. ఈ ఏడాది మాల్స్ స్థలాల లావాదేవీలు ఎక్కువగా ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు నగరాల్లో జరిగాయి. 2019 ముగింపు నాటికి 7 ప్రధాన నగరాల్లో 2 కోట్ల చ.అ., హైదరాబాద్‌లో 60 లక్షల చ.అ.ల్లో మాల్స్ స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా. దేశీయ రిటైల్ విభాగంలో చరిత్రలోనే తొలిసారిగా మాల్స్ స్థలం ఉపసంహరణకు గురైంది. ప్రతికూల సప్లయి కారణంగా ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ల్లో 8 మాల్స్‌ల్లో సుమారు 47 లక్షల చ.అ. స్థలాన్ని ఉపసంహరించుకున్నారు.
లాజిస్టిక్ విభాగం: 909 మిలియన్ చ.అ.కు గిడ్డంగుల స్థలం
ఈ ఏడాది దేశీయ లాజిస్టిక్ రంగంలో అతిపెద్ద డీల్స్ జరిగాయి. కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ ఇండోస్పేస్‌లో 500 మిలియన్ డాలర్లతో 1.3 కోట్ల చ.అ.ల్లో 13 ఇండస్ట్రియల్, లాజిస్టిక్ పార్క్ లను కొను గోలు చేసింది. ప్రస్తుతం దేశీయ గిడ్డంగుల పరిశ్రమ 56 వేల కోట్లుగా ఉంది. దేశంలో గిడ్డంగుల స్థలం 909.5 మిలియన్ చ.అ.లుగా ఉంది. 2019 ముగింపు నాటికి మరో 1,439 మిలియన్ చ.అ. స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ ఏడాది అమెజాన్ శంషాబాద్ దగ్గర 4 లక్షల చ.అ.ల్లో గిడ్డంగిని ఏర్పాటు చేసింది.
మౌలిక రంగ హోదా, సీఎల్‌ఎస్‌ఎస్, వడ్డీ రేట్ల తగ్గింపు కూడా..
2017 సంవత్సరం ప్రారంభంలోనే కేంద్రం అందుబాటు గృహాలకు మౌలిక రంగ హోదాను అందించింది. దీంతో తక్కువ వడ్డీ రేట్లకు నిధుల లభ్యత పెరిగింది. తొలిసారి గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్‌ఎస్‌ఎస్)ను ప్రకటించింది. అందుబాటు గృహ నిర్మాణదారులను, కొనుగోలుదారులను ఇద్దరినీ ప్రోత్సహించేందుకు ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద గృహాల కార్పెట్ ఏరియాలను పెంచింది. ఎంఐజీ గృహాల కార్పెట్ ఏరియాను 90 చ.మీ. నుంచి 120 చ.మీ.లకు, ఎంఐజీ–2 గృహాల ఏరియాను 110 చ.మీ. నుంచి 150 చ.మీ.లకు విస్తరించారు. దీంతో బడా నిర్మాణ సంస్థలూ అందుబాటు గృహాల ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ కారణంగా బ్యాంకులూ వడ్డీ రేట్లను తగ్గించాయి. ఏడాదిలో గృహ రుణాల వడ్డీ రేట్లు 150–200 బేసిస్ పాయింట్లు తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment