రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిర్మాణ రంగంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన చట్టం. కానీ, దీంతో అందుబాటు గృహాలకు కష్టకాలం వచ్చింది. ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది రెండో త్రైమాసికం నాటికి 7 లక్షల గృహాలు అమ్ముడుపోకుండా ఉంటే.. ఇందులో రూ.40 లక్షలు లోపు ధర ఉన్న అందుబాటు గృహాలు 2.37 లక్షలు ఉన్నాయి. మౌలిక వసతుల లేమి, నాసిరకమైన నిర్మాణాలు, లీగల్ సమస్యలే ఇందుకు కారణమని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది.
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రెండో త్రైమాసికం నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్‌కతా, హైదరాబాద్‌ల్లో 2.37 లక్షల అందుబాటు గృహాలు ఖాళీగా (వేకెంట్)గా ఉన్నాయి. ఈ గృహాలు కూడా సంఘటిత రంగంలోని ప్రైవేట్ డెవలపర్లకు చెందినవే.
ప్రభుత్వ గృహ పథకాలు, అసంఘటిత రంగంలోని చిన్న డెవలపర్ల గృహాలను కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రధాన నగరాల్లో సంఘటిత రంగంలోని డెవలపర్లు నిర్మించిన అందుబాటు ప్రాజెక్ట్‌లు, స్థానిక ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నిర్మించిన బడ్జెట్ గృహాలు విక్రయమయ్యాయి. కానీ, అసంఘటిత రంగంలోని చిన్న డెవలపర్లు చేపట్టిన నిర్మాణాలు, అసంఖ్యాకమైన చిన్న అపార్ట్‌మెంట్లు, సుదూర ప్రాంతాల్లో నిర్మించిన గృహాలు మాత్రం అమ్ముడుపోకుండా ఉన్నాయి.
ఎందుకు అమ్ముడుపోలేదంటే?
రెరా కంటే ముందు లోప భూయిష్టమైన ప్రాజెక్ట్‌లను గుర్తించడంతో కొనుగోలుదారులు వెనకపడ్డారు. కానీ, రెరా అమల్లోకి వచ్చాక కస్టమర్లు గుర్తించలేకపోయినా సరే రెరా అథారిటీ, బ్యాంక్‌లు గుర్తిస్తాయి. దీంతో రెరా అమలయ్యాక గృహాల ఇన్వెంటరీ పెరిగింది. ఇందుకు ప్రధాన కారణాలివే..
మౌలిక వసతులు: అందుబాటు ప్రాజెక్ట్‌లను ప్రారంభించే ముందు డెవలపర్లు స్థానిక ప్రజల అవసరాలు, గృహ విస్తీర్ణాలపై అధ్యయనం చేయలేదు. కేవలం భూమి తక్కువ ధరకు దొరుకుతుందని, అభివృద్ధి నిబంధనలఖర్చు తగ్గుతుందనే కారణాలతో సుదూర ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌లను నిర్మించారు. పని ప్రదేశాలకు, మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు సరిగా లేని ప్రాంతాల్లో గృహాలను నిర్మించారు.
నాసిరకం నిర్మాణాలు: చాలా వరకు అందుబాటు గృహాల డిజైన్, నాణ్యత అంశాల్లో నాసిరకం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. పాత కాలం నాటి డిజైన్లతో నిర్మాణాలుండటం కూడా అమ్మకాలకు అడ్డంకే. నిర్మాణంలో నాణ్యత లేకపోతే అందుబాటు గృహాలైనా, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నా సరే ఏళ్లపాటు అమ్ముడుపోకుండా ఉంటాయి.
లీగల్ సమస్యలు: చాలా వరకు అందుబాటు గృహ ప్రాజెక్ట్‌లు స్థానిక సంస్థల అనుమతులు లేకుండా ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాజెక్ట్‌ల్లో అయితే అనుమతి ఉన్న ఫ్లోర్స్ కంటే
ఎక్కువ అంతస్తు నిర్మాణాలున్నాయి. దీంతో అందుబాటు గృహాలు విక్రయానికి నోచుకోవట్లేదు.
అమ్ముడుపోవాలంటే?
కేంద్రం నిజంగా 2022 నాటికి అంద రికీ గృహాలను అందించాలనే లక్ష్యంతో ఉంటే గనక ముం దుగా ఖాళీగా ఉన్న అందుబాటు గృహాలను ఆక్రమించేయాలి. అంటే ఇన్వెంటరీగా ఉన్న గృహాలను తగ్గించడం తప్ప ఇతర మార్గం లేదు.
♦ నీరు, విద్యుత్, డ్రైనేజీ, రోడ్లు వంటి మెరుగైన మౌలిక వసతులున్న చోటే గృహాలు అమ్ముడుపోతాయి. అందుకే ఎక్కడైతే విక్రయించబడకుండా ఉన్న గృహాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో వెంటనే మౌలిక వసతులను కల్పించాలి. దీంతో వెంటనే ఆయా ప్రాంతా ల్లో గృహాలు అమ్ముడుకాకపోయినా మెల్లగా కొనుగోలుదారులు ఆయా ప్రాంతాల్లో క్రయవిక్రయాలకు మొగ్గుచూపే అవకాశముంది.
♦ చిన్న చిన్న అతిక్రమణలు జరిగిన అందుబాటు గృహ ప్రాజెక్ట్‌లను క్రమబద్దీకరించుకునేందుకు అవకాశం కల్పించాలి. ఒకవేళ అందుబాటు గృహాలు నో డెవలప్‌మెంట్ జోన్ (ఎన్‌డీజెడ్) లేదా పర్యావరణ సున్నితమైన ప్రాంతాల్లో నిర్మించినట్ల యితే స్థానిక మున్సిపల్ నిబంధనల్లో మార్పు చేసి ప్రత్యేక స్కీమ్‌లను తీసుకురావాలి. దీంతో ఆయా ప్రాంతాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకు గతంలో ముంబైలో సాల్ట్ ప్లాన్ ల్యాండ్స్‌లో నిర్మాణాలకు స్థానిక రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వటంతో పెద్ద ఎత్తున అందుబాటు గృహ ప్రాజెక్ట్‌లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment