12 శాతం వృద్ధితో 36,974 యూనిట్లు
2024లో నమోదు 12 ఏళ్ల గరిష్టానికి హౌసింగ్ డిమాండ్
ఎనిమిది నగరాలపై నైట్‌ఫ్రాంక్ నివేదిక
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. 2024లో 12 శాతం అధికంగా 36,974 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయినట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో 2024లో 7 శాతం మేర ఇళ్ల విక్రయాలు పెరిగాయి. మొత్తం 3,50,613 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 12 ఏళ్ల గరిష్ట స్థాయి. హైదరాబాద్‌తోపాటు పుణెలో ఆల్‌టైమ్ గరిష్టాలకు విక్రయాలు చేరగా, ముంబైలో 13 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నట్టు నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ‘‘ప్రీమియం ఇళ్లకు డిమాండ్ నెలకొంది. రూ.2–5 కోట్ల విభాగంలోని ఇళ్ల విక్రయాల్లో 85 శాతం వృద్ధి నమోదైంది.
మరోవైపు రూ.50 లక్షల్లోపు ధరలో, రూ.50లక్షల నుంచి రూ.కోటి మధ్య ధరల విభాగాల్లోనూ వృద్ధి లేకపోవడం లేదా బలహీనపడడం కనిపించింది’’అని తెలిపింది. రూ.2–5 కోట్ల ధరల ఇళ్లకు బలమైన డిమాండ్ ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. 2020 నుంచి నివాస గృహాల మార్కెట్ అద్భుతమైన ర్యాలీని చూసిందని, 2024 విక్రయాలు 12 ఏళ్ల గరిష్టానికి చేరాయని చెప్పారు. ‘‘ప్రీమియమైజేషన్ ధోరణి పెరిగిపోయింది. ఇళ్ల మార్కెట్‌లో క్రమంగా అధిక ధరల వైపు కస్టమర్లు మళ్లుతున్నారు. మెరుగైన జీవన అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకుంటున్నారు’’అని వివరించారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్లు అనుకూలిస్తున్నట్టు చెప్పారు.
పట్టణాల వారీ విక్రయాలు..
⇒ 2024లో ముంబైలో ఇళ్ల అమ్మకాలు అంతక్రితం ఏడాదితో పోలి్చతే 11 శాతం పెరిగి 96,187 యూనిట్లుగా ఉన్నాయి.
⇒ బెంగళూరులో 2 శాతం అధికంగా 55,362 ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి.
⇒ పుణెలో 6 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 52,346 యూనిట్లకు చేరాయి.
⇒ అహ్మదాబాద్‌లో 15 శాతం వృద్ధి కనిపించింది. 18,462 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.
⇒ కోల్‌కతాలోనూ 16 శాతం పెరిగి 17,389 యూనిట్లు అమ్ముడయ్యాయి.
⇒ చెన్నైలో అమ్మకాలు 9 శాతం మేర పెరిగి.. 16,238 యూనిట్లకు చేరాయి.
⇒ ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో 4 శాతం క్షీణించి 57,654 యూనిట్లకు విక్రయాలు పరిమితమయ్యాయి.
అందుబాటు ధరల ఇళ్ల విభాగం మెరుగుపడుతుంది..
‘‘ఇళ్ల మార్కెట్లో సెంటిమెంట్ బలంగా ఉంది. ధరలతోపాటు అమ్మకాల్లోనూ స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. రూ.కోటిలోపు ఇళ్ల అమ్మకాలు బలహీనపడడం పట్ల ఆందోళనలు నెలకొన్నాయి. కానీ, అందుబాటు ధరల ఇళ్లకు ప్రభుత్వం నుంచి మద్దతు, ప్రైవేటు రంగం ఆసక్తి చూపిస్తుండడంతో ఈ విభాగంలో అమ్మకాలు స్థిరపడతాయి’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రీసెర్చ్ సీనియర్ ఈడీ గులామ్ జియా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment