న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల ధరలు జూన్ త్రైమాసికంలో 6–10 శాతం పెరిగినట్టు (క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు) ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో రికార్డు స్థాయిలో 10 శాతం పెరిగి చదరపు అడుగు రూ.4,980గా ఉంది. ఏడు పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు 36 శాతం అధికంగా 1,15,100 యూనిట్లు అమ్ముడుపోయాయి.
క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 84,940 యూనిట్లుగా ఉన్నాయి. ‘‘ఈ ఏడాది ఆరంభంలో గృహ రుణాల రేట్ల పెంపు ప్రభావం, అంతర్జాతీయ ఆర్థిక సమస్యల ప్రభావం ఇంకా హౌసింగ్ మార్కెట్‌పై పడలేదు. 2023 ద్వితీయ ఆరు నెలల కాలంలోనూ అమ్మకాల డిమాండ్ బలంగానే ఉంది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి వెల్లడించారు.
- హైదరాబాద్‌లో అమ్మకాలు 13,570 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 11,190 యూనిట్లతో పోలిస్తే 21 శాతం పెరిగాయి.
- జూన్ త్రైమాసికంలో పుణె పట్టణంలో ఇళ్ల అమ్మకాలు 65 శాతం పెరిగి 20,680 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 12,500 యూనిట్లుగా ఉన్నాయి.
- ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో అమ్మకాలు కేవలం 7 శాతం పెరిగాయి. ఒకే అంకె అమ్మకాల వృద్ధిని చూసిన పట్టణం ఇదొక్కటే. ఇక్కడ 16,450 యూనిట్లు విక్రయమయ్యాయి.
- కోల్‌కతా మార్కెట్లో 20 శాతం వృద్ధితో అమ్మకాలు 5,780 యూనిట్లుగా ఉన్నాయి.
- ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో 48 శాతం అధికంగా 38,090 యూనిట్లు అమ్ముడయ్యాయి.
- బెంగళూరులో 15,050 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 31 శాతం వృద్ధి నమోదైంది.
- చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 44 శాతం పెరిగాయి. 5,490 యూనిట్లు అమ్ముడయ్యాయి.
- ఏడు పట్టణాల్లో నూతన ఇళ్ల నిర్మాణం వార్షికంగా 25 శాతం పెరిగి 1,02,620 యూనిట్లుగా ఉంది.
- అమ్మకాలు బలంగా ఉండడంతో ఏడు పట్టణాల్లో ఇళ్ల నిల్వలు 2 శాతం తగ్గి 6.14 లక్షల యూనిట్లుగా జూన్ చివరికి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment