రెరా నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షలేంటో?
నిబంధనలు పాటించని డెవలపర్లు, ఏజెంట్లకూ జరిమానాలు, జైలు శిక్షలు కూడా
మహారాష్ట్ర రెరాలో నమోదు చేయకుండా ప్రకటనలు చేసిన ఓ సంస్థ ∙ రూ.1.2 లక్షల జరిమానా
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) స్థిరాస్తి రంగంలో పారదర్శకతను తీసుకొస్తుంది! మాయమాటలతో కొనుగోలుదాలుదారులను మోసం చేసే డెవలపర్లకు కళ్లెం వేస్తుంది!! .. వంటి ఉపోద్ఘాతాలు కాసేపు పక్కన పెడితే.. అసలు రెరా నిబంధనలు ఉల్లంఘిస్తే డెవలపర్లకు ఎలాంటి శిక్షలుంటాయి? రెరా వద్ద నమోదు చేయకుండా ప్రకటనలు గానీ విక్రయించడం గానీ చేస్తే ఏమవుతుంది? – సాక్షి, హైదరాబాద్
ప్రాజెక్ట్‌ను రెరాలో నమోదు చేయకపోతే?
నివాస, వాణిజ్య సముదాయాలతో పాటూ ఓపెన్ ప్లాట్లను, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లనూ రెరా వద్ద 90 రోజుల్లోగా నమోదు చేయాల్సిందే. లేనిపక్షంలో డెవలపర్లకైతే ప్రాజెక్ట్ వ్యయంలో 5 శాతం జరిమానా. ఏజెంట్లకైతే ప్రతి రోజూ రూ.10 వేలు లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 5 శాతం వరకు పెనాల్టీ ఉంటుంది.
నమోదు చేయకుండా విక్రయిస్తే?
రెరాలో నమోదు చేయకుండా ఏ స్థిరాస్తినైనా సరే విక్రయించడం గానీ ప్రకటనలు చేయడం గానీ చేయకూడదు. ఒకవేళ చేసిన పక్షంలో డెవలపర్లకైతే ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం వరకూ జరిమానా ఉంటుంది. అయినా కూడా నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం జరిమానాతో పాటూ 3 ఏళ్ల వరకూ జైలు శిక్ష తప్పదు.
రెరా నిబంధనలు పాటించకపోతే?
డెవలపర్లు, ఏజెంట్లు ఎవరైనా సరే రెరా నిబంధనలను లేదా ఆర్డర్లను పాటించకపోతే ప్రతి రోజూ ప్రాజెక్ట్ వ్యయంలో 5 శాతం జరిమానా ఉంటుంది.
ఆర్డర్లను ఉల్లంఘిస్తే?
అప్పిలెట్ ట్రిబ్యునల్ ఆర్డర్లను, నిర్ణయాలను దిక్కరించినా లేదా ఉల్లంఘించినా డెవలపర్లకైతే ప్రతి రోజూ ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా లేదా 3 ఏళ్ల జైలు శిక్ష. లేదా రెండూ విధింవచ్చు. ఏజెంట్లకైతే ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు.
రూ.1.2 లక్షల జరిమానా
దేశంలోనే తొలిసారిగా రెరా శిక్షలు మహారాష్ట్రలో మొదలయ్యాయి. చెంబూర్‌కు చెందిన సాయి ఎస్టేట్ కన్స్‌ల్టెన్స్.. స్థానిక రెరా వద్ద నమోదు చేయకుండా పలు నివాస ప్రాజెక్ట్‌లను 12 రోజుల పాటు ప్రకటనలు చేసింది. ఇందుకుగాను మహారాష్ట్ర రెరా సంబంధిత సంస్థకు రూ.1.2 లక్షల జరిమానా విధించింది. రెరా నిబంధనల ప్రకారం.. కొత్త ప్రాజెక్ట్‌లే కాదు నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లూ రెరా వద్ద నమోదు చేయకుండా విక్రయించడం కాదు కదా కనీసం ప్రకటనలు కూడా చేయకూడదు.