స్థిరాస్తి బిల్లు.. మనకేం తెచ్చింది?
► కొనుగోలుదారుల చేతిలో పాశుపతాస్త్రం
► 500 చ. మీ. లేదా 8 ఫ్లాట్లున్న ప్రతి ప్రాజెక్టూ బిల్లు పరిధిలోకే..
► మోసం చేసే బిల్డర్లుకు జైలుశిక్ష
► స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు-2015కు ఆమోదం
అడ్డదిడ్డంగా.. కొన్ని చోట్ల మాఫియా తరహాలో విస్తరించిన స్థిరాస్తి రంగానికి సంస్కరణ దిశగా అడుగులు పడ్డాయ్!
బ్రోచర్లో మయసభను తలపిస్తూ..
క్షేత్రస్థాయిలో నాసిరకం నిర్మాణాలతో మోసం చేసే బిల్డర్లకు ముచ్చెమటలు పట్టనున్నాయ్!!
.. ‘స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు-2015’కు గురువారం రాజ్యసభ ఆమోదం తెలపడమే ఇందుకు కారణం. స్థిరాస్తి కొనుగోలుదారుల చేతిలో పాశుపతాస్త్రంలా మారే ఈ బిల్లులోని ముఖ్యాంశాల సమాహారమే ఈవారం ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనం.
సాక్షి, హైదరాబాద్: దేశంలో స్థిరాస్తి వ్యవస్థను నియంత్రించి, మోసపూరిత డెవలపర్ల నుంచి కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేదే స్థిరాస్తి నియంత్రణ బిల్లు-2015. ప్రకటనలతో ఆకర్షించి, నిర్మాణ పనుల్ని సాగదీస్తూ, సమయానికి ఫ్లాట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోన్న బిల్డర్లు, డెవలపర్లకు గుణపాఠం చెప్పాలంటే స్థిరాస్తి నియంత్రణ బిల్లు అత్యంత ఆవశ్యకమనేది కొనుగోలుదారుల అభిప్రాయం.
ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు..
స్థిరాస్తి నియంత్రణ బిల్లుతో బిల్డర్లకు, బిల్డర్లతో కొనుగోలుదారులకూ ఎలాంటి సమస్యలెదురైనా పరిష్కరించేందుకు రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రతిపాదిత చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేస్తారు. లేదా రెండు రాష్ట్రాలకు కలిపి ఒక సంస్థను లేదా ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒక నియంత్రణ సంస్థను 60 రోజుల్లో ఏర్పాటు చేస్తారు. సమస్యల వేగవంత పరిష్కారం కోసం ట్రిబ్యునల్‌లో ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది న్యాయ నిర్ణయాధికారులుంటారు. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జి దీనికి నేతృత్వం వహిస్తారు. కీలక అంశాలపై ఎప్పటికప్పుడు తగిన నిర్ణయం తీసుకునేందుకు గృహ నిర్మాణ శాఖ మంత్రి నేతృత్వంలో ఓ జాతీయ సలహా మండలి కూడా ఏర్పాటవుతుంది.
ప్రీలాంచ్ అమ్మకాలు చేయొద్దు..
దేశంలోని బిల్డర్లు, ఏజెంట్లు, ప్రమోటర్లు, గుత్తేదార్లు, ఆర్కిటెక్ట్, స్ట్రక ్చరల్ ఇంజనీర్లు తమ పేర్లను, చిరునామాలను నియంత్రణ సంస్థ వద్ద నమోదు చేసుకోవాలి. అలాగే ప్రాజెక్ట్ లే-అవుట్, అభివృద్ధి గడువు, భూమి స్థితి, చట్టపరమైన అమోదాల పరిస్థితి ఇలా స్థిరాస్తికి సంబంధించిన ప్రతి ఒక్కటీ నియంత్రణ సంస్థకు సమర్పించాలి. ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే అమ్మకాలు ప్రారంభించాలి. అంటే ప్రీలాంచ్ పేర్లతో ముందస్తు అమ్మకాలు చేయరాదన్నమాట. పొందిన అనుమతులన్నింటినీ నియంత్రణ సంస్థకు సమర్పించడంతో పాటు నిర్మాణానికి ముందే బిల్డర్లు తమ వెబ్సైట్లలో వాటిని ప్రదర్శించాలి. ప్రాజెక్ట్‌ను ఎంత కాలంలో పూర్తి చేస్తామనే విషయాన్ని ముందుగానే స్పష్టం చేయాలి.
ప్రతి ప్రాజెక్ట్‌కు ఓ ఖాతా..
ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రత్యేక బ్యాంక్ ఖాతా (ఎస్క్రో)ను తెరవాలి. కొనుగోలుదారుల నుంచి స్వీకరించిన సొమ్ములో 70 శాతాన్ని 15 రోజుల్లోగా ఎస్క్రో ఖాతాలో జమ చేయాలి. ఆ నిధులను ఆ ప్రాజెక్ట్ కోసమే ఖర్చు చేయాలి. ఇతర అవసరాలు, ప్రాజెక్ట్‌లకు మళ్లించేందుకు వీలు లేదు. సంబంధిత ప్రాజెక్ట్‌లోని కొనుగోలుదారుల్లో మూడింట రెండొంతుల మంది ఆమోదం లేకుండా ప్రాజెక్ట్ ప్లాన్, స్ట్రక్చరల్ డిజైన్లను మార్చడానికి వీల్లేదు. ఆర్థిక సంవత్సరం ముగిసే ఆరు నెలల ముందుగానే చార్టర్ట్ అకౌంటెంట్ (సీఏ) పర్యవేక్షణలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను అడి ట్ చేయించాలి.
తప్పు చేస్తే జైలు..
తప్పుడు ప్రకటనలు చేసే బిల్డర్లకు తొలి తప్పిదానికైతే ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా.. పదే పదే తప్పుడు ప్రకటనలు చేసేవారికి గరిష్టంగా మూడేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తారు. అప్పటికీ నిబంధనలను పాటించకపోతే మరో 10 శాతం జరిమానాతో పాటు జైలు ఊచలూ లెక్కపెట్టాల్సిందే. అంతేకాకుండా కొనుగోలుదారులు చెల్లించిన పూర్తి సొమ్మును వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
8 ఫ్లాట్లుంటే బిల్లు పరిధిలోకే..
కొత్తగా నిర్మించే నివాస, వాణిజ్య సముదాయాలే కాదు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లూ బిల్లు పరిధిలోకే వస్తాయి. స్వీయ అవసరాల కోసం కట్టే ప్రతి ప్రాజెక్ట్, నిర్మాణం పూర్తయి ఇంకా ధ్రువీకరణ పత్రాలు రాని ప్రాజెక్ట్‌లూ ఇందులోకే వస్తాయి. ఇంకా చెప్పాలంటే 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్లుండే ప్రతి నివాస, వాణిజ్య ప్రాజెక్ట్‌లు బిల్లు పరిధిలోకే వస్తాయన్నమాట. ఫ్లాట్లను సూపర్ బిల్టప్ ఏరియా ప్రాతిపదికన కాకుండా కార్పెట్ ఏరియా ప్రాతిపదికన విక్రయించాలి. ప్రతి బిల్డర్ తాను అమ్మబోయే ఫ్లాట్ కార్పెట్ ఏరియాను, సొసైటీ కామన్ ఏరియాను విడి విడిగా స్పష్టం చేయాలి. ప్రస్తుతం బిల్డర్లు ఏం చేస్తున్నారంటే.. సూపర్ ఏరియా అంటూ నాలుగు గోడల మధ్య ఉండే కార్పెట్ ఏరియాకు 25-30 శాతం అదనంగా కలిపి ఫ్లాట్ విస్తీర్ణాన్ని లెక్కేస్తున్నారు. దీంతో వినియోగించుకోని స్థలానికీ కొనుగోలుదారులు డబ్బులు చెల్లిస్తున్నారు.
‘‘స్థిరాస్తి కొనుగోలుదారులకు 100 శాతం న్యాయం చేసే స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లును స్వాగతిస్తున్నాం. అయితే ఈ బిల్లును ఢిల్లీ, ముంబై వంటి కొన్ని నగరాల్లోని స్థిరాస్తి రంగాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్టుందని’’ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ ప్రెసిడెంట్ జి. రాంరెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఆయనింకా ఏమంటారంటే..
► ఈ బిల్లుతో చిన్న, మధ్యతరహా బిల్డర్లు నిలదొక్కుకోలేరు. కొనుగోలుదారులు చెల్లించే 70 శాతం సొమ్మును బ్యాంకులో జమ చేయలేరు. దీంతో నగదు నిల్వల్లేక ఆయా బిల్డర్లు వ్యాపారాన్ని విస్తరించలేరు కూడా. మార్కెట్లో బడా బిల్డర్లు మాత్రమే ఉండటంతో స్థిరాస్తి సుమారు 10-15 శాతం పెరిగే అవకాశం ఉంది.
► అధిక శాతం నిర్మాణాలు ఆలస్యం జరిగేది ప్రభుత్వ విభాగాలు అనుమతులు జాప్యం వల్లే. అలాంటప్పుడు నిర్మాణాలు ఆలస్యమైతే కేవలం బిల్డర్లను శిక్షించడం సరైందికాదు.
► స్థిరాస్తి నియంత్రణ సంస్థకు పూర్తి స్థాయి అధికారాల్ని ఇవ్వడంతో మళ్లీ లెసైన్సుల రాజ్యం మొదలవుతుంది. నియంత్రణ సంస్థ నుంచి కూడా ప్రలోభాలు, బెదిరింపులూ తప్పవు. దీంతో అవినీతే కాదు ద్రవ్యోల్యణం పెరిగే అవకాశమూ లేకపోలేదు.
► ఏదేమైనా ఈ బిల్లుతో నిర్మాణ రంగంలో పారదర్శకత నెలకొంటుం ది. ఎఫ్‌డీఐ, రీట్స్ పెట్టుబడులు సులువుగా వస్తాయి.
స్థిరాస్తులకు సంబంధించిమీ సందేహాలు మాకు రాయండి.
realty@sakshi.com