
ముంబైలోని అత్యంత చరిత్రాత్మకమైన ప్రాపర్టీలలో ఒకటైన లక్ష్మీ నివాస్ బంగ్లా రికార్డు స్థాయి రియల్ ఎస్టేట్ వ్యవహారంలో చేతులు మారింది.

నెపియాన్ సీ రోడ్డులో ఉన్న ఈ చారిత్రక భవనాన్ని రూ.276 కోట్లకు విక్రయించారు. ఇది నగరంలో అత్యంత ఖరీదైన నివాస లావాదేవీలలో ఒకటిగా నిలిచింది.

1904లో పార్శీ కుటుంబం నిర్మించిన లక్ష్మీ నివాస్ తరువాత 1917లో కపాడియా కుటుంబం యాజమాన్యంలోకి వచ్చింది. అప్పట్లో కేవలం రూ.1.20 లక్షలకు దీన్ని కొనుగోలు చేశారు.

జాప్కీకి లభించిన రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్లు, ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం లక్ష్మీ నివాస్ అమ్మకం గత ఫిబ్రవరి 28న ఖరారైంది. ఈ లావాదేవీలో రూ.16.56 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక లక్ష్మీ నివాస్ బంగ్లాను ఇప్పుడు అంబానీ కుటుంబానికి చెందిన వాగేశ్వరి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తన కీలక వాటాదారుల ద్వారా సొంతం చేసుకుంది.

ఈ కంపెనీకి చెందిన ఎలీనా నిఖిల్ మేస్వానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో కీలక వ్యక్తి అయిన నిఖిల్ మేస్వానీ సతీమణి.


