సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) కొరడా ఝళిపించింది. టీ–రెరాలో నమోదు చేయకుండా ప్రాజెక్ట్‌ను అడ్వటయిజింగ్ చేసిన 40 మంది డెవలపర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20 తేదీలోపు వివరణ ఇవ్వాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని టీ–రెరా సెక్రటరీ కే విద్యాధర్ రావు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు.
నోటీసులు జారీ చేసిన 40 మంది డెవలపర్లలో ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రమోటర్లు కూడా ఉన్నట్లు సమాచారం. టీ–రెరాలో నమోదు చేయకుండా ప్రచారం చేయడమే కాకుండా విక్రయాలు కూడా జరిపినట్లు తెలిసింది. రెరాలో నమోదు చేయకుండా ప్రచారం చేసినా లేదా విక్రయించినా సరే సెక్షన్ 59 ప్రకారం.. ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా ఉంటుంది. అథారిటీకి సరైన వివరణ ఇవ్వకపోయినా లేదా అప్పటికీ రిజిస్టర్ చేయకపోయినా రెరా అథారిటీ సంబంధిత డెవలపర్‌కు మూడేళ్ల పాటు జైలు శిక్ష లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 20 శాతం జరిమానా విధిస్తుంది.
రెరా జరిమానాలు, శిక్షలివే..
ప్రమోటర్లకు: రెరా అథారిటీ ఆర్డర్లను ఉల్లంఘిస్తే.. సెక్షన్ 59 ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా.
♦ ప్రాజెక్ట్ లేదా అమ్మకాలకు సంబంధించిన తప్పుడు సమాచారం అందిస్తే.. సెక్షన్ 60 ప్రకారం ప్రాజెక్ట్ వ్యయంలో 5 శాతం జరిమానా.
ఏజెంట్లకు: నమోదు కాకుండా ఫ్లాట్లు/ప్లాట్లను విక్రయిస్తే.. సెక్షన్ 65 ప్రకారం విక్రయించిన ప్రాజెక్ట్ వ్యయంలో 5 శాతం జరిమానా.
♦ అప్పిలేట్ ట్రిబ్యునల్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. సెక్షన్ 62 ప్రకారం ఏడాది పాటు జైలు శిక్ష లేదా ప్రతి రోజు రూ.10 వేలు, గరిష్టంగా ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా.
ఇంకా 14 రోజులే..
టీ–రెరాలో ప్రాజెక్ట్‌ల నమోదు గడువు ఈనెల 30తో ముగస్తుంది. అంటే ఇంకా 14 రోజులే మిగిలి ఉంది. రెరా గడువును పొడిగించే ప్రసక్తే లేదని, డిసెంబర్ 1 నుంచి ప్రాజెక్ట్‌లను నమోదు చేయని నిర్మాణ సంస్థలకు నోటీసులు జారీ చేసి సెక్షన్ 59 ప్రకారం ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా విధిస్తామని విద్యాధర్ రావు తెలిపారు. ఇప్పటివరకు టీ–రెరాలో 1,200 మంది ఏజెంట్లు, డెవలపర్లు రిజిస్టరయ్యారు. సుమారు 600ల ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి.
♦ 2017, జనవరి 1 తర్వాత జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, టీఎస్‌ఐఐసీ, మున్సి పాలిటీ, పంచాయతీల నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్ల కంటే ఎక్కువుండే ప్రతి ప్రాజెక్టూ రెరాలో నమోదు తప్పనిసరి. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం.. గతేడాది జనవరి 1 తర్వాత ఆయా విభాగాల నుంచి సుమారు 5 వేల ప్రాజెక్ట్‌లను అనుమతి పొందాయి. కానీ, ఇప్పటివరకు కేవలం 600 ప్రాజెక్ట్‌లే నమోదవ్వటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment