పెద్ద నోట్ల రద్దు, రెరా అమలు రియల్టీ పోర్టల్స్
99ఎకర్స్, ప్రొప్‌టైగర్, మ్యాజిక్‌బ్రిక్స్, కామన్‌ఫ్లోర్, హౌజింగ్ వంటివన్నీ నష్టాల్లోనే
♦ ఉద్యోగుల తొలగింపు, వ్యయాలను తగ్గించుకుంటున్న పోర్టల్స్
♦ ప్రచార అగ్రిమెంట్లనూ రద్దు చేసుకుంటున్న డెవలపర్లు
♦ జీఎస్‌టీ, ఈపీపీబీలతో భవిష్యత్తు మరింత కష్టం: నిపుణులు
దేశంలో రూ.1,000, రూ.500 నోట్ల రద్దు నిర్ణయం స్థిరాస్తి రంగాన్ని కుదిపేసింది. తేరుకునేలోపే స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లు (రెరా) రూపంలో రియల్టీని పల్టీకొట్టింది. కేంద్రం తీసుకున్న ఈ రెండు నిర్ణయాల ఫలితం.. రియల్టీ పోర్టల్స్ నష్టాలు రూ.762 కోట్లు!
జూలై 1 నుంచి అమల్లోకి రానున్న వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), సమీప భవిష్యత్తులో ప్రవేశ పెట్టనున్న ఎలక్ట్రానిక్ ప్రాపర్టీ పాస్‌బుక్ (ఈపీపీబీ) వంటి వాటితో భవిష్యత్తు ఆగమ్యగోచరమేనని నిపుణులు చెబుతున్నారు.
సాక్షి, హైదరాబాద్
దేశంలో ప్రస్తుతం హౌజింగ్.కామ్, ప్రొప్‌టైగర్, మ్యాజిక్‌బ్రిక్స్, 99ఎకర్స్, కామన్‌ఫ్లోర్, ఇండియా ప్రాపర్టీ, రీడయల్, మకాన్ వంటి వెబ్‌సైట్లు (పోర్టల్స్) ఆన్‌లైన్ కేంద్రంగా స్థిరాస్తి క్రయ, విక్రయ, అద్దె సేవలందిస్తున్నాయి. వీటిల్లో దాదాపు అన్ని పోర్టల్స్ ప్రధాన ఆదాయ వనరులు క్లాసిఫైడ్సే. అయితే పెద్ద నోట్ల రద్దు, రెరా అమలు తర్వాత స్థిరాస్తి లావాదేవీలు పూర్తిగా మందగించాయి. కొత్త ప్రాజెక్ట్‌ల సంగతి దేవుడెరుగు.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడమే నిర్మాణ సంస్థలకు తలకు మించిన భారమైంది. దీంతో డెవలపర్లు పోర్టల్స్‌కు క్లాసిఫైడ్స్‌ను ఇవ్వటమూ ఆపేశాయి. ఫలితం పోర్టల్స్ నష్టాల్లో చిక్కుకున్నాయి.
ఏడాదికి చార్జీ రూ.15 వేలు ఆ పైనే..
రియల్టీ పోర్టల్స్ క్లాసిఫైడ్స్ (లిస్టింగ్) రెండు రకాలుగా ఉంటాయి. డెవలపర్ల ప్రాజెక్ట్‌లు, వ్యక్తిగత ప్రాపర్టీల లిస్టింగ్స్. ప్రాజెక్ట్‌లకైతే ఏడాదికి రూ.15 వేల నుంచి చార్జీలుంటాయి. వ్యక్తిగత ప్రాపర్టీలైతే నెలకు రూ.1,000–2,500 మధ్య చార్జీలుంటాయి. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత నిధుల కొరతతో డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌ల జోలికే వెళ్లట్లేదు. రెరా అమలు తర్వాత నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లూ రెరా పరిధిలోకి వస్తే మరిన్ని చిక్కులనే భావనతో ప్రచారం కంటే ప్రాజెక్ట్ పూర్తి చేయటంపైనే దృష్టిసారిస్తున్నారని హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న రీడయల్ సీఈఓ జీ వెంకట రమణ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. కొత్త క్లాసిఫైడ్స్ సంగతి పక్కన పెడితే అప్పటికే చేసుకున్న అగ్రిమెంట్లనూ రద్దు చేసుకుంటారని ఆయన పేర్కొన్నారు. దీంతో రియల్టీ పోర్టల్స్ ఆదాయం గణనీయంగా పడిపోతుందని చెప్పారు. పోర్టల్స్ యూజర్ల సంఖ్య 60 శాతానికి పైగా పడిపోయిందని అంచనా.
నష్టాలకు విలీనాలు, కొనుగోళ్లూ కారణమే..
రియల్టీ పోర్టల్స్ నష్టాలకు ఈ రంగంలో విలీనాలు, కొనుగోళ్లు కూడా కారణాలనే చెప్పాలి. ఆన్‌లైన్ క్లాసిఫైడ్ సంస్థ క్వికర్.. రియల్టీ ఏజెన్సీ అగ్రిగేటర్, అనలిటిక్ట్ రియల్టీ కంపాస్, కామన్‌ఫ్లోర్‌లను కొనుగోలు చేసింది. ఈ ఏడాది జనవరిలో హౌజింగ్.కామ్, మకాన్.కామ్‌లను ప్రొప్‌టైగర్ కైవసం చేసుకుంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ కోల్డ్‌వెల్ బ్యాంకర్ ఇండియా.. ప్రాపర్టీ బ్రోకర్ ఫవిస్టా.కామ్‌ను వశం చేసుకుంది. మ్యాజిక్‌బ్రిక్స్.. ప్రాపర్టీ రీసెర్చ్, అనలిటిక్ట్ ప్రాపర్జీ.కామ్‌ను కైవసం చేసుకుంది. ఆయా కొనుగోళ్లతో సంస్థల మూలధన వ్యయాలు పెరిగాయి. ఒకవైపు మార్కెట్ బాగాలేక డెవలపర్ల నుంచి ఆదాయం లేక, మరోవైపు నిర్వహణ, ఉద్యోగుల వేతనాల వంటివి భారం కావటంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోందని వెంకట రమణ వివరించారు. ఆన్‌లైన్ పోర్టల్స్‌లో యూజర్ల సందర్శన 40 శాతానికి పడిపోయింది. మూలధన, నిర్వహణ వ్యయాలను తగ్గించుకునేందుకు ఆయా సంస్థలు ఉద్యోగుల తొలగింపు, వ్యయాలను తగ్గించేస్తున్నాయని పేర్కొన్నారు.
రెండు వైపులా జుట్టుముళ్లే..
ఎక్కువ సంఖ్యలో యూజర్లను ఆకర్షించాలంటే.. ఆయా పోర్టల్స్‌లో ప్రాపర్టీల లిస్టింగ్ పెద్ద మొత్తంలో ఉండాలి. పోనీ ఇన్వెంటరీని పెంచుదామం టే.. డెవలపర్లు క్లాసిఫైడ్స్ ఇవ్వాలంటే యూజర్ల సంఖ్య ఎక్కువగా ఉండాలి. రెండు వైపులా జుట్టుముళ్లు ఉండటంతే చాలా వరకూ పోర్టల్స్ ఏం చేస్తున్నాయంటే.. నకిలీ ప్రాపర్టీల లిస్టింగ్స్‌తో యూజర్లను, యూజర్ల సామర్థ్యాన్ని చూపించి క్లాసిఫైడ్స్‌ను పొందుతాయి. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో యూజర్ల సంఖ్య 40 శాతానికి పైగా పడిపోవటంతో క్లాసిఫైడ్సూ దూరమయ్యాయి.
అన్ని పోర్టల్స్‌దీ నష్టాల బాటే..
ఠి2015 ఆర్ధిక సంవత్సరంలో హౌజింగ్.కామ్, ప్రొప్‌టైగర్, మ్యాజిక్‌బ్రిక్స్, 99ఎకర్స్, కామన్‌ఫ్లోర్ వంటి సంస్థల నష్టాలు రూ.462 కోట్లుగా ఉంటే.. 2016 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ.762 కోట్లకు చేరాయి. అంటే ఏడాదిలో 65 శాతం నష్టాలు పెరిగాయన్నమాట. ఇక కంపెనీల వారీగా లాభ, నష్టాల గణాంకాలను పరిశీలిస్తే..