రిజిస్ట్రేషన్‌ శాఖతో   రెరా అనుసంధానం  | Rera integration with the Registration Department | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ శాఖతో   రెరా అనుసంధానం 

Published Sat, Apr 6 2019 12:00 AM | Last Updated on Sat, Apr 6 2019 12:00 AM

Rera integration with the Registration Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్థిరాస్తి కొనుగోలుదారులకు భరోసా కల్పించడమే తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) ప్రధాన లక్ష్యం. రెరాలో నమోదు చేయకుండా విక్రయించే ప్రాజెక్ట్‌లను, ప్రమోటర్లను, ఏజెంట్లను గుర్తించేందుకు అన్ని రకాల అస్త్రాలను వినియోగిస్తోంది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ, హెచ్‌ఎండీఏల నుంచి  అనుమతి తీసుకోగానే సమాచారం అందేలా ఏర్పాట్లు చేసిన టీ–రెరా.. తాజాగా రిజిస్ట్రేషన్‌ శాఖ మీద కన్నేసింది. ఏ విభాగం నుంచి అనుమతి తీసుకున్నా సరే చివరికి రిజిస్ట్రేషన్‌ శాఖ వద్దకు రావాల్సిందే! ఇక్కడే టీ–రెరా వల వేయాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రతి డాక్యుమెంట్‌ వివరాలు టీ–రెరాకు అందుబాటులో ఉండేలా.. శాఖకు లేఖ రాయనుంది.  

జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ, హెచ్‌ఎండీఏ, టీ–రెరా, రిజిస్ట్రేషన్‌ శాఖ.. ఇలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే అనుమతులు, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత వస్తుంది. అంతిమంగా కొనుగోలుదారునికి ప్రయోజనం చేకూరుతుంది. కానీ, తెలంగాణలో 20 శాతం మంది ప్రమోటర్లు బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతింటుందని, పారదర్శకంగా ఉండాలని రెరాలో నమోదు చేశాకే విక్రయాలు జరుపుతుంటే.. 80 శాతం మంది మాత్రం కొనుగోలుదారులకు మాయమాటలు, రకరకాల ఆఫర్లతో  మోసపూరితంగా అమ్మకాలు చేస్తున్నారని టీ–రెరా పరిశీలనలో తేలింది. ఏ విభాగం నుంచి అనుమతి తీసుకున్నా, ఎవరు ఎవరితో క్రయ విక్రయాలు జరిపినా సరే అంతిమంగా రిజిస్ట్రేషన్‌ శాఖకు రావాల్సిందే కాబట్టి రిజిస్ట్రేషన్‌ శాఖ, టీ–రెరా సమన్వయంగా పనిచేయాలని అధికారులు నిర్ణయించారు. రిజిస్ట్రేషన్‌ అయిన ప్రతి డాక్యుమెంట్‌ వివరాలు తెలిసేలా రెండు విభాగాలను అనుసంధానించనున్నారు. ప్రతి డాక్యుమెంట్, ప్రాజెక్ట్‌ను రెరా అధికారులు భౌతికంగా పరిశీలించి, రెరాలో నమోదు అయిందా? లేదా? చెక్‌ చేస్తారు. ఒకవేళ టీ–రెరాలో నమోదు అర్హత ఉండి కూడా రిజిస్టర్‌ కాకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటారు. 

సర్వం టీ–రెరా చేతిలో.. 
టీ–రెరా, రిజిస్ట్రేషన్‌ శాఖలు సమన్వంగా పనిచేస్తే.. ప్రమోటర్‌ ఫొటో, ఫోన్‌ నంబర్లు, ఆధార్‌ వివరాలు, చిరునామా వంటి సమాచారంతో పాటూ భూమికి సంబంధించిన లింక్‌ డాక్యుమెంట్లు, ప్లాటింగ్‌ ఏరియా, ప్రాజెక్ట్‌ వ్యయం, విక్రయ ధర వంటి వివరాలన్నీ తెలిసిపోతాయి. ఇప్పటికే టీ–రెరాలో నమోదు అర్హత ఉన్న ప్రతి ప్రాజెక్ట్, ప్రమోటర్లను గుర్తించేందుకు మున్సిపల్, కార్పొరేషన్, పంచాయతీ విభాగాలతో కలిసి పనిచేస్తుమన్నాని టీ–రెరా సెక్రటరీ కె. విద్యాధర్‌ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. ఆయా విభాగాల నుంచి అనుమతి తీసుకున్న ప్రతి ప్రాజెక్ట్‌/ లే అవుట్‌ సమాచారాన్ని తెప్పించుకొని, భౌతికంగా పరిశీలన చేస్తుమన్నాని చెప్పారు. గడువులోగా రెరాలో నమోదు చేసుకుంటే ఓకే! లేకపోతే షోకాజ్‌ నోటీసులు జారీ చేసి.. జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు.

సాక్షి: రెరాలో ఎన్ని ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి? 
రెరా: 4634 ప్రమోటర్లు, ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఇందులో 2039 మంది ఏజెంట్లు, 2595 ప్రాజెక్ట్‌ ప్రమోటర్లు ఉన్నారు. 

సాక్షి: స్థిరాస్తి కొనుగోలు చేయాలంటే మీ సూచన? 
రెరా: ఏజెంట్లు, ప్రమోటర్లు ఎవరైనా సరే మీకు ఫోన్‌ చేసి లేదా బ్రోచర్లు ఇచ్చి మా ప్రాజెక్ట్‌లో కొనండి అంటే ముందుగా వాళ్లని అడగాల్సిన మొదటి ప్రశ్న.. మీరు రెరాలో నమోదు అయిన ఏజెంటేనా అని! రెండో
ప్రశ్న.. సంబంధిత ప్రాజెక్ట్‌లో రెరాలో నమోదు అయిందా అని! వీటికి సమాధానం అవునొస్తే ముందడుగు వేయవచ్చు. 

సాక్షి: ఒకవేళ రెరా ఏజెంట్‌ అని, నంబరు ఉందని తప్పుడు సమాచారం ఇస్తే? 
రెరా: రెరా వెబ్‌సైట్‌లో రెరా నంబరు, ఏజెంట్ల వివరాలను నిర్ధారించుకునే వీలుంది. ట్ఛట్చ.్ట్ఛ ్చnజ్చ n్చ.జౌఠి.జీn వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే సెర్చ్‌ రిజిస్టర్‌ ప్రాజెక్ట్‌ అండ్‌ ఏజెంట్‌ అనే అప్షన్‌ ఉంటుంది. దాని మీద క్లిక్‌ చేయగానే ప్రత్యేకంగా లింక్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో ప్రాజెక్ట్, ప్రమోటర్‌ పేరు, ఏజెంట్ల నంబర్లు నమోదు చేస్తే చాలు వివరాలన్నీ క్షణాల్లో మీ ముందుంటాయి.

సాక్షి: హెచ్‌ఎండీఏ/డీటీసీపీ అనుమతి ఉంది. కానీ, రెరా రిజిస్టర్‌ కాదు? ఆ ప్రాజెక్ట్‌లో కొనొచ్చా? 
రెరా: జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, కార్పొరేషన్, పంచాయతీ ఏ విభాగం నుంచి అయినా అపార్ట్‌మెంట్‌ లేదా లే అవుట్‌ అనుమతి తీసుకున్నా సరే రెరాలో నమోదు చేయకుండా విక్రయాలు జరపకూడదు. ప్రకటనలు కూడా చేయకూడదు. అలా చేస్తే రెరా చట్టం ప్రకారం కఠిన చర్యలుంటాయి. 2017 జనవరి 1 తర్వాత అనుమతి పొందిన, 9 ఫ్లాట్లు లేదా 501 చ.మీ. నుంచి ప్రారంభమయ్యే ప్రతి అపార్ట్‌మెంట్, లే అవుట్‌ రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. 

సాక్షి: రెరా నమోదు గురించి ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా డెవలపర్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవటానికి కారణం? 
రెరా: టీ–రెరాలో ప్రాజెక్ట్‌ గురించి ప్రతి ఒక్క అంశాన్ని నమోదు చేయడంతో పాటూ ప్రాజెక్ట్‌ ప్రమోటర్లు, డైరెక్టర్ల వివరాలు, ఫొటోలు, ఫోన్‌ నంబర్లు, కంపెనీ అడ్రస్, ఏజెంట్ల వివరాలు ప్రతి ఒక్కటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవే డెవలపర్లకు కష్టంగా ఉంది. ఈ వివరాలు రెరాకు ఇస్తే.. లాక్‌ అయిపోతామని భావిస్తున్నారు. అందుకే తప్పుడు ఫోన్‌ నంబర్లు, ఈ–మెయిల్‌ ఐడీలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఫోన్‌ నంబర్లను ట్రాక్‌ చేస్తున్నాం. రెరాలో తప్పుడు నంబర్లు ఇస్తే షోకాజ్‌ నోటీసులు పంపిస్తున్నాం. సరైన సమాచారం ఇవ్వని వాళ్ల మీద జరిమానాలతో పాటూ కఠిన చర్యలు తీసుకుంటాం. 

సాక్షి: రెరాలో ప్రాజెక్ట్‌లను నమోదు చేయడంతోనే డెవలపర్ల పని పూర్తయినట్టా? 
రెరా: అది తప్పు. నిజం చెప్పాలంటే ప్రాజెక్ట్‌ నమోదు చేయడంతోనే డెవలపర్ల అసలు పని మొదలవుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి రెరాలో ప్రాజెక్ట్‌ వివరాలను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 33 మంది డెవలపర్లకు ప్రాజెక్ట్‌ను అప్‌డేట్‌ చేయమని చెప్పాం. రెరా వెబ్‌సైట్‌లో స్క్రోల్‌ కూడా చేస్తున్నాం. అప్‌డేషన్‌ ఫీజు ఏడాదికి రూ.500.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement