
భాగ్యనగరిలో 3 శాతం తగ్గిన కొత్త ప్రాజెక్ట్‌లు
♦ దేశంలో16 శాతం తగ్గిన నివాస ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు
♦ అందుబాటు గృహాల్లో మాత్రం 30 శాతం వృద్ధి
2016 మార్చిలో కేంద్రం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ప్రకటన చేసింది. అప్పటి నుంచి 2017 తొలి త్రైమాసికం ముగింపు వరకూ భాగ్యనగరిలో నివాస సముదాయాల ప్రారంభాలు 3 శాతం తగ్గుముఖం పట్టాయి. నగరంలో ఏప్రిల్ 2015– మార్చి 2016 మధ్య 10,125 యూనిట్లు ప్రారంభం కాగా.. ఏప్రిల్ 2016– మార్చి 2017లో మాత్రం 9,775 యూనిట్లకు పడిపోయాయి.– సాక్షి, హైదరాబాద్
హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, కోల్‌కతా, ముంబై, పుణె.. ఎనిమిది నగరాల్లో 2017 క్యూ1లో 25,800 యూనిట్లు ప్రారంభమయ్యాయి. గతేడాదితో ఇదే సమయంతో పోలిస్తే ఇది 16 శాతం తక్కువ. మరోవైపు అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ నిర్మాణ సంస్థలకు తలకు మించిన భారంగా మారుతోంది. రెరా, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు వంటి వాటితో ఈ పరిస్థితి మరో ఏడాది పాటు కొనసాగుతుందని నివేదిక వెల్లడించింది.
అందుబాటు గృహాల్లో 30 శాతం వృద్ధి..
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అందుబాటు గృహాలు, లగ్జరీ ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు మాత్రం వృద్ధిని నమోదు చేశాయి. ఏప్రిల్ 2016 నుంచి మార్చి 2017 మధ్య కాలంలో అందుబాటు గృహాలు 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2015–16 ఇదే సమయంలో 25 శాతంగా ఉది. లగ్జరీ, హైఎండ్ అండ్ యూనిట్ల ప్రారంభాలు మాత్రం ఇదే సమయంలో 11 శాతం నుంచి 13 శాతానికి పెరిగాయి. అయితే ఆయా విభాగాల్లో అమ్మకాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయండోయ్!
కొనుగోళ్లూ అంతంతే..
రెరాలోని పలు కఠిన నిబంధనల కారణంగా నిర్మాణ సంస్థలు తమ వ్యాపార శైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే కార్యకలాపాలు, నిర్వహణ, మార్కెటింగ్ వ్యూహాల వంటివన్నమాట. దీంతో 2017 మూడో త్రైమాసికం నాటికి పరిస్థితి ఇలాగే ఉంటుందని కుమ్‌మెన్ వేక్‌ఫీల్డ్ ఎండీ (ఇండియా) అన్షుల్ జైన్ తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్థిరాస్తి మూలధన విలువలు తగ్గాయియని పేర్కొన్నారు. రెరా, జీఎస్‌టీ అమలు వంటి కారణంగా ఈ పరిస్థితి మరో త్రైమాసికం పాటూ కొనసాగుతుందన్నారు. ‘‘పెద్ద నోట్ల రద్దు, ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో ఉద్యోగుల తొలగింపు వంటి ప్రతికూల వాతావరణ నేపథ్యంలో కొనుగోలుదారులూ డోలయమానంలో పడ్డారు. దీంతో అమ్మకాలూ తగ్గుముఖం పట్టాయి. పరిస్థితి సానుకూలంగా మార్చేందుకు మరో 3 నెలల సమయం పడుతుందని’’ జైన్ అంచనా వేశారు.