15 నుంచి రెరాలో నమోదు!  | Register in Rera website from 15! | Sakshi
Sakshi News home page

15 నుంచి రెరాలో నమోదు! 

Published Sat, Aug 11 2018 2:40 AM | Last Updated on Sat, Aug 11 2018 2:40 AM

Register in Rera website from 15! - Sakshi

సమావేశంలో పాల్గొన్న డైరెక్టర్‌ బాలకృష్ణ, రాంరెడ్డి, రామచంద్రా రెడ్డి, విద్యాధర్‌ రావు

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 15 నుంచి తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లో ప్రాజెక్ట్‌ల నమోదు ప్రారంభం కానుంది. రెరా అధికారుల నియామకంతో పాటూ వెబ్‌సైట్‌ అభివృద్ధి దాదాపు పూర్తయిందని.. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ), తెలంగాణ రెరా సెక్రటరీ కే విద్యాధర్‌ రావు చెప్పారు. 2017 జనవరి 1 తర్వాత జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, టీఎస్‌ఐఐసీ నుంచి అనుమతి పొందిన అన్ని రకాల నివాస ప్రాజెక్ట్‌లు రెరాలో నమోదు చేసుకోవాలి. 500 చ.మీ. లేదా 8 కంటే ఎక్కువ ఫ్లాట్లున్న ప్రతి ప్రాజెక్ట్‌ కూడా రెరాలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఆయన చెప్పారు. ‘‘ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. గతేడాది జనవరి 1 తర్వాత అనుమతి పొందిన ప్రాజెక్ట్‌లు తెలంగాణలో 5 వేలున్నాయి. ఇవన్నీ కూడా రెరాలో నమోదు చేసుకోవాలి. ఈనెల 15 నుంచి రెరా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రారంభమవు తుంది కాబట్టి అక్కడి నుంచి 3 నెలల గడువు ఇస్తాం. అయినా నమోదు చేసుకోకపోతే నోటీసులు అందిస్తాం. అప్పటికీ స్పందించకపోతే రెరా చట్టం ప్రకారం జరిమానాలు, ఇతరత్రా శిక్షలుంటాయని’’ హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌ బాలకృష్ణ హెచ్చరించారు. 

ప్రాజెక్ట్‌ నమోదుకు నాలుగంచెలు.. 
 శుక్రవారమిక్కడ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) ఆధ్వర్యంలో రెరా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యాధర్‌ రావు మాట్లాడుతూ.. ఒక్క ప్రాజెక్ట్‌ నమోదు కోసం నాలుగంచెలుంటాయి. రెరా రిజిస్ట్రేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన డాక్యుమెంట్లను లెవల్‌–1 అధికారి పరిశీలించి.. లెవల్‌–2 అధికారికి పంపిస్తారు. ఇక్కడ ఏజెంట్, డెవలపర్ల డాక్యుమెంట్లను తనిఖీ చేసిన తర్వాత రెరా సెక్రటరీకి వెళుతుంది. ఆయా డాక్యుమెంట్లు, ఇతరత్రా వివరాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత చైర్మన్‌ ప్రాజెక్ట్‌ను నమోదుకు అనుమతిస్తారు. ఒక్క ప్రాజెక్ట్‌ నమోదు కోసం 30 రోజులు, ఏజెంట్ల నమోదుకు 24 గంటల సమయం పడుతుందని చెప్పారు. 

- తెలంగాణ రెరాలో ప్రాజెక్ట్, ఏజెంట్ల నమోదుతో పాటూ ఫిర్యాదు, నమోదు ఉపసంహరణ, రద్దు వంటి ప్రతి అంశాలకు సంబంధించిన ప్రమాణాలుంటాయని పేర్కొన్నారు. రెరా మీద కొనుగోలుదారులు, డెవలపర్లు ఇద్దరిలోనూ అవగాహన కల్పించాల్సిన అవసరముందని.. ప్రభుత్వంతో పాటూ డెవలపర్ల సంఘాలూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 

రెరా అనేది నమోదు మాత్రమే అనుమతి కాదు.. 
రెరా అనేది ఒక రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మాత్రమే అనుమతి కాదని హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌ బాలకృష్ణ అన్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్థానిక మున్సిపల్‌ శాఖ అనుమతులు, అగ్నిమాపక, పోలీసు, పర్యావరణ ఇతరత్రా అన్ని ప్రభుత్వ విభాగాల అనుమతులు వచ్చాకే రెరా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 
అంతే తప్ప రెరాలో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే అనుమతులొచ్చినట్లు కాదని ఆయన వివరించారు. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో రెరా అవసరం పెద్దగా ఉండదని.. ఇక్కడి డెవలపర్లలో 95 శాతం నిర్మాణంలో, లావాదేవీల్లోనూ పారదర్శకంగా ఉంటారని చెప్పారు. 
గడువులోగా నిర్మాణం పూర్తి చేయకపోయినా, లేక కొనుగోలుదారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయినా ఇతరత్రా ఉల్లంఘనలు చేపట్టినా సరే రెరా అథారిటీ నుంచి కఠినమైన శిక్షలుంటాయని.. అవసరమైతే ప్రాజెక్ట్, ఏజెంట్, డెవలపర్ల లైసెన్స్‌లూ రద్దు అవుతాయని హెచ్చరించారు. ఏసీగార్డ్స్‌లో డీటీసీపీ భవనంలోని క్రింది అంతస్తు తెలంగాణ రెరా కార్యాలయం. 

డీపీఎంఎస్‌ మాదిరి ఇబ్బందులొద్దు: క్రెడాయ్‌
క్రెడాయ్‌ తెలంగాణ ప్రెసిడెంట్‌ గుమ్మి రాంరెడ్డి, జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ రామచంద్రా రెడ్డిలు మాట్లాడుతూ.. ‘‘గతంలో జీహెచ్‌ఎంసీ ప్రవేశపెట్టిన డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీపీఎంఎస్‌) ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.  డ్రాయింగ్స్, ఇతరత్రా డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ అవ్వక 3–4 నెలల పాటు ఇబ్బందులొచ్చాయని.. రెరా వెబ్‌సైట్‌ అమలులో ఇవేవీ లేకుండా చూసుకోవాలని సూచించారు. అన్ని విధాలా పరీక్షించిన అనంతరమే అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. మహారాష్ట్ర రెరా మాదిరిగానే తెలంగాణ రెరాను అభివృద్ధి చేశారు. మహారాష్ట్రలో మాదిరిగా ఇక్కడి కొన్ని విషయాలు అవసరం లేదు. స్థానిక డెవలపర్లకు సులువుగా, అనుకూలంగా ఉండేలా తెలంగాణ రెరాను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్‌ తెలంగాణలోని 10 చాప్టర్ల సభ్యులు, ఇతర డెవలపర్‌ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement