‘రియల్’ బూమ్‌కు రాయితీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మరింతగా ఊపు తెచ్చేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇటీవల తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవెలపర్స్ అసోసియేషన్(ట్రెడా) చేసిన విజ్ఞప్తి మేరకు స్టాంపు డ్యూటీకి సంబంధించి పలు రాయితీలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆస్తుల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లపై ప్రస్తుతం 4 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించే విధానం ఉంది. 2009 ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం మహిళల పేరిట జరిగే రిజిస్ట్రేషన్లకు అందులో ఒక శాతం రాయితీని ప్రకటించింది. ఏడాది పాటు ఈ రాయితీ అమలైంది.
తిరిగి అదే రాయితీని అమలు చేయాలని ఇటీవల ట్రెడా సీఎంను కలిసి విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు భూముల అభివృద్ధి ఒప్పందాలు (డెవెలప్‌మెంట్ అగ్రిమెంట్లు) రిజిస్ట్రేషన్లకు స్టాంపు డ్యూటీని గరిష్ఠంగా రూ. 2 లక్షలకు పరిమితం చేయాలని కోరింది. ఈ రెండు అంశాలపై శనివారం(నేడు) జరిగే రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది. కొత్త ఏడాదిలో మొదటిసారిగా రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. మూడు నెలల తర్వాత సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించేందుకు దాదాపు 40 అంశాలతో ఎజెండా సిద్ధమైంది.
‘గ్రేటర్’పై వరాలు...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీలో నగరవాసులపై వరాలు కురిపించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. కరెంటు బిల్లు, నల్లా బిల్లుల బకాయిలను మాఫీ చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి హామీలిచ్చారు. దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. 8 లక్షల మందికి లబ్ధి చేకూర్చే రూ.2 వేల వరకు ఆస్తిపన్ను రద్దుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనికి సైతం కేబినెట్ ఆమోదం తీసుకోవాల్సి ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై చర్చించి మంత్రులకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించనున్నారు.
బడ్జెట్‌పై చర్చ...
వచ్చే బడ్జెట్ కేటాయింపులపై కేబినెట్‌లోనే సమగ్రంగా చర్చించాలని కేసీఆర్ నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల తేదీని ఖరారు చేసే అవకాశముంది. శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలతో రావాలని మంత్రులకు సమాచారం అందించారు. వీటితోపాటు గాంధీ మెడికల్ కాలేజీ ఆధునికీకరణ, గతంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ(శాప్)ను తెలంగాణకు అన్వయింపు, వాటర్‌గ్రిడ్(మిషన్ భగీరథ) పనులను సకాలంలో పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకం తదితర అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. వీటితో పాటు కొత్త సంవత్సరంలో అమలు చేయాల్సిన ఎజెండా, డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపిక, మిషన్ కాకతీయ పర్యవేక్షణపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై మంత్రులు, అధికారులకు పలు లక్ష్యాలను నిర్దేశించనున్నారు.
డీఎస్సీ, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్...
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. కేబినెట్ ఆమోదం తర్వాత నోటిఫికేషన్ జారీ కానుంది. మరోవైపు రాష్ట్రంలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, మరో 20 వేల మందికిపైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు అంశాలు కేబినెట్ ఎజెండాలో ఉన్నాయి.