యువోటర్
♦ ఓటరు జాబితాలో సగానికి పైగా యువజనమే
♦ హైదరాబాద్‌లో 60.91 శాతం, రంగారెడ్డిలో 49.70 శాతం
♦ రేపటి స్థానిక నేతల తలరాత రాసేది వీరే...
ఇక గ్రేటర్ నేతలు ‘యువ’ జపం చేయాల్సిందే. యువతను ఆకట్టుకోవాల్సిందే. వారికోసం ప్రత్యేక ప్లాన్‌లు అమలు చేయాల్సిందే. మేనిఫెస్టోల్లో యువజన సంక్షేమ కార్యక్రమాలు ప్రస్తావించాల్సిందే. ఎందుకంటే...గ్రేటర్ పీఠాధిపతిని నిర్ణయించేది యువ ఓటర్లే. అవును...ఇది నిజం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్లలో 61 శాతం యువ ఓటర్లు ఉన్నట్లు తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటరు జాబితాలో వెల్లడైంది. గత ఎన్నికల్లో యువ ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తేలింది. ఈ వివరాలు తెలుసుకున్న మన నేతలు యువతను ఆకర్షించే పనిలో పడిపోయారు. ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌లతో సిద్ధమవుతున్నారు.
- సాక్షి ప్రతినిధి, హైదరాబాద్
సేఫ్ సిటీ కావాలి
హైదరాబాద్ మరింత సేఫ్ సిటీ కావాలి. ఆ దిశగా పనిచేసే నేతలకే మా మద్దతు. మారిన పరిస్థితుల్లో 24 గంటలు యువతులు పనిచేయాల్సి వస్తోంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవరికీ ‘ప్రైవేటు’ లేకుండా పోయింది. అందుకు సైబర్ చట్టాలకు మరింత పదును పెంచి, యువతులపై చోటు చేసుకునే ఆగడాల నియంత్రణకు మరింత పకడ్బందీ యాక్షన్‌ప్లాన్ అమలు చేయాలి. ఎన్నికయ్యే నేతలు ఈ దిశగా చర్యలు చేపట్టాలి. - శృతి శ్రీపాద, ఆర్టిస్ట్
ఫిట్‌నెస్.. మస్ట్
నగరంలో యూత్ 20 ఏళ్లలోనే పలు రోగాలతో సతమతమయ్యే పరిస్థితి. మారిన లైఫ్‌స్టైల్ నేపథ్యంలో ఫిట్‌నెస్ కోసం స్థానిక ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలల్లో కనీసం చిన్న మైదానాలు కూడా లేని పరిస్థితి. శారీరక వ్యాయాయం లేక యువత ఇబ్బంది పడుతోంది. ప్రతి డివిజన్‌కు ఇక ఇంటర్నేషనల్ స్థాయి జిమ్‌లు ఏర్పాటు చేసి, హైదరాబాద్ యూత్ మనుసుల్ని గెలిచే వారికే గ్రేటర్ ఎన్నికల్లో మా మద్దతు.
- రవి పర్యాద, ఇంటర్నేషనల్ ఫిట్‌నెస్ ట్రైనర్
మహానగర ఎన్నికల్లో గెలుపు ఎవరిది..? వినటానికే ఉత్కంఠగా ఉంది కదూ ఈ ప్రశ్న. నిజమే బరిలో ఉన్నది ఎవరైనా..యూత్ మద్దతును కూడగట్టిన స్థానిక నేతలే విజేతలు కానున్నారు. ఎందుకంటే ఫలితాన్ని ఒంటిచేత్తో శాసించే స్థితిలో యువ ఓటర్లు ఉండటమే కారణం. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రాంతాల్లో మొత్తం ఓటర్లలో 60.91 శాతం మంది యువ ఓటర్లు (18 నుంచి 35 ఏళ్లు) ఉండగా, రంగారెడ్డి అర్బన్ పరిధిలోని ప్రాంతాల్లో 49.70 శాతం మంది ఉన్నారు. గత ఎన్నికల్లో పోలింగ్ శాతం చూస్తే, మిగతా వయసు వారి కంటే యువజనులే అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో అన్ని పార్టీలు త్వరలో జరగబోయే ఎన్నికల్లో యువనామ స్మరణ చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
యూత్ కోసం.. స్పెషల్ యాక్షన్ ప్లాన్
యువజనులు తమకు ఓటేస్తే తప్ప విజయం సాధించలేమన్న అంశాన్ని గమనిస్తున్న రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వారి కోసం ప్రత్యేక మేనిఫెస్టోతో ముందుకు వెళ్లే యోచనలో ఉన్నారు. నగరంలోని యువజనులను మూడు కేటగిరీలుగా విభజించి వారికి చేరువయ్యే యాక్షన్‌ప్లాన్‌లు రూపొందిస్తున్నారు. ప్రాంతాల వారీగా యూత్ ఆకాంక్షలపై ‘క్విక్ సర్వే’లతో వారిని ప్రసన్నం చేసుకునే ఏర్పాట్లలో తలమునకలయ్యారు. వారిని స్థానిక నాయకులు ప్రత్యక్షంగా కలుసుకోవటంతో పాటు సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అయ్యే వ్యూహం అమలు చేయాలని భావిస్తున్నారు.
ఒక అంచనా మేరకు నగరంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ తదితర అకౌంట్లున్న వారి సంఖ్య సుమారు 65 లక్షలుండగా అందులో 90 శాతం 40 ఏళ్ల లోపువారే కావటంతో వారితో నిత్యం టచ్‌లో ఉండే ందుకు పార్టీలు రెడీ అయ్యాయి. ఇప్పటికే నగరంలో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంలు సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. ఈ విషయమై టీఆర్‌ఎస్ తరపున సోషల్ మీడియా కోఆర్డినేషన్ హెడ్‌గా వ్యవహరిస్తున్న నేత ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ నాలుగు అంశాలపై దృష్టి సారించి ముందుకు వెళుతున్నామన్నారు. అందులో సేఫ్టీ సిటీ, గ్రీన్‌సిటీ, క్లీన్‌సిటీ, డెవలప్‌మెంట్ సిటీ అంశాలను యూత్ ముందుంచినట్లు చెప్పారు.