రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ అధికారి నిఖేశ్‌కుమార్ అవినీతి బట్టబయలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేసిన ఏసీబీ
బఫర్ జోన్లలో అనుమతులు.. అందుకు ప్రతిగా లంచాలుగా ఆస్తులు
19 ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగిన తనిఖీలు.. రూ. 17.73 కోట్ల ఆస్తుల గుర్తింపు.. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ. 200 కోట్లపైనే
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: బఫర్ జోన్లలో నిర్మాణాలకు అక్రమంగా అనుమతులిచ్చి అందుకు ప్రతిగా లంచాలుగా ఆస్తులు పొందడంతోపాటు ఇటీవల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కి సస్పెండైన ఓ అవినీతి అధికారి బాగోతం బట్టబయలైంది. ఆదాయానికి మించి రూ. వందల కోట్ల ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులో రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెరూర్ నిఖేశ్ కుమార్‌ను ఏసీబీ శనివారం రాత్రి అరెస్ట్ చేసింది. అంతకుముందు శనివారం ఉదయం నుంచి రాత్రి దాకా ఆయన ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లపై ఏసీబీ మెరుపుదాడులు చేసింది.
హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లోని పెబెల్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని ఆయన ఇంటితోపాటు 19 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో కొల్లూరులో 15 ఎకరాల వ్యవసాయ భూమి, మొయినాబాద్‌లో 3 ఫాంహౌస్‌లు, విలాసవంతమైన 3 విల్లాలు, 5 నివాస స్థలాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఆరు ఫ్లాట్లు, రెండు కమర్షియల్ స్థలాలకు సంబంధించిన పత్రాలను ఏసీబీ గుర్తించింది. వాటి విలువ రూ. 17,73,53,500గా వెల్లడించింది. అయితే బహిరంగ మార్కెట్‌లో ఆ ఆస్తుల విలువ రూ. 200 కోట్లపైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏసీబీ సోదాల సమయంలో పెద్ద మొత్తంలో ఖరీదైన వస్తువులు, విలువైన ఆభరణాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు ఖాతాలను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని తెలిసింది. మరోవైపు పలు రియల్ ఎస్టేట్ సంస్థలకు, నిఖేశ్‌కుమార్‌కు మధ్య జరిగిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా రాజ పుష్ప అనే రియల్ ఎస్టేట్ సంస్థలో ఆయనకు 56 ఆస్తులు ఉన్నట్లు పత్రాలు లభించాయి. అలాగే మరో సంస్థలో ఆయనకు చెందిన 26 ఆస్తుల పత్రాలు కూడా బయటపడ్డాయి.
రూ. లక్ష తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి..
రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ కార్యాలయంలో ఏడబ్ల్యూ సెక్షన్‌లో ఏఈఈగా పనిచేస్తున్న సమయంలో నిఖేశ్‌కుమార్ మరికొందరు అధికారులతో కలిసి మణికొండ, నేక్నామ్‌పూర్‌లో ఒక భవన నిర్మాణానికి అనుమతలిచ్చేందుకు రూ. 2.5 లక్షల లంచాన్ని తీసుకొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇందులో ముందుగా రూ. లక్షన్నర తీసుకున్నారు. ఈ ఏడాది మే 30న లంచం మొత్తంలోని మిగిలిన రూ. లక్ష తీసుకుంటుండగా ఈఈ కె.భన్సీలాల్, నిఖేశ్‌కుమార్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
దీంతో నిఖేశ్‌కుమార్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏసీబీ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో లంచాల సొమ్ముతో నిఖేశ్‌కుమార్ పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసి తాజాగా సోదాలు చేపట్టారు.
బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మాణ అనుమతులు..
చెరువులు, కుంటల దగ్గర భూముల్లోని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలకు ఎన్‌ఓసీలు జారీ చేసే విభాగంలో నిఖేశ్ కుమార్ విధులు నిర్వర్తించిన సమయంలో గండిపేట బఫర్ జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చి భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment