డమ్మీ కాన్సులేట్‌లో వీసా ఇంటర్వ్యూ | gang cheated Gujarat businessman: Visa interview | Sakshi
Sakshi News home page

డమ్మీ కాన్సులేట్‌లో వీసా ఇంటర్వ్యూ

Oct 11 2024 5:58 AM | Updated on Oct 11 2024 5:58 AM

gang cheated Gujarat businessman: Visa interview

గుజరాత్‌ వ్యాపారి కుటుంబాన్ని మోసం చేయడానికి ఓ ముఠా పక్కా ప్లాన్‌ 

హైదరాబాద్‌ శివార్లలోని హోటల్‌లో యూఎస్‌ కాన్సులేట్‌ సెట్‌వేసి

వీసా ఇంటర్వ్యూల నిర్వహణ 

ప్రాసెసింగ్‌ పేరుతో రూ.41.5 లక్షలు కాజేసిన గ్యాంగ్‌ 

బాధితుడి ఫిర్యాదుతో అహ్మదాబాద్‌లో కేసు నమోదు 

ఆధారాల కోసం నగరానికి రానున్న దర్యాప్తు బృందం

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారులోని ఓ స్టార్‌ హోట ల్‌లో అమెరికన్‌ కాన్సులేట్‌ సెట్‌ వేసిన ఓ ముఠా.. గుజరాత్‌కు చెందిన వ్యాపారిని మోసం చేసింది. వీసా ఇంటర్వ్యూల పేరిట రూ.41.5 లక్షలు కాజేసింది. బాధితుడి ఫిర్యాదుతో అహ్మదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో కొందరు హైదరాబాద్‌కు చెందినవారు ఉన్నారని అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు సేకరించడానికి ఓ ప్రత్యేక బృందం అహ్మదాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు రానుంది.  

ట్రావెల్‌ ఏజెంట్‌తో పరిచయం.. 
అహ్మదాబాద్‌లో వస్త్ర వ్యాపారం చేసే వ్యాపారికి స్నేహితుల ద్వారా మీన్‌చంద్‌ పటేల్‌ అనే ట్రావెల్‌ ఏజెంట్‌తో పరిచయమైంది. తనతో సహా 19 మంది స్నేహితులు, కుటుంబీకులు అమెరికా విహారయాత్రకు వెళ్లాలని భావిస్తున్నట్టు మీన్‌చంద్‌కు చెప్పాడు. అందరి వీసాలు ప్రాసెస్‌ చేయడానికి అంగీకరించిన ఇతగాడు వారి నుంచి టూర్‌ ప్యాకేజీ కూడా సిద్ధం చేశారు. మొత్తం 19 మంది నుంచి పాస్‌పోర్ట్‌ కాపీలు తీసుకున్నాడు. అప్లికేషన్‌ ఫీజు పేరుతో రూ.1.5 లక్షలు వసూలు చేసిన మీన్‌చంద్‌ వారికి కొన్ని దరఖాస్తులు ఇచ్చి పూరించమని చెప్పాడు. వ్యాపారిని మోసం చేయాలని నిర్ణయించిన ఈ ఏజెంట్, దానికోసం మరికొందరితో కలిసి భారీ స్కెచ్‌ వేశాడు.

హైదరాబాద్‌ కాన్సులేట్‌లో మాత్రమే తమకు కావాల్సిన సమయంలో వీసా స్లాట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పి నమ్మించాడు. వీసా ఇంటర్వ్యూ కోసం అంతా అక్కడకు వెళ్లాలంటూ ప్రత్యేక బస్సులో తీసుకొచ్చాడు. దీనికి ముందే తన అనుచురులు కొందరిని హైదరాబాద్‌కు పంపిన మీన్‌ చంద్‌ శివార్లలోని ఓ స్టార్‌ హోటల్‌లో బాంక్వెట్‌ హాల్‌ బుక్‌ చేయించాడు. అందులో ప్రత్యేకంగా టేబుళ్లు, కుర్చీలు ఉంచి యూఎస్‌ కాన్సులేట్‌ బ్రాంచ్‌ ఆఫీస్‌గా మార్చాడు. గుజరాత్‌కు చెందిన వారికి వీసాలు జారీ కావడం కష్టమంటూ అహ్మదాబాద్‌ వ్యాపారికి చెప్పిన మీన్‌చంద్‌... తనకు ఉన్న పరిచయాలు వినియోగించి ప్రాసెస్‌ పూర్తయ్యేలా చేస్తున్నానని నమ్మబలికాడు.

అయితే భద్రతా కారణాల నేపథ్యంలో నానక్‌రామ్‌గూడలో ఉన్న అమెరికన్‌ కాన్సులేట్‌లోకి ఎక్కువ మందిని అనుమతించట్లేదని, గ్రూప్‌ వీసా ప్రాజెక్టులో భాగంగా ఓ హోటల్‌లో ఇంటర్వ్యూలు చేయడానికి కాన్సులేట్‌ అధికారులు అంగీకరించారని నమ్మించాడు. దాదాపు మూడు నెలల క్రితం అందరినీ హైదరాబాద్‌ తీసుకొచ్చిన మీన్‌చంద్‌ మరో హోటల్‌లో బస చేయించాడు. అక్కడ నుంచి వాళ్ల బస్సులోనే ఈ స్టార్‌హోటల్‌కు తీసుకొచ్చాడు. నేరుగా బాంక్వెట్‌ హాల్‌కు తీసుకెళ్లి... అప్పటికే సిద్ధంగా ఉన్న తన అనుచరుల్ని కాన్సులేట్‌ అధికారులు, ప్రతినిధులుగా నమ్మించాడు.

అలా 19 మందికీ డమ్మీ ఇంటర్వ్యూలు చేయించి వారిని మీన్‌చంద్‌ తిరిగి అహ్మదాబాద్‌కు తీసుకెళ్లాడు. ఆపై వీసా ఫీజుల పేరుతో మరో రూ.40 లక్షలు వసూలు చేశాడు. ఎన్నాళ్లు వేచి చూసినా వీసాలు ప్రాసెస్‌ కాకపోవడంతో అనుమానించిన వ్యాపారి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ స్కామ్‌లో మీన్‌చంద్‌కు హైదరాబాద్‌కు చెందిన వారూ సహకరించి ఉంటారని అనుమానిస్తున్న అక్కడ పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కీలక ఆధారాల సేకరణ కోసం త్వరలో నగరానికి రానున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement