కొనుగోళ్లతో రూ.6 వేల కోట్ల వరకు భారమన్న ప్రభుత్వ వర్గాలు
ఆ కరెంటు ధర, ట్రాన్స్‌మిషన్ చార్జీలు కలిపి అధిక ధర..
సరిగా సరఫరాగాక బయటి నుంచి కొనుగోళ్లు
అదనపు కారిడార్ బుకింగ్‌తోనూ అనవసరపు ఖర్చు అనే వాదన
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలపై వివాదం
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సర్కారు శాసనసభలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రకటించడం, ఆ తర్వాత ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తో సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో.. ప్రభుత్వం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అధ్యక్షతన విచారణ కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలు పలు గణాంకాలు చెప్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల దాదాపు రూ.6 వేల కోట్ల వరకు విద్యుత్ సంస్థలు నష్టపోయాయని అంటున్నాయి. అనవసరంగా ట్రాన్స్‌మిషన్ కారిడార్లను బుక్ చేసుకోవడం, ఒప్పందం మేరకు విద్యుత్ తీసుకోకపోవడం, అర్ధంతరంగా కొనుగోళ్లు ఆపేయడం, బకాయిలు చెల్లింపుపై వివాదాలు వంటివన్నీ కలసి సమస్యగా మారాయని పేర్కొంటున్నాయి.
అదనపు ఖర్చులతో రేటు పెరిగి..
2017 చివరి నుంచి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని.. 2022 ఏప్రిల్ వరకు సరఫరా జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సంస్థలతో యూనిట్‌కు రూ.3.90 ధరతో 1000 మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నా.. ఏనాడూ పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా కాలేదని తెలిపాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కొనుగోలు చేసిన మొత్తం విద్యుత్ 17,996 మిలియన్ యూనిట్లని.. ఇప్పటివరకు రూ.7,719 కోట్లు చెల్లించారని, ఇంకా రూ.1,081 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించాయి.
ట్రాన్స్‌మిషన్ లైన్ల కోసం రూ.1,362 కోట్లు చార్జీలు చెల్లించారని తెలిపాయి. అన్ని ఖర్చులు కలిపి లెక్కిస్తే ఒక్కో యూనిట్ సగటు ఖర్చు రూ.5.64కు చేరిందని.. దీనితో దాదాపు రూ.3,110 కోట్లు అదనపు భారం పడిందని వెల్లడించాయి. బకాయిల విషయంలో వివాదం ఉందని, రూ.1,081 కోట్లే బకాయి ఉందని తెలంగాణ చెప్తుంటే.. ఛత్తీస్‌గఢ్ మాత్రం రూ.1,715 కోట్లు రావాల్సి ఉందని లెక్క చూపిస్తోందని పేర్కొన్నాయి.
సరిగా విద్యుత్ సరఫరా లేక..
ఛత్తీస్‌గఢ్ నుంచి ఏనాడూ వెయ్యి మెగావాట్ల కరెంటు సాఫీగా రాలేదని.. దీనితో తెలంగాణ డిస్కంలు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచి్చందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇలా 2017 నుంచి 2022 వరకు రూ.2,083 కోట్లు అదనపు భారం పడిందని పేర్కొన్నాయి. ఇక ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌ను తెచ్చుకునేందుకు పవర్ గ్రిడ్ నుంచి వెయ్యి మెగావాట్ల కారిడార్ బుక్ చేయడం.. విద్యుత్ తెచ్చుకున్నా, లేకున్నా ఒప్పందం ప్రకారం చార్జీలు చెల్లించాల్సి రావడంతో రూ.638 కోట్లు భారం పడిందని తెలిపాయి.
దీనికితోడు మరో 1000 మెగావాట్ల కారిడార్‌ను అడ్వాన్స్‌గా బుక్ చేయడం, దాన్ని అర్ధంతరంగా రద్దు చేసుకోవడం కూడా రాష్ట్ర విద్యుత్ సంస్థలకు నష్టం కలిగించిందని పేర్కొన్నాయి. పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాలని పవర్‌గ్రిడ్ సంస్థ రాష్ట్ర డిస్కంలకు నోటీసులు జారీ చేసిందని వివరించాయి. ఇక ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ఈఆర్సీ ఇప్పటివరకు ఆమోదం తెలపలేదని.. ఈ లెక్కన ఛత్తీస్‌గఢ్‌కు కట్టిన వేల కోట్ల రూపాయలను అడ్డదారి చెల్లింపులుగానే పరిగణించాల్సి ఉంటుందని ఆరోపించాయి.
Comments
Please login to add a commentAdd a comment