former Chief Justice of India
-
న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు లేవు
న్యూఢిల్లీ: భారతదేశం ఏకైక రాజకీయ పార్టీ ఆధిపత్యం చెలాయించే దేశంగా మారిపోతోందన్న వాదనను సుప్రీంకోర్టు(Supreme Court) మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్( DY Chandrachud) తిరస్కరించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు సైతం బలంగా ఉన్నాయని చెప్పారు. తాను సీజేఐగా పనిచేసినప్పుడు రాజకీయ పార్టీల నుంచి, ప్రభుత్వ వర్గాల నుంచి తనపై ఎలాంటి ఒత్తిళ్లు రాలేదని స్పష్టంచేశారు. ఇండియాలో న్యాయ వ్యవస్థ చట్టపరిధిలోనే పనిచేస్తోందని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు ఉన్నట్లు తాను భావించడం లేదన్నారు. తాజాగా బీబీసీ ‘హర్డ్టాక్’ఇంటర్వ్యూ(BBC Hard Talk interview)లో జర్నలిస్టు స్టీఫెన్ సకర్ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. పలు అంశాలను ప్రస్తావించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ఆధిపత్యం కింద ఇండియా ఏక పార్టీ రాజ్యంగా మారుతోందన్న వాదనను తాను అంగీకరించలేనని పేర్కొన్నారు. ఈ మేరకు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వెలువడిన సంపాదకీయాన్ని ఖండించారు.అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ప్రాంతీయ పార్టీలతోపాటు రాష్ట్రస్థాయిలో రాజకీయాలకు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పడానికి 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయని, దేశంలో ప్రాంతీయ ఆకాంక్షలు, గుర్తింపునకు ప్రాధాన్యం నానాటికీ పెరుగుతోందని వివరించారు. సుప్రీంకోర్టు పట్ల ప్రజల విశ్వాసంసొంత పార్టీ నాయకులను రక్షించుకోవడానికి, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి న్యాయ వ్యవస్థపై అధికార పార్టీ ఒత్తిడి పెంచుతోందని ఆరోపించడం సరైంది కాదని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అలాంటి ఒత్తిళ్లేవీ తనకు ఎదురు కాలేదన్నారు. పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అనర్హతకు గురయ్యారని, ఆ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిందని గుర్తుచేశారు.ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగే అవకాశం కల్పించిందని అన్నారు. పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఇండియా కోర్టులు స్థిరంగా పరిరక్షిస్తున్నాయని చెప్పారు. ఎన్నో కేసుల్లో నిందితులకు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే కోర్టులు ఉన్నాయని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు స్పష్టం చేసిందని వివరించారు. కొన్ని కేసుల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని, అయినప్పటికీ పౌరుల స్వాతం్రత్యాన్ని కాపాడే విషయంలో సుప్రీంకోర్టు ముందు వరుసలో ఉంటోందని పేర్కొన్నారు. అందుకే ప్రజలు సుప్రీంకోర్టు పట్ల సంపూర్ణ విశ్వాసం చూపుతున్నారని వెల్లడించారు.లింగ వివక్ష, వారసత్వ జాడ్యం లేదుభారత న్యాయ వ్యవస్థపై ఆగ్రవర్ణ హిందూ పురుషులు పెత్తనం చెలాయిస్తున్నారని, ఇక్కడ కూడా వారసత్వ జాడ్యం కనిపిస్తోందన్న అభిప్రాయాన్ని జస్టిస్ చంద్రచూడ్ ఖండించారు. న్యాయ వ్యవస్థలో లింగ వివక్ష భారీగా తగ్గిపోయిందని అన్నారు. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో కొత్తగా చేరుతున్న వారిలో 50 శాతానికిపైగా మహిళలే ఉంటున్నారని గుర్తుచేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్య 60 నుంచి 70 శాతం ఉందన్నారు. న్యాయ విద్య మహిళలకు చేరువవుతోందని తెలిపారు. లా స్కూళ్లలో మహిళల ప్రవేశాలు పెరుగుతున్నాయని, వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని చెప్పారు.న్యాయవాదులు, న్యాయమూర్తులు వారసత్వంగా కోర్టుల్లో చేరుతున్నట్లు తాను అనుకోవడం లేదన్నారు. తన తండ్రి వై.వి.చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారని గుర్తుచేశారు. సీజేఐగా ఉన్నంత కాలం కోర్టులో అడుగుపెట్టొద్దంటూ తన తండ్రి తనకు చెప్పారన్నారు. దీంతో హార్వర్డ్ లా స్కూల్లో మూడేళ్లు చదివానని, తన తండ్రి రిటైర్ అయిన తర్వాతే మొదటిసారి కోర్టులో అడుగుపెట్టానని వెల్లడించారు.ఇండియాలో చాలామంది లాయర్లు, జడ్జిలకు ఎలాంటి న్యాయ నేపథ్యం లేదన్నారు. అయోధ్య రామమందిరం, ఆర్టీకల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వంటి కీలక అంశాలపై నిబంధనల ప్రకారమే తీర్పులు ఇచ్చినట్లు జస్టిస్ చంద్రచూడ్ స్పష్టంచేశారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజకీయ వాస్తవికతల మధ్య చక్కటి సమతుల్యత పాటిస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. అది మర్యాదపూర్వక కలయిక గత ఏడాది వినాయక చవితి సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరైన సంగతి తెలిసిందే. సీజేఐ ఇంటికి ప్రధానమంత్రి రావడం అత్యంత అరుదు. ఈ ఉదంతం అప్పట్లో తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. సీజేఐని ప్రభావితం చేసేందుకు మోదీ ప్రయత్నిచారని మండిపడ్డాయి. ఈ అంశంపై జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు.ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగానే తన నివాసానికి వచ్చారని చెప్పారు. దీనిపై అతి విశ్లేషణ అవసరం లేదని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లోని వ్యక్తుల మధ్య ఉండే కనీస మర్యాదలను అర్థం చేసుకొనేటంత పరిపక్వత మన వ్యవస్థకు ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి మర్యాదపూర్వకమైన కలయికల ప్రభావం కేసుల విచారణపై ఎంతమాత్రం ఉండదన్నారు.ప్రధాని మోదీ తన నివాసానికి రాక ముందు, వచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు వెలువరించిందని, ఇందులో ప్రభుత్వానికి ప్రతికూలంగా వచ్చిన తీర్పులు సైతం ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ న్యాయ వ్యవస్థ పాత్ర పార్లమెంట్లో ప్రతిపక్షం పోషించే పాత్రలాంటిది కాదని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. కేసులను విచారించడం, చట్టబద్ధమైన పాలన కొనసాగేలా చూడడం మాత్రమే న్యాయ వ్యవస్థ బాధ్యత అని తేల్చిచెప్పారు. -
జస్టిస్ చంద్రచూడ్‌పై మొయిత్రా విమర్శలు
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌ను లక్ష్యంగా చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా శుక్రవారం లోక్‌సభలో చేసిన విమర్శలు తీవ్ర కలకలం రేపాయి. అంతేగాక విమర్శించే గొంతుకలన్నింటినీ నొక్కేయడమే లక్ష్యంగా దేశంలో సర్వ వ్యవస్థలనూ మోదీ సర్కారు చెరబడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసే క్రమంలో ప్రత్యేక కోర్టు జడ్జి బి.హెచ్.లోయా మృతి అంశాన్ని ఆమె ప్రస్తావించడంతో సభలో దుమారం రేగింది. లోయాది అత్యంత అకాల మరణమన్న మొయిత్రా వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘అత్యంత తీవ్ర ఆరోపణలివి. దీనిపై కచ్చితంగా తగిన రీతిలో పార్లమెంటరీ చర్యలుంటాయి. మొయిత్రా తప్పించుకోలేరు’’ అన్నారు. మొయిత్రా ప్రసంగ రికార్డులను స్పీకర్ ఓం బిర్లా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. ఆమెపై మరోసారి అనర్హత వేటు తప్పదంటున్నారు. నోటుకు ప్రశ్నల ఆరోపణలపై గత లోక్‌సభలో మొయిత్రా సభ్యత్వం రద్దవడం తెలిసిందే. లోయా 2014లో రాజకీయంగా సొహ్రాబుద్దీన్ షేక్ హత్య కేసును విచారిస్తుండగా వివాదాస్పద రీతిలో మృతి చెందారు. దాని వెనక బీజేపీ హస్తముందనేలా విపక్షాలు ఆరోపించాయి. ఆయనది సహజ మరణమేనని సుప్రీంకోర్టు నిర్ధారించింది.సీజేఐలపై తీవ్ర వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని హత్య చేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయతి్నస్తోందంటూ మొయిత్రా తన ప్రసంగంలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కారు చేతిలో వెయ్యి కత్తి పోట్లతో రాజ్యాంగం నిలువెల్లా రక్తమోడుతోందన్నారు. ఈడీ, సీబీఐ వంటివాటిని చివరికి వసూళ్ల సంస్థలుగా, ఈసీ వంటివాటిని జేబు సంస్థలుగా మార్చుకుందని ఆక్షేపించారు. ఆ క్రమంలో జస్టిస్ చంద్రచూడ్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాల్లో కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానాల సమగ్రతను, స్వతంత్ర ప్రతిపత్తిని పణంగా పెట్టేందుకు ప్రయతి్నంచారు! తాజా మాజీ సీజేఐ హయాంలో కొందరికే బెయిళ్లు మంజూరయ్యాయి. ఒక వర్గం వారికి మొండిచెయ్యి చూపారు. వారికి ఆయన అక్షరమాలలో స్థానమే లేకుండా పోయింది. ఆ మాజీ సీజేఐ ప్రవర్తన చివరికి సుప్రీంకోర్టు రాజకీయ ప్రతిపక్షంలా వ్యవహరించరాదనే వ్యాఖ్యలకూ కారణమైంది. విపక్ష పాత్ర పోషించేందుకు మేమున్నాం. అందుకు సుప్రీంకోర్టు అవసరమేమీ లేదు’’ అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ తన నివాసంలో గణేశ్ చతుర్థి వేడుకలకు ప్రధాని మోదీని ఆహా్వనించడాన్ని మొయిత్రా తీవ్రంగా తప్పుబట్టారు. మోదీని దేవునితో పోలుస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘న్యాయమూర్తులు తీర్పులు రాసేందుకు తర్కం, చట్టం, రాజ్యాంగానికి బదులు ఇలా దేవునితో ప్రైవేట్ సంభాషణలపై ఆధారపడే పరిస్థితిని బహుశా మన రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ ఊహించి కూడా ఉండరు. మాజీ, ప్రస్తుత సీజేఐలందరికీ నాదో సలహా. ఇలా దేవుడి నుంచి సూచనలు అందుకోవడం మానేయండి. వ్యక్తిగత వేడుకలకు రాజకీయ పెద్దలను అతిథులుగా పిలిచి వాటిని టీవీ సర్కస్లుగా మార్చకండి. మీ ఏకైక అతిథి రాజ్యాంగమే. అది మాత్రమే మీ ఇంట్లో కొలువుదీరే దేవుడు కావాలి. మీరు మిగల్చబోయే వ్యక్తిగత వారసత్వం గురించి ఆందోళన పడటం ఆపేయండి. ఎందుకంటే అలా వ్యక్తిగత గుర్తింపు కోరుకునే వాళ్లు ఎలాంటి వారసత్వమూ మిగల్చలేరు. మౌలిక హక్కులను పరిరక్షించేవారు మాత్రమే గుర్తుండిపోతారు’’ అన్నారు. -
ఓటమి నుంచే గాంధీ నేర్చుకున్నారు..
సాక్షి, హైదరాబాద్: ‘‘గెలుపు కన్నా ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం.. గాంధీజీ సైతం అలాగే ఓటమి నుంచే నేర్చుకున్నారు.. అందుకని ఏ రంగంలోనైనా ఓడిపోతే కుంగిపోకూడదు ’’ అని ఒడిశా హైకోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ ఎస్.మురళీధర్ ఉద్బోధించారు. గాంధీ జయంతి నాడు ప్రముఖుల ప్రసంగాలకు పట్టం కట్టే మంథన్ సంవాద్ వార్షిక చర్చాగోష్టిని నగరంలోని శిల్పకళా వేదికలో సోమవారం నిర్వహించింది. కార్యక్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ మురళీధర్ మాట్లాడుతూ రాజకీయా ల్లోకి రాక పూర్వం న్యాయవాదిగా గాంధీజీ ఎదుర్కొన్న వృత్తిపరమైన ఆటుపోట్లు, దక్షిణాఫ్రికా లో రెండు దశాబ్దాల పాటు న్యాయవాద వృత్తిలో పొందిన అనుభవాలను ప్రస్తావించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా, నేర్చుకోవడాన్ని మానకుండా సత్యాన్ని వీడకుండా నిరుపేదలకు అండగా గాంధీజీ న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. నవతరం న్యాయవాదులు గాంధీజీ న్యాయవాద ప్రస్థానం నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధికి దోహదం చేయలేని ఆర్ధికాభివృద్ధి: యామినీ అయ్యర్ సిటిజన్ వర్సెస్ లాభార్థి? అంశంపై ఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు యామినీ అయ్యర్ మాట్లాడారు. దేశంలో పేర్కొంటున్న ఆర్థికాభివృద్ధి లాభదాయకమైన ఉపాధి అవకా శాలకు, ఉద్యోగాలకు దోహదం చేయలేకపోతోందని అభిప్రాయపడ్డారు. నిజమైన సంక్షేమానికి ఇంకా సరైన నిర్వచనాన్ని వెదికే క్రమంలోనే ఉన్నామన్నారు. ది క్వశ్చన్ ఆఫ్ అకడమిక్ ఫ్రీడమ్ అనే అంశంపై లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌కు చెందిన ప్రొఫెసర్ నీరజా గోపాల్ జయాల్ మాట్లాడుతూ విద్యా సంబంధ స్వేచ్ఛ (అకడమిక్ ఫ్రీడమ్) అనేది మన దేశంలో ఇంకా తగిన స్థాయిలో లేదన్నారు. సదస్సులో ‘‘వై ఇండిపెండెంట్ న్యూస్ మీడియా షుడ్ త్రైవ్’’ అనే అంశంపై ది న్యూస్ మినిట్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ధన్యా రాజేంద్రన్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్త అదానీపై వచ్చిన ఆరోపణల విషయంలో మీడియా పూర్తిస్థాయిలో నిష్పక్షపాత్ర పోషించలేకపోయిందన్నారు. ఫైటింగ్ ది ఫేక్ న్యూస్ పాండమిక్ అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో ఫేక్ న్యూస్ ప్రచారం సాగుతోందని ఆరోపించారు. విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ డైరెక్టర్ ఆర్ఘ్యాసేన్గుప్తా ‘ది గ్లోబల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ అనే అంశంపై మాట్లాడారు. సదస్సులో హిందీ కవి,వ్యంగ్యరచయిత సంపత్ సరళ్ పలు కవితలు,వ్యంగ్యరచనలు వినిపించారు. -
అంతర్జాతీయ మీడియేటర్ ప్యానెల్ సభ్యుడిగా మాజీ జస్టిస్ ఎన్వీ రమణ!
సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేటర్ ప్యానల్ సభ్యునిగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌లోని ప్రధాన తెలుగు సంస్థలైన సాంస్కృతిక కళాసారథి, తెలుగుదేశం ఫోరమ్ మొదలైన సంస్థల ప్రతినిధులు వారిని గౌరవపూర్వకంగా కలిసి తమ సంస్థల తరఫున అభినందనలు తెలియజేసి సత్కరించారు. “తెలుగువారికే గర్వకారణమైన జస్టిస్ ఎన్వీ రమణను, వారి సింగపూర్ పర్యటన సందర్భంగా కలుసుకోవడం, వారికి తమ సంస్థ గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను అన్నింటిని తెలియపరచి వారి ఆశీస్సులు అభినందనలు అందుకోవడం చాలా సంతోషదాయకంగా ఉందని" 'సాంస్కృతిక కళాసారథి' అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు. జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ "తెలుగు వారంతా ఒక్కటిగా, ఒకే మాట మీద, ఒకే తాటి మీద ఉంటే తెలుగుని సింగపూర్ ప్రభుత్వం కూడా గుర్తించి మీరంతా ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్న విధంగా తెలుగు భాషను సింగపూర్ ప్రభుత్వ పాఠశాలలో బోధించడం సులభతరం అవుతుందని, ఆ ప్రక్రియలో తమ సహాయ సహకారాలు కూడా ఎప్పుడూ ఉంటాయని" అన్నారు. ఈ సందర్భంగా సభ్యులు టేకూరి నగేష్, అమ్మయ్య చౌదరి, సతీష్ పారేపల్లి తదితరులు జస్టిస్ రమణని కలిసి సత్కరించారు. (చదవండి: ఆతిథ్యం ఇచ్చిన సింగపూర్ తెలుగు ప్రజలు!) -
పీఏసీఎల్ కేసులో రిఫండ్స్ షురూ
న్యూఢిల్లీ: పీఏసీఎల్ గ్రూప్‌లో నష్టపోయిన ఇన్వెస్టర్లు మార్చి 20లోగా ఒరిజనల్ సర్టిఫికెట్లను దాఖలు చేయవలసిందిగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీ తాజాగా స్పష్టం చేసింది. తద్వారా అర్హతగల ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేపట్టేందుకు వీలుంటుందని తెలియజేసింది. రూ. 15,001–17,000 మధ్య క్లెయిము చేస్తున్న ఇన్వెస్టర్లకు ఒరిజనల్ పత్రాల పరిశీలన తదుపరి రిఫండ్లను చేపట్టనున్నట్లు వివరించింది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తయిన ఇన్వెస్టర్లు ఒరిజనల్ సర్టిఫికెట్లను దాఖలు చేయవలసి ఉంటుందని వెబ్సైట్లో సెబీ పేర్కొంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటైన అత్యున్నత కమిటీ పీఏసీఎల్ ఆస్తుల విక్రయం, ఇన్వెస్టర్ల రిఫండ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇప్పటికే రిఫండ్ల ప్రాసెస్‌ను దశలవారీగా చేపట్టింది. అర్హతగల ఇన్వెస్టర్లకు ఎస్ఎంఎస్ ద్వారా పీఏసీఎల్ రిజిస్టర్డ్ పత్రాలు దాఖలు చేయవలసిందిగా తెలియజేస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు 2016లో సెబీ కమిటీ ఏర్పాటైంది. ఒరిజనల్ సర్టిఫికెట్ల దాఖలును 2023 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 20వరకూ అనుమతిస్తారు. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో పీఏసీఎల్ (పెరల్ గ్రూప్) పబ్లిక్ నుంచి రూ. 60,000 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఈ నిధులను 18ఏళ్లపాటు చట్టవిరుద్ధ పథకాల ద్వారా సమీకరించినట్లు సెబీ గుర్తించింది. -
కొలీజియంపై ఫిర్యాదులను విస్మరించలేం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ పనితీరుపై ప్రభుత్వం సహా పలు వర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని విస్మరించలేమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. కొలీజియం విషయంలో పౌర సమాజం, న్యాయవాద సంఘాల ఆందోళనలను కొట్టిపారేయలేమని అన్నారు. న్యాయ వ్యవస్థలో వైవిధ్యం కోసం ఒక సంస్థాగత యంత్రాంగం లేకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. ఆసియన్ ఆస్ట్రేలియన్ లాయర్స్ అసోసియేషన్ నిర్వహించిన ‘కల్చరల్ డైవర్సిటీ, లీగల్ ప్రొఫెషన్’ అంశంపై సదస్సులో జస్టిస్ రమణ ప్రసంగించారు. కోర్టు ధర్మాసనాల్లో వైవిధ్యం ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు. విభిన్న అనుభవాలు కలిగిన న్యాయమూర్తులు ధర్మాసనంలో సభ్యులుగా ఉండాలని చెప్పారు. న్యాయ వ్యవస్థలో తాము కూడా భాగస్వాములమేనన్న నమ్మకం ప్రజలకు కలిగేలా జడ్జీలు వ్యవహరించాలన్నారు. భిన్నమైన నేపథ్యాలు కలిగినవారిని నియమించేందుకు తాను ప్రయత్నించానని చెప్పారు. దాదాపు తాను చేసిన అన్ని సిఫార్సులను కేంద్రం ఆమోదించిందని పేర్కొన్నారు. -
సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కన్నుమూత
కోల్‌కతా: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అల్తామస్ కబీర్ (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. 1948లో కోల్‌కతాలో జన్మించిన కబీర్.. సుప్రీం కోర్టు 39వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012 సెప్టెంబర్ 29 నుంచి 2013 జూలై 18 వరకు ఆయన ఈ పదవిలో ఉన్నారు. అంతకుముందు జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. -
కేరళ గవర్నర్‌గా సదాశివం ప్రమాణ స్వీకారం
తిరువనంతపురం: కేరళ గవర్నర్‌గా పి.సదాశివం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పి.సదాశివం చేత కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అశోక్ భూషణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, ఆయన మంత్రివర్గ సహాచరులు, ఉన్నతాధికారులతోపాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పి.జె.కురియన్, కేరళ అసెంబ్లీ స్పీకర్ జి.కార్తీకేయన్లు హాజరయ్యారు. అయితే కేరళ గవర్నర్‌గా యూపీఏ హాయాంలో నియమితులైన షీలా దీక్షిత్ రాజీనామా చేయడంతో... బీజేపీ ప్రభుత్వం పి.సదాశివంను ఆ పదవిలో నియమించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన సదాశివం ఈ ఏడాది ఏప్రిల్‌లో పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే. -
కేరళ గవర్నర్‌గా సదాశివం
-
కేరళ గవర్నర్‌గా సదాశివం
న్యూఢిల్లీ: విపక్ష విమర్శలను ఖాతరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం.. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) పళనిస్వామి సదాశివంను బుధవారం కేరళ గవర్నర్‌గా నియమించింది. దీంతో 65 ఏళ్ల సదాశివం ప్రొటోకాల్ ప్రకారం సీజేఐ హోదాకంటే తక్కువదైన గవర్నర్ పదవి చేపట్టనున్న తొలి సీజేఐగా రికార్డులకెక్కారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఈ పదవిలో నియమితులైన రాజకీయేతర వ్యక్తి కూడా ఆయనే. గతవారం కేరళ గవర్నర్ పదవికి షీలా దీక్షిత్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించి, సదాశివంను ఆ రాష్ట్ర గవర్నర్‌గా నియమించారని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. సదాశివం శుక్రవారం బాధ్యతలు చేపడతారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది ఏప్రిల్‌లో రిటైరైన సదాశివంను గవర్నర్‌గా నియమించే అంశంపై కాంగ్రెస్ విమర్శించటం తెలిసిందే. ఆయనను గవర్నర్‌గా నియమించొద్దని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్, కేరళ బార్ అసోసియేషన్లు రాష్ట్రపతిని కోరడమూ విదితమే. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కేసులో ఆయనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పునకు ప్రతిఫలంగానే ఈ పదవి కట్టబెట్టారంటూ కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ మంగళవారం విమర్శించారు. సదాశివంతో కూడిన సుప్రీం ధర్మాసనం.. ఓ నకిలీ ఎన్కౌంటర్ కేసులో షాపై రెండో ఎఫ్ఐఆర్ను గతంలో కొట్టేసింది. మాట మారుస్తారా?: కాంగ్రెస్ రిటైరైన జడ్జీలు తిరిగి పదవులు చేపట్టొద్దని బీజేపీ నేతలు గడ్కారీ, జైట్లీలు 2012లో చెప్పారని, మోడీ ప్రభుత్వం మాటలు మార్చే ప్రభుత్వమని కాంగ్రెస్ ప్రతినిధి శోభా ఓజా విమర్శించారు. అయితే మాజీ సీజేఐ గవర్నర్ పదవి చేపట్టొద్దన్న నిషేధమేమీ లేదని పార్టీ నేత మనీశ్ తివారీ అన్నారు. సదాశివం నిజాయితీని శంకించకూడదని బీజేపీ పేర్కొంది.రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడతా తన నియమాకం వ్యవహారంలో వస్తున్న విమర్శలను సదాశివం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం బాగా పనిచేస్తానని చెప్పారు.