లోక్‌సభలో తీవ్ర కలకలం
జడ్జి మృతి ప్రస్తావనపై రగడ చర్యలు తప్పవన్న రిజిజు
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌ను లక్ష్యంగా చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా శుక్రవారం లోక్‌సభలో చేసిన విమర్శలు తీవ్ర కలకలం రేపాయి. అంతేగాక విమర్శించే గొంతుకలన్నింటినీ నొక్కేయడమే లక్ష్యంగా దేశంలో సర్వ వ్యవస్థలనూ మోదీ సర్కారు చెరబడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసే క్రమంలో ప్రత్యేక కోర్టు జడ్జి బి.హెచ్.లోయా మృతి అంశాన్ని ఆమె ప్రస్తావించడంతో సభలో దుమారం రేగింది.
లోయాది అత్యంత అకాల మరణమన్న మొయిత్రా వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘అత్యంత తీవ్ర ఆరోపణలివి. దీనిపై కచ్చితంగా తగిన రీతిలో పార్లమెంటరీ చర్యలుంటాయి. మొయిత్రా తప్పించుకోలేరు’’ అన్నారు. మొయిత్రా ప్రసంగ రికార్డులను స్పీకర్ ఓం బిర్లా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు.
ఆమెపై మరోసారి అనర్హత వేటు తప్పదంటున్నారు. నోటుకు ప్రశ్నల ఆరోపణలపై గత లోక్‌సభలో మొయిత్రా సభ్యత్వం రద్దవడం తెలిసిందే. లోయా 2014లో రాజకీయంగా సొహ్రాబుద్దీన్ షేక్ హత్య కేసును విచారిస్తుండగా వివాదాస్పద రీతిలో మృతి చెందారు. దాని వెనక బీజేపీ హస్తముందనేలా విపక్షాలు ఆరోపించాయి. ఆయనది సహజ మరణమేనని సుప్రీంకోర్టు నిర్ధారించింది.
సీజేఐలపై తీవ్ర వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని హత్య చేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయతి్నస్తోందంటూ మొయిత్రా తన ప్రసంగంలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కారు చేతిలో వెయ్యి కత్తి పోట్లతో రాజ్యాంగం నిలువెల్లా రక్తమోడుతోందన్నారు. ఈడీ, సీబీఐ వంటివాటిని చివరికి వసూళ్ల సంస్థలుగా, ఈసీ వంటివాటిని జేబు సంస్థలుగా మార్చుకుందని ఆక్షేపించారు. ఆ క్రమంలో జస్టిస్ చంద్రచూడ్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.
‘‘న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాల్లో కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానాల సమగ్రతను, స్వతంత్ర ప్రతిపత్తిని పణంగా పెట్టేందుకు ప్రయతి్నంచారు! తాజా మాజీ సీజేఐ హయాంలో కొందరికే బెయిళ్లు మంజూరయ్యాయి. ఒక వర్గం వారికి మొండిచెయ్యి చూపారు. వారికి ఆయన అక్షరమాలలో స్థానమే లేకుండా పోయింది. ఆ మాజీ సీజేఐ ప్రవర్తన చివరికి సుప్రీంకోర్టు రాజకీయ ప్రతిపక్షంలా వ్యవహరించరాదనే వ్యాఖ్యలకూ కారణమైంది.
విపక్ష పాత్ర పోషించేందుకు మేమున్నాం. అందుకు సుప్రీంకోర్టు అవసరమేమీ లేదు’’ అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ తన నివాసంలో గణేశ్ చతుర్థి వేడుకలకు ప్రధాని మోదీని ఆహా్వనించడాన్ని మొయిత్రా తీవ్రంగా తప్పుబట్టారు. మోదీని దేవునితో పోలుస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘న్యాయమూర్తులు తీర్పులు రాసేందుకు తర్కం, చట్టం, రాజ్యాంగానికి బదులు ఇలా దేవునితో ప్రైవేట్ సంభాషణలపై ఆధారపడే పరిస్థితిని బహుశా మన రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ ఊహించి కూడా ఉండరు.
మాజీ, ప్రస్తుత సీజేఐలందరికీ నాదో సలహా. ఇలా దేవుడి నుంచి సూచనలు అందుకోవడం మానేయండి. వ్యక్తిగత వేడుకలకు రాజకీయ పెద్దలను అతిథులుగా పిలిచి వాటిని టీవీ సర్కస్‌లుగా మార్చకండి. మీ ఏకైక అతిథి రాజ్యాంగమే. అది మాత్రమే మీ ఇంట్లో కొలువుదీరే దేవుడు కావాలి. మీరు మిగల్చబోయే వ్యక్తిగత వారసత్వం గురించి ఆందోళన పడటం ఆపేయండి. ఎందుకంటే అలా వ్యక్తిగత గుర్తింపు కోరుకునే వాళ్లు ఎలాంటి వారసత్వమూ మిగల్చలేరు. మౌలిక హక్కులను పరిరక్షించేవారు మాత్రమే గుర్తుండిపోతారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment