trinamool congress party
-
జస్టిస్ చంద్రచూడ్‌పై మొయిత్రా విమర్శలు
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌ను లక్ష్యంగా చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా శుక్రవారం లోక్‌సభలో చేసిన విమర్శలు తీవ్ర కలకలం రేపాయి. అంతేగాక విమర్శించే గొంతుకలన్నింటినీ నొక్కేయడమే లక్ష్యంగా దేశంలో సర్వ వ్యవస్థలనూ మోదీ సర్కారు చెరబడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసే క్రమంలో ప్రత్యేక కోర్టు జడ్జి బి.హెచ్.లోయా మృతి అంశాన్ని ఆమె ప్రస్తావించడంతో సభలో దుమారం రేగింది. లోయాది అత్యంత అకాల మరణమన్న మొయిత్రా వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘అత్యంత తీవ్ర ఆరోపణలివి. దీనిపై కచ్చితంగా తగిన రీతిలో పార్లమెంటరీ చర్యలుంటాయి. మొయిత్రా తప్పించుకోలేరు’’ అన్నారు. మొయిత్రా ప్రసంగ రికార్డులను స్పీకర్ ఓం బిర్లా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. ఆమెపై మరోసారి అనర్హత వేటు తప్పదంటున్నారు. నోటుకు ప్రశ్నల ఆరోపణలపై గత లోక్‌సభలో మొయిత్రా సభ్యత్వం రద్దవడం తెలిసిందే. లోయా 2014లో రాజకీయంగా సొహ్రాబుద్దీన్ షేక్ హత్య కేసును విచారిస్తుండగా వివాదాస్పద రీతిలో మృతి చెందారు. దాని వెనక బీజేపీ హస్తముందనేలా విపక్షాలు ఆరోపించాయి. ఆయనది సహజ మరణమేనని సుప్రీంకోర్టు నిర్ధారించింది.సీజేఐలపై తీవ్ర వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని హత్య చేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయతి్నస్తోందంటూ మొయిత్రా తన ప్రసంగంలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కారు చేతిలో వెయ్యి కత్తి పోట్లతో రాజ్యాంగం నిలువెల్లా రక్తమోడుతోందన్నారు. ఈడీ, సీబీఐ వంటివాటిని చివరికి వసూళ్ల సంస్థలుగా, ఈసీ వంటివాటిని జేబు సంస్థలుగా మార్చుకుందని ఆక్షేపించారు. ఆ క్రమంలో జస్టిస్ చంద్రచూడ్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాల్లో కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానాల సమగ్రతను, స్వతంత్ర ప్రతిపత్తిని పణంగా పెట్టేందుకు ప్రయతి్నంచారు! తాజా మాజీ సీజేఐ హయాంలో కొందరికే బెయిళ్లు మంజూరయ్యాయి. ఒక వర్గం వారికి మొండిచెయ్యి చూపారు. వారికి ఆయన అక్షరమాలలో స్థానమే లేకుండా పోయింది. ఆ మాజీ సీజేఐ ప్రవర్తన చివరికి సుప్రీంకోర్టు రాజకీయ ప్రతిపక్షంలా వ్యవహరించరాదనే వ్యాఖ్యలకూ కారణమైంది. విపక్ష పాత్ర పోషించేందుకు మేమున్నాం. అందుకు సుప్రీంకోర్టు అవసరమేమీ లేదు’’ అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ తన నివాసంలో గణేశ్ చతుర్థి వేడుకలకు ప్రధాని మోదీని ఆహా్వనించడాన్ని మొయిత్రా తీవ్రంగా తప్పుబట్టారు. మోదీని దేవునితో పోలుస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘న్యాయమూర్తులు తీర్పులు రాసేందుకు తర్కం, చట్టం, రాజ్యాంగానికి బదులు ఇలా దేవునితో ప్రైవేట్ సంభాషణలపై ఆధారపడే పరిస్థితిని బహుశా మన రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ ఊహించి కూడా ఉండరు. మాజీ, ప్రస్తుత సీజేఐలందరికీ నాదో సలహా. ఇలా దేవుడి నుంచి సూచనలు అందుకోవడం మానేయండి. వ్యక్తిగత వేడుకలకు రాజకీయ పెద్దలను అతిథులుగా పిలిచి వాటిని టీవీ సర్కస్లుగా మార్చకండి. మీ ఏకైక అతిథి రాజ్యాంగమే. అది మాత్రమే మీ ఇంట్లో కొలువుదీరే దేవుడు కావాలి. మీరు మిగల్చబోయే వ్యక్తిగత వారసత్వం గురించి ఆందోళన పడటం ఆపేయండి. ఎందుకంటే అలా వ్యక్తిగత గుర్తింపు కోరుకునే వాళ్లు ఎలాంటి వారసత్వమూ మిగల్చలేరు. మౌలిక హక్కులను పరిరక్షించేవారు మాత్రమే గుర్తుండిపోతారు’’ అన్నారు. -
బాండ్లను డ్రాప్ బాక్స్‌లో పడేశారు..
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా వందల కోట్ల విరాళాలను అందుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ దాతలు ఎవరో తెలీయదని చెప్పొకొచి్చంది. ప్రభుత్వ ప్రాజెక్టులు, కాంట్రాక్టులను సంపాదించిన కంపెనీలే ఆయా అధికార పారీ్టలకు వందల కోట్ల ముడుపులను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ముట్టజెప్పాయన్న ఆరోపణల నడుమ తృణమూల్ కాంగ్రెస్ స్పందించడం విశేషం. టీఎంసీకొచి్చన బాండ్లపై పశ్చిమబెంగాల్లో సోమవారం ఒక పత్రికా సమావేశంలో ఆ పార్టీ నేత కునాల్ ఘోష్ మాట్లాడారు. ‘‘ మా పారీ్టకి ఎవరు విరాళంగా ఇచ్చారో మాకు తెలీదు. ఎంత పెద్ద మొత్తాలను ఇచ్చిందీ తెలీదు. అసలు ఈ బాండ్ల పథకాన్ని తెచి్చందే బీజేపీ. రాజకీయ పారీ్టలకు నిర్వహణ వ్యయాలను ప్రభుత్వాలే భరించాలని 1990దశకం నుంచీ మమతా బెనర్జీ మొత్తుకుంటూనే ఉన్నారు. వేలకోట్ల నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట పడాలని ఆమె కాంక్షించారు. అయినా సరే ఎవరిమాటా వినకుండా బీజేపీ ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తెచి్చంది. వేరే దారి లేక మేమూ ఆ పథకం నిబంధనలను పాటించాం. మాకు ఎన్ని బాండ్లు ఇచ్చారో, ఎవరిచ్చారో తెలీదు. సాధారణంగా పార్టీ ఆఫీస్ బయట ఒక డ్రాప్‌బాక్స్ ఉంటుంది. అందులోనే ఈ బాండ్లు ఎవరో పెట్టి వెళ్లారు. ఆ బాండ్లపై దాతల పేర్లు ఉండవు. కేవలం ఆల్ఫా–న్యూమరిక్ నంబర్ ఉంటుంది. దాత పేరు, వివరాలు బీజేపీకైతే తెలుస్తాయి. ఎందుకంటే వాళ్లే కేంద్రంలో అధికారంలో ఉన్నారు. సీబీఐ, ఈడీని తమ చెప్పుచేతల్లో ఉంచుకుని వాటి ద్వారా బెదిరించి మరీ విరాళాల వసూళ్ల పర్వాన్ని బీజేపీ యథేచ్ఛగా కొనసాగింది. బాండ్ల ద్వారా మేం అందుకున్న మొత్తాలను టీఎంసీ అధికారిక బ్యాంక్ ఖాతాల్లోనే జమచేశాం’’ అని కునాల్ ఘోష్ చెప్పారు. భారతీయ స్టేట్ బ్యాంక్ ఎలక్టోరల్ బాండ్ల గణాంకాల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్‌కు 10 మంది అతిపెద్ద విరాళాల దాతల నుంచే ఏకంగా రూ.1,198 కోట్లు వచ్చాయి. ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సరీ్వసెస్ సంస్థ ఒక్కటే టీఎంసీకి రూ.542 కోట్లు విరాళంగా ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచించిన కాలపరిమితిలో ఎస్బీఐ నుంచి దాదాపు 1,300 సంస్థలు/వ్యక్తులు రూ.12,000 కోట్లకుపైగా విలువైన బాండ్లను కొనుగోలుచేసి 23 రాజకీయపారీ్టలకు తమకు నచి్చన మొత్తాలను విడివిడిగా విరాళంగా ఇవ్వడం తెల్సిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ బాండ్ల వివరాలన్నింటినీ ఎన్నికల సంఘానికి అందజేసింది. -
Lok Sabha elections 2024: తృణమూల్ ఒంటరి పోరు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం తమ అభ్యర్థులను ప్రకటించింది. తద్వారా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు తేల్చేసింది. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని ప్రచారం జరిగినా అది ఉత్తదేనని స్పష్టమైంది. ఈసారి ఏడుగురు సిట్టింగ్ ఎంపీలను తృణమూల్ పక్కనపెట్టింది. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌తోపాటు తెలుగు సహా పలు భాషల చిత్రాల్లో నటించిన రచనా బెనర్జీ వంటి కొత్తముఖాలకు అవకాశం కలి్పంచింది. 2022 ఉప ఎన్నికలో అసన్సోల్ నుంచి గెలిచిన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాకు మరోసారి టికెటిచ్చారు. బసీర్హాత్లో సినీ నటి, సిట్టింగ్ ఎంపీ నుస్రత్ జహాన్‌ను తప్పించి మాజీ ఎంపీ హజీ నూరుల్ ఇస్లాంను బరిలో దించారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సందేశ్‌ఖాలీ ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. 23 మంది సిట్టింగుల్లో 16 మందికి టికెట్లు దక్కాయి. ఇద్దరు రాష్ట్ర మంత్రులు సహా 9 మంది ఎమ్మెల్యేలు లోక్‌సభ బరిలో దిగబోతున్నారు. గతేడాది లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన వివాదాస్పద ఎంపీ మహువా మొయిత్రాకు టికెట్ లభించింది. కృష్ణనగర్ నుంచే ఆమె మళ్లీ బరిలో దిగుతున్నారు. ఇక బహ్రాంంపూర్ నుంచి ఐదుసార్లు నెగ్గిన కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిపై యూసుఫ్ పఠాన్ బరిలో దిగుతున్నారు. మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ బర్దమాన్–దుర్గాపూర్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. టికెట్లు రాని నేతలకు అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం కలి్పస్తామని తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. ఆమె ఆదివారం కోల్‌కతాలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని, బీజేపీతోపాటు కాంగ్రెస్, సీపీఎం కూడా ప్రత్యర్థులేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు రెండు సీట్లే ఇస్తామని మమత గతంలో ఆఫర్ చేయడం, దానిపై ఆ పార్టీ స్పందించకపోవడం తెలిసిందే. మోదీకి భయపడే: కాంగ్రెస్ బెంగాల్లో ఏకపక్షంగా మొత్తం లోక్‌సభ స్థానాలకూ తృణమూల్ అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్ మండిపడింది. ఇది ఏకపక్ష పోకడ అంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. మమత బీజేపీకి సరెండరయ్యారని కాంగ్రెస్ ఎంపీ అ«దీర్ రంజన్ చౌధరి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ మళ్లీ ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తారోనని భయపడే విపక్ష ఇండియా కూటమికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారన్నారు. మరోవైపు, తృణమూల్ జాబితా తమ పార్టీ మాజీలతో, బెంగాలేతరులతో నిండిపోయిందంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. -
బెంగాల్ మంత్రి నివాసాల్లో ఈడీ సోదాలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జ్యోతిప్రియో మల్లిక్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు గురువారం ఉదయం సోదాలు ప్రారంభించారు. బెంగాల్లో రేషన్ సరుకుల పంపిణీలో కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు కోల్‌కతాలో మంత్రికి చెందిన రెండు నివాసాల్లో సోదాలు ప్రారంభించారు. ఆయన మాజీ వ్యక్తిగత సహాయకుడి ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. జ్యోతిప్రియో మల్లిక్ గతంలో ఆహార శాఖ మంత్రి పనిచేశారు. ఆ సమయంలోనే రేషన్ పంపిణీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో మంత్రితో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని ఈడీ అరెస్టు చేసింది. మంత్రి బ్యాంకు ఖాతాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, అనుమానాస్పద లావాదేవీలపై ఆయనను ప్రశి్నస్తున్నామని అధికారులు వెల్లడించారు. -
కాంగ్రెస్ నాయకత్వంలో విపక్షాల భేటీకి హాజరై షాకిచ్చిన ఆ రెండు పార్టీలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యకక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఊహించని విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగగ్రెస్ పార్టీలు పాల్గొన్నాయి. ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీలో పాల్గొని అందరిని ఆశ్యర్యానికి గురి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యకక్షుడైన ఖర్గే ప్రస్తుతం రాజ్యసభలో విపక్షాల నేతగా కూడా కొనసాగుతున్నారు. బుధవారం నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదురొర్కొనేందుకు పార్లమెంట్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించడానికి, ప్రతిపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించారు. వామపక్షాలతోపాటు డీఎంకే, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీడీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎస్పీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ భేటీకి ఆప్, తృణమూల్ కాంగ్రెస్ కూడా హాజరవ్వడం గమనార్హం. ఈ సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య చర్చలకు నిలయం పార్లమెంట్ అని పేర్కొన్నారు. భావసారూప్యత గల పార్టీలతో కలిసి ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలను పార్లమెంటులో గట్టిగా లేవనెత్తుతామని స్పష్టం చేశారు. Parliament is the abode of democratic deliberation. We, the like-minded parties will strongly raise all the issues relevant to our people. PM @narendramodi ji, you spoke about opposition getting more chance to participate, therefore we expect the Govt to walk its talk. 1/2 pic.twitter.com/T5faKJo1j3 — Leader of Opposition, Rajya Sabha (@LoPIndia) December 7, 2022 ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఎక్కువ ఇస్తామన్న ప్రధాని మోదీ, తన మాటను నిలబెట్టుకుంటారని తాము ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్లో జరిగే అన్ని చర్చలకు తాము సహకరిస్తామన్నారు. అయితే ముఖ్యమైన బిల్లులను ఆమోదించడంలో హడావుడి చేయకుండా పరిశీలన కోసం జాయింట్ లేదా సెలెక్ట్ కమిటీకి పంపాలని ఆయన సూచించారు. చదవండి: గుజరాత్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు -
‘రాష్ట్రపతిపై వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం’.. ఆ మంత్రిపై టీఎంసీ ఫైర్
కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?.. అంటూ ఆయన చేసిన కామెంట్ల తాలుకా వీడియో వివాదాస్పదమైన నేపథ్యంలో విపక్షాలు అధికార టీఎంసీ లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో మంత్రి వ్యాఖ్యలపై స్పందించింది తృణమూల్ కాంగ్రెస్. ఆయన తీరు బాధ్యతారాహిత్యమేనని, ఆ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, పూర్తిగా వ్యక్తిగతమని స్పష్టం చేసింది. ఈ మేరకు టీఎంసీ అధికార ప్రతిని సాకెత్ గోఖలే ట్వీట్ చేశారు. ‘ఇది బాధ్యతారాహిత్యంగా చేసిన కామెంట్. ఆ వ్యాఖ్యలతో టీఎంసీకి ఎలాంటి సంబంధం లేదు. మేము భారత రాష్ట్రపతి పట్ల ఎంతో గర్వపడుతున్నాం. మేము ఆమెను, ఆమె పదవిని అత్యున్నతంగా చూస్తాం.’ అని తెలిపారు టీఎంసీ అధికార ప్రతినిధి సాకెత్ గోఖలే. Statement: This is an irresponsible comment & does NOT represent the views of @AITCofficial. We are extremely proud of the President of India & hold her & her office in the highest regard. https://t.co/v571435Snv — Saket Gokhale (@SaketGokhale) November 12, 2022 మంత్రి క్షమాపణలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపిన క్రమంలో క్షమాపణలు చెప్పారు టీఎంసీ మంత్రి అఖిల్ గిరి. ‘రాష్ట్రపతిని నేను చాలా గౌరవిస్తాను. సువేందు అధికారికి సమాధానం చెప్పేందుకు పదవిని చూపిస్తూ వ్యాఖ్యానించా. ఎవరి పేరును చెప్పలేదు. ఆయన అఖిల్ గిరి చాలా అంద వికారంగా ఉంటారని చెప్పారు. నేను ఒక మంత్రిని. నాగురించే ఏదైనా చెడుగా చెబితే.. అది రాజ్యాంగానికే అవమానం. నేను రాష్ట్రపతి అని సంబోధించాను కానీ, ఎవరి పేరు చెప్పలేదు. దీనిని భారత రాష్ట్రపతి అవమానంగా భావిస్తే.. క్షమాపణలు చెబుతున్నా. నేను చెప్పినదానికి పశ్చాతాపపడుతున్నా.’ అని పేర్కొన్నారు మంత్రి అఖిల్ గిరి. I respect President. I mentioned the post&made a comparison to respond to Suvendu Adhikari,I didn't take any name. He had said Akhil Giri looks bad in his appearance. I'm a min,took oath to office. If something is said against me, it's an insult to Constitution: WB Min Akhil Giri pic.twitter.com/9w1oY2BuZA — ANI (@ANI) November 12, 2022 ఇదీ చదవండి: వీడియో: మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?.. ముర్ముపై మంత్రి వ్యాఖ్యలు.. బీజేపీ ఫైర్ -
బెంగాల్ రాజకీయాల్లో కలకలం.. ఎవరీ అనుబ్రతా మోండల్?
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుబ్రతా మోండల్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంతో రాజకీయవర్గాల్లో కలకలం రేగింది. టీఎంసీ నేతలు వరుసగా అరెస్టవుతుండడం చర్చనీయాంశంగా మారింది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మోండల్ సీబీఐ వలలో చిక్కుకోవడంతో ఆయన గురించి తెలుసుకోవడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరీ అనుబ్రతా మోండల్? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీర్భమ్ జిల్లా అధ్యక్షుడిగా అనుబ్రతా మోండల్ ఉన్నారు. 61 ఏళ్ల మోండల్ బీర్భమ్ జిల్లాలో మంచి పట్టున్న రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఈ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు గానూ పదింటిని టీఎంసీ కైవసం చేసుకుందంటే ఈ జిల్లాలో ఆయన సత్తా ఏంటో తెలుస్తోంది. మమతా బెనర్జీకి వీర విధేయుడైన మోండల్ టీఎంసీ జాతీయ వర్కింగ్ కమిటీలోనూ స్థానం దక్కించుకున్నారు. పోటీకి దూరంగా.. వివాదాలకు దగ్గరగా.. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ అనుబ్రతా మోండల్ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. తెర వెనుక నుంచి చక్రం తిప్పడానికే ఇష్టపడే ఆయన టీఎంసీ కీలక వ్యూహకర్తలో ఒకరిగా గుర్తింపు పొందారు. వివాదాలు ఆయనకు కొత్త కాదు. చాలా సందర్భాల్లో రెచ్చగొట్ట ప్రకటనలతో వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ సందర్భంలో పోలీసులపై బాంబులు వేయాలని టీఎంసీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. చాలా మంది రౌడీషీటర్లకు ఆయన ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. బీర్భూమ్ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు, రాళ్ల తవ్వకాలు, పశువుల అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ఆయనకు సంబంధాలున్నట్లు సమాచారం. అంతేకాదు ప్రతిపక్ష నేతలను బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆక్సిజన్ సిలిండర్ వెంట ఉండాల్సిందే.. బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండ కేసులో మోండల్‌ను ప్రశ్నించేందుకు గతంలో సీబీఐ సమన్లు పంపింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం అంగీకరించింది. హైపోక్సియా(ఆక్సిజన్ కొరత) రుగ్మతతో బాధపడుతున్న ఆయన ఆక్సిజన్ సిలిండర్‌ను తన వెంట తీసుకెళుతుంటారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం హాస్పిటల్ వైద్యులు చెప్పడంతో మోండల్‌ను సీబీఐ తాజాగా అరెస్ట్ చేసింది. (క్లిక్: సీబీఐ ఉచ్చులో టీఎంసీ అగ్రనేత) -
సింగర్ కేకే మృతిపై వివాదం
కోల్‌కతా: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కేకే అకాల మర ణంపై రాజకీయ రగడ జరుగుతోంది. మంగళవారం రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన అనంతరం హోటల్ చేరుకుంటూనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలడం తెలిసిందే. ప్రదర్శనకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడమే ఇందుకు కారణమని బీజేపీ ఆరోపించింది. దీనిపై లోతుగా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేసింది. ‘‘మూడు వేల మంది పట్టే ఆడిటోరియంలో రెట్టింపుకు పైగా జనం వచ్చారు. కేకేను పూర్తిగా చుట్టుముట్టారు’’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య ఆరోపించారు. అనవసరంగా రాబందు రాజకీయాలు చేయొద్దంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వీటిని తిప్పికొట్టింది. కేకే మృతికి గుండెపోటే కారణమని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్టు పోలీసులు చెప్పారు. దర్యాప్తు జరుగుతోందన్నారు. ‘‘మంగళవారం రాత్రి ప్రదర్శన తర్వాత హోటల్ లాబీల్లో ఆయనను అభిమానులు భారీగా చుట్టుముట్టారు. ఒకరిద్దరితో సెల్ఫీ దిగాక పై అంతస్తులోని తన గదిలోకి వెళ్లబోతూ తూలి పడిపోయారు’’ అని వివరించారు. ఆయన నుదిటిపై, పెదవులపై రెండు గాయాలున్నాయన్నారు. సీఎం మమతా బెనర్జీ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. గొప్ప గాయకున్ని కోల్పోయామన్నారు. భార్య, ఇతర కుటుంబీకులను ఓదార్చారు. కేకే అంత్యక్రియలు ముంబైలో జరగనున్నాయి. -
2024 లోక్‌సభ ఎన్నికలు; మమత కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా: ప్రత్యామ్నాయం లేకనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, సరైన ప్రత్యామ్నాయం దొరికిన రోజున ప్రజలు ఆ పార్టీని సాగనంపడం ఖాయమని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అటువంటి ప్రత్యామ్నాయాన్ని ఆచరణ సాధ్యం చేసేందుకు తమ టీఎంసీ ఇతర ప్రతిపక్షాలతో కలిసి ప్రయత్నిస్తోందని చెప్పారు. మంగళవారం ఇక్కడ జరిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశంలో ఆమె మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని.. ఇందుకోసం చురుగ్గా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అధినేతగా గత నెలలో మరోసారి ఎన్నికైన మమతా బెనర్జీ.. తాజాగా రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. సీనియర్లు, కొత్త నేతలకు సమతౌల్యం పాటిస్తూ విధేయతకు పెద్దపీట వేశారు. సుబ్రతా బక్షీని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్థా చటర్జీని ప్రధానకార్యదర్శిగా మళ్లీ నియమించారు. అదేవిధంగా, పార్టీ ఉపాధ్యక్షులుగా సుమారు 20 మందిని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా హాజరయ్యారు. సీనియర్ నేతలతో కలిసి ఆయన వేదికపై ఆసీనులయ్యారు. మమత.. బెంగాల్‌కే పరిమితం తమ పార్టీని ఓడించాలన్న మమతా బెనర్జీ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ స్పందించారు. మమతా బెనర్జీ బెంగాల్‌కే పరిమితమని.. కేంద్రంలో బీజేపీని ఓడించే సత్తా ఆమెకు లేదన్నారు. ‘ఇంత పెద్ద లక్ష్యం వారి (టీఎంసీ) ఆరోగ్యానికి మంచిది కాదు. ఆమె (సీఎం మమతా బెనర్జీ) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన లోక్‌సభ ఎన్నికల్లో కూడా గెలుస్తారని అనుకోలేం. సార్వత్రిక ఎన్నికల్లో వారిని భంగపాటు తప్పద’ని సుకాంత మజుందార్ అన్నారు. (క్లిక్: బీజేపీ నుంచి ఔట్.. మమత పార్టీలోకి మరో సీనియర్ నేత) -
తృణమూల్ అధినేతగా మమత ఎన్నిక
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేతగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఎన్నికయ్యారు. టీఎంసీ నాయకులు బుధవారం ఆమెను పార్టీ అధినేతగా ఎన్నుకున్నారు. బీజేపీపై పోరాటానికి పార్టీ శ్రేణులంతా ఒక్క తాటిపైకి రావాలని ఈ సందర్భంగా మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. పార్టీలో అంతర్గత కలహాలను ఎంతమాత్రం సహించబోనని హెచ్చరించారు. టీఎంసీలో గ్రూపులు కడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలను మనమే గెలుచుకోవాలని, అందుకోసం ఇప్పటినుంచే కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా బీజేపీని ఓడిద్దాం 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని మట్టికరిపించడానికి ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని మమతా బెనర్జీ సూచించారు. అందరం కలిసికట్టుగా బీజేపీని ఓడిద్దామని అన్నారు. తాము బెంగాల్లో సీపీఎంను సులభంగా ఓడించామని, జాతీయ స్థాయిలో బీజేపీని సైతం ఇంటికి సాగనంపడం అసాధ్యమేమీ కాదని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్‌గా మళ్లీ ఎన్నికైన అనంతరం ఆమె పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ వ్యతిరేక శక్తులు ఒకే వేదికపైకి రావాలని తాము కోరుకుంటున్నామని వెల్లడించారు. ఎవరైనా అహం(ఈగో) కారణంగా వెనకే కూర్చుండిపోవాలని అనుకుంటే అది వారిష్టమని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి చురక అంటించారు. అవసరమైతే తామే ఒంటిరిగా బీజేపీపై పోరాడుతామని చెప్పారు. మేఘాలయా, చండీగఢ్‌లో బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ సాయం చేసిందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్, గుజరాత్ నుంచి బీజేపీ జాతీయ పార్టీలుగా ఎదిగినట్లుగానే పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. -
నేతాజీ ఆచూకీ గురించి నేటికీ తెలియని మిస్టరీ!
న్యూఢిల్లీ: నేతాజీ మరణానికి సంబంధించిన ఫైళ్లను కేంద్రం ఎందుకు బయట పెట్టడం లేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. అంతేకాదు జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన నేతాజీ బూడిదను డీఎన్ఏ విశ్లేషణకు పంపాలని తృణమాల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఈ మేరకు నేతాజీ 125వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బెనర్జీ మాట్లాడుతూ...నేతాజీ ఆచూకీ గురించి నేటికీ మాకు తెలియదు. తాము అధికారంలోకి రాగానే దానిపై పని చేస్తామని కేంద్రం చెప్పింది. పైగా నేతాజీకి సంబంధించిన అన్ని ఫైళ్లను విడుదల చేసి, వర్గీకరించాం అని కేంద్రం పేర్కొంది. కానీ వాస్తవానికి అవి ఏం జరగలేదు. అని అన్నారు. అయితే నేతాజీ మరణానికి సంబంధించిన వివాదం బెంగాల్లో తీవ్ర భావోద్వేగ సమస్యగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు 1945లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించలేదని చాలామంది ఇప్పటికీ నమ్ముతుండటం విశేషం. అయితే 2017లో తృణమాల్ కాంగ్రెస్ పార్టీ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఆగస్ట్ 18, 1945న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించినట్లు కేంద్రం ధృవీకరించింది. పైగా నేతాజీకి సంబంధించిన అన్ని ఫైళ్లను నిర్వీర్యం చేసినట్లు కేంద్రం ప్రకటించింది. కానీ ఇంకోవైపు నేతాజీకి సంబంధించిన ఇంటెలీజెన్స్ బ్యూరో ఫైల్స్ ఇప్పటికీ ప్రజా బాహుళ్యంలో లేవని పరిశోధకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ రే "నేతాజీ ఫైల్స్" వర్గీకరణను డి-క్లాసిఫికేషన్ చేయాలని అభ్యర్థిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాము తీసుకువచ్చిన ఒత్తిడి మేరకు మన్‌కీ బాత్‌లో ఇండియా గేట్‌కి సమీపంలో దిగ్గజ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని మోదీ హామీ ఇచ్చారంటూ మమతా బెనర్జీ ఆరోపించారు. (చదవండి: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డు ప్రదానం) -
తెలంగాణలో తృణమూల్ కాంగ్రెస్!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ తెలంగాణలో అడుగుపెట్టే యోచనలో ఉంది. దేశవ్యాప్తంగా పార్టీని విస్తృతం చేసే ఆలోచనతో ముందుకెళ్తున్న ఆ పార్టీ ఇప్పుడు రాష్ట్రంపైనా దృష్టి సారించింది. ఇందులోభాగంగా కొద్దిమంది కాంగ్రెస్ కీలక నేతలతోపాటు టీఆర్ఎస్ అసంతృప్త నేతలతో జాబితా రూపొందిస్తున్నట్టు తెలిసింది. పార్టీని విస్తృతం చేసే బాధ్యతలను మమతా బెనర్జీ ఇటీవల కీలక నేతలకు అప్పగించా రు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, పార్టీల బలాలు, వాటి బలహీనతలు తదితర అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో బ్యాక్ఎండ్ వర్క్ చేస్తున్న ఓ ఏజెన్సీకి ఈ బాధ్యత అప్పగించినట్టు చర్చ జరుగుతోంది. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల పరిస్థితిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ఈనెల మొదటి వారంలో అధినేత్రికి నివేదికివ్వనున్నట్టు తెలిసింది. ఇప్పటికే అస్సాం, త్రిపుర, గోవా, యూపీలో.. గోవా, అస్సాం, త్రిపుర, హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్, మేఘాలయా రాష్ట్రాల్లో తృణమూల్ కాం గ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న గోవా, యూపీ తదితర రాష్ట్రాల్లో పోటీకి సిద్ధవుతోంది. ఇందులో భాగంగా దక్షిణాన తెలంగాణలో పార్టీ విస్తరణకు అవకాశాలున్నట్టు గుర్తించారని, అందుకే ఇక్కడ పార్టీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు మాజీ ఎంపీలతో తృణమూల్ సీనియర్ నేత ఒకరు చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. బీజేపీలోకి వెళ్తారని భావిస్తున్న కొంతమంది అధికార పార్టీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ఎలాంటి వ్యూహం అవలంబించాలన్న దానిపైనా వారితో మాట్లాడినట్లు తెలిసింది. ఇటీవలి హుజురాబాద్ ఎన్నికలపైనా తృణమూల్ అధినేత్రికి సంబంధిత ఏజెన్సీ పూర్తి నివేదిక అందించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ సాధించిన ఓట్ల విషయంలోనూ లోతైన అధ్యయనం చేసి మరీ నివేదిక అందించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో మరోపార్టీకి వెసులుబాటు ఉంటుందని బెంగాల్ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగానే..: సుస్మిత దేవ్, టీఎంసీ ఎంపీ బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పార్టీ విస్తరణపై మమతా బెనర్జీ దృష్టి సారించినట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. భావసారూప్యత ఉన్న నేతలు ఎవరొచ్చినా పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తృణమూల్ రాజ్యసభ ఎంపీ సుస్మిత దేవ్ ‘సాక్షి’తో చెప్పారు. ‘మమతా బెనర్జీ జాతీయ భావజాలంతో ముందుకెళ్తున్నందున బీజేపీని సమర్థవంతంగా ఢీకొట్టేందుకు పార్టీని విస్తృతం చేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ.. ఇలా ఏ పార్టీ నేతలైనా మాతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉంటే తప్పకుండా ఆహ్వానిస్తాం. తెలంగాణలోనూ పార్టీ విస్తరణ ఉంటుంది. అయితే, ఇందుకు మరికొంత సమయం ఉంది’అని ఆమె పేర్కొన్నారు. -
పార్లమెంట్లో కాంగ్రెస్‌తో సమన్వయంపై ఆసక్తి లేదు
కోల్‌కతా: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీతో సమన్వయం చేసుకోవడంపై తమకు ఆసక్తి లేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇతర పక్షాలకు సహకారం అందిస్తామని వెల్లడించింది. కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఈ నెల 29న నిర్వహించనున్న ప్రతిపక్షాల భేటీకి తాము హాజరుకాబోమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని టీఎంసీ సీనియర్ నాయకుడొకరు శనివారం చెప్పారు. కాంగ్రెస్ ముందు అంతర్గతంగా సమన్వయం చేసుకోవాలని, సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఈ తర్వాతే ఇతర పార్టీలతో సమన్వయంపై ఆలోచించాలని సూచించారు. అధికార బీజేపీని ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ నేతల్లో అంకితభావం కనిపించడం లేదని తప్పుపట్టారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు దెబ్బతింటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అసమర్థ పార్టీ అని తృణమూల్ ఆరోపిస్తోంది. బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్‌కు లేదని విమర్శిస్తోంది. -
ఈ టీ ఖరీదు రూ.15 లక్షలు.. అయినా ఎగబడ్డ జనం
కోల్‌కతా: రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడానికి కొందరు ప్రత్యేక దారిని ఎంచుకుంటారు. అదే తరహాలో టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్ర ప్రధానిని టార్గెట్ చేస్తూ ఏకంగా చాయ్ వాలా అవతారం ఎత్తారు. తన అభిమానులు, ప్రజలకు టీ ఇచ్చారు. దాని ధర రూ.15 లక్షలు అని చెప్పారు. అందరూ ఆ టీ తీసుకుని ఆనందంగా తాగారు. ఆ తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన దైన శైలిలో సెటైర్స్ వేశారు. మిత్ర మాట్లాడుతూ.. మా తృణమూల్ కాంగ్రెస్సే కాదు, ఇతర విపక్షాలు కూడా బీజేపీ ప్రభుత్వం 2014లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలుచేస్తాయో అని ఎదురుచూస్తూనే ఉన్నాం. ప్రతి పౌరుడి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోదీ అప్పట్లో మాట ఇచ్చారు. మరి ఏళ్లు గడుస్తున్న ఆ రోజు ఇంకా రాలేదని, ఇది ఎప్పుడు నెరవేరనుందోనని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నెటిజన్లలో విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ కమర్హతి ఎమ్మెల్యే, కోల్‌కతాలోని భువానిపూర్ ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులకు టీ అందిస్తూ.. "ఇది ఒక ప్రత్యేకమైన టీ. మోదీజీ రైల్వే స్టేషన్లలో చాయ్ వాలాగా ఉన్నప్పుడు చేసిన టీ రుచికి సరిపోతుందని నేను అనుకుంటున్నాను. దీన్ని ఉచితంగా అందిస్తున్నాను. కానీ మీరు ధర అడిగితే మాత్రం, ఒక కప్పు ధరను రూ .15 లక్షలుగా చెప్తాను ఎందుకంటే ఇది మోదీ వాగ్దానం చేసిన మొత్తం కూడా 15 లక్షలే కనుక అంటూ విమర్శలు గుప్పించారు. @AITCofficial MLA, Madan Mitra: A cup of tea costs 15 lakh rupees, the name of the ‘seller’ is Madan Mitra! An innovative campaign by @madanmitraoff 🙏 pic.twitter.com/ggT6bWIEbP — Satyaki Sengupta (@satyaki_sngupta) August 1, 2021 -
మమతా ఢిల్లీ పర్యటన.. విపక్షాల ఏకీకరణే ప్రధాన ఎజెండా
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఢిల్లికి వెళ్లనున్నారు. ఆమెతో పాటు తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ, యంఎస్ బెనర్జీలు హస్తినాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. కాంగ్రెస్ అధినేత్రి, సోనియా గాంధీ, శరద్ పవార్ సహ విపక్ష నేతలందరిని కలువనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్షాల ఏకీకరణ దిశగా మమతా బెనర్జీ పర్యటన సాగుతుందని టీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. అదే విధంగా, ఈనెల 28న పత్రిపక్ష పార్టీలతో భేటీ కానున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అపాయింట్మెంట్ మమతా.. ప్రధాని నరేంద్రమోదీని కలువనున్నట్లు తెలుస్తోంది. ఇక మమతా బెనర్జీని తృణముల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సారథిగా ఏకగ్రవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. మమతా ఇప్పటి వరకు 7 సార్లు ఎంపీగా సేవలందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో బీజేపీ ప్రభుత్వం కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమైందని మమతా బెనర్జీ విమర్షిస్తున్నారు. మమతా ఢిల్లీ పర్యటన గురించి టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ మాట్లాడుతూ.. బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన పరిస్థితుల్లో 2024 విపక్షల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి రేసులో మమతా ముందు వరసలో ఉన్నారని తెలిపారు. అందుకోసమే సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారని తెలిపారు. ఇక దీదీ ఢిల్లీ పర్యటన ప్రకటనతో హస్తిన రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. -
సెల్ఫీ కోసం ఆరాటం.. అభిమానిని తోసేసిన సీనియర్ నటి
కోల్‌కతా: బాలీవుడ్ సీనియర్ నటి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ముక్కిసూటి మనిషి. ఆమె మాటలు, చేష్టలు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాయి. చూసేవారు ఏం అనుకుంటారో అని ఆలోచించరు. ఇలాంటి ప్రవర్తనతో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు జయా బచ్చన్. తన అనుమతి లేకుండా సెల్ఫీ తీయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి పట్ల జయా బచ్చన్ కఠినంగా ప్రవరించారు. ఆ వ్యక్తిని పక్కకు తోసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ఆమె పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పొగరుగా ప్రవర్తించడం సరికాదు అంటున్నారు. ఆ వివరాలు.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో జయా బచ్చన్ టీఎంసీకి మద్దతిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం జయా బచ్చన్ టీఎంసీ అధినేత్రి మమతకు మద్దతుగా కోల్‌కతాలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనాలు భారీ ఎత్తున హాజరయ్యారు. వారందరికి చేతులు ఊపుతూ అభివాదం చేశారు జయా బచ్చన్. ఈ క్రమంలో ఓ యువకుడు ఆమె సమీపంలోకి వెళ్లి సెల్ఫీ తీసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన జయా బచ్చన్.. అతడిని పక్కకు తోసి ర్యాలీని కొనసాగించారు. తన అనుమతి లేకుండా ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తుండటంతో ఆగ్రహానికి గురైన జయా అతడిని నెట్టేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరీ ఇంత కోపంగా, కఠినంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఫోటోలు తీయోద్దు అని చెప్తే సరిపోయేది కదా అంటున్నారు నెటిజనులు. చదవండి: జయ బచ్చన్ వల్లే బాలీవుడ్లో ఎన్నో మార్పులు, చరిత్ర చేర్పులు -
బెదిరింపులకు బెంగాలీలెప్పుడూ తల వంచరు: జయా బచ్చన్
కోల్‌కతా: ‘భయం కారణంగా బెంగాలీలెప్పుడూ తమ తలలను ఇతరుల ఎదుట వంచలేదు. బెంగాలీలను భయపెట్టి ఎవరూ ఇంతవరకు గెలవలేదు..’ అంటూ బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ భార్య, సమాజ్‌వాదీ పార్టీనేత జయా బచ్చన్ పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆదేశాల మేరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆమె బెంగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, జేఎంఎం వంటి పార్టీలు సైతం టీఎంసీకి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. మమతా అనుకున్నది సాధిస్తారు.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురించి జయా బచ్చన్ మాట్లాడారు. మమతా అనుకున్నది సాధిస్తారని ఆమె చెప్పారు. ‘మమతా బెనర్జీ మీద నాకెంతో గౌరవం, ప్రేమ ఉన్నాయి. అన్ని రకాల దాడులకు వ్యతిరేకంగా ఆమె ఒక్కరే పోరాడుతున్నారు. తల పగిలినా, కాలు విరిగినా.. ఆమె గుండె ధైర్యం, మనో నిబ్బరం మాత్రం సడలడంలేదు’ అని వ్యాఖ్యానించారు. ఆమె నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మమతా తిరిగి గెలుస్తారని అన్నారు. నా మూలాలు బెంగాల్లో.. రాష్ట్రానికి వెలుపల జన్మించినప్పటికీ, తాను బెంగాలీనేనని జయా బచ్చన్ తెలిపారు. పెళ్లికి ముందు వరకూ తన ఇంటి పేరు భాదురి అని చెప్పారు. బెంగాల్ ప్రజాస్వామ్య హక్కుల కోసం మమతా పోరాడుతున్నారని అన్నారు. రవీంధ్రనాధ్ ఠాగూర్ సైతం బెంగాలీలంతా అక్కాచెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లని చెప్పారని గుర్తు చేశారు. బెంగాల్ ప్రస్తుతం మహిళలకు సురక్షితంగా ఉందన్నారు. మమతాను అసభ్యపదజాలంతో దూషించిన వారి పై స్పందిస్తూ.. సిగ్గు సిగ్గు.. అని వ్యాఖ్యానించారు. -
కట్‌మనీ సంస్కృతిని అంతం చేస్తాం
కాక్ద్వీప్/డైమండ్ హార్బర్: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ప్రభుత్వం కట్‌మనీ సంస్కృతిని తీసుకొచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కట్‌మనీ సంస్కృతిని అంతం చేస్తామన్నారు. బీజేపీ చేపట్టిన పరివర్తన్ యాత్ర పరమార్థం ఒక ముఖ్యమంత్రిని, ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్యేను మార్చడం కాదని.. అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేయడం, బెంగాల్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమేనని స్పష్టం చేశారు. బెంగాల్‌ను సోనార్ బంగ్లాగా(బంగారు బంగ్లా) మార్చడానికే బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. తమ బూత్‌స్థాయి కార్యకర్తలకు, టీఎంసీ సిండికేట్‌కు మధ్య ఈ పోరాటం సాగుతోందని తెలిపారు. అమిత్ గురువారం బెంగాల్లో మరో దశ పరివర్తన్ యాత్రను ప్రారంభించారు. మేనల్లుడి కోసమే ముఖ్యమంత్రి ఆరాటం బెంగాల్లో అంఫన్ తుపాను బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులను టీఎంసీ నేతలు కాజేశారని అమిత్ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే తుపాన్లు, పర్యావరణ విపత్తుల నుంచి ప్రజలను కాపాడడానికి ప్రత్యేక టాస్క్ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాలల్లో సరస్వతి పూజను మమతా బెనర్జీ అడ్డుకున్నారని దుయ్యబట్టారు. బెంగాల్లో రాజకీయ హింస కారణంగా 130 మందికిపైగా బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎంసీ గూండాల ఆగడాలు ఇకపై సాగవని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలను హత్య చేసిన అరాచక శక్తులను కటకటాల వెనక్కి పంపిస్తామన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను పక్కనపెట్టి, కేవలం ఆమె మేనల్లుడి సంక్షేమం కోసమే పని చేస్తున్నారని ఆక్షేపించారు. బెంగాల్లో సిండికేట్ పాలనను అంతం చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే 7వ వేతన సవరణ సంఘం సిఫార్సులను అమలు చేస్తామన్నారు. అమిత్ షా గురువారం 24 పరగణాల జిల్లాలోని నారాయణపూర్ గ్రామంలో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన సుబ్రతా బిశ్వాస్ ఇంట్లో భోజనం చేశారు. ఈ గ్రామంలో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉంది. కట్‌మనీ అంటే? బెంగాల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వర్తింపజేయడానికి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల నుంచి వసూలు చేస్తున్న కమిషన్‌ను కట్‌మనీగా వ్యవహరిస్తున్నారు. అంటే ఏదైనా పథకం కింద లబ్ధి పొందాలంటే అధికార పార్టీ నాయకులకు వారు అడిగినంత ముట్టజెప్పాల్సిందే. లేకపోతే అనర్హులవుతారు. -
రథయాత్ర వర్సెస్ బైక్ ర్యాలీ
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో వచ్చే ఏప్రిల్/మే నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. తృణమూల్ కాంగ్రెస్ పదేళ్ల పాలనకు చెక్ పెట్టే లక్ష్యంతో బీజేపీ శనివారం నుంచి రథయాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగా మరో దఫా రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టేందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) బైక్ ర్యాలీకి శ్రీకారం చుట్టింది. నడియా జిల్లాలో శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు జనసమర్థన్ యాత్ర పేరుతో సాగే ఈ ర్యాలీలో వేలాది మోటారుసైకిళ్లపై పార్టీ శ్రేణులు పాల్గొంటాయి. అదేవిధంగా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శనివారం నడియాలో పరివర్తన్ రథ యాత్రను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఐదు దశల్లో ఈ యాత్ర, మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. బెంగాల్‌కు కేంద్ర బలగాలను పంపండి: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేందుకు, ఎన్నికల ప్రక్రియ గౌరవాన్ని కాపాడేందుకు ఆ రాష్ట్రానికి కేంద్ర బలగాలను మాత్రమే పంపాలని బీజేపీ కోరింది. బీజేపీ ప్రతినిధి బృందం శుక్రవారం ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఈ మేరకు వినతి పత్రం అందజేసింది. కేంద్ర ఎన్నికల పరిశీలకులకు రాష్ట్ర పోలీసులు, అధికార యంత్రాంగం విధుల పర్యవేక్షణ బాధ్యతలనుఅప్పగించాలంది. -
ఇదేనా బెంగాల్ సంస్కృతి?
బర్ధమాన్: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) తీరుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా నిప్పులు చెరిగారు. తన పేరును హేళన చేయడం, తన కాన్వాయ్‌పై దాడి చేయడం.. ఇదేనా పశ్చిమ బెంగాల్ సంస్కృతి అని నిలదీశారు. చడ్డా, నడ్డా, ఫడ్డా, భడ్డా అంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యంగా మాట్లాడిన వీడియో ఒకటి ఇటీవల బహిర్గతమైంది. జె.పి.నడ్డా శనివారం పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలోకి బయటి వ్యక్తులు వస్తున్నారంటూ టీఎంసీ నాయకులు విమర్శలు చేస్తున్నారని, మరి వారి అరాచకాలు, అవినీతి, దోపిడీ మాటేమిటని ప్రశ్నించారు. టీఎంసీ నేతలు బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బొగ్గు, పశువులు, ఇసుక అక్రమ రవాణాతోపాటు కట్ మనీ వసూలు చేయడంలో అధికార పార్టీ నేతలు ఆరితేరారని, ఇదేనా బెంగాల్ సంస్కృతి అని నడ్డా మండిపడ్డారు. బెంగాల్ సంస్కృతి గురించి మాట్లాడే హక్కును టీఎంసీ కోల్పోయిందని తేల్చి చెప్పారు. మమతా ఇక ఇంటికే.. రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, శ్రీ అరబిందో వారసత్వాన్ని బీజేపీ మాత్రమే ముందుకు తీసుకెళ్లగలదని జె.పి.నడ్డా ఉద్ఘాటించారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను బీజేపీ అనుసరిస్తోందని గుర్తుచేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని బెంగాల్ ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని జోస్యం చెప్పారు. బర్ధమాన్‌లోని సర్వమంగళ ఆలయంలో నడ్డా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అరాచకానికి, అవినీతికి, వేధింపులకు మారుపేరు తప్ప బెంగాల్ సంస్కృతికి ప్రతినిధి కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతిని వ్యవస్థీకృతంగా మార్చారని విమర్శించారు. పిడికెడు బియ్యం ఇవ్వండి రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని నడ్డా గుర్తుచేశారు. ఆయన శనివారం బెంగాల్లో కృషక్ సురక్ష యోజన, ఏక్ ముట్టీ చావల్(పిడికెడు బియ్యం) కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బీజేపీ నేతలు బెంగాల్లో రైతుల ఇళ్లకు వెళ్లి పిడికెడు బియ్యం సేకరించనున్నారు. ఈ బియ్యం వండి, పేదలకు అన్నదానం చేయాలని నిర్ణయించారు. -
‘నన్ను చంపేస్తారు.. అందుకే విగ్రహాలు చేయించా’
కోల్‌కతా : చంపేస్తారనే భయంతో తన విగ్రహాలను తయారు చేయించిపెట్టుకున్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జయంత్ నాస్కర్. తాను చనిపోయిన తర్వాత ప్రజలు తనను మర్చిపోవద్దనే ఉద్దేశంతో విగ్రహాలను తయారు చేయించానని చెబుతున్నారు. సౌత్ 24 పర్గానాస్ జిల్లాలోని గోసాబా నియోజవర్గ ఎమ్మెల్యే జయంత్ నాస్కర్(71) మూడేళ్ల క్రితం కోల్‌కతాలో పేరుగాంచిన శిల్పితో రెండు విగ్రహాలను తయారు చేయించుకున్నారు. ఫైబర్ గ్లాస్‌తో తయారు చేయించిన ఈ విగ్రహాలను తన ఇంట్లో భద్రంగా దాచుకున్నారు. అయితే ఇటీవల తన నివాసంలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ విగ్రహాల విషయం బహిర్గతమైంది. ఈ విగ్రహాల ఫోటోలు వైరల్ కావడంతో ఆయన ఈ విషయంపై స్పందించారు. తనకు ప్రాణహాని ఉందని, తాను హత్యకు గురై చనిపోతే.. ప్రజలను మర్చిపోవద్దనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాలను తయారు చేయించానని చెప్పుకొచ్చారు. ‘గతంలో నలుగురు హంతకులు అలిపోర్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు. కొద్ది రోజుల తర్వాత వారు మళ్లీ పట్టుబట్టారు. వారిని విచారించగా.. నన్ను చంపేందుకు కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. లోకల్ లీడర్లే నన్ను హత్య చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నాకు జిల్లా ఎస్పీ ప్రవీణ్ త్రిపతి చెప్పారు. దీంతో నాకు ‘వై’ కేటగిరి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నాకు ప్రాణహాని ఉంది. ఏ క్షణంలోనైనా నేను హత్యకు గురికావొచ్చు. నేను చనిపోయిన తర్వాత ప్రజలు నన్ను మర్చిపోవద్దు. అందుకే విగ్రహాలు తయారు చేయించా‘ అని ఎమ్మెల్యే నాస్కర్ అన్నారు. తనకు టీఎంసీలోనే ఎక్కువ శత్రువులు ఉన్నారని, వారంతం ఇంతకు ముందు ఇతర పార్టీలో ఉండేవారని చెప్పుకొచ్చారు. జయంత్‌కు రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడం గమనార్హం. -
ఉప ఎన్నికల్లో తృణమూల్ క్లీన్ స్వీప్
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఉప ఎన్నికలు జరిగిన మూడు శాసనసభా స్థానాలను తృణమూల్ కైవసం చేసుకుంది. రెండు దశాబ్దాల అనంతరం కలియాగంజ్ స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్ దక్కించుకుంది. ఈ ఫలితాలపై తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు ప్రజా విజయంగా పేర్కొన్న ఆమె... బీజేపీకి ఇక రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. అహంకారపూరిత రాజకీయాలు పనిచేయవని, అందుకే బీజేపీని ప్రజలు తిరస్కరించారని మమతా విమర్శించారు. ఖరగ్ పూర్ సదర్ నుంచి పోటీ చేసిన తృణమూల్ అభ్యర్థి ప్రదీప్ సర్కార్ 20,811 ఓట్ల తేడాతో గెలుపొందారు. అలాగే కరీంపూర్, కలియాగంజ్ నుంచి తృణమూల్ అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు ఉప ఎన్నికల్లో విజయంతో తృణమూల్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కాగా పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని ఖరగ్ పూర్ సదర్, కరీంపూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు దిలీప్ ఘోష్, మహువా మొయిత్రా లోక్ సభకు ఎన్నిక కావడం, ఉత్తర్ దినాజ్‌పూర్‌లోని కలియాగంజ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రమథనాథ్ రాయ్ ఈ ఏడాది మే 31న మరణించడంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీ సాక్షిగా సీఎం వర్సెస్ గవర్నర్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధాంకర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. మమత సర్కార్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందంటూ గవర్నర్ ధాంకర్ విమర్శలు గుప్పిస్తుండగా.. గవర్నరే సమాంతర ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారని మమత దీటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో 70వ వార్షికోత్సవం సందర్భంగా బెంగాల్ అసెంబ్లీలో జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య ఘర్షణకు వేదికగా నిలిచింది. రాష్ట్ర అసెంబ్లీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి తనను చివరి నిమిషంలో ఆహ్వానించడంతో గుర్రుగా ఉన్న గవర్నర్ ధాంకర్ బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వచ్చిన ఆయనకు సాదర స్వాగతం పలికేందుకు సీఎం మమత, స్పీకర్ బిమన్ బెనర్జీ వెళ్లారు. అయితే, మమతను మర్యాదపూర్వకంగా పలుకరించకుండా.. స్వాగతం పలికేందుకు వచ్చిన ఆమె పట్టించుకోకుండా గవర్నర్ ముందుకుసాగారు. గవర్నర్ అనూహ్యంగా తనను విస్మరించి ముందుకుసాగడంతో మమత నిర్ఘాంతపోయారు. అయినా సహనం కోల్పోకుండా ఒక అడుగు వెనుకకు వేశారు. గుంభనంగా ముందుకుసాగిన గవర్నర్ స్పీకర్‌తో కలిసి అసెంబ్లీలోకి వెళ్లారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చివరి నిమిషంలో తనకు ఆహ్వానం పంపడంపై గవర్నర్ అసంతృప్తి వెళ్లగక్కారు. అంతేకాకుండా తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని రెండుసార్లు ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా కశ్మీర్లో ఉగ్రవాదానికి, వేర్పాటువాదానికి వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ఇక, గవర్నర్ తన ప్రసంగంలో కేంద్ర, రాష్ట్రాల అధికారాలు, సమాఖ్య విధానం తదితర అంశాలను ప్రస్తావిస్తూ.. చివర్లో మమత సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజ్యాంగ అధిపతి పదవిని రాజీపడేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగం విన్న ప్రతిపక్షాలు బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధింబోతున్నారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంతో ఈ ఘర్షణ ముగిసిపోలేదు. ఆయన అసెంబ్లీని వీడి వెళుతుండగా.. టీఎంసీ ఎమ్మెల్యేలు జై బంగ్లా, జై హింద్ అంటూ నినాదాలు చేశారు. మమతతో మాట్లాడకుండానే గవర్నర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, తాను వెళుతుండగా టీఎంసీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంపై గవర్నర్ తీవ్ర ఆగ్రహానికి లోనైనట్టు తెలుస్తోంది. దీనిపై తన కారులో కూర్చున్న స్పీకర్‌ను ఆయన గట్టిగా హెచ్చరించినట్టు సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తన మారకపోతే తానే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు సమాచారం. ఇక, మమత కూడా గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెళ్లిన తర్వాత అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. ‘ఆయనలాగే ఎవరూ ప్రవర్తించరు. ప్రధాని మోదీ కూడా మేం కనిపిస్తే పలుకరిస్తారు. కానీ గవర్నర్ ప్రవర్తన చూడండి. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారన్న సంగతి తెలుసు. ఆయనను ఏ ఉద్దేశంతో రాష్ట్రానికి పంపించారో కూడా తెలుసు’ అంటూ మమత తప్పుబట్టారు. -
నన్నే తిరిగి డబ్బులు అడుగుతావా?.. బెంగాల్లో దారుణం
కలకత్తా : తను ఇచ్చిన లంచం తిరిగి ఇవ్వమనడమే ఆమె నేరమైంది. నన్నే తిరిగి డబ్బులు అడుగుతావా అంటూ ఓ పార్టీ నాయకుడు తన అనుచరులతో కలసి ఆమెను దారుణంగా రేప్ చేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తాజాగా తమ పార్టీ కార్యకర్తలకు లంచాలు తీసుకోవద్దని, ఇప్పటికే తీసుకుంటే తిరిగివ్వండని పిలపునిచ్చారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎవరైనా పార్టీ కార్యకర్త లంచం తీసుకున్నట్లయితే వెంటనే తిరిగి ఇవ్వాలని సూచించారు. మమతా బెనర్జీ పిలుపుతో చాలా మంది పార్టీ కార్యకర్తలు తాము తీసుకున్న లంచాన్ని తిరిగివ్వడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని మైనాగురి ప్రాంతానికి చెందిన ఓ పేద మహిళ ప్రభుత్వ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకోవడానికి దరఖాస్తు చేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన తృణమూల్ కార్యకర్త, పంచాయతీ నాయకుడు లంచం డిమాండ్ చేయడంతో రూ.7000 ఇచ్చింది. సంవత్సరం నుంచి ఇంటి నిర్మాణానికి ఒక్క రూపాయి విడుదల కాకపోయినా ఆమె అతన్ని నిలదీయలేదు. కానీ తాజాగా మమతా బెనర్జీ తన కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు మేరకు తన డబ్బులు వస్తాయనే ఆశతో ఆగస్టు 14న వెళ్లి అడిగింది. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ ఆ ‘నాయకుడు’ ఆమెను దారుణంగా హింసించడమేగాక తన అనుచరులతో కలసి గ్యాంగ్‌రేప్ చేశాడు. దీంతో ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులను ఇంతవరకూ అరెస్టు చేయలేదు. ఈ అంశం తాజాగా వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. ‘మమతాజీ మీ కార్యకర్తలు మీ పిలుపుకు బాగా ప్రతిస్పందించారని’ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తోన్న నేపథ్యంలో తాజా ఘటన మమతకు రాజకీయంగా మరిన్ని తలనొప్పులు తీసుకొచ్చింది. -
హనీమూన్: భర్తతో విహరిస్తున్న ఎంపీ!
నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్, భర్త నిఖిల్ జైన్‌తో కలిసి మాల్దీవుల్లో ప్రణయయాత్ర చేస్తున్నారు. పార్లమెంటుకు తొలిరోజు వెస్టర్న్ దుస్తులు ధరించి వచ్చినందుకు తృణమూల్ ఎంపీలైన నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నూతన దంపతులైన నుస్రత్, నిఖిల్ ప్రస్తుతం మాల్దీవుల్లో హానీమూన్ జరుపుకొంటున్నారు. ఈ హనీమూన్‌కు సంబంధించి పలు ఫొటోలను నుస్రత్ జహాన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. యెల్లో ప్యాంట్, కలర్‌ఫుల్ ప్రింటెడ్ టాప్ ధరించి.. స్టైలిష్ హ్యాట్ పెట్టుకొని.. భర్తతో దిగిన ఓ ఫొటోను ఆమె పోస్టు చేశారు. మరోవైపు ఈ ప్రయణయాత్రలోనే ఆమె హిందూ మహిళల తరహాలో సంప్రదాయబద్ధంగా సింధూర దూజ్‌ను జరుపుకున్నారు. హిందూ వైవాహిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ.. చీరను ధరించి.. నుదుట కుంకమ పెట్టుకొని.. ఆమె భర్తతో కలిసి ఈ వేడుకను జరిపారు. ఇక, స్ట్రిప్డ్ బ్లూ టాప్ ధరించి ఒంటరిగా దిగిన ఫొటోను కూడా ఆమె పోస్టు చేయగా.. ‘హనీ.. హనీమూన్ ఎలా ఉంది’ అంటూ తోటి తృణమూల్ ఎంపీ మిమి చక్కవర్తి సరదాగా కామెంట్ చేశారు. ‘దీనికి ఇక్కడ హానీ బాగుంది. మూన్ బావున్నాడు. సూర్యుడే కొంచెం ఎక్కువ ఎండ కాస్తున్నాడు’ అంటూ నుస్రత్ తెలివిగా చమత్కరించారు. -
బెంగాల్లో రాష్ట్రపతి పాలన??
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ.. పశ్చిమబెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగి.. హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత కూడా బెంగాల్ రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగానే ఉంది. శనివారం రాష్ట్రంలో జరిగిన ఘర్షణల్లో నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘర్షణలకు మీరే కారణమంటూ టీఎంసీ, బీజేపీ పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్‌లోని పరిస్థితులను ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆ రాష్ట్ర గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి తెలియజేశారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై కేంద్రానికి నివేదిక అందజేశారు. ఈ క్రమంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేతో మాట్లాడిన త్రిపాఠి.. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం రావొచ్చునని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణల్లో డజను మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, ఈ క్రమంలో బెంగాల్లో పరిస్థితులు ఇంకా దిగజారితే.. రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరముంటుందని ఆయన అన్నారు. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరముందన్న బీజేపీ నేత కైలాశ్ విజయ్వార్గియా వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ‘ఆ అవసరం రావొచ్చు. అలాంటి డిమాండ్ వస్తే కేంద్రం దానిని పరిశీలిస్తుంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రపతి పాలన గురించి ప్రధానితోగానీ, హోంమంత్రితోగానీ నేను చర్చించలేదు’ అని పేర్కొన్నారు. బెంగాల్లో హింసకు మీరే కారణమంటూ బీజేపీ, టీఎంసీ పరస్పరం వేలెత్తి చూపించుకోవడంపై స్పందిస్తూ.. రాజకీయ పార్టీలు సంయమనం పాటిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు పాటుపడాలని సూచించారు. -
బెంగాల్లో ప్రచారానికి ఇమ్రాన్‌ఖాన్!
న్యూఢిల్లీ : బంగ్లాదేశీ నటులు ఫెర్దోస్ అహ్మద్, నూర్ ఘాజీలను రప్పించి.. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ తరఫున తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, ఒకప్పటి మమతా బెనర్జీ కుడిభుజం ముకుల్ రాయ్ ఘాటైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్‌కతాలో ప్రచారానికి పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను పిలువాలని టీఎంసీ ప్లాన్ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్‌ను బెంగాల్లో ప్రచారానికి టీఎంసీ ఆహ్వానించింది. ఈ విషయమై నాకు సమాచారముంది. అందుకే ఆ పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశాను’ అని ముకుల్ రాయ్ సోమవారం విలేకరులతో పేర్కొన్నారు. ఈ విషయం మీకు ఎలా తెలుసు అని మీడియా ప్రశ్నించగా.. ‘ఫెర్దోస్ అహ్మద్, నూర్ ఘాజీలను ప్రచారానికి పిలుస్తున్న విషయాన్ని ముందు ప్రకటించారా? అదేవిధంగా ఇది కూడా జరగనుందని మాకు వినిపిస్తోంది. అందుకే ఈసీని అలర్ట్ చేశాం’ అని ఆయన చెప్పుకొచ్చారు. -
నిరాడంబర నిప్పుకణిక మమతా బెనర్జీ
(సాక్షి వెబ్ ప్రత్యేకం) విద్యార్థి దశ నుంచే చిచ్చర పిడుగు లక్షణాలతో పట్టుదలకు, గుండె నిబ్బరానికి మారు పేరుగా నిలిచిన ధీర మహిళ 'ఫైర్ బ్రాండ్' మమతా బెనర్జీ. 1970వ దశకంలో రాజకీయ జీవితం ప్రారంభించి శరవేగంగా అడుగులు వేస్తూ తనదైన వ్యక్తిత్వంతో దూసుకుపోతున్నారు. నందిగ్రామ్ ఉద్యమం, సింగూరులో టాటాలకు ఎదురొడ్డి, బలవంతపు భూసేకరణను నిలువరించి రైతుబంధుగా ప్రజలకు దగ్గరైన తీరు, సాధించిన అఖండ విజయం ఆమె రాజకీయ ప్రస్థానంలో కీలక మైలురాళ్లు. 2011లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 34 ఏళ్ల కమ్యూనిస్టుల కంచుకోటకు ఎదురెళ్లి నిలిచి గెలిచిన నాయకురాలు. ఇపుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వ్యూహరచనలో తలమునకలైవున్నారు. ప్రధానంగా బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షా ద్వయానికి చెక్ చెప్పే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2019 ఎన్నికల సమరానికి సమర శంఖం పూరించారు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మమతా బెనర్జీ ఒక మహిళగా రాజకీయాల్లో నిలదొక్కుకున్నవైనం అంత అషామాషీగా ఏమీ సాగలేదు. అనేక రకాల సవాళ్లకు ధీటుగా ఎదుర్కొంటూ, అవరోధాలను అధిగమించుతూ రాజకీయాల్లో తన ముద్రను సాధించుకున్నారు. 1970లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మమతా బెనర్జీ అనతికాలంలోనే మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 1984 ఎన్నికల్లో కమ్యూనిస్టు మహాయోధుడు సోమనాధ ఛటర్జీని ఓడించి అందరి దృష్టినీ తనవైపునకు తిప్పుకున్నారు. అలా పార్లమెంటులో అడుగుపెట్టిన అతి చిన్నవారిలో ఒకరిగా నిలిచారు. అంతేకాదు కాంగ్రెస్ హయాంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో దీదీ తొలి మహిళా రైల్వే మంత్రి ఖ్యాతి దక్కించుకున్నారు. అలాగే మొదటి మహిళా బొగ్గు శాఖా మంత్రి కూడా దీదీనే. కాంగ్రెస్ వ్యతిరేక పవనాల్లో 1989లో ఓడిపోయినా ఆ తరువాతి నుంచి ఆమె ప్రభంజనానికి ఎదురే లేదు. 1991, 1996, 98, 99, 2009 ఎన్నికల్లో తన హవాను చాటుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీతో తీవ్ర విభేదాల కారణంగా 1997లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వాల్లో కీలక భూమికను నిర్వహించారు. అయితే 2004 లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది. మమత ఒక్కరే ఎంపీగా గెలిచారు. ఆ సమయంలో సీపీఎం పారిశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా బెంగాల్లో వ్యూహాత్మక పోరాటానికి శ్రీకారం చుట్టారు. సింగూర్ లో టాటా మోటార్స్ ప్లాంట్ కు వ్యతిరేకంగా 2006లో అసెంబ్లీ మార్చ్ విజయవంతంగా నిర్వహించారు. నందిగ్రామ్‌లో జరిగిన హింసను అడ్డుకున్నారు. ఇదే ఆమె రాజకీయ జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. సామాన్యులకు నిజమైన దీదీగా మారారు. 2011ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా అధికారాన్ని కైవసం చేసుకున్నారు. సొంత కుంపటిని ఏర్పాటుచేసుకున్న అనంతరం ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు మమతకు సుమారు 14 ఏళ్లు పట్టింది. ఏ ఉద్యమమైతే తనకు సీఎం కుర్చీని అప్పగించిందో అదే సింగూరు ఉద్యమ రైతులకు 400 ఎకరాల భూమిని తిరిగి ఇస్తూ తొలి సంతకం చేశారు. ఈ నిర్ణయమే 2016 వరుసగా రెండవసారి కూడా అఖండ మెజార్టీని ఆమెకు కట్టబెట్టింది. ప్రస్తుతం దీదీ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటం విశేషం. వ్యక్తిగత వివరాలు తల్లిదండ్రులు ప్రోమిలేశ్వర్ బెనర్జీ, గాయత్రి బెనర్జీ జనవరి 5 1955న మమతా బెనర్జీ (బందోపాధ్యాయ) జన్మించారు. ఎమ్.ఏ (ఇస్లామిక్ చరిత్ర) తో పాటు న్యాయశాస్త్ర విద్యను అభ్యసించారు. ఇక్కడో ఇంకో గమ్మత్తైన విషయం ఏమింటటే పదవతరగతి పరీక్షలు రాయడానికి మమతకు వయసు సరిపోకపోతే ఐదేళ్లు ఎక్కువగా వేసి రాయించారట. నిజానికి మమత పుట్టింది 1960 అక్టోబర్ 5వ తదీ అనే వాదన ప్రచారంలో ఉంది. అయితే రికార్డులలో ఉన్న తేదీ మాత్రం 1955 జనవరి 5. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రయివేటు టీచర్‌గా, సేల్స్ గర్ల్‌గా, స్టోనోగ్రాఫర్గా పనిచేశారు. ఇష్టాలు వ్యక్తిగతంగా మమతా బెనర్జీ నిరాడంబర నాయకురాలు. ఆత్మస్థైర్యమే ఆమెకు ఆభరణం. ఆమె ఆహార్యమే ఆమెకు గుర్తింపు. అన్నట్టు దీదీ మంచి రచయిత కూడ. కవిత్వం రాయడమంటే ఆమెకు వల్లమాలిన ప్రేమ. ప్రకృతి అంటే ప్రాణం. సమయం దొరికితే హిమాలయ పర్వతాలు, మేదినీపూర్ అడవులను సందర్శించడం అలవాటు. ప్రకృతి ఫోటోగ్రఫీ, పెయింటింగ్స్ వేయడం అన్నా చాలా ఇష్టం. పోరిబోర్టాన్ (మార్పు) పేర ఓ కవిత్వ సంకలనాన్ని కూడా తీసుకొచ్చారు. కొబిత (కవితలు) పేర మరో పుస్తకం కూడా వచ్చింది. మై అన్ఫర్గెటెబుల్ మెమొరీస్ (మర్చిపోలేని నా జ్ఞాపకాలు) ఆమె రాసిన మరో పుస్తకం. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న మమత దుర్గా దేవీ పూజ కోసం ప్రత్యేకంగా పాటలుతో‘రౌద్రాచార్య’ ను ఆల్బమ్‌ను కూడా తీసుకొచ్చారు. వివాదాలు తన కాలంలో వెలుగులోకి వచ్చిన శారదా స్కాం, నారద స్టింగ్, రోజ్‌వ్యాలీ ఆర్థిక కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన మంత్రుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణలకు, ఇటీవల సీబీఐ అధికారుల అరెస్టు వ్యవహారం ఈ వివాదాలకు మరింత ఆజ్యం పోసింది. అలాగే పార్క్ స్ట్రీట్ సామూహిక అత్యాచార బాధితురాలు సుజెట్టే జోర్డాన్‌పై ముఖ్యమంత్రి హోదాలో ‘అదంతా ఓ కట్టుకథ’ అంటూ మమత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రాజేశాయి. మృత్యుంజయురాలు కాంగ్రెస్ నేతగా మమతా బెనర్జీపై1990 ఆగస్టు 16న, ఒక ర్యాలీలో సీపీఎం కార్యకర్త లాలూ అలాం ఆమెపై హత్యాయత్నం చేశాడు. కర్రతో బలంగా కొట్టడంతో, ఆమె తలపగిలింది. దీంతో దాదాపు నెల రోజులపాటు ఆమె ఆసుపత్రిలోనే ఉన్నారు. సీపీఎం ప్రోద్బలంతోనే తానీ దురాగతానికి పాల్పడ్డాననీ, క్షమించాలని కోరుకున్నా అతణ్ని దీదీ క్షమించలేదు. - టి. సూర్యకుమారి -
ఆ ప్రమాదం బాధ్యత మమత సర్కార్‌దే!
సాక్షి, న్యూఢిల్లీ : కోల్‌కతా నగరానికి మరో విషాదం తప్పలేదు. 2016లో వివేకానంద రోడ్డులోని ఫ్లైఒవర్ కూలిపోయి 27 మంది మరణించి, దాదాపు 60 మంది గాయపడినా పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం మేల్కొనలేదు. పర్యవసానంగా విమానాశ్రయానికి వెళ్లేదారిలోని మేజర్‌హట్ వంతెన మంగళవారం కూలిపోయి ఒకరు మరణించగా 21 మంది గాయపడ్డారు. గత ప్రభుత్వం అంటే సీపీఎం ప్రభుత్వం తప్పుడు డిజైన్‌ను ఆమోదించడం వల్ల వివేకానంద రోడ్డులోని వంతెన కూలిపోయిందంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాడు నెపాన్ని నెట్టేశారు. ఆ వంతెన కూలిపోయిన సందర్భంగానే ఢిల్లీ నుంచి పిలిపించిన ఓ ఏజెన్సీ వచ్చి మేజర్హట్తో పాటు నగరంలోని పలు వంతెనల పరిస్థితిని ఆడిట్ చేసింది. పదే పదే రోడ్డు లేయర్లు వేస్తూ రావడం వల్ల మేజర్‌హట్ వంతెన బరువు పెరిగిందని, అంత బరువును తట్టుకునే పరిస్థితుల్లో పిల్లర్లు లేవని, అధిక బరువును సమాంతరంగా పంపిణీ చేసేలా అదనపు పిల్లర్లను నిర్మించకపోతే వంతెన కూలిపోతుందని ఆ ఏజెన్సీ హెచ్చరించింది. అయినప్పటికీ మమత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఆ వంతెన కూలింది. 2016లో కూలిపోయిన వివేకానంద వంతెన తాలూకా శిథిలాలు ఇంకా ప్రమాదకరంగానే వేలాడుతున్నాయని, వాటిని తొలగించాలంటూ స్థానిక పత్రికల్లో పలుసార్లు వార్తలు వచ్చినా ఆమె ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. శిథిలాలను తొలగించేందుకు కూడా ఎంతో ఖర్చు అవుతుందని, ప్రస్తుతం ప్రభుత్వం వద్ద అంత నిధులు లేవని ఆమె చెబుతూ వస్తున్నారు. ఏడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మమతా ప్రభుత్వం ఏ తప్పు జరిగినా నెపాన్ని గత ప్రభుత్వంపైకి నెట్టేసి తప్పించుకోవాలని చూస్తోంది. ఈ ఆరేళ్ల కాలంలోనే కోల్‌కతాలో మూడు వంతెనలు కూలిపోయాయి. వంతెనలు ఎప్పుడు నిర్మించినా వాటి నిర్వహణ బాధ్యతలు మాత్రం అధికారంలో ఉన్న ప్రభుత్వానివే అవుతుంది. ఇలాంటి ప్రమాదాలు ఒక్క కోల్‌కతాలో, ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే జరగడం లేదు. ముంబైలోని అంధేరి రైల్వే బ్రిడ్జిలో కొంత భాగం గత జూలై నెలలో కూలిపోగా ఒకరు మరణించి, పలువురు గాయపడ్డారు. బ్రిడ్జి ఆడిటింగ్ జరిగిన ఆరు నెలలకే ప్రమాదం జరగడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్‌లోని ఛాంబ పట్టణాన్ని, పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ను కలుపుతూ నిర్మించిన కాంక్రీట్ వంతెన గతేడాది కూలిపోగా ఆరుగురు మరణించారు. మన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరిగాయి. -
మోదీ, అమిత్ షాలకు టీఎంసీ కౌంటర్
కోల్‌కతా : బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయడంలో వివిధ పార్టీల మద్దతు కూడగట్టడంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలకంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మమత సర్కారును విమర్శిస్తూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ ద్వారా సమాధానమిచ్చింది. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా గురువారం పురూలియాలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘శుభ్రమైన తాగునీరు, విద్యుత్, రేషన్ వంటి మౌలిక వసతులు కల్పించడంలో మమత సర్కారు విఫలమైంది. బెంగాల్లో తృణమూల్ కార్యకర్తలు తప్ప సామాన్య ప్రజలు ఎవరూ కూడా సంతోషంగా లేరని’ విమర్శిస్తూ అమిత్ షా ట్వీట్ చేశారు. అయితే గ్రామాల విద్యుదీకరణలో సాధించిన పురోగతిని వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ... ‘ ఏప్రిల్28, 2018 చరిత్రలో నిలిచిపోయే రోజు. భారత్‌లోని ప్రతీ గ్రామంలో విద్యుత్ వెలుగులు నింపడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతీ భారతీయుడు ఆనందంగా జీవించేందుకు నిబద్దతతో మేము చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి’ అంటూ ట్వీట్ చేశారు. కాగా అమిత్ షా, మోదీ ట్వీట్లను ఉటంకిస్తూ.. ‘ రెండు ట్వీట్లు. ఒకటేమో భారత ప్రధాని, మరొకటి బీజేపీ అధ్యక్షుడు చేశారు. విద్యుదీకరణ అంశంపై వీరిద్దరిలో ఒకరు అబద్దం చెబుతున్నట్లు అర్థమవుతోంది కదా’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ట్విటర్లో పోస్ట్ చేసింది. Addressed a huge public meeting in Purulia (WB). Mamata govt has failed on all fronts & people don’t have access to even basic facilities like clean drinking water, electricity & ration. No development has taken place for the common people but only goons of TMC have flourished. pic.twitter.com/xSLRdcZcJs — Amit Shah (@AmitShah) June 28, 2018 28th April 2018 will be remembered as a historic day in the development journey of India. Yesterday, we fulfilled a commitment due to which the lives of several Indians will be transformed forever! I am delighted that every single village of India now has access to electricity. — Narendra Modi (@narendramodi) April 29, 2018 -
టీఎంసీకి టీమిండియా మాజీ కెప్టెన్ గుడ్‌బై
కోల్‌కతా: ఫుట్‌బాల్ ప్లేయర్, టీమిండియా మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ నుంచి తప్పుకున్నారు. అధిష్టానంతో విబేధాలు, ఇతరత్రా కారణాలతో టీఎంసీకి రాజీనామా చేసిన ఆయన ఈ మేరకు ట్వీటర్లో ఓ పోస్ట్ చేశారు. ‘ నేడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. టీఎంసీకి సంబంధించిన అన్ని అధికారిక హోదాల నుంచి తప్పుకుంటున్నాను. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీలోను కొనసాగడం లేదంటూ’ భూటియా ట్వీట్ చేశారు. గతేడాది గోరక్లాండ్ ఉద్యమం విషయంలో టీఎంసీ అధిష్టానానికి, భూటియాకు మధ్య విబేధాలు తలెత్తాయి. టీఎంసీకి రాజీనామా చేసి సొంత రాష్ట్రం సిక్కింలోని ఏదైనా ప్రాంతీయ పార్టీలో చేరాలంటూ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని పదవుల నుంచి వైదొలగుతున్నట్లు భూటియా ప్రకటించేశారు. గత కొంతకాలం నుంచి న్యూఢిల్లీలోని బైచుంగ్ భూటియా ఫుట్‌బాల్ స్కూళ్ల అభివృద్ధిపై ఆయన దృష్టిసారించారు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ కెరీర్ కు భూటియా 2011లో రిటైర్మెంట్ ప్రకటించారు. రాజకీయాల్లోకి రావాలని భావించిన భూటియా మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో 2013లో చేరిన విషయం తెలిసిందే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా డార్జిలింగ్ నుంచి పోటీ చేసిన భూటియా బీజేపీ నేత ఎస్ఎస్ అహ్లువాలియా చేతిలో 1.96 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఆపై 2016లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సిలిగురి నుంచి పోటీ చేయగా.. సీపీఐ(ఎం) అభ్యర్థి అశోక్ భట్టాచార్య చేతిలో ఓటమి చవిచూసిన సంగతి విదితమే. -
తృణమూల్ షాక్.. ఆ ఎంపీపై ఆరేళ్ల నిషేధం
సాక్షి, కోల్‌కతా : పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కీలకనేత, రాజ్యసభ సభ్యుడు ముకుల్ రాయ్ పార్టీని వీడనున్నట్లు ప్రకటించడంపై పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ముకుల్ రాయ్ ప్రకటన వెలువడిన కొన్నిగంటల్లోనే పార్టీ నుంచి ఆయనను ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఓ ప్రకటన వెలువడింది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలకనేతగా ఉంటూ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే నేత ముకుల్ రాయ్ పార్టీ సభ్యత్వానికి ఇతర పదవులకు రాజీనామా చేస్తానన్న ప్రకటనను తృణమూల్ అధిష్టానం జీర్ణించుకోలేకపోతోంది. 'పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి మొదట రాజీనామా చేస్తాను. నేటి దుర్గా పూజల్లో పాల్గొన్న అనంతరం రాజ్యసభ సభ్యత్వానికి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పుకుంటాను. అదే సమయంలో పార్టీ నుంచి ఎందుకు తప్పుకుంటున్నానో అందరి సమక్షంలో వెల్లడిస్తాను. భవిష్యత్ కార్యాచరణపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని' ముకుల్ రాయ్ తెలిపారు. పార్టీలో మమతా బెనర్జీ తర్వాత కీలకనేతల్లో రాయ్ ఒకరు. ఇంకా చెప్పాలంటే మమతకు కుడిభుజంగా రాయ్ పేరును పేర్కొంటారు. శారదా చిట్‌ఫండ్ స్కామ్ బయటకు వచ్చాక ముకుల్ రాయ్‌ని మమతా బెనర్జీ పార్టీ జనరల్ సెక్రెటరీ పదవి నుంచి తప్పించారు. అప్పటి నుంచి పార్టీ విషయాలకు దూరంగా ఉంటున్న ఆయన తృణమూల్‌నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రాయ్ బీజేపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరికొన్ని గంటల్లో రాయ్ వెల్లడించే విషయాలు పశ్చిమబెంగాల్ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
మమతా బెనర్జీకి షాక్
► నారద కేసులో దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు ఆదేశం కోల్‌కతా: పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేతకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. నరద స్టింగ్ ఆపరేషన్ పై దర్యాప్తు కొనసాగించాలని కతకత్తా హైకోర్టు సీబీఐనీ ఆదేశించింది. సీబీఐ తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ని కొట్టేయాలని కోరుతూ తృణముల్ ఎంపీ ఆలీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. వరుస అవినీతి ఆరోపణలతో సతమతమవుతోన్న మమత సర్కార్‌కు ఇది గట్టి ఎదరుదెబ్బతగిలింది. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీ లాండరింగ్ కేసులో మమత సర్కార్‌పై కేసు నమోదు చేసింది. గతేడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నారద స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోల్లో కొందరు తృణముల్ కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయి. కాగా, ఇవి ట్యాంపర్ చేసిన టేపులు కావని చండీగఢ్‌లోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరెటరీ (సీఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో రాజ్యసభ ఎంపీ ముఖుల్ రాయ్, లోక్‌సభ ఎంపీ సౌగాత రాయ్, వీరితో సంబంధం ఉన్న పలువురు ఐపీఎస్ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. సుల్తాన్ అహ్మద్, ఇక్బాల్ అహ్మద్, కకోలి ఘోష్, ప్రసూన్ బెనర్జీ, సువేందు అధికారి, సోవన్ చటర్జీ, సుబ్రత ముఖర్జీ, సయ్యద్ హుస్సేన్ మీర్జా, ఫిర్హాద్ హకీమ్ తదితరులున్నారు. చిట్‌ఫండ్ స్కాంతో సంబంధం ఉన్న ఇద్దరు ఎంపీలు సుదీప్ బెనర్జీ, తపస్ పాల్ ఇప్పటికే సీబీఐ అదుపులో ఉన్నారు. -
కోర్టు తీర్పుతో మమ్మల్ని వెంటాడుతున్నారు!
న్యూఢిల్లీ: నారద స్టింగ్ ఆపరేషన్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలని న్యాయస్థానాలు ఆదేశించిన నేపథ్యంలో ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన జర్నలిస్టులకు వేధింపులు, బెదిరింపులు ఎదురవుతున్నాయి. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత కొందరు వ్యక్తులు తమను వెంటాడుతున్న విషయాన్ని గుర్తించామని తాజాగా నారద న్యూస్ ఆన్లైన్ పోర్టల్ సీఏవో ఏంజెల్ అబ్రహం పేర్కొన్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్న నారద న్యూస్ కు చెందిన పాత్రికేయులందరికీ ఇదేవిధంగా బెదిరింపులు, వెంటాడటాలు ఎదురవుతున్నాయని ఆమె చెప్పారు. పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ముడుపులు తీసుకుంటూ నారద న్యూస్ స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఈ స్టింగ్ ఆపరేషన్‌పై ప్రాథమిక విచారణ చేయాలని కలకత్తా హైకోర్టు సీబీఐని ఆదేశించింది. స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని, వస్తువులను 24 గంటల్లో స్వాధీనం చేసుకోవాలని, 72 గంటల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, తర్వాత దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్లినా.. అక్కడ ఆమెకు చుక్కెదురైంది. గతేడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నారద స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలను పలు వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. మొదట ఈ వీడియోలు ‘నారదన్యూస్.కామ్’లో ప్రసారమయ్యాయి. దీనిలో కొందరు నేతలు డబ్బులు తీసుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయి. కాగా, ఇవి ట్యాంపర్ చేసిన వీడియోలు కావని చండీగఢ్‌లోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరెటరీ (సీఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలు ఉన్నందువల్ల రాష్ట్ర సంస్థలు కాకుండా సీబీఐ అయితేనే స్వతంత్రంగా దర్యాప్తు నిర్వహించగలదని కోర్టు పేర్కొంది. -
‘నారద’ కేసు సీబీఐకి
-
‘నారద’ కేసు సీబీఐకి
3 రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలి: కలకత్తా హైకోర్టు కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ముడుపులు తీసుకుంటూ నారద న్యూస్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన వ్యవహారంలో ప్రాథమిక విచారణ చేయాలని కలకత్తా హైకోర్టు శుక్రవారం సీబీఐని ఆదేశించింది. స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని, వస్తువులను 24 గంటల్లో స్వాధీనం చేసుకోవాలని, 72 గంటల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, తర్వాత దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంది. ప్రముఖుల ప్రవర్తన ఇతరులు వేలెత్తి చూపేలా ఉండకూడదని, అవినీతి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని జస్టిస్ చక్రవర్తి పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని సీఎం మమత చెప్పారు. గతేడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నారద స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలను పలు వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. మొదట ఈ వీడియోలు ‘నారదన్యూస్.కామ్’లో ప్రసారమయ్యాయి. దీనిలో కొందరు నేతలు డబ్బులు తీసుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయి. కాగా, ఇవి ట్యాంపర్ చేసిన టేపులు కావని చండీగఢ్‌లోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరెటరీ (సీఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలు ఉన్నందువల్ల రాష్ట్ర సంస్థలు కాకుండా సీబీఐ అయితేనే స్వతంత్రంగా దర్యాప్తు నిర్వహించగలదని కోర్టు పేర్కొంది. స్టింగ్ ఆపరేషన్ బూటకం: మమత హైకోర్టు ఆదేశం దురదృష్టకరమని, దీన్ని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని మమత చెప్పారు. ‘స్టింగ్ ఆపరేషన్ నాటకం. వీడియోను బీజేపీ కార్యాలయంలో విడుదల చేశారు’ అని అన్నారు. ఆపరేషన్‌లో లంచం తీసుకుంటూ కనిపించిన టీఎంసీ ఎంపీలపై చర్యలు తీసుకోవాలని వామపక్షాలు లోక్‌సభలో డిమాండ్ చేశాయి. దర్యాప్తు పరిధిలోకి సీఎంను తేవాలనే డిమాండ్‌తో లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలు కోల్‌కతా భారీ ర్యాలీ నిర్వహించాయి. -
బీజేపీ సీనియర్ నేత ఇంటిపై బాంబు దాడి
కోల్‌కతా: ఓ బీజేపీ సీనియర్ నేత ఇంటిపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఇల్లు బీజేపీ నేత కృష్ణ భట్టాచార్యది చెబుతున్నారు. అయితే, ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. కోల్‌కతాలోని ఉత్తర్‌పురా ప్రాంతంలోగల భట్టాచార్య ఇంటిపై బాంబు దాడి జరిగిందని, అంతకుముందు జరిగిన పరిణామాల కారణంగానే టీఎంసీ నేతలు ప్రతిగా ఈ దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభిస్తున్నారు. ఓ చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించి మరో టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ్‌ని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ అరెస్టులను వ్యతిరేకిస్తూ టీఎంసీ విద్యార్థి విభాగం తొలుత ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. కోల్‌కతాలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై ఆ పార్టీ శ్రేణులు దాడి కూడా చేశాయి. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో వారిపై రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనతో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు చర్యను సీఎం మమతా బెనర్జీ కూడా ఖండించారు. పెద్దనోట్ల రద్దును తాను, తమ పార్టీ నేతలు బాహాటంగా వ్యతిరేకిస్తుండటంతోనే రాజకీయ కక్షతో తమ పార్టీ ఎంపీలను కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు అరెస్టు చేయిస్తున్నదని, దీనికి తాను బెదిరేది లేదని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ అన్నారు. మొన్నటి వరకు నోట్లను బంధించిన మోదీ ఇప్పుడు తమ పార్టీని బంధించాలని అనుకుంటున్నారని అది మాత్రం ఆయనకు సాధ్యం కాదని మండిపడ్డారు. -
'దమ్ముంటే సీబీఐ కేసు పెట్టుకోండి'
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి పరోక్షంగా బీజేపీపై, దాని విధానాలపై విరుచుకుపడ్డారు. గురువారం ఆమె పాల్గొన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు అంశాలపట్ల ఒంటికాలితో లేచారు. భారత్‌లో అసహన పరిస్థితులున్నాయంటూ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆమె సమర్థించారు. ఒక భారతీయుడిగా ఆయన ఎలా ఫీలయ్యారో అదే విషయాన్ని ఆమిర్ చెప్పారని అన్నారు. అసలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపొమ్మని చెప్పడానికి మీరెవరు అంటూ ఆయనను నిందించిన వారిని ప్రశ్నించారు. ఈ దేశం మనందరిదని, ఈ జన్మభూమి, ఈ కర్మభూమి అందరి సొత్తని గుర్తు చేశారు. ఈ దేశం విడిచి పాకిస్థాన్ వెళ్లిపొమ్మని చెప్పడానికి మీరెవరు? మేం ఏం తినాలో చెప్పడానికి మీరెవరు అంటూ ఆమె ఒంటికాలిపై లేచారు. రాజకీయాల్లో భయపడుతూ మాట్లాడటం తనకు అలవాటు లేదని, తనకు చావంటే అస్సలు భయం లేదన అన్నారు. మరణం ప్రతి ఒక్కరికీ ఏదో ఒకరోజు వస్తుందని అందుకే రాజకీయాల్లో అవినీతిని తానెప్పుడు తలెత్తి ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినప్పుడు తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని సీబీఐ కేసులు పెడతామని భయపెడుతుంటారని, ఒక వేళ కేసులు పెట్టుకుంటే పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు. తాను మాత్రం అస్సలు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. మరోపక్క, ఉగ్రవాదంపై కూడా ఆమె స్పందిస్తూ ఉగ్రవాదానికి కుల,మత, విశ్వాసాలు ఉండనే ఉండవని అన్నారు. నేరస్తులు నేరస్తులే, ఉగ్రవాదులు ఉగ్రవాదులేనని అన్నారు. -
తృణమూల్ ప్రభంజనం
కోల్‌కతా: మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో కామ్రేడ్ల కంచుకోటలను నేలమట్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి పూర్తిస్థాయిలో సత్తా చాటి రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో 34 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రస్తుత లోక్‌సభలో 19 సీట్లున్న తృణమూల్ వామపక్షాల ఖాతాలోని మొత్తం 15 సీట్లనూ కొల్లగొట్టి తన బలాన్ని 34కు చేర్చింది. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్ రాష్ట్రంలో ఈసారి గతంలో ఎన్నడూలేనంత ఘోరంగా దెబ్బతిని కాంగ్రెస్ ఖాతాలోని రెండే స్థానాల్లో(రాయ్‌గంజ్, ముర్షీదాబాద్) గెలిచింది. శారదా చిట్ స్కాంపై సాగిన వ్యతిరేక ప్రచారాన్ని తట్టుకుని ‘దీదీ’ పార్టీ 2011 అసెంబ్లీ ఎన్నిక ల నాటి తన చారిత్రక విజయాన్ని పునరావృతం చేసింది. తనకు పట్టున్న దక్షిణ బెంగాల్‌లోని 31 సీట్లలో 30 సీట్లను కొల్లగొట్టి, లెఫ్ట్ స్థావరమైన ఉత్తర బెంగాల్లోకి దూసుకుపోయి వామపక్షాలను దాదాపుగా తుడుచిపెట్టేసింది. కాగా, 2009లో ఆరు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఈసారి వాటిలో నాలుగింటిని కాపాడుకోగలింది. -
ఐ డోంట్ కేర్..!
న్యూఢిల్లీ: సహాయ పాత్రలతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన ఓ సమయంలో అగ్రహీరోలతో సమానమైన ప్రేక్షకాదరణను పొందారు. ఆశా పరేఖ్, మాలా సిన్హా, వహీదా రెహ్మాన్ వంటి అందాల తారల సరసన నటించి, బెంగాలీ అభిమానులకే కాకుండా బాలీవుడ్ అభిమానులనూ ఉర్రూతలూగించారు. లేటు వయసులో రాజకీయాల్లోకి ప్రవేశించి, దేశ రాజధానికి గుండెకాయగా చెప్పుకునే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తాను గెలుస్తానన్న ఆత్మవిశ్వాసం తనకుందని, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అంతకుమించి ప్రోత్సాహాన్ని తనకు అందిస్తోందన్నారు. ప్రత్యర్థుల పేర్లు, వారి చరిత్రలు చూసి భయపడి వెనకడుగు వేసే వ్యక్తిత్వం తనది కాదన్నారు. వారెవరనే విషయాన్ని తాను అసలు పట్టించుకోనని చెప్పారు. న్యూఢిల్లీ నియోజవర్గంలో తన విజయావకాశాల గురించి, తాను చేస్తున్న ప్రచారం గురించి ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ‘క్యారెక్టర్ ఆర్టిస్టుగా బెంగాలీ చిత్రంతో సినిమాల్లోకి ప్రవేశించాను. ఆ తర్వాత ఒక్కోమెట్టు ఎదుగుతూ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. అగ్రహీరోల సరసన స్థానం సంపాదించుకున్నాను. సినీ పరిశ్రమలో పెద్దపెద్దవాళ్లున్నారని ఎప్పుడూ బెదరలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాను. అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను. అప్పటి నుంచే ప్రత్యర్థుల గురించి ఆలోచించడం మానేశాను. లేటు వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టావని కొందరంటున్నారు... వయసు ప్రభావం రాజకీయాల్లో జయాపజయాలపై ఉండదనేది నా అభిప్రాయం. నిజానికి వయసు అనుభవాన్నిస్తుంది. ఆ అనుభవంతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. మిగతావారితో పోలిస్తే నేనే అత్యంత అనుభవమున్న వ్యక్తిని. ఇది నాకు అనుకూలాంశం. యువకులు ఆవేశపడతారు.. ఆందోళనకు దిగుతారు. కానీ వయసు మీదపడినవారు ఆలోచనతో ముందుకెళ్తారు. ప్రజలకు సేవ చేయడానికి అవసరమైనది కేవలం మంచి చేయాలన్న ఆలోచన మాత్రమే. అది నాకుంది. మూడో ఇన్నింగ్.. బెంగాలీ చిత్రసీమలోకి అడుగుపెట్టడం తొలి ఇన్నింగ్ అయితే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టడం రెండో ఇన్నింగ్. ఇక తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చి జీవితంలో మూడో ఇన్నింగ్‌ను ప్రారంభించాను. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన చాలా రోజుల నుంచే ఉంది. అయితే ఇదే సరైన సమయమనే అభిప్రాయంతో ఇప్పుడు అడుగుపెట్టాను. ఇక న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తాను. ఇక గెలుపోటములన్నవి ఇప్పుడే ఎవరూ నిర్ణయించలేని విషయం. ఎన్నికలు టీ20 మ్యాచ్‌లాంటిది. చివరి నిమిషం వరకు ఎవరు గెలుస్తారో? ఎవరు ఓడిపోతారో చెప్పడం కష్టం. నా గెలుపుకోసం నేను చేయాల్సిందంతా చేస్తున్నాను. పార్టీ నుంచి కూడా అవసరమైనంత సహకారం అందుతోంది. ఇక నా ప్రత్యర్థుల విషయానకి వస్తే ఎవరు బలవంతులు? ఎవరు బలహీనులు? అనే విషయాలపై నేను దృష్టిపెట్టలేదు. రాజకీయాల్లో బలవంతులు, బలహీనులు ఉండరనేది నా అభిప్రాయం. ‘మా, మతి, మానుష్’(కన్నతల్లి, కన్నభూమి, మానవత్వం) నినాదంతో ఎన్నికల్లోకి వెళ్తున్నాం. ఇదే నినాదంతో 2009 ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ భారీ విజయాలు నమోదు చేసింది. ఇప్పుడు కూడా ఆ మ్యాజిక్ జరగక మానద’న్నారు. బెంగాలీల జనాభా ఎక్కువే... ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని ఎంపిక చేసేముందు మరో ఆలోచన ఏదీ లేకుండా బిశ్వజీత్ పేరును ఎంపిక చేశారని మమతా బెనర్జీ చెప్పడం వెనుక అనేక వ్యూహాలు దాగి ఉన్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో బెంగాలీల జనాభా ఎక్కువగానే ఉంది. ఇక్కడి చిత్తరంజన్ పార్కు ప్రాంతాన్ని మినీ బెంగాల్‌గా పిలుస్తారు. దీంతోపాటు చటర్జీ అమ్ముల పొదిలో ‘బాలీవుడ్ హీరో ’ అనే మరో అస్త్రం ఉండనే ఉంది. దీంతోపాటు అన్నా హజారే వంటి ప్రముఖ సామాజిక కార్యకర్తలు దీదీ(మమతా బెనర్జీ)కి తమ మద్దతును ప్రకటించారు. ఇది కూడా న్యూఢిల్లీ నియోజకవర్గంలో చటర్జీకి కలిసిరావొచ్చంటున్నారు. -
ఏడు స్థానాలకు 206 నామినేషన్లు
న్యూఢిల్లీ: రాజధానిలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 10 జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 206 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. శనివారంతో నామినేషన్ల గడువు ముగిసే సరికి 206 మంది నామినేషన్లు స్వీకరించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కపిల్ సిబల్, హర్షవర్ధన్, రాజ్‌మోహన్ గాంధీ వంటి ప్రముఖులు బరిలో నిలిచిన ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అన్ని పార్టీల నుంచి నువ్వా-నేనా అనే స్థాయిలోనే అభ్యర్థులు బరిలోకి దిగారని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఏ నియోజకవర్గంలో కూడా ఏ పార్టీ గెలుపు ఖాయమని చేప్పేందుకు వీలులేకుండా అభ్యర్థుల జాబితా కనిపిస్తోందన్నారు. బీజేపీ నేతలు హర్షవర్ధన్, మీనాక్షి లేఖీ, కాంగ్రెస్ నేతలు అజయ్ మాకెన్, ఆప్ నేతలు అశుతోష్, రాజ్‌మోహన్ గాంధీ వంటి ప్రముఖుల గెలుపు కొంతవరకు ఖాయంగానే కనిపిస్తున్నా ఢిల్లీ ఓటరు ఎప్పుడూ ఊహించని రీతిలో తీర్పునిస్తున్నాడని చెబుతున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో 221 మంది నామినేషన్లు వేసినప్పటికీ ఉపసంహరణ తర్వాత 160 మంది మాత్రమే బరిలో నిలిచారని, ఈసారి కూడా ఉపసంహరణ తర్వాత అసలైన అభ్యర్థుల సంఖ్య ఖరారవుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ, మరో నటుడు విశ్వజీత్ చటర్జీ, సిట్టింగ్ ఎంపీ కృష్ణాతీరథ్, రమేశ్ కుమార్ వంటి ప్రముఖులు కూడా ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. ఇక తృణముల్ కాంగ్రెస్ కూడా ఢిల్లీలో సత్తాచాటాలని పరితపిస్తోంది. ఈ పార్టీ అభ్యర్థులు చివరిరోజైన శనివారం నామినేషన్లు వేశారు. ఈశాన్య ఢిల్లీ నుంచి బరిలోకి దిగుతున్న భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీకి సిట్టింగ్ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్, ఆప్ నేత ఆనంద్‌కుమార్‌ల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముందంటున్నారు. ఇక కేంద్ర మంత్రి కృష్ణాతీరథ్‌కు కూడా ఆప్ నేత రాఖీ బిర్లా, బీజేపీ నుంచి నామినేషన్ వేసిన ఉదిత్‌రాజ్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇక తృణముల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న విశ్వజీత్ చటర్జీకి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్, బీజేపీ నేత మీనాక్షి లేఖీ, ఆప్ నేత ఆశిష్ కేతన్ నుంచి పోటీ ఎదురుకానుంది. ఇలా ఏడు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల బలాబలాలు పోటాపోటీగా ఉన్నాయని చెబుతున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్నవారికి స్థానికంగా హర్షవర్ధన్‌కు ఉన్న మంచిపేరు, ప్రధాని అభ్యర్థిగా మోడీ చరిష్మా కలిసివచ్చే అంశంకాగా ఆమ్ ఆద్మీ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ ఉద్యమాలు, 49 రోజుల పాలనలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆప్ అభ్యర్థుల విజయానికి అనుకూలాంశాలుగా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం పార్టీ పేరుమీదే గెలుస్తామని చెబుతున్నారు. -
హస్తినలో మమత ఫ్లాప్ షో
రామ్‌లీలా సభకు హజారే గైర్హాజరు కనీసం వెయ్యి మంది కూడా లేక వెలవెల సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అండతో దేశరాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటాలనుకున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కలలు కలలుగానే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. హజారే ప్రధాన ఆకర్షణగా ఆమె బుధవారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో తలపెట్టిన బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. దీనికి తోడు హజారే కూడా గైర్హాజరవవడంతో ఆమె మాత్రమే సభలో ఏకైక వక్తగా మిగిలారు. సభ అట్టర్ ఫ్లాప్ కావడంతో మమత, హజా రే అనుచరులు ఒకరిపై మరొకరు నిందారోపణలకు దిగారు. జనం లేక ఆలస్యంగా సభ: రామ్‌లీలా మైదానంలో సభ నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. మైదానమంతటా కుర్చీలు వేయడంతోపాటు 50కి పైగా సీసీటీవీ కెమెరాలు అమర్చారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఈ సభతో ప్రారంభిస్తారని విసృ్తతంగా ప్రచారం జరిగింది. హజారే ఈ సభలో పాల్గొంటారని ప్రకటించడం ప్రధాన చర్చనీయాంశమైంది. మీడియా కూడా ఈ సభకు విశేష ప్రాధాన్యాన్ని ఇచ్చింది. కానీ మీడియా ఇచ్చిన ప్రాధాన్యాన్ని నగరవాసులు ఈ సభకు ఇవ్వలేదు. కనీసం వెయ్యిమంది కూడా రాలేదు. పది గంటలకు ప్రారంభం కావాల్సిన సభను జనం కోసం, అన్నా కోసం ఎదురు చూస్తూ వాయిదావేస్తూ పోయారు. సభలో హజారే ప్రసంగిస్తారని, సమయముంటే తాను ప్రసంగిస్తానని అంతకు ముందు ఫేస్బుక్లో తెలిపిన మమత.. సభకు వచ్చేసరికి జనం లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. అనారోగ్యం వల్ల హజారే సభకు హాజరుకాలేకపోయారనిఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
‘మహిళ’ పర్వం!
-
‘మహిళ’ పర్వం !
జాతీయ రాజకీయాల్లో కొత్త కూటమికి తెరలేస్తోందా? మమతతో జయ ఫోన్ సంభాషణ దాంతో జోరందుకున్న రాజకీయ ఊహాగానాలు నిర్ణాయక శక్తిగా జయ-మమత-మాయా త్రయం! కోల్‌కతా: భారత రాజకీయ యవనికపై స్త్రీ పర్వానికి తెర లేవనుందా? విప్లవ నాయకి జయలలిత, బెంగాలీ అగ్గిబరాటా మమతా బెనర్జీ, అణగారిన సామాజిక వర్గాల్లో తిరుగులేని మాయావతి అందుకు నేతృత్వం వహించనున్నారా? రానున్న లోక్‌సభ ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయాల్లో ఈ ముగ్గురు మహిళా నేతలు కీలక పాత్ర పోషించనున్నారా? కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణాయక శక్తిగా మారనున్నారా? ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఆ అవకాశాలను తోసిపుచ్చలేమని పరిశీలకులు భావిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం ఫోన్ చేసి సంభాషించడం రాజకీయ వర్గాల్లో పలు రకాల చర్చోపచర్చలకు తెర తీసింది. ఎన్నికల తర్వాత జయ ప్రధాని అయ్యే పక్షంలో ఆమెతో కలిసి పని చేయడానికి తనకెలాంటి అభ్యంతరమూ లేదని మమత గురువారం వ్యాఖ్యానించడం తెలిసిందే. ఆ మర్నాడే ఆమెకు అన్నాడీఎంకే అధినేత్రి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. వారు ఏం ఏం చర్చించిందీ తెలియరాకున్నా, రానున్న లోక్‌సభ ఎన్నికల ప్రస్తావన మాత్రం ప్రముఖంగా వచ్చిందని ఇద్దరు నేతల సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి. జయ, మమత మధ్య ఎన్నికలకు ముందు పొత్తు వంటిదేమీ ఉండకపోయినా, ఫలితాలు వెల్లడయ్యాక మాత్రం నంబర్ గేమ్‌లో భాగంగా అవసరమైతే వారిద్దరూ ఒక్కటయ్యే అవకాశాలు మెరుగైనట్టేనన్నది ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయ పండితుల అభిప్రాయం. మమతకు బద్ధ శత్రువులైన వామపక్షాలతో జయలలిత తాజాగా తమిళనాట తెగదెంపులు చేసుకోవడం అందుకు మార్గాన్ని మరింత సుగమం చేయగల పరిణామమంటున్నారు. జయతో పాటు బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతితో కలిసి పని చేసేందుకు సిద్ధమేనని మమత చేసిన వ్యాఖ్యల ప్రభావం కూడా జాతీయ రాజకీయాలపై బాగానే ఉండగలదని అంచనా వేస్తున్నారు. అన్నీ కలిసొస్తే ప్రధాని పీఠమెక్కాలని జయలలిత కొంతకాలంగా ఆశపడుతుండటం, తన ఆకాంక్షను ఇటీవల బాహాటంగానే బయట పెట్టుకుంటుండటం తెలిసిందే. ఆమె ఆకాంక్ష నెరవేరడంలోని సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే, జయ-మమత-మాయా త్రయం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణాయక శక్తిగా మారే అవకాశాలు మాత్రం నానాటికీ ప్రబలమవుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ చేతిలో ఎదురైన ఘోర పరాభవం నుంచి వామపక్షాలు ఇంకా తేరుకోనేలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకు గాను మెజారిటీ సీట్లలో తృణమూల్ హవాయే కొనసాగుతుందని సర్వేలన్నీ ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. తమిళనాడులోని 39 స్థానాల్లో జయ 20కి అటూ ఇటుగా చేజిక్కించుకునేలా కన్పిస్తున్నారు. యూపీలో కూడా సమాజ్‌వాదీ పాలన పట్ల ప్రజల్లో రాజుకుంటున్న అసంతృప్తి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి కలిసొస్తుందన్నది రాజకీయ పండితుల అంచనా. ఆ లెక్కన రాష్ట్రంలోని 80 స్థానాల్లో కనీసం 20కి పై చిలుకు బీఎస్పీ ఖాతాలో పడవచ్చంటున్నారు. ఈ అంచనాలన్నీ నిజమైతే సమష్టిగా 60 పై చిలుకు లోక్‌సభ స్థానాలతో ఈ ముగ్గురు నేతలు కింగ్మేకర్లుగా అవతరించే అవకాశాలు పుష్కలంగా ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీ బరిలో తృణమూల్ న్యూఢిల్లీ: గాంధేయవాది, సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే నుంచి లభించిన ప్రశంసలు, మద్దతు నేపథ్యంలో ఢిల్లీలో కూడా అదృష్టం పరీక్షించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయించారు. రానున్న ఎన్నికల్లో అక్కడి ఏడు లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేయనున్నారు. తృణమూల్ అభ్యర్థుల జాబితాను మార్చి 12న రాంలీలా మైదానంలో జన్‌తంత్ర ర్యాలీ సందర్భంగా అన్నాహజారేతో కలిసి ఆమె ప్రకటించనున్నారు. తృణమూల్ ఎంపీ సుకేందు శేఖర్ రాయ్ శుక్రవారం ఈ మేరకు తెలిపారు. 300 మంది ఆశావహుల నుంచి అన్నా, మమత సంయుక్తంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని కూడా ఆయన చెప్పారు. -
‘మహిళ’ పర్వం!
* జాతీయ రాజకీయాల్లో కొత్త కూటమికి తెరలేస్తోందా? * మమతతో జయ ఫోన్ సంభాషణ * దాంతో జోరందుకున్న రాజకీయ ఊహాగానాలు * నిర్ణాయక శక్తిగా జయ-మమత-మాయా త్రయం! కోల్‌కతా: భారత రాజకీయ యవనికపై స్త్రీ పర్వానికి తెర లేవనుందా? విప్లవ నాయకి జయలలిత, బెంగాలీ అగ్గిబరాటా మమతా బెనర్జీ, అణగారిన సామాజిక వర్గాల్లో తిరుగులేని మాయావతి అందుకు నేతృత్వం వహించనున్నారా? రానున్న లోక్‌సభ ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయాల్లో ఈ ముగ్గురు మహిళా నేతలు కీలక పాత్ర పోషించనున్నారా? కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణాయక శక్తిగా మారనున్నారా? ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఆ అవకాశాలను తోసిపుచ్చలేమని పరిశీలకులు భావిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం ఫోన్ చేసి సంభాషించడం రాజకీయ వర్గాల్లో పలు రకాల చర్చోపచర్చలకు తెర తీసింది. ఎన్నికల తర్వాత జయ ప్రధాని అయ్యే పక్షంలో ఆమెతో కలిసి పని చేయడానికి తనకెలాంటి అభ్యంతరమూ లేదని మమత గురువారం వ్యాఖ్యానించడం తెలిసిందే. ఆ మర్నాడే ఆమెకు అన్నాడీఎంకే అధినేత్రి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. వారు ఏం ఏం చర్చించిందీ తెలియరాకున్నా, రానున్న లోక్‌సభ ఎన్నికల ప్రస్తావన మాత్రం ప్రముఖంగా వచ్చిందని ఇద్దరు నేతల సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి. జయ, మమత మధ్య ఎన్నికలకు ముందు పొత్తు వంటిదేమీ ఉండకపోయినా, ఫలితాలు వెల్లడయ్యాక మాత్రం నంబర్ గేమ్‌లో భాగంగా అవసరమైతే వారిద్దరూ ఒక్కటయ్యే అవకాశాలు మెరుగైనట్టేనన్నది ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయ పండితుల అభిప్రాయం. మమతకు బద్ధ శత్రువులైన వామపక్షాలతో జయలలిత తాజాగా తమిళనాట తెగదెంపులు చేసుకోవడం అందుకు మార్గాన్ని మరింత సుగమం చేయగల పరిణామమంటున్నారు. జయతో పాటు బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతితో కలిసి పని చేసేందుకు సిద్ధమేనని మమత చేసిన వ్యాఖ్యల ప్రభావం కూడా జాతీయ రాజకీయాలపై బాగానే ఉండగలదని అంచనా వేస్తున్నారు. అన్నీ కలిసొస్తే ప్రధాని పీఠమెక్కాలని జయలలిత కొంతకాలంగా ఆశపడుతుండటం, తన ఆకాంక్షను ఇటీవల బాహాటంగానే బయట పెట్టుకుంటుండటం తెలిసిందే. ఆమె ఆకాంక్ష నెరవేరడంలోని సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే, జయ-మమత-మాయా త్రయం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణాయక శక్తిగా మారే అవకాశాలు మాత్రం నానాటికీ ప్రబలమవుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ చేతిలో ఎదురైన ఘోర పరాభవం నుంచి వామపక్షాలు ఇంకా తేరుకోనేలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకు గాను మెజారిటీ సీట్లలో తృణమూల్ హవాయే కొనసాగుతుందని సర్వేలన్నీ ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. తమిళనాడులోని 39 స్థానాల్లో జయ 20కి అటూ ఇటుగా చేజిక్కించుకునేలా కన్పిస్తున్నారు. యూపీలో కూడా సమాజ్‌వాదీ పాలన పట్ల ప్రజల్లో రాజుకుంటున్న అసంతృప్తి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి కలిసొస్తుందన్నది రాజకీయ పండితుల అంచనా. ఆ లెక్కన రాష్ట్రంలోని 80 స్థానాల్లో కనీసం 20కి పై చిలుకు బీఎస్పీ ఖాతాలో పడవచ్చంటున్నారు. ఈ అంచనాలన్నీ నిజమైతే సమష్టిగా 60 పై చిలుకు లోక్‌సభ స్థానాలతో ఈ ముగ్గురు నేతలు కింగ్మేకర్లుగా అవతరించే అవకాశాలు పుష్కలంగా ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీ బరిలో తృణమూల్ న్యూఢిల్లీ: గాంధేయవాది, సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే నుంచి లభించిన ప్రశంసలు, మద్దతు నేపథ్యంలో ఢిల్లీలో కూడా అదృష్టం పరీక్షించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయించారు. రానున్న ఎన్నికల్లో అక్కడి ఏడు లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేయనున్నారు. తృణమూల్ అభ్యర్థుల జాబితాను మార్చి 12న రాంలీలా మైదానంలో జన్‌తంత్ర ర్యాలీ సందర్భంగా అన్నాహజారేతో కలిసి ఆమె ప్రకటించనున్నారు. తృణమూల్ ఎంపీ సుకేందు శేఖర్ రాయ్ శుక్రవారం ఈ మేరకు తెలిపారు. 300 మంది ఆశావహుల నుంచి అన్నా, మమత సంయుక్తంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని కూడా ఆయన చెప్పారు. -
రాజ్యసభకు రాకుండా చూడండి
టీ బిల్లుపై రాష్ట్రపతికి తృణమూల్ కాంగ్రెస్ వినతి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ఆమోదించిన తీరును ఎండగడుతూ తృణమూల్ కాంగ్రెస్ బుధవారర రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదుచేసింది. పార్లమెంట్ నిబంధనలు, ప్రక్రియలను పూర్తిగా ఉల్లంఘించి బిల్లును ఆమోదించారని పేర్కొంది. ఈ దృష్ట్యా రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టకుండా చూడాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం తృణమూల్ ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, ముకుల్‌రాయ్‌లతో పాటు మొత్తం 16 మంది ఎంపీలు రాష్ట్రపతిని కలిశారు. ‘మొదటగా ఈ నెల 13న లోక్‌సభ బిజినెస్, సప్లిమెంటరీ బిజినెస్ లిస్ట్‌లో పెట్టకుండానే మా నిరసనల మధ్యే హోం మంత్రి బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం ఇంత ప్రాధాన్యం ఉన్న బిల్లుపై పూర్తిస్థాయి చర్చ జరగనేలేదు. మా పార్టీ ఎంపీ సౌగతారాయ్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కొన్ని సవరణలు సూచించారు. అన్ని సవరణలపై డివిజన్ చేయమని కోరాం. కానీ స్పీకర్ దీన్ని తిరస్కరించారు. బిల్లు ఆమోదం సమయంలో డివిజన్‌కు అనుమతించకుండా మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు’ అని ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. మనోభావాలను పట్టించుకోలేదు: మమత లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. మమత బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని భూస్వామ్య పెత్తందారీ విధానంలో పాలిస్తోందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె దుయ్యబట్టారు. -
టీ-బిల్లును వ్యతిరేకిస్తాం: తృణమూల్ కాంగ్రెస్
కోల్‌కతా: తెలంగాణ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకిస్తామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాము దేశ సమగ్రత కోరుకుంటున్నామని, ఆంధ్రప్రదేశ్‌ను విభజించే చేసే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో అడ్డుకుంటామని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రిన్ తెలిపారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు కోల్‌కతా వచ్చే అవకాశముందని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో విభజన బిల్లుపై ఆయన చర్చలు జరపనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిరోజుల క్రితం మమతా బెనర్జీని కలిశారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలిపాలని ఆమెను కోరారు. -
నేను రాజీనామ చేయను: జస్టిస్ గంగూలీ
కోల్‌కతా: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమబెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ గంగూలీ తన పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. తనను లైంగికంగా వేధించారంటూ జస్టిస్ గంగూలీపై న్యాయ విద్యార్థిని చేసిన ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు ప్యానెల్ ఇప్పటికే ఆయన ప్రవర్తనను తప్పుబట్టిన విషయం తెలిసిందే. తానేం చేయాలనుకుంటే అది చేస్తానంటూ విలేకరులపై గంగూలీ చిర్రుబుర్రులాడారు. ఇక మంగళవారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ ట్విట్టర్లో జస్టిస్ గంగూలీకి ఒక అభ్యర్థన చేశారు. ‘సర్ మీ కార్యాలయాన్ని పరిహాసం పాలు చేయకండి. సీఎం మమతా బెనర్జీ సహా ఎంతో మంది మీపై చర్యల కోసం డిమాండ్ చేస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు. -
'మీ స్థానాన్ని అవమానించకండి'
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల సంఘం అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ గంగూలీని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. నేడు ప్రపంచ మానవ హక్కుల దినంగా సందర్భంగా ఈ డిమాండ్ చేసింది. 'ఐక్యరాజ్యసమితి ఈ రోజు మానవ హక్కుల దినం పాటిస్తోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ గంగూలీ ఇంకా బెంగాల్ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సర్, దయచేసి మీ స్థానాన్ని అవమానించకండి' అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రిన్ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినాన్ని పాటిస్తే గంగూలీ పదవి నుంచి వైదొలగుతారని, తన కార్యాలయానికి అపప్రద రాకుండా చూసుకుంటారని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా అయిన ఓబ్రిన్ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తుతానని చెప్పారు.