బెంగాల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
ఏడుగురు సిట్టింగులు ఔట్
మహువాకు మళ్లీ చాన్స్
మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, సినీ నటి రచనా బెనర్జీకి అవకాశం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం తమ అభ్యర్థులను ప్రకటించింది. తద్వారా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు తేల్చేసింది. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని ప్రచారం జరిగినా అది ఉత్తదేనని స్పష్టమైంది. ఈసారి ఏడుగురు సిట్టింగ్ ఎంపీలను తృణమూల్ పక్కనపెట్టింది. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌తోపాటు తెలుగు సహా పలు భాషల చిత్రాల్లో నటించిన రచనా బెనర్జీ వంటి కొత్తముఖాలకు అవకాశం కలి్పంచింది.
2022 ఉప ఎన్నికలో అసన్‌సోల్ నుంచి గెలిచిన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాకు మరోసారి టికెటిచ్చారు. బసీర్హాత్‌లో సినీ నటి, సిట్టింగ్ ఎంపీ నుస్రత్ జహాన్‌ను తప్పించి మాజీ ఎంపీ హజీ నూరుల్ ఇస్లాంను బరిలో దించారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సందేశ్‌ఖాలీ ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. 23 మంది సిట్టింగుల్లో 16 మందికి టికెట్లు దక్కాయి. ఇద్దరు రాష్ట్ర మంత్రులు సహా 9 మంది ఎమ్మెల్యేలు లోక్‌సభ బరిలో దిగబోతున్నారు.
గతేడాది లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన వివాదాస్పద ఎంపీ మహువా మొయిత్రాకు టికెట్ లభించింది. కృష్ణనగర్ నుంచే ఆమె మళ్లీ బరిలో దిగుతున్నారు. ఇక బహ్రాంంపూర్ నుంచి ఐదుసార్లు నెగ్గిన కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిపై యూసుఫ్ పఠాన్ బరిలో దిగుతున్నారు.
మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ బర్దమాన్–దుర్గాపూర్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. టికెట్లు రాని నేతలకు అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం కలి్పస్తామని తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. ఆమె ఆదివారం కోల్‌కతాలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని, బీజేపీతోపాటు కాంగ్రెస్, సీపీఎం కూడా ప్రత్యర్థులేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు రెండు సీట్లే ఇస్తామని మమత గతంలో ఆఫర్ చేయడం, దానిపై ఆ పార్టీ స్పందించకపోవడం తెలిసిందే.
మోదీకి భయపడే: కాంగ్రెస్
బెంగాల్లో ఏకపక్షంగా మొత్తం లోక్‌సభ స్థానాలకూ తృణమూల్ అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్ మండిపడింది. ఇది ఏకపక్ష పోకడ అంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. మమత బీజేపీకి సరెండరయ్యారని కాంగ్రెస్ ఎంపీ అ«దీర్ రంజన్ చౌధరి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ మళ్లీ ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తారోనని భయపడే విపక్ష ఇండియా కూటమికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారన్నారు. మరోవైపు, తృణమూల్ జాబితా తమ పార్టీ మాజీలతో, బెంగాలేతరులతో నిండిపోయిందంటూ బీజేపీ ఎద్దేవా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment