Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్‌! | Lok Sabha elections 2024: West Bengal Lok Sabha election phase 5 | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్‌!

Published Sun, May 19 2024 1:11 AM | Last Updated on Sun, May 19 2024 1:11 AM

Lok Sabha elections 2024: West Bengal Lok Sabha election phase 5

బెంగాల్లో్ల హోరాహోరీ 

7 స్థానాలకు 20న పోలింగ్‌ 

మైనారిటీలు, సీఏఏ ప్రధానాంశాలు

సార్వత్రిక సంగ్రామంలో పశి్చమ బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలకు గాను ఇప్పటిదాకా 4 విడతల్లో 18 చోట్ల పోలింగ్‌ ముగిసింది. 20వ తేదీన ఐదో విడతలో 7 నియోజకవర్గాల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవన్నీ రాష్ట్రంలోని కీలకమైన పారిశ్రామిక బెల్టులోనే ఉన్నాయి. 

భారీగా పట్టణ ఓటర్లున్న సీట్లివి. ఇటీవలే అమల్లోకి వచి్చన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), మైనారిటీలు ఈ సీట్లలో బాగా ప్రభావం చూపే అవకాశముంది. ఐదో విడతలో  తలపడుతున్న 88 మంది అభ్యర్థుల్లో 21 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు కీలక నియోజకవర్గాలపై ఫోకస్‌... 

హౌరా... వలస ఓట్లు కీలకం 
సుప్రసిద్ధ హౌరా బ్రిడ్జ్, హౌరా రైల్వే స్టేషన్, బొటానిక్‌ గార్డెన్‌లకు నెలవైన ఈ నియోజకవర్గం కమ్యూనిస్టుల కంచుకోట. తృణమూల్‌ ఇక్కడ పాగా వేసినప్పటికీ బీజేపీ కూడా భారీగా పుంజుకుంటోంది. తృణమూల్‌ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన ప్రముఖ ఫుట్‌బాలర్‌ ప్రసూన్‌ బెనర్జీ ఈసారి హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. గత ఎన్నికల్లో కాషాయ పార్టీ గట్టి పోటీ ఇచి్చంది. బీజేపీ అభ్యర్థి రంతిదేవ్‌ సేన్‌గుప్తా కేవలం 6,447 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 

కిక్కిరిసిన జనాభా, ఐరన్‌ ఫౌండ్రీల్లో పనిచేసే కారి్మకులతో కళకళలాడే ఈ ప్రాంతంలో కొన్నాళ్లుగా పరిశ్రమలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 93 శాతం పట్టణ జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో పావు వంతు బెంగాలీయేతరులే! వీరంతా బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌ నుంచి వచ్చి స్థిరపడ్డారు. బీజేపీ నుంచి రతిన్‌ చక్రవర్తి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ దన్నుతో సీపీఎం సవ్యసాచి చటర్జీని రంగంలోకి దించింది. అత్యధికంగా 19 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉండటం విశేషం.

ఆరాంబాగ్‌... హోరాహోరీ 
తృణమూల్‌ పాగా వేసిన మరో కమ్యూనిస్ట్‌ అడ్డా ఇది. ఈ ఎస్సీ నియోజకవర్గంలో 2014లో తొలిసారి తృణమూల్‌ నుంచి అపురూపా పొద్దార్‌ (అఫ్రీన్‌ అలీ) 3.5 లక్షల బంపర్‌ మెజారిటీతో విజయం సాధించారు. 2019లో మాత్రం సీపీఎం అభ్యర్థి శక్తి మోహన్‌ మాలిక్‌పై ఆమె కేవలం 1,142 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తపన్‌ కుమార్‌ రాయ్‌ గెలుపు వాకిట బోల్తా పడ్డా తృణమూల్‌తో పాటు సీపీఎం ఓట్లకు భారీగా గండికొట్టారు. 

అపురూపపై అవినీతి ఆరోపణలతో పాటు ముస్లింను పెళ్లి చేసుకుని ఆఫ్రిన్‌ అలీగా పేరు మార్చుకోవడంపై దుమారం చెలరేగడంతో తృణమూల్‌ ఈసారి మిథాలీ బాగ్‌ను రంగంలోకి దించింది. బీజేపీ కూడా కొత్త అభ్యర్థి అరూప్‌ కాంతి దిగర్‌ను పోటీలో నిలబెట్టింది. కాంగ్రెస్‌ దన్నుతో సీపీఎం బిప్లవ్‌ కుమార్‌ మొయిత్రాకు సీటిచి్చంది. మూడు పారీ్టలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు బీజేపీ, మూడు తృణమూల్‌ గుప్పిట్లో ఉన్నాయి.  

హుగ్లీ... సినీ గ్లామర్‌! 
ఒకప్పుడు కమ్యూనిస్టు దుర్గం. తర్వాత తృణమూల్‌ చేజిక్కించుకుంది. గత ఎన్నికల్లో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. ఇప్పుడిక్కడ ఇద్దరు సినీ నటుల మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. 2019లో ప్రముఖ బెంగాలీ సినీ నటి లాకెట్‌ ఛటర్జీ బీజేపీ నుంచి 73 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి తృణమూల్‌ కూడా సినీ నటి రచనా బెనర్జీని తొలిసారి లోక్‌సభ బరిలో దించింది. కాంగ్రెస్‌ సపోర్టుతో సీపీఎం నుంచి మనోదీప్‌ ఘోష్‌ రేసులో ఉన్నారు. యూరప్‌ వలసపాలనకు ఈ నియోజకవర్గం అద్దం పడుతుంది. 

ఈ లోక్‌సభ స్థానం పరిధిలో పోర్చుగీసు, ఫ్రెంచ్, డాని‹Ù, డచ్‌ కాలనీలుండటం విశేషం. గతంలో టాటా మోటార్స్‌ నానో కార్ల ప్లాంట్‌ను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించి వెళ్లగొట్టిన సింగూర్‌ కూడా ఈ ఎంపీ స్థానం పరిధిలోనే ఉంది. ఈ వివాదం తర్వాతే కమ్యూనిస్టులను ఇక్కడ దీదీ మట్టికరిపించారు కూడా. బెంగాల్‌లో పారిశ్రామికంగా, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన జిల్లా కావడంతో ఇక్కడ పట్టణ ఓటర్లు ఎక్కువ. దీని పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లూ తృణమూల్‌ ఖాతాలోనే ఉన్నాయి. త్రిముఖ పోరులో ఈసారి బీజేపీకి ఎదురీత తప్పదంటున్నారు.

ఉలుబేరియా... మైనారిటీల అడ్డా 
బ్రిటిష్‌ జమానా నుంచీ జనపనార పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గం హౌరా జిల్లాలో ఉంది. అయితే, ఈ పరిశ్రమలు నెమ్మదిగా మూతబడుతూ వస్తున్నాయి. ఇప్పుడిక్కడ ఒక్క భారీ జూట్‌ మిల్లు కూడా లేదు. నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలో ఇంజనీరింగ్, తయారీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉపాధి కల్పిస్తున్నాయి. ఇక్కడ హిందూ, ముస్లింలు సమానంగా ఉంటారు. 1980ల నుంచీ ముస్లిం అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు! సీపీఎం తరఫున హన్నన్‌ మోలాహ్‌ ఏకంగా వరుసగా ఎనిమిదిసార్లు నెగ్గారు. 

2004 నుంచి ఈ స్థానం తృణమూల్‌ గుప్పిట్లో ఉంది. ఆ పార్టీ నుంచి రెండుసార్లు సుల్తాన్‌ అహ్మద్‌ గెలుపొందారు. ఆయన మరణానంతరం భార్య సజ్దా అహ్మద్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఆమె బీజేపీ అభ్యర్థి జాయ్‌ బెనర్జీపై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి కూడా సజ్దాయే తృణమూల్‌ తరఫున బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి అరుణ్‌ ఉదయ్‌ పాల్‌ చౌదరి పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్టుల మద్దతుతో కాంగ్రెస్‌ అజర్‌ మాలిక్‌ను పోటీకి దించింది. హుగ్లీ జిల్లాలోని ప్రముఖ ముస్లిం మత గురువు అబ్బాస్‌ సిద్ధిఖీ తన ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌) పార్టీ తరఫున స్వయంగా పోటీ చేస్తుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది.

బారక్‌పూర్‌... పోటాపోటీ 
ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట. 2014లో తృణమూల్‌ కాంగ్రెస్‌ దీన్ని బద్దలుకొట్టగా... కమలనాథులు గత ఎన్నికల్లో దీదీకి షాకిచ్చారు. రెండుసార్లు తృణమూల్‌ నుంచి గెలిచిన సీనియర్‌ నేత దినేశ్‌ త్రివేదిపై 2019లో బీజేపీ నేత అర్జున్‌ సింగ్‌ 14,857 స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. గతంలో సింగ్‌ తృణమూల్‌ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. 2019 ముందు బీజేపీలోకి జంప్‌ చేసి అనూహ్యంగా విజయం సాధించిన అర్జున్‌ సింగ్‌ 2022లో తిరిగి తృణమూల్‌ గూటికి చేరారు. ఎంపీ టికెట్‌ దక్కకపోవడంతో ఇటీవలే మళ్లీ కాషాయ తీర్థం పుచ్చుకొని టికెట్‌ దక్కించుకున్నారు. 

అర్జున్‌ సింగ్‌ చేతిలో ఓటమి పాలైన దినేశ్‌ త్రివేది కూడా తృణమూల్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడం విశేషం. అర్జున్‌ సింగ్‌పై ఏకంగా 93 కేసులుండటం గమనార్హం! తృణమూల్‌ నుంచి ఈసారి పార్థా భౌమిక్‌ రేసులో ఉన్నారు. కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఎం దేబదత్‌ ఘోష్‌ను బరిలో దింపింది. పోటీ ప్రధానంగా బీజేపీ, తృణమూల్‌ మధ్యే ఉంది. కమ్యూనిస్టులకు గట్టి ఓటు బ్యాంకున్న నేపథ్యంలో సీపీఎం ఓట్లు ఎవరి విజయావకాశాలకు గండి కొడతాయనేది ఆసక్తికరం. ఉత్తర 24 పరగణాల జిల్లాలోనే ఉన్న ఈ నియోజకవర్గం గతంలో పారిశ్రామికంగా బాగా పురోగతిలో ఉండేది. జూట్, జౌళి మిల్లులు, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు ఎక్కువ. ఇప్పుడవన్నీ మూతబడటంతో ఉపాధి కోసం ప్రజలు వలస బాట పట్టారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement