జగదానందపూర్‌లో బియ్యం స్వీకరిస్తున్న నడ్డా
బర్ధమాన్: పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) తీరుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా నిప్పులు చెరిగారు. తన పేరును హేళన చేయడం, తన కాన్వాయ్‌పై దాడి చేయడం.. ఇదేనా పశ్చిమ బెంగాల్ సంస్కృతి అని నిలదీశారు. చడ్డా, నడ్డా, ఫడ్డా, భడ్డా అంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యంగా మాట్లాడిన వీడియో ఒకటి ఇటీవల బహిర్గతమైంది. జె.పి.నడ్డా శనివారం పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
రాష్ట్రంలోకి బయటి వ్యక్తులు వస్తున్నారంటూ టీఎంసీ నాయకులు విమర్శలు చేస్తున్నారని, మరి వారి అరాచకాలు, అవినీతి, దోపిడీ మాటేమిటని ప్రశ్నించారు. టీఎంసీ నేతలు బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బొగ్గు, పశువులు, ఇసుక అక్రమ రవాణాతోపాటు కట్ మనీ వసూలు చేయడంలో అధికార పార్టీ నేతలు ఆరితేరారని, ఇదేనా బెంగాల్ సంస్కృతి అని నడ్డా మండిపడ్డారు. బెంగాల్ సంస్కృతి గురించి మాట్లాడే హక్కును టీఎంసీ కోల్పోయిందని తేల్చి చెప్పారు.
మమతా ఇక ఇంటికే..
రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, శ్రీ అరబిందో వారసత్వాన్ని బీజేపీ మాత్రమే ముందుకు తీసుకెళ్లగలదని జె.పి.నడ్డా ఉద్ఘాటించారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను బీజేపీ అనుసరిస్తోందని గుర్తుచేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని బెంగాల్ ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని జోస్యం చెప్పారు. బర్ధమాన్‌లోని సర్వమంగళ ఆలయంలో నడ్డా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అరాచకానికి, అవినీతికి, వేధింపులకు మారుపేరు తప్ప బెంగాల్ సంస్కృతికి ప్రతినిధి కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతిని వ్యవస్థీకృతంగా మార్చారని విమర్శించారు.
పిడికెడు బియ్యం ఇవ్వండి
రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని నడ్డా గుర్తుచేశారు. ఆయన శనివారం బెంగాల్‌లో కృషక్ సురక్ష యోజన, ఏక్ ముట్టీ చావల్(పిడికెడు బియ్యం) కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బీజేపీ నేతలు బెంగాల్‌లో రైతుల ఇళ్లకు వెళ్లి పిడికెడు బియ్యం సేకరించనున్నారు. ఈ బియ్యం వండి, పేదలకు అన్నదానం చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment