న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరకాటంలో పడేసిన ఎంపీపై బీజేపీ చర్యలు తీసుకుంది. జాతీయ కార్యదర్శి పదవి నుంచి అనుపమ్ హజ్రాను తప్పిస్తున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించింది. పార్టీ పేరు, ప్రతిష్టలను దెబ్బ తీసే యత్నం చేయడమే ఇందుకు కారణంగా వెల్లడించింది.
అనుపమ్ హజ్రా 2014 ఎన్నికల్లో బోల్పూర్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ టికెట్ తరఫున నెగ్గారు. కానీ, ఆ తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు. బెంగాల్‌లో ఎస్సీ సామాజిక వర్గ ఓట్లను ఆకర్షించడంలో బీజేపీకి అనుపమ్ ముఖచిత్రంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 2020లో బీజేపీ ఆయనకు జాతీయ కార్యదర్శి పోస్ట్ కట్టబెట్టి జాతీయ నాయకత్వంలోకి తీసుకుంది. అయితే..
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనుపమ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. అవినీతి నేతలు ఎవరున్నా సరే.. బీజేపీలో చేరేందుకు తనను సంప్రదించాలంటూ బహిరంగ ప్రకటన చేశారు. ‘‘బీజేపీలో చేరాలని అనుకుంటున్నారా?. ఈడీ, సీబీఐ నోటీసులు అందుతాయని.. దాడులు జరుగుతాయని భయంగా ఉందా?.. మీకు ఎంతటి అవినీతి చరిత్ర ఉన్నా సరే.. ఫేస్‌బుక్ ద్వారా నన్ను సంప్రదించొచ్చు. మొహమాటంగా అనిపిస్తే.. నేరుగా నన్ను వచ్చి కలిసి మాట్లాడొచ్చు. బీజేపీ మీ సేవల్ని ఎలా వినియోగించుకోవాలో అనే ఆలోచన తప్పకుండా చేస్తుంది’’ అంటూ ఆయన మాట్లాడిన మాటల వీడియో వైరల్ అయ్యింది.
ఇక ప్రతిపక్షలు ఈ వీడియో ఆధారంగా చెలరేగిపోయాయి. బీజేపీ అవినీతిపరులకు అడ్డాగా మారుతుందా? అంటూ మండిపడ్డాయి. అనుపమ్ ‘‘వాషింగ్ మెషిన్’’ వ్యాఖ్యలపై బీజేపీ ఇంతకాలం సైలెంట్‌గా ఉంది. అయితే టీఎంసీ ఈ ఆరోపణలపై ఇంకా విమర్శలు చేస్తుండడంతో ఇప్పుడు చర్యలు తీసుకుంది. పార్టీ గీత దాటినందుకే ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పేరు మీద ప్రకటన విడుదలైంది. పార్టీ అగ్రనేత, చీఫ్ స్ట్రాటజిస్ట్ అమిత్ షా కోల్‌కతా పర్యటన సమయంలోనే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment