
హస్తినలో మమత ఫ్లాప్ షో
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అండతో దేశరాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటాలనుకున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కలలు కలలుగానే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది.
రామ్‌లీలా సభకు హజారే గైర్హాజరు
కనీసం వెయ్యి మంది కూడా లేక వెలవెల
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అండతో దేశరాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటాలనుకున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కలలు కలలుగానే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. హజారే ప్రధాన ఆకర్షణగా ఆమె బుధవారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో తలపెట్టిన బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. దీనికి తోడు హజారే కూడా గైర్హాజరవవడంతో ఆమె మాత్రమే సభలో ఏకైక వక్తగా మిగిలారు. సభ అట్టర్ ఫ్లాప్ కావడంతో మమత, హజా రే అనుచరులు ఒకరిపై మరొకరు నిందారోపణలకు దిగారు.
జనం లేక ఆలస్యంగా సభ: రామ్‌లీలా మైదానంలో సభ నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. మైదానమంతటా కుర్చీలు వేయడంతోపాటు 50కి పైగా సీసీటీవీ కెమెరాలు అమర్చారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఈ సభతో ప్రారంభిస్తారని విసృ్తతంగా ప్రచారం జరిగింది. హజారే ఈ సభలో పాల్గొంటారని ప్రకటించడం ప్రధాన చర్చనీయాంశమైంది. మీడియా కూడా ఈ సభకు విశేష ప్రాధాన్యాన్ని ఇచ్చింది. కానీ మీడియా ఇచ్చిన ప్రాధాన్యాన్ని నగరవాసులు ఈ సభకు ఇవ్వలేదు. కనీసం వెయ్యిమంది కూడా రాలేదు. పది గంటలకు ప్రారంభం కావాల్సిన సభను జనం కోసం, అన్నా కోసం ఎదురు చూస్తూ వాయిదావేస్తూ పోయారు. సభలో హజారే ప్రసంగిస్తారని, సమయముంటే తాను ప్రసంగిస్తానని అంతకు ముందు ఫేస్‌బుక్‌లో తెలిపిన మమత.. సభకు వచ్చేసరికి జనం లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. అనారోగ్యం వల్ల హజారే సభకు హాజరుకాలేకపోయారనిఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.