కోల్‌కతా: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమబెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ గంగూలీ తన పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. తనను లైంగికంగా వేధించారంటూ జస్టిస్ గంగూలీపై న్యాయ విద్యార్థిని చేసిన ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు ప్యానెల్ ఇప్పటికే ఆయన ప్రవర్తనను తప్పుబట్టిన విషయం తెలిసిందే. తానేం చేయాలనుకుంటే అది చేస్తానంటూ విలేకరులపై గంగూలీ చిర్రుబుర్రులాడారు. ఇక మంగళవారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ ట్విట్టర్లో జస్టిస్ గంగూలీకి ఒక అభ్యర్థన చేశారు.
‘సర్ మీ కార్యాలయాన్ని పరిహాసం పాలు చేయకండి. సీఎం మమతా బెనర్జీ సహా ఎంతో మంది మీపై చర్యల కోసం డిమాండ్ చేస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు.