justice Ganguly
-
రాజీనామా యోచనలో గంగూలీ
ఢిల్లీ/కోల్‌కతా: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే గంగూలీ.. పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ (డబ్ల్యూబీహెచ్ఆర్సీ) చైర్మన్ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. గంగూలీ ఈ విషయాన్ని తనకు ఫోన్లో చెప్పినట్టు మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ తెలిపారు. గంగూలీ తనను లైంగికంగా వేధించారంటూ న్యాయ విద్యార్థి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై గంగూలీ తనకు వివరించారని సోరాబ్జీ తెలిపారు. డబ్ల్యూబీహెచ్ఆర్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలనుకోవడం వివేకమైన నిర్ణయమని గంగూలీకి చెప్పానని సోరాబ్జీ పేర్కొన్నారు. -
రాజీనామాపైనిర్ణయం తీసుకోలేదు: జస్టిస్ గంగూలీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసే విషయంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ కుమార్ గంగూలీ గురువారం తేల్చిచెప్పారు. ఆరోపణల నేపథ్యంలో హక్కుల కమిషన్ చైర్మన్ పదవికి గంగూలీ రాజీనామా చేయాలని సర్వత్రా ఆందోళనలు పెల్లుబికిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసుపై కేంద్ర కేబినెట్ దష్టి సారిస్తుందని, రాష్ట్రపతి నివేదికను సుప్రీం కోర్టుకు పంపి సదరు ఆరోపణలపై విచారణ కోరే అంశాన్ని చర్చిస్తామని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే బుధవారం ప్రకటించిన నేపథ్యంలో తదుపరి ఏవిధంగా వ్యవహరిస్తారన్న ఓ వార్తా సంస్థ ప్రశ్నకు జస్టిస్ గంగూలీ స్పందించారు. ‘ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయను. చైర్మన్ పదవికి రాజీనామా చేసే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు’ అని బదులిచ్చారు. -
సుప్రీంకోర్టు సరిగా వ్యవహరించలేదు: జస్టిస్ గంగూలీ
కోల్‌కతా: జడ్జీగా తాను ఇచ్చిన కొన్ని తీర్పులను గిట్టని శక్తిమంతులు తన ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఏకే గంగూలీ ఆరోపించారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణ విషయంలో సుప్రీంకోర్టు తన పట్ల సరిగా వ్యవహరించలేదని ఆక్షేపించారు.ఈ మేరకు ఆయన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివంకు ఫిర్యాదు చేస్తూ ఎనిమిది పేజీల లేఖ రాశారు. లేఖ ప్రతిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపుతున్నట్లు తెలిపారు.తన వద్ద పనిచేసే న్యాయ విద్యార్థినిపై గత ఏడాది డిసెంబర్ లోని ఓ హోటల్లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమీషన్ చైర్మన్ పదవి కూడా రాజీనామా చేయాలని ఆయనపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తన వాదన వినిపిస్తూ 36 అంశాలతో కూడిన లేఖను సీజేఐకి రాశారు. -
ప్రేమిస్తున్నానంటూ ముద్దుపెట్టుకున్నారు..
జస్టిస్ గంగూలీపై న్యాయ విద్యార్థిని ఆరోపణ ఆమె అఫిడవిట్ వివరాలను బయటపెట్టిన అదనపు సొలిసిటర్ ఇందిరా జైసింగ్ న్యాయ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ జడ్జి ఏకే గంగూలీ ఉదంతంలో మరో సంచలనం! ఈ కేసుపై విచారణకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య న్యాయమూర్తుల కమిటీకి బాధితురాలు ఇచ్చిన అఫిడవిట్‌లోని వివరాలను అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్ సోమవారం అసాధారణ రీతిలో బహిర్గతం చేశారు. దీంతో గంగూలీకి వ్యతిరేకంగా నిరసనలు, పశ్చిమబెంగాల్ మానవహక్కుల కమిషన్(డబ్ల్యూబీహెచ్ఆర్సీ) చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. గంగూలీ రాజీనామాకు తిరస్కరించడం వల్లే తాను, బాధితురాలి పూర్తి సహకారంతో ఆమె అఫిడవిట్‌లోని అంశాలను బయటపెట్టానని జైసింగ్ చెప్పారు. గంగూలీ లాంటి వారు తక్షణమే పదవుల నుంచి తప్పుకోవాలన్నారు. కాగా, సుప్రీం కోర్టుకు ఇచ్చి న రహస్య అఫిడవిట్‌ను ఎలా బహిర్గతం చేస్తారని గంగూలీ ప్రశ్నిం చారు. జైసింగ్‌పై ఫిర్యాదు చేస్తారా అని కోల్‌కతాలో విలేకర్లు అడగ్గా ‘నేనేం చేయగలను? నా మాట ఎవరు వింటున్నారు?’ అని బదులిచ్చారు. గత ఏడాది డిసెంబర్ 24న రిటైరైన గంగూలీ అదే రోజు ఢిల్లీలోని లె మెరిడియన్ హోటల్ గదిలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయన వద్ద ఇంటర్న్‌గా పనిచేసిన న్యాయ విద్యార్థిని ఆరోపించడం, ఆ ఆరోపణలను గంగూలీ తోసిపుచ్చడం తెలిసిందే. అయితే హోటల్లో గంగూలీ ప్రవర్తన కామాపేక్షంగా ఉందని సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీ ఇటీవల అభిశంసించింది. ‘రాత్రంతా హోటల్లోనే ఉండిపొమ్మన్నారు.. ’ హోటల్ గదిలో గంగూలీ రాత్రి 8 నుంచి 10.30 మధ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తనను ప్రేమిస్తూన్నానంటూ చేతిని ముద్దుపెట్టుకున్నారని బాధితురాలు అఫిడవిట్లో పేర్కొంది. జైసింగ్ వెల్లడించిన అందులోని కొన్ని వివరాలు బాధితురాలి మాటల్లోనే.. ‘‘గంగూలీ ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరరేషన్కు సంబంధించిన నివేదికను మరుసటిరోజు ఉదయానికల్లా అందజేయాల్సి ఉందని, దాన్ని పూర్తి చేసేందుకు హోటల్‌కు రావాలని చెప్పడంతో వెళ్లా. రాత్రంతా హోటల్లోనే ఉండి పనిచేయాలని ఆయన అడిగారు. నేను తిరస్కరించాను. త్వరగా పని పూర్తి చేసి హాస్టల్‌కు వెళ్లిపోతానన్నా... ఒక దశలో ఆయన మద్యం(రెడ్ వైన్) తీసుకున్నారు. ‘రోజంతా పనిచేశావు కనుక నా బెడ్రూంలోకి వెళ్లి, వైన్ తాగుతూ విశ్రాంతి తీసుకో’ అని అన్నారు. నాకు ఇబ్బందిగా అనిపించింది. తర్వాత గంగూలీ.. ‘నువ్వు ఎంతో అందంగా ఉన్నావు’ అన్నారు. నేను వెంటనే లేచి, మాట్లాడబోయేలోగా నా చేతిని పట్టుకుని ‘నువ్వంటే నాకిష్టమమని నీకు తెలుసు కదా? నువ్వంటే నిజం గానే ఇష్టం. నిన్ను ప్రేమిస్తున్నా’ అన్నారు. నేను పక్క కు వెళ్లేందుకు ప్రయత్నించగా నా చేతిని ముద్దుపెట్టుకున్నారు. ప్రేమిస్తున్నానంటూ పదేపదే చెప్పారు.’ ‘రాష్ట్రపతి చర్య తీసుకోవాలి’ గంగూలీ డబ్ల్యూబీహెచ్ఆర్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేయకపోతే ఆయనకు ఉద్వాసన పలికే ప్రక్రియను రాష్ట్రపతి ప్రారంభించాలని ఇందిరా జైసింగ్ అన్నారు. ఈమేరకు తాను ప్రధానికి లేఖ రాశానని తెలిపారు. -
గంగూలీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎకే.గంగూలీకి వ్యతిరేకంగా బీజేపీ శుక్రవారం పార్లమెంటులో గళమెత్తింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దుచేసి గంగూలీని తొలగింపుపై చర్చ చేపట్టాలని ప్రధాన ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు. న్యాయ విద్యార్థినిపై అత్యాచారయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగాల్ మానవ హక్కుల సంఘం ఛైర్మన్ అశోక్ గంగూలీ తక్షణం రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేశారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రత్యేకంగా ఈ అంశాన్ని విపక్ష నేత సుష్మాస్వరాజ్ ప్రస్తావించారు. సుష్మావాదనతో తృణమూల్ కాంగ్రెస్ ఏకీభవించింది. జస్టిస్ గంగూలీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. -
పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా
పార్లమెంట్‌లోని ఉభయ సభలలో సమైక్యాంధ్ర నినాదాలు శుక్రవారం మారుమ్రోగాయి. దాంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభను మధ్యాహ్నం 12.00 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు.లోక్‌సభ ప్రారంభం కాగానే సీమాంధ్రకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు పెద్దపెట్టున్న నినాదాలు చేశారు. ఆ క్రమంలో స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. పార్లమెంట్ పై తీవ్రవాదులు దాడి చేసి నేటితో 12 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్బంగా ఆ దాడి ఘటనలో అమరులైన జవాన్లకు లోక్‌సభ ఘనంగా నివాళులు అర్పించింది. అయితే మహిళ న్యాయవాదిపై లైంగిక వేధింపులకు పాల్పడిన జస్టిస్ గంగూలీని వెంటనే పదవి నుంచి తొలగించాలని తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. వారితో బీజేపీ సభ్యులు గొంతుకలిపారు. అటు సీమాంధ్ర ఎంపీల నినాదాలు, ఇటు తృణమూల్, బీజేపీ సభ్యుల నినాదాలతో లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో మధ్యాహ్నం 12.00 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. -
నేను రాజీనామ చేయను: జస్టిస్ గంగూలీ
కోల్‌కతా: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమబెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ గంగూలీ తన పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. తనను లైంగికంగా వేధించారంటూ జస్టిస్ గంగూలీపై న్యాయ విద్యార్థిని చేసిన ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు ప్యానెల్ ఇప్పటికే ఆయన ప్రవర్తనను తప్పుబట్టిన విషయం తెలిసిందే. తానేం చేయాలనుకుంటే అది చేస్తానంటూ విలేకరులపై గంగూలీ చిర్రుబుర్రులాడారు. ఇక మంగళవారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ ట్విట్టర్లో జస్టిస్ గంగూలీకి ఒక అభ్యర్థన చేశారు. ‘సర్ మీ కార్యాలయాన్ని పరిహాసం పాలు చేయకండి. సీఎం మమతా బెనర్జీ సహా ఎంతో మంది మీపై చర్యల కోసం డిమాండ్ చేస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు.