పార్లమెంట్లోని ఉభయ సభలలో సమైక్యాంధ్ర నినాదాలు శుక్రవారం మారుమ్రోగాయి. దాంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్సభను మధ్యాహ్నం 12.00 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు.లోక్సభ ప్రారంభం కాగానే సీమాంధ్రకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు పెద్దపెట్టున్న నినాదాలు చేశారు. ఆ క్రమంలో స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. పార్లమెంట్ పై తీవ్రవాదులు దాడి చేసి నేటితో 12 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్బంగా ఆ దాడి ఘటనలో అమరులైన జవాన్లకు లోక్సభ ఘనంగా నివాళులు అర్పించింది.
అయితే మహిళ న్యాయవాదిపై లైంగిక వేధింపులకు పాల్పడిన జస్టిస్ గంగూలీని వెంటనే పదవి నుంచి తొలగించాలని తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. వారితో బీజేపీ సభ్యులు గొంతుకలిపారు. అటు సీమాంధ్ర ఎంపీల నినాదాలు, ఇటు తృణమూల్, బీజేపీ సభ్యుల నినాదాలతో లోక్సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో మధ్యాహ్నం 12.00 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు.