ప్రేమిస్తున్నానంటూ ముద్దుపెట్టుకున్నారు..
జస్టిస్ గంగూలీపై న్యాయ విద్యార్థిని ఆరోపణ
ఆమె అఫిడవిట్ వివరాలను బయటపెట్టిన
అదనపు సొలిసిటర్ ఇందిరా జైసింగ్
న్యాయ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ జడ్జి ఏకే గంగూలీ ఉదంతంలో మరో సంచలనం! ఈ కేసుపై విచారణకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య న్యాయమూర్తుల కమిటీకి బాధితురాలు ఇచ్చిన అఫిడవిట్‌లోని వివరాలను అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్ సోమవారం అసాధారణ రీతిలో బహిర్గతం చేశారు. దీంతో గంగూలీకి వ్యతిరేకంగా నిరసనలు, పశ్చిమబెంగాల్ మానవహక్కుల కమిషన్(డబ్ల్యూబీహెచ్‌ఆర్‌సీ) చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. గంగూలీ రాజీనామాకు తిరస్కరించడం వల్లే తాను, బాధితురాలి పూర్తి సహకారంతో ఆమె అఫిడవిట్‌లోని అంశాలను బయటపెట్టానని జైసింగ్ చెప్పారు. గంగూలీ లాంటి వారు తక్షణమే పదవుల నుంచి తప్పుకోవాలన్నారు. కాగా, సుప్రీం కోర్టుకు ఇచ్చి న రహస్య అఫిడవిట్‌ను ఎలా బహిర్గతం చేస్తారని గంగూలీ ప్రశ్నిం చారు. జైసింగ్‌పై ఫిర్యాదు చేస్తారా అని కోల్‌కతాలో విలేకర్లు అడగ్గా ‘నేనేం చేయగలను? నా మాట ఎవరు వింటున్నారు?’ అని బదులిచ్చారు. గత ఏడాది డిసెంబర్ 24న రిటైరైన గంగూలీ అదే రోజు ఢిల్లీలోని లె మెరిడియన్ హోటల్ గదిలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయన వద్ద ఇంటర్న్‌గా పనిచేసిన న్యాయ విద్యార్థిని ఆరోపించడం, ఆ ఆరోపణలను గంగూలీ తోసిపుచ్చడం తెలిసిందే. అయితే హోటల్లో గంగూలీ ప్రవర్తన కామాపేక్షంగా ఉందని సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీ ఇటీవల అభిశంసించింది.
‘రాత్రంతా హోటల్లోనే ఉండిపొమ్మన్నారు.. ’
హోటల్ గదిలో గంగూలీ రాత్రి 8 నుంచి 10.30 మధ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తనను ప్రేమిస్తూన్నానంటూ చేతిని ముద్దుపెట్టుకున్నారని బాధితురాలు అఫిడవిట్లో పేర్కొంది. జైసింగ్ వెల్లడించిన అందులోని కొన్ని వివరాలు బాధితురాలి మాటల్లోనే.. ‘‘గంగూలీ ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరరేషన్‌కు సంబంధించిన నివేదికను మరుసటిరోజు ఉదయానికల్లా అందజేయాల్సి ఉందని, దాన్ని పూర్తి చేసేందుకు హోటల్‌కు రావాలని చెప్పడంతో వెళ్లా. రాత్రంతా హోటల్లోనే ఉండి పనిచేయాలని ఆయన అడిగారు. నేను తిరస్కరించాను. త్వరగా పని పూర్తి చేసి హాస్టల్‌కు వెళ్లిపోతానన్నా... ఒక దశలో ఆయన మద్యం(రెడ్ వైన్) తీసుకున్నారు. ‘రోజంతా పనిచేశావు కనుక నా బెడ్‌రూంలోకి వెళ్లి, వైన్ తాగుతూ విశ్రాంతి తీసుకో’ అని అన్నారు. నాకు ఇబ్బందిగా అనిపించింది. తర్వాత గంగూలీ.. ‘నువ్వు ఎంతో అందంగా ఉన్నావు’ అన్నారు. నేను వెంటనే లేచి, మాట్లాడబోయేలోగా నా చేతిని పట్టుకుని ‘నువ్వంటే నాకిష్టమమని నీకు తెలుసు కదా? నువ్వంటే నిజం గానే ఇష్టం. నిన్ను ప్రేమిస్తున్నా’ అన్నారు. నేను పక్క కు వెళ్లేందుకు ప్రయత్నించగా నా చేతిని ముద్దుపెట్టుకున్నారు. ప్రేమిస్తున్నానంటూ పదేపదే చెప్పారు.’
‘రాష్ట్రపతి చర్య తీసుకోవాలి’
గంగూలీ డబ్ల్యూబీహెచ్‌ఆర్‌సీ చైర్మన్ పదవికి రాజీనామా చేయకపోతే ఆయనకు ఉద్వాసన పలికే ప్రక్రియను రాష్ట్రపతి ప్రారంభించాలని ఇందిరా జైసింగ్ అన్నారు. ఈమేరకు తాను ప్రధానికి లేఖ రాశానని తెలిపారు.