కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసే విషయంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ కుమార్ గంగూలీ గురువారం తేల్చిచెప్పారు. ఆరోపణల నేపథ్యంలో హక్కుల కమిషన్ చైర్మన్ పదవికి గంగూలీ రాజీనామా చేయాలని సర్వత్రా ఆందోళనలు పెల్లుబికిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసుపై కేంద్ర కేబినెట్ దష్టి సారిస్తుందని, రాష్ట్రపతి నివేదికను సుప్రీం కోర్టుకు పంపి సదరు ఆరోపణలపై విచారణ కోరే అంశాన్ని చర్చిస్తామని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే బుధవారం ప్రకటించిన నేపథ్యంలో తదుపరి ఏవిధంగా వ్యవహరిస్తారన్న ఓ వార్తా సంస్థ ప్రశ్నకు జస్టిస్ గంగూలీ స్పందించారు. ‘ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయను. చైర్మన్ పదవికి రాజీనామా చేసే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు’ అని బదులిచ్చారు.