![There may be need for President rule in West Bengal, Governor - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/10/keshari%20nath%20tripathi%20mamatha%20banerjee.jpg.webp?itok=UqPMvKEu)
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ.. పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగి.. హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత కూడా బెంగాల్ రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగానే ఉంది. శనివారం రాష్ట్రంలో జరిగిన ఘర్షణల్లో నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘర్షణలకు మీరే కారణమంటూ టీఎంసీ, బీజేపీ పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్‌లోని పరిస్థితులను ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆ రాష్ట్ర గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి తెలియజేశారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై కేంద్రానికి నివేదిక అందజేశారు.
ఈ క్రమంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేతో మాట్లాడిన త్రిపాఠి.. బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం రావొచ్చునని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణల్లో డజను మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, ఈ క్రమంలో బెంగాల్‌లో పరిస్థితులు ఇంకా దిగజారితే.. రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరముంటుందని ఆయన అన్నారు. బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరముందన్న బీజేపీ నేత కైలాశ్ విజయ్‌వార్గియా వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ‘ఆ అవసరం రావొచ్చు. అలాంటి డిమాండ్ వస్తే కేంద్రం దానిని పరిశీలిస్తుంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రపతి పాలన గురించి ప్రధానితోగానీ, హోంమంత్రితోగానీ నేను చర్చించలేదు’ అని పేర్కొన్నారు. బెంగాల్‌లో హింసకు మీరే కారణమంటూ బీజేపీ, టీఎంసీ పరస్పరం వేలెత్తి చూపించుకోవడంపై స్పందిస్తూ.. రాజకీయ పార్టీలు సంయమనం పాటిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు పాటుపడాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment