(సాక్షి వెబ్ ప్రత్యేకం)
విద్యార్థి దశ నుంచే చిచ్చర పిడుగు లక్షణాలతో పట్టుదలకు, గుండె నిబ్బరానికి మారు పేరుగా నిలిచిన ధీర మహిళ 'ఫైర్ బ్రాండ్' మమతా బెనర్జీ. 1970వ దశకంలో రాజకీయ జీవితం ప్రారంభించి శరవేగంగా అడుగులు వేస్తూ తనదైన వ్యక్తిత్వంతో దూసుకుపోతున్నారు. నందిగ్రామ్ ఉద్యమం, సింగూరులో టాటాలకు ఎదురొడ్డి, బలవంతపు భూసేకరణను నిలువరించి రైతుబంధుగా ప్రజలకు దగ్గరైన తీరు, సాధించిన అఖండ విజయం ఆమె రాజకీయ ప్రస్థానంలో కీలక మైలురాళ్లు. 2011లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 34 ఏళ్ల కమ్యూనిస్టుల కంచుకోటకు ఎదురెళ్లి నిలిచి గెలిచిన నాయకురాలు. ఇపుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వ్యూహరచనలో తలమునకలైవున్నారు. ప్రధానంగా బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షా ద్వయానికి చెక్ చెప్పే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2019 ఎన్నికల సమరానికి సమర శంఖం పూరించారు.
దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మమతా బెనర్జీ ఒక మహిళగా రాజకీయాల్లో నిలదొక్కుకున్నవైనం అంత అషామాషీగా ఏమీ సాగలేదు. అనేక రకాల సవాళ్లకు ధీటుగా ఎదుర్కొంటూ, అవరోధాలను అధిగమించుతూ రాజకీయాల్లో తన ముద్రను సాధించుకున్నారు. 1970లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మమతా బెనర్జీ అనతికాలంలోనే మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 1984 ఎన్నికల్లో కమ్యూనిస్టు మహాయోధుడు సోమనాధ ఛటర్జీని ఓడించి అందరి దృష్టినీ తనవైపునకు తిప్పుకున్నారు. అలా పార్లమెంటులో అడుగుపెట్టిన అతి చిన్నవారిలో ఒకరిగా నిలిచారు. అంతేకాదు కాంగ్రెస్ హయాంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో దీదీ తొలి మహిళా రైల్వే మంత్రి ఖ్యాతి దక్కించుకున్నారు. అలాగే మొదటి మహిళా బొగ్గు శాఖా మంత్రి కూడా దీదీనే.
కాంగ్రెస్ వ్యతిరేక పవనాల్లో 1989లో ఓడిపోయినా ఆ తరువాతి నుంచి ఆమె ప్రభంజనానికి ఎదురే లేదు. 1991, 1996, 98, 99, 2009 ఎన్నికల్లో తన హవాను చాటుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీతో తీవ్ర విభేదాల కారణంగా 1997లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఎన్‌డీఏ, యూపీఏ ప్రభుత్వాల్లో కీలక భూమికను నిర్వహించారు. అయితే 2004 లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది. మమత ఒక్కరే ఎంపీగా గెలిచారు. ఆ సమయంలో సీపీఎం పారిశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా బెంగాల్‌లో వ్యూహాత్మక పోరాటానికి శ్రీకారం చుట్టారు. సింగూర్ లో టాటా మోటార్స్ ప్లాంట్ కు వ్యతిరేకంగా 2006లో అసెంబ్లీ మార్చ్ విజయవంతంగా నిర్వహించారు. నందిగ్రామ్లో జరిగిన హింసను అడ్డుకున్నారు. ఇదే ఆమె రాజకీయ జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. సామాన్యులకు నిజమైన దీదీగా మారారు.
2011ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా అధికారాన్ని కైవసం చేసుకున్నారు. సొంత కుంపటిని ఏర్పాటుచేసుకున్న అనంతరం ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు మమతకు సుమారు 14 ఏళ్లు పట్టింది. ఏ ఉద్యమమైతే తనకు సీఎం కుర్చీని అప్పగించిందో అదే సింగూరు ఉద్యమ రైతులకు 400 ఎకరాల భూమిని తిరిగి ఇస్తూ తొలి సంతకం చేశారు. ఈ నిర్ణయమే 2016 వరుసగా రెండవసారి కూడా అఖండ మెజార్టీని ఆమెకు కట్టబెట్టింది. ప్రస్తుతం దీదీ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటం విశేషం.
వ్యక్తిగత వివరాలు
తల్లిదండ్రులు ప్రోమిలేశ్వర్ బెనర్జీ, గాయత్రి బెనర్జీ జనవరి 5 1955న మమతా బెనర్జీ (బందోపాధ్యాయ) జన్మించారు. ఎమ్.ఏ (ఇస్లామిక్ చరిత్ర) తో పాటు న్యాయశాస్త్ర విద్యను అభ్యసించారు. ఇక్కడో ఇంకో గమ్మత్తైన విషయం ఏమింటటే పదవతరగతి పరీక్షలు రాయడానికి మమతకు వయసు సరిపోకపోతే ఐదేళ్లు ఎక్కువగా వేసి రాయించారట. నిజానికి మమత పుట్టింది 1960 అక్టోబర్ 5వ తదీ అనే వాదన ప్రచారంలో ఉంది. అయితే రికార్డులలో ఉన్న తేదీ మాత్రం 1955 జనవరి 5. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రయివేటు టీచర్‌గా, సేల్స్ గర్ల్‌గా, స్టోనోగ్రాఫర్‌గా పనిచేశారు.
ఇష్టాలు
వ్యక్తిగతంగా మమతా బెనర్జీ నిరాడంబర నాయకురాలు. ఆత్మస్థైర్యమే ఆమెకు ఆభరణం. ఆమె ఆహార్యమే ఆమెకు గుర్తింపు. అన్నట్టు దీదీ మంచి రచయిత కూడ. కవిత్వం రాయడమంటే ఆమెకు వల్లమాలిన ప్రేమ. ప్రకృతి అంటే ప్రాణం. సమయం దొరికితే హిమాలయ పర్వతాలు, మేదినీపూర్ అడవులను సందర్శించడం అలవాటు. ప్రకృతి ఫోటోగ్రఫీ, పెయింటింగ్స్ వేయడం అన్నా చాలా ఇష్టం. పోరిబోర్టాన్ (మార్పు) పేర ఓ కవిత్వ సంకలనాన్ని కూడా తీసుకొచ్చారు. కొబిత (కవితలు) పేర మరో పుస్తకం కూడా వచ్చింది. మై అన్‌ఫర్గెటెబుల్ మెమొరీస్ (మర్చిపోలేని నా జ్ఞాపకాలు) ఆమె రాసిన మరో పుస్తకం. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న మమత దుర్గా దేవీ పూజ కోసం ప్రత్యేకంగా పాటలుతో‘రౌద్రాచార్య’ ను ఆల్బమ్‌ను కూడా తీసుకొచ్చారు.
వివాదాలు
తన కాలంలో వెలుగులోకి వచ్చిన శారదా స్కాం, నారద స్టింగ్, రోజ్‌వ్యాలీ ఆర్థిక కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన మంత్రుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణలకు, ఇటీవల సీబీఐ అధికారుల అరెస్టు వ్యవహారం ఈ వివాదాలకు మరింత ఆజ్యం పోసింది. అలాగే పార్క్ స్ట్రీట్ సామూహిక అత్యాచార బాధితురాలు సుజెట్టే జోర్డాన్‌పై ముఖ్యమంత్రి హోదాలో ‘అదంతా ఓ కట్టుకథ’ అంటూ మమత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రాజేశాయి.
మృత్యుంజయురాలు
కాంగ్రెస్ నేతగా మమతా బెనర్జీపై1990 ఆగస్టు 16న, ఒక ర్యాలీలో సీపీఎం కార్యకర‍్త లాలూ అలాం ఆమెపై హత్యాయత్నం చేశాడు. కర్రతో బలంగా కొట్టడంతో, ఆమె తలపగిలింది. దీంతో దాదాపు నెల రోజులపాటు ఆమె ఆసుపత్రిలోనే ఉన్నారు. సీపీఎం ప్రోద్బలంతోనే తానీ దురాగతానికి పాల్పడ్డాననీ, క్షమించాలని కోరుకున్నా అతణ్ని దీదీ క్షమించలేదు.
- టి. సూర్యకుమారి
Comments
Please login to add a commentAdd a comment