కోల్‌కత్తా : మధ్యప్రదేశ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఓటమి తప్పదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2019 లోక్‌సభ ఎన్నికలపై పడే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. బెంగాల్‌లో ఆమె ఓ సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. వారికి ప్రజలు ఓటమితో స్వాగతం పలుకుతారని వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే అది అర్థమవుతుందని అన్నారు. బెంగాల్‌లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తృణమూల్ ఓటు బ్యాంకును చీల్చలేరని మమతా ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నోఏళ్లుగా బెంగాల్‌లో నాటుకుపోయిన మావోయిస్టుల సమస్యను తమ ప్రభుత్వం శాశ్వతంగా తీర్చిందని, కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో ఆ సమస్య ఇంకా కొనసాగుతోందని ఆమె గుర్తుచేశారు. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా నేడు (బుధవారం) మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణతో పాటు రాజస్తాన్‌కు డిసెంబర్ 7న పోలింగ్ జరగనుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఎంతో కీలకంగా భావించే ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీతో సహా ఇతర ప్రాంతీయ పార్టీలు సైతం ప్రతీష్టాత్మకంగా భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment