Indian Politicians
-
ఉద్యమశీల కార్యకర్త.. రామ్ మనోహర్ లోహియా
లోహియా కులాంతర వివాహాలయితేనే∙ఏ పెళ్లికయినా వెళ్లేవారు. విడాకులను సమర్థించారు. ఆస్తికి ఆయన వ్యతిరేకి. దానిని ఆచరణలో చూపించారు కూడా. ఆయన హరిజన దేవాలయాలకూ వెళ్లారు. జాతికి కొత్త జవ జీవాలను తీసుకురావడానికి ఆయన తాను చేయగలిగిందంతా చేశారు. ఆయన తన యాభై ఏడేళ్ల జీవితంలో మొత్తం ఇరవై సార్లు అరెస్టు అయినట్లు ఎక్కడో చదివాను. చదవండి: ఉక్కు మహిళకు తగిన మహిళ.. కిరణ్ బేడి లోహియా ఢిల్లీ వార్తాపత్రికలకు పెద్ద పెద్ద ఆదర్శాలతో వ్యాసాలు రాయడానికే పరిమితం కాలేదు. పేదల కోసం తన పోరాటాన్ని స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగించారు. బహుశా అందుకే కావచ్చు మొత్తం 20 అరెస్టుల్లో 12 అరెస్టులు స్వాతంత్య్రం వచ్చాకే జరిగాయి! ఆయన బాగా చదువుకున్న, బాగా పర్యటనలు చేసిన రాజకీయ నాయకుడు. డాక్టర్ లోహియా అనే పేరులోని డాక్టర్ అనే మాట ఆయన చేసిన పరిశోధనలకు లభించింది. బెర్లిన్ నుంచి ఎకనామిక్స్‌లో ఆయనకు డాక్టరేట్ లభించింది. అప్పుడు ఆయన వయసు 23 ఏళ్లు. పరిశోధనను జర్మనీ భాషలో చేశారు. బ్రిటన్‌లో చదువుకోడానికి ఆయన ఆసక్తి చూపలేదు. కులం, మతం, జాతి, రాజకీయాలు, సంగీతం, కళలు, అర్థశాస్త్రం, రాజ్యాంగం, న్యాయశాస్త్రం, సాహిత్యం వంటి అంశాలను సమదృష్టితో పరిశీలించి, విమర్శించారు. ఆయన ఢిల్లీలోని రాకబ్‌గంజ్‌లో ఉన్న తన ఇంటి తలుపులను అందరికీ ఎప్పుడూ తెరిచే ఉంచేవారు. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి తన మాట్లాడవచ్చు. మా నాన్నగారు, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ఆయనకు సహచరుడు. ఆయన తరచు లోహియా ఇంటికి వెళుతుండేవారు. లోహియా హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో అనర్ఘళంగా మాట్లాడుతుండేవారు. ఇంగ్లిషు మీద ఆయన పోరాటం సాగించినప్పటికీ, ఆ భాషలో కూడా నిష్ణాతుడే. ‘‘ప్రపంచంలో ఎక్కడ చూసినా చిన్న, పెద్ద మనుషుల మధ్య అసమానతలు ఉంటూనే ఉన్నాయి. అయితే భారతదేశంలో ఈ అంతరం మరీ దుర్భరంగా ఉంటోంది’’ అని ఆయన ఆవేదన చెందేవారు. ఆయన బతికి ఉంటే ఇప్పుడు కూడా జైల్లోనే ఉండేవారేమో. – నిరంజన్ రామకృష్ణ, లోహియా వెబ్సైట్ రూపకర్త -
Pegasus: ఏంటీ పెగాసస్.. భారీ డేటా హ్యాక్‌లో వాస్తవమెంత?
ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండే స్పైవేర్ ‘పెగాసస్’ హ్యాకింగ్‌కు గురైందన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓవైపు భారత ప్రభుత్వం ఈ హ్యాకింగ్ కుంభకోణంలో తమ ప్రమేయం లేదని చెప్తుండగా.. మరోవైపు ఫోరెన్సిక్ టెస్టుల్లో పెగాసస్ ద్వారా డేటా హ్యాక్ అయ్యేందుకు వీలుందన్న కథనాలు కలకలం రేపుతున్నాయి. న్యూఢిల్లీ: దేశంలో మరో భారీ డేటా లీకేజీ కుంభకోణం ప్రకంపనలు మొదలయ్యాయా?. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, మరికొందరు ప్రముఖుల్ని లక్క్ష్యంగా చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్.. కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్పైవేర్ ద్వారా హ్యాకర్లు.. ప్రముఖుల ఫోన్ డేటాను చోరీ చేశారని ‘ది వైర్’ ఆదివారం ఓ కథనం ప్రచురించింది. తాజా కథనం ప్రకారం.. భారత్‌తో మరికొన్ని దేశాల ప్రముఖులను లక్క్ష్యంగా చేసుకుని ఈ హ్యాకింగ్ ఎటాక్ జరిగినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ టెస్ట్‌లు(డేటాబేస్‌లో ఉన్న పది నెంబర్లపై పరీక్షలు) దాదాపుగా హ్యాకింగ్ జరిగిందనేందుకు ఆస్కారం ఉందని తేల్చాయని వైర్ ప్రస్తావించింది. మన దేశానికి చెందిన సుమారు 300 మంది ఫోన్ నెంబర్లు ఆ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు, తాజా-మాజీ అధికారులు, రాజ్యాంగబద్ధ పదవిలో ఓ ప్రముఖుడు, ముగ్గురు కీలక ప్రతిపక్ష సభ్యులు, 40 మంది జర్నలిస్టుల నెంబర్లు, ఆరెస్సెస్ సభ్యులు, ఇతర ప్రముఖుల వివరాలు ఉన్నట్లు, రాబోయే రోజుల్లో వాళ్ల పేర్లను సైతం వెల్లడిస్తామని ది వైర్ పేర్కొంది. యాపిల్ ఫోన్లు వాడే ప్రముఖుల డేటా మరింత తేలికగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని ఉటంకించింది. Strong rumour that this evening IST, Washington Post & London Guardian are publishing a report exposing the hiring of an Israeli firm Pegasus, for tapping phones of Modi’s Cabinet Ministers, RSS leaders, SC judges, & journalists. If I get this confirmed I will publish the list. — Subramanian Swamy (@Swamy39) July 18, 2021 దావా వేస్తాం 2018-19 నడుమ ఈ హ్యాకింగ్ ప్రయత్నం జరిగిందని, అయితే అన్ని నెంబర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయా,? లేదా? అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉందని వైర్ పేర్కొంది. వైర్‌తో పాటు వాషింగ్టన్ పోస్ట్ లాంటి అంతర్జాతీయ మ్యాగజైన్లు సైతం ఈ వార్తలను ప్రచురించాయి. మరోవైపు ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్వో గ్రూప్ (పెగాసస్‌ను అమ్మేది ఇదే) ఆరోపణల్ని ఖండించింది. నిఘా కార్యకలాపాల కోసమే ఈ స్పైవేర్‌ను ఎన్ఎస్వో ప్రభుత్వాలకు అమ్ముతుంటుంది. అలాంటిది హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే ఉండదని స్పష్టం చేసింది. అయితే లీక్ డేటా బేస్‌లో నెంబర్లు కనిపించినంత మాత్రనా హ్యాక్ అయినట్లు కాదని గుర్తించాలని తెలిపింది. ప్రభుత్వాలకు మాత్రమే యాక్సెస్ ఉండే Pegasus డేటా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే లేదని, తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించింది. గతంలో కూడా.. పారిస్‌కు చెందిన ఓ మీడియా హౌజ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ద్వారా ఈ నిఘా కుంభకోణం వెలుగు చూసినట్లు సమాచారం. ఎన్ఎస్వో గ్రూప్ రూపొందించిన పెగాసస్.. సైబర్‌వెపన్‌గా భావిస్తుంటారు. కానీ, ఐఫోన్ యూజర్లనే ఇది టార్గెట్ చేస్తుందని, హ్యాకింగ్‌కు పాల్పడుతుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఇది ఆండ్రాయిడ్ ఫోన్లను సైతం టార్గెట్ చేస్తుందని తర్వాత తేలింది. పెగాసస్ స్పైవేర్‌కు సంబంధించి ఎన్ఎస్వో గ్రూప్ మీద ఫేస్బుక్ 2019లో ఓ దావా కూడా వేసింది. అంతేకాదు వాట్సాప్ యూజర్లను అప్రమత్తం చేసింది కూడా. ప్రస్తుతం పెగాసస్ కథనాలు పలు ఇంటర్నేషనల్ మీడియా హౌజ్‌లలో కూడా ప్రచురితం అవుతున్నాయి. -
పొలిటికల్ ‘పవార్’
సాక్షి, వెబ్ ప్రత్యేకం : శరద్ పవార్ పేరు వినగానే రాజకీయాలతో పాటు, క్రికెట్ కూడా కళ్లెదుట మెదులుతుంది. భారతదేశంలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ రెండు రంగాల్లో తనదైన ముద్ర వేశారు శరాద్ పవార్. క్రికెట్లో రాజకీయాలు చేసినా, రాజకీయాలను ఓ ఆటాడుకున్నా ఆయనకే చెల్లింది. ముంబై క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ సారథ్యంతో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. అటు రాజకీయ క్రీడలోనూ ఆరితేరారు. అంశమేదైనా అనర్గళంగా మాట్లాడగలరు. శరద్ పవార్ రాజకీయ గురువు వైబీ చవాన్. ఆయన సలహా సూచనలు పాటిస్తూ 1978లో, అత్యంత పిన్న వయసులో (37) మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. నోటి కేన్సర్‌ను జయించి విజేతగా నిలిచారు. బాల్యం, విద్యాభ్యాసం.. మహారాష్ట్ర పూణెలోని బారామతి పట్టణంలో గోవిందరావ్ పవార్, శారదా బాయ్ పవార్ దంపతులకు 1940, డిసెంబరు 12 న జన్మించారు శరాద్ పవార్. ఆయన అసలు పేరు శరాద్ చంద్రా గోవిందరావ్ పవార్. ఈయనకు తొమ్మిది మంది తోబుట్టువులు. మహారాష్ట్ర ఎడ్యుకేషన్ సొసైటీలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు పవార్. అనంతరం పూణె యూనివర్సిటీ పరిధిలోని బ్రిహాన్ మహారాష్ట్ర కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బీకాం డిగ్రీ పొందారు. చదువులో వెనకబడినప్పటికీ క్రీడలు, ఉపన్యాసం వంటి అంశాల్లో ఆయన చురుగ్గా ఉండేవారు. గోవా స్వతంత్రం కోసం 1956లో ప్రవరానగర్లో నిర్వహించిన నిరసన ర్యాలీతో పవార్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఈ సమయంలోనే ఆధునిక మహారాష్ట్ర నిర్మాతగా ప్రసిద్ధి చెందిన యశ్వంత్ చవాన్.. పవార్లోని నాయకత్వ లక్షణాలను గుర్తించడం ఆయన జీవితంలో కీలక మలుపుగా చెప్పవచ్చు. ఆ తరువాత పవార్ యూత్ కాంగ్రెస్ నాయుకుడిగా.. ఆపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా పని చేశారు. ప్రత్యక్ష రాజకీయ జీవితం.. 1967లో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు పవార్. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించారు. ఎమర్జెన్సీ కాలంలో వచ్చిన విబేధాల ఫలితంగా 1978లో కాంగ్రెస్ పార్టీని వీడి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ తరఫున మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించి.. విపక్షాల మద్దతుతో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్ల పాటు సీఎంగా పని చేశారు. ఆ తరువాత 1988 - 91 వరకు ఒకసారి, 1993 - 95 వరకు మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పీవీ హాయాంలో 1991 - 93 వరకూ రక్షణ శాఖ మంత్రిగా కూడా పని చేశారు. ఆ తరువాత 1999లో పీఏ సంగ్మాతో కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2004లో యూపీఏ కూటమిలో చేరి వ్యవసాయ, ఆహార శాఖ మంత్రిగా పని చేశారు. కేంద్ర మంత్రిగా పని చేస్తూనే 2005లో బీసీసీఐ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2007లో ఐసీసీ వైస్ ప్రెసిడెంట్‌గా.. 2010లో ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆరోపణలు... శరాద్ పవార్.. పలు అవినీతి ఆరోపణలే కాక అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాక సంచలనం సృష్టించిన స్టాంప్ పేపర్ కుంభకోణం, గోధుమల ఎగుమతి, భూ కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇవే కాక ఐపీఎల్‌కు పన్ను మినహాయింపు ఇవ్వడం, నీరా రాడియా టేపుల వ్యవహారం, ఆస్తుల డిక్లరేషన్ వంటి వివాదాల్లో కూడా పవార్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇవన్ని పవార్ రాజకీయ జీవితానికి ఓ మచ్చలా మారాయి. అయినా పవార్ రాజకీయ ఎదుగుదలకు అవేవీ అడ్డంకి కాలేదు. కుటుంబం.. శరాద్ పవార్ భార్య ప్రతిభా పవార్. వీరికి ఒక్కతే కుమార్తె. పేరు సుప్రియా సూలే. ఇమే 2009 లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇష్టాఇష్టాలు పవార్‌కు వ్యవసాయం, హార్టీకల్చర్ అంటే మక్కువ ఎక్కువ. వీటితో పాటు పుస్తక పఠనం, ప్రయాణాలు చేయడం అన్నా పవార్‌కు చాలా ఆసక్తి. ఇక ఆహారం విషయానికొస్తే పవార్ సీ ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. కారమిల్ కస్టర్డ్ పవార్‌కు అత్యంత ప్రీతిపాత్రం. పిల్లి ధరణి -
ఆయన గళం గమనం ఒకటే...!
సాక్షి వెబ్ ప్రత్యేకం : హైదరా 'బాద్షా'. ఓల్డ్‌సిటీకా షేర్. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. ఉర్దూ ఇంగ్లీష్ బాషలో అనర్గళంగా మాట్లాడే వక్త. భారత ముస్లింలకు ఆయనే గళం. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ప్రతి సందర్భంలోనూ ముస్లింల పక్షానే పోరాడుతూ.. వారి సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ ముందుకుసాగుతున్నారు. ఎప్పుడూ షేర్వాణీ, టోపీ ధరించి విలక్షణమైన ఆహార్యంతో ఆరడుగులకుపైగా ఆజానుబాహుడు. ఆయన ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగిన ఉర్దూలో ప్రసంగించడానికే ఇష్టపడుతారు. ముస్లిం ధార్మిక సంస్థగా పురుడు పోసుకున్న మజ్లిస్ –ఏ–ఇత్తేహదుల్–ముస్లిమీన్ (ఎంఐఎం)ను సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ రాజకీయపార్టీగా మారిస్తే.. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అసదుద్దీన్ పార్టీని జాతీయ స్థాయి వినిపించడంలో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఒటమెరుగని నేతగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, తమ డిమాండ్లను సాధించుకోవడం ఒవైసీ ప్రత్యేకత. రాజకీయ ప్రస్థానం సుల్తాన్ సలావుద్దీన్ వారుసుడిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన అసదుద్దీన్.. పాతబస్తీలోని చార్మినార్ అసెంబ్లీ నుంచి 1994,1999 రెండు పర్యాయాలు ఎంపికయ్యారు. అనంతరం 2004లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగి ఘన విజయం సాధించారు. వరసగా మూడు పర్యాయాలు(2004, 2009, 2014) గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు నాలుగోసారి బరిలో దిగేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఒవైసీ పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనే భారీ మెజార్టీతో ప్రత్యర్థులను మట్టికరిపించారు. 2009లో ఎంఐఎం పార్టీ అధ్యక్షత బాధ్యతలను చేపట్టిన అసదుద్దీన్.. పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఒక స్థానం గెలుచుకోవడంలో అసద్ కీలక పాత్ర పోషించారు. వివాదాలు.. వివాదాస్పద వ్యాఖ్యలు ముస్లింల పక్షాన తన గళాన్ని వినిపించే ఒవైసీ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 2016లో మహారాష్ట్రలో జరిగిన ఓ ప్రచార ర్యాలీలో భారత్‌మతాకీ జై అననని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆర్ఎస్సెస్ భావాజాలాన్ని ఇతరులకు బలవంతంగా రుద్దుతుందని, అందుకే తాను భారత్ మతాకీ జై అనని వివరణ ఇచ్చారు. ఇక దూకుడుగా వ్యవహరించే సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ ముస్లింలు తలచుకుంటే.. ముస్లింలు ఆలోచించుకోవాలి.. అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఒవైసీ ఇరకాటంలో పడ్డారు. 2005లో ఓ వ్యక్తిని కొట్టారనే ఆరోపణలతో ఒవైసీ సోదరులపై కేసు నమోదైంది. 2009లో అసద్.. టీడీపీ పోలింగ్ ఏజెంట్‌పై దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2013లో కర్ణాటక, బీదర్‌లో జరిగిన ఓ ర్యాలీలో అనుమతి లేకుండా గన్ పట్టుకొచ్చారని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ నేపథ్యం ఎంఐఎం వ్యవస్థాపక అధినేత సుల్తాన్ సలావుద్దిన్ ఒవైసీ-నజమున్నీసాల తనయుడైన అసుదుద్దీన్ ఒవైసీ... 1969 మే 13న హైదరాబాద్‌లో జన్మించారు. ఇక్కడే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు. అనంతరం లండన్‌లో న్యాయవాద విద్యను అభ్యసించారు. అనంతరం న్యాయవాదిగా వృత్తిని కొనసాగిస్తూ తండ్రిప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1996లో ఫర్హీన్‌ను వివాహం చేసుకున్న ఒవైసీకి ఆరుగురు సంతానం. ఒక కుమారుడు, ఐదుగురు కూతుర్లు. రాజకీయ నాయకుడుగానే కాకుండా ఒవైసీ ఆసుపత్రి, వైద్య కళాశాల అధిపతిగా కొనసాగుతున్నారు. ముస్లింలు, దళితుల రిజర్వేషన్ల కోసం పోరాడే ఒవైసీ.. తాను హిందుత్వానికి వ్యతిరేకమని కానీ హిందువులకు కాదని చెబుతుంటారు. ఒవైసీని అందరూ అసద్ భాయ్ అని పిలుస్తుంటారు. సోదరుడు సగం బలం.. దూకుడు స్వభావంతో సోదరుడు అక్భరుద్దీన్.. ఇరకాటంలో పడేసినా.. అసద్ బలం మాత్రం ఆయనే. ఎంఐఎంలో నెంబర్ టూ పొజిషన్గా కొనసాగుతున్న అక్బర్.. అవసరానికి అనుగుణంగా రాజకీయాలు...చేయడంలో దిట్ట. ఎన్నికలు వచ్చాయంటే చాలు పార్టీకి ఆయనే స్టార్ క్యాంపెయినర్. ఇటు పార్టీ క్యాడర్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. అందుకే అక్బర్ మాటంటే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వేదవాక్కు. 1999, 2004, 2009, 2014 .. ఇలా వరుసగా... చాంద్రాయణ గుట్ట నుంచి పోటీ చేసి నాలుగు సార్లు అక్భర్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. - శివ ఉప్పల -
ఆయన జన మోహనుడు
సాక్షి వెబ్ ప్రత్యేకం : ఎవరికీ తలవంచని ధైర్యం ఆయనది. కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం. యోధుడైన తండ్రిని పోగొట్టుకున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం. రాజీపడి ఎక్కే అందలాల కన్నా.. పోరాటాల ద్వారానే విజయ లక్ష్యాన్ని ఛేదించాలనే మనస్థత్వం. తండ్రికి తగ్గ తనయుడు. ఓదార్పు యాత్ర అయినా.. పాదయాత్ర అయినా ప్రజల కోసం ఏందాకైనా ముందుకు సాగే ధీరత్వం. ఆయనే పులివెందుల బిడ్డ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దాపరికాలు, అడ్డదారులు ఆయనకు ఇష్టముండదు. తెరవెనుక రాజకీయాలంటే ఆయనకు అసహ్యం. చేసేదే చెప్పాలి. చెప్పేది కచ్చితంగా చేయాలి అన్నదే ఆయన సిద్ధాంతం. రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని ఎవరైనా చెప్పినా 'కాని' పని చేయడానికి అసలు ఒప్పుకోరు. ఆ కారణంగా మొండివాడని దగ్గరివాళ్లే పెదవి విరిచినా పెద్దగా పట్టించుకోడు. నమ్మినవారి కోసం నష్టాన్ని కష్టాన్నీ భరిస్తాడే కాని అవసరానికి రాజకీయాలు చేయడం అబ్బలేదు. ఆయనకు ప్రజలుంటే చాలు..! తిండీ నిద్రా ఎవీ గుర్తుకురావు. రాజకీయ జీవితం 2009 లో 1.78 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో కడప ఎంపీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జగన్‌కు తండ్రి అకాల మరణంతో ఊహించని షాక్ తగిలింది. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన 2010 నవంబరు 29న కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. అనంతరం 2011 మార్చి 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ తరువాత ఈ రెండు స్థానాలకూ జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా జగన్ కనీవినీ ఎరుగని రీతిలో 5.45 లక్షల ఓట్ల పైచిలుకు మెజారిటీతో, విజయమ్మ పులివెందుల నుంచి 75 వేల ఓట్ల భారీ ఆధిక్యతతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హాట్ ఫేవరేట్‌గా బరిలో దిగింది. కానీ చంద్రబాబు.. నరేంద్రమోదీ, పవన్‌కల్యాణ్ సహకారంతో కేవలం 1.6 శాతం ఓట్లతో గట్టెక్కారు. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గం నుంచి 75,243 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక 175 స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 65 గెలిచి ఏకైక ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. 2009 లోనే ఎంపీగా గెలిచినప్పటికీ తండ్రి మరణం తరువాతే వైఎస్ జగన్ రాజకీయంగా క్రియాశీలమయ్యారు. తండ్రిబాటలో.. ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సమస్యలను తిరుగులేని పోరాటం చేశారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా అనే అంశం ఈ రోజు సజీవంగా ఉందంటే అది ఆయన చలువే. ప్రజాసంకల్పయాత్ర పేరిట ఆయన సాగించిన సుదీర్ఘ పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే ఓ చరిత్ర. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా 2009, సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జగన్‌ను బాగా కలచివేసింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది అభిమానులు హఠాన్మరణానికి గురికావడం ఆయనకు మరింత దుఃఖాన్ని కలిగించింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన ప్రతీవ్యక్తి ఇంటికి వస్తానని.. వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తానని కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద జరిగిన సభలో ఇచ్చిన మాట ఆయన జీవితాన్నే మార్చివేసింది. ఇచ్చిన మాట కాదని రాజీ పడి ఉంటే... అసలు రాష్ట్ర రాజకీయాలు ఇలా ఉండేవే కాదు. జగన్ ఎన్నో పదవుల్లో కొనసాగేవారు. ఆ మాటపై నిలబడటంలో ఆయన ఎన్నో ఎన్నెన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. అయన ఆనాటి నుంచి ఇప్పటివరకు ఎక్కడా వెనుదిరగలేదు. ఆ మాటపైనే నిలబడ్డారు. ఆయన వ్యతిరేక శక్తులు జగన్‌ను అణగదొక్కాలని చూసేకొద్దీ ఆయన రెట్టించిన ఉత్సాహంతో బలపడుతూ వచ్చారు. తండ్రి ఆశయాలను సాధించాలనే బృహత్తర ఆశయంతో, ఆయన చూపిన ప్రజా సంక్షేమ వెలుగులో ప్రజలకు మరింత చేరువై, వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగిన జగన్.. జనం మధ్యనే ఉంటూ వచ్చారు. జగన్ ఎదుగుదలను సహించని కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఎన్ని కుట్రలు పన్నినా.. అక్రమ కేసులు పెట్టినా ఆయన సంకల్పం మాత్రం సడలలేదు. పోరాడుతూనే ఉన్నారు. జనం మధ్యే ఉంటూ ఆ రాజన్న రాజ్యం కోసం కష్టపడుతూనే ఉన్నారు. అడుగులో అడుగేస్తూ...! 2017 నవంబర్ 6 వ తేదీ రోజున ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర జగన్ జీవితంలో మరో మైలురాయి. దాదాపు 14 నెలల పాటు ఎండనకా వాననకా 13 జిల్లాల ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ 3648 కిలోమీటర్ల (కశ్మీర్ నుంచి కన్యాకుమారి కన్నా ఎక్కువ దూరం) మేరకు సాగిన కాలినడకన ఆయన ప్రజలకు మరింత చేరువయ్యారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, సోదరి షర్మిల పాదయాత్రలు ముగించిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోనే జగన్ పాదయాత్ర పూర్తి చేయడం మరో చారిత్రక ఘట్టంగా మారింది. ప్రజా సంకల్పయాత్రలో 3648 కిలోమీటర్లు నడిచింది నేనైనా నడిపించింది మాత్రం ప్రజలే అని జగన్ చెప్పిన మాటతో ఆయన జనంతో మమేకం కావడమంటే ఎంతిష్టమో తెలియజేస్తుంది. " ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు వేలాది కిలోమీటర్లు పాదయాత్రలు చేయడం... కోట్లాది మంది ప్రజలను ప్రత్యేక్షంగా కలవడం... ప్రపంచ చరిత్రలో ఎవరికీ దొరకని అదృష్టం. ఇది దైవ నిర్ణయం.ఇది ప్రజల ఆశీర్వాదం. కోట్లాది మంది గుండె చప్పుళ్లు వినగలగడం నా జీవితానికే గొప్ప అనుభవం " అని చివరి రోజున జగన్ చెప్పిన మాట. ఏదైనా ఒక విషయంమీద మాట్లాడాలన్నా, కొత్త అంశం తెలుసుకోవాలనుకున్నా దాని పూర్తి లోతుపాతులు తెలుసుకునే వరకు నిద్రపోరు. మరీ ముఖ్యంగా ప్రజా సమస్యలకు సంబంధించి తాను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా చూసినదానిపైనే ఎక్కువ ఆధారపడుతారు. ఏ విషయంలోనైనా పూర్తి అవగాహన రాకుండా మాట్లాడరు. నేర్చుకునే విషయంలో నిత్యవిద్యార్థి. అవగాహన చేసుకునే వరకు అడిగి తెలుసుకుంటారు. ఎవరైనా సరే ఒకసారి పరిచయమైతే చాలు ఎన్నేళ్లయినా సరే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ప్రజా సమస్యలపై జగన్ స్థాయిలో పోరాటాలు చేసిన చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడు దేశంలోనే ఉండరేమో. ప్రత్యేక హోదా కావొచ్చు... ఫీజు రీయింబర్స్ మెంట్ కావొచ్చు... సమస్యఏదైనా...దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు... జగన్ చేసినన్ని ఎవరూ చేయలేదు. అలాగే లక్షలాది మంది ప్రజలను కలుసుకున్న ప్రత్యేక్షంగా కలుసుకున్న అరుదైన నాయకుడు జగన్. నేపథ్యం యెడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి 1972 డిసెంబరు 21న జన్మించారు. నిజాం కాలేజీలో బీకాం పూర్తి చేశారు. ఆ తర్వాత మేనేజ్ మెంట్ కోర్సులో చేరినప్పటికీ పూర్తి చేయలేదు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, విజయమ్మలకు తొలి సంతానం కాగా సోదరి షర్మిల. 1996లో భారతీరెడ్డితో వివాహం. వారికి హర్షా, వర్షా ఇద్దరు కూతుళ్లు. మితంగా తినడం ఇష్టం. టీ అంటే ఎక్కువ ఇష్టపడుతారు. తెల్లచొక్కాలు ధరించడానికి ప్రాధాన్యతనిస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే తెల్లచొక్కా చేతులు కొంతవరకు పైకి మడిచి ధరిస్తారు. - శివ ఉప్పల -
మధ్యప్రదేశ్ మాంత్రికుడు
సాక్షి వెబ్ ప్రత్యేకం : పదమూడేళ్ల వయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరిన ఓ పాఠశాల విద్యార్థి తన అకుంఠిత దీక్ష, నిరంతర కృషి, పట్టుదలతో మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఆయనే మూడుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్. భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా, మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సేవలందించిన ఆయన 2005 నుంచి 2018 డిసెంబర్ వరకు మధ్యప్రదేశ్ సీఎంగా కొనసాగారు. రాజకీయాల్లో విశేషమైన అనుభవమున్నా ప్రతి విషయాన్ని సున్నితంగా ఆలోచించే మనస్థత్వం చౌహాన్‌ది. వృత్తిరీత్యా ఆయనది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా మూడు సార్లు సీఎం పీఠం ఎక్కి ఔరా అనిపించారు. అంతేకాదు విదిశ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. లాడ్లీ లక్ష్మీ యోజన, కన్యాదాన్ యోజన, జననీ సురక్షా యోజన లాంటి పథకాలను ప్రవేశపెట్టి మధ్యప్రదేశ్ ప్రజల మన్ననలు అందుకున్నారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో బాబాలకు క్యాబినెట్ హోదా కల్పించి జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ (తత్వశాస్త్రం) పట్టా అందుకున్నారు. రాజకీయ ప్రవేశం 1972లో ఆర్ఎస్ఎస్ లో చేరారు. 1975లో మధ్యప్రదేశ్‌లోని మోడల్ స్కూల్ స్టూడెంట్స్ యూనియన్‌కి మొదటిసారిగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం 1976-77 ప్రాంతంలో ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ వ్యతిరేకంగా ఉద్యమించినందుకు కొంతకాలం భోపాల్‌లో జైలుశిక్ష అనుభవించారు. మొదటిసారి 1990లో బుద్నీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1991లో పదో లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతేకాకుండా 1997-98 మధ్యకాలంలో పార్టీ కీలక కమిటీల్లో సభ్యుడిగా, మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా సేవలు అందించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల్లో నాలుగోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 2000 నుంచి 2003 వరకు భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా, ఛైర్మన్ ఆఫ్ హౌస్ కమిటీ (లోక్‌సభ), బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే బుద్నీ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. మూడు పర్యాయాలు మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారం చేపట్టేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే చోటుచేసుకుంది. దీనిలో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాంద్సౌర్లో రైతులపై కాల్పులు జరిపి ఐదుగురు రైతుల మృతికి కారణమైయారన్న అప్రతిష్టను శివరాజ్‌సింగ్ మూటకట్టుకున్నారు. సంస్కరణలు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన అనంతరం రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితిని మెరుగుపరిచేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రైతులకు వడ్డీలేని రుణాలు, నీటి వనరుల పెంపు, రాయితీ ధరకు విద్యుత్ సరఫరా తదితర మార్గాల ద్వారా వ్యవసాయం వృద్ధి చెందేందుకు కృషి చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా దిగుబడి సాధించినందుకు గానూ వరుసగా నాలుగు సంవత్సరాల పాటు రాష్ట్రపతి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ‘కృషి కర్మణ్’ అవార్డును అందుకున్నారు. మనిషి జీవన విధానంలో నదుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాటిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని చెబుతూ ‘నమామి దేవి నర్మదా’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. తన నిబద్ధత, నిరాడంబరతతో చాలా సులువుగా ప్రజల్లో కలిసి పనిచేసినందుకుగాను అందరి మన్ననలు అందుకుంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవన విధానం మెరుగు పరిచేందుకు సూర్యోదయ మానవతా సేవా బిరుదును అందుకున్నారు. కుటుంబ నేపథ్యం ప్రేమ్‌సింగ్ చౌహాన్, సుందర్‌బాయ్ చౌహాన్ దంపతులకు 1959, మార్చి 5న శివరాజ్‌సింగ్ జన్మించారు. భార్య సుధాన్ సింగ్, కార్తికేయ, కునాల్ వీరిపిల్లలు. శివరాజ్ సింగ్‌ది వ్యవసాయ ఆధారిత కుటుంబం. -సురేష్ అల్లిక -
బుల్లితెర నటిగా రాణించిన ఇరానీ
సాక్షి వెబ్ ప్రత్యేకం : తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన జై బోలో తెలంగాణ చిత్రంలో జయమ్మ పాత్రలో నటించి తెలుగువారికి సుపరిచితురాలుగా నిలిచారు స్మృతి ఇరానీ. ‘ఆటుపోట్లు లేని సముద్రం.. గెలుపు ఓటములు లేని యుద్దం ఉండదని’ అంటూ స్మృతి ఇరానీ చెప్పిన డైలాగులపై, ఆమె ప్రదర్శించిన నటనపై ప్రశంసల వర్షం కురిసింది. అప్పటికే హిందీ టెలివిజన్ రంగంలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన స్మృతి.. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన స్మృతి.. చిన్ననాటి నుంచే అవకాశాలను వెతుక్కుంటూ జీవనం సాగించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి అనతికాలంలోనే కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. పలు సందర్భాల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. ఇలా ఆమె టీవీ రంగంలో, రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. స్మృతి తండ్రి పంజాబీ, తల్లి బెంగాలీ.. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి బయటికొచ్చి పెళ్లి చేసుకున్నారు. ఢిల్లీ శివార్లలో నివాసం ఉంటున్న వారికి 1976 మార్చి 23న స్మృతి ఇరానీ జన్మించారు. స్మృతికి ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు. స్మృతి ఇరానీ పెద్ద అమ్మాయి కావడంతో.. పదో తరగతి పూర్తి చేసినప్పటి నుంచే కుటుంబానికి ఆర్థికంగా చేయూత అందించేందుకు కష్టపడ్డారు. ఇంటర్ విద్యను మధ్యలోనే ఆపేసిన ఆమె మెక్ డోనాల్డ్స్‌లో హెల్పర్‌గా పనిచేశారు. అంతేకాకుండా పలు సౌందర్య సాధనాలకు మార్కెటింగ్ ఎజెంట్‌గా పనిచేశారు. దూర విద్యలో డిగ్రీ పూర్తిచేశారు. స్నేహితురాలి సలహాతో తన ఫొటోలను మిస్ ఇండియా పోటీలకు పంపిన స్మృతి 1998లో మిస్ ఇండియా ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచారు. కానీ మిస్ ఇండియా టైటిల్ సొంతం చేసుకోలేకపోయ్యారు. ఆ తర్వాత ఆమెకు ఓ ప్రకటనలో నటించే అవకాశం వచ్చింది. అలా టీవీ రంగంలోకి అడుగుపెట్టిన స్మృతి ఇరానీ పలు హిట్ సీరియల్స్‌లో నటించారు. బుల్లితెర స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2001లో తనకంటే వయసులో చాలా పెద్దవాడైన బిజినెస్మెన్ జుబిన్ ఇరానీని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఓ ప్రొడక్షన్ సంస్థ ఏర్పాటు చేసిన స్మృతి పలు సీరియల్స్‌ను కూడా నిర్మించారు. రాజకీయ జీవితం.. స్మృతి ఇరానీ తాత ఆరెస్సెస్‌లో, తల్లి జనసంఘ్‌లో సభ్యులుగా ఉండటంతో ఆమె చిన్నతనంలోనే ఆరెస్సెస్ వైపు ఆకర్షితురాలైయ్యారు. చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆలోచన ఉండటంతో.. 2003లో బీజేపీలో చేరారు. ఆ మరుసటి ఏడాదే ఆమె మహారాష్ట్ర యూత్ వింగ్ ఉపాధ్యక్షురాలిగా నియమింపబడ్డారు. తొలిసారిగా 2004 సార్వత్రిక ఎన్నికల్లో చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్‌పై చేతిలో ఓటమిపాలయ్యారు. అయిన ఆమెకు బీజేపీ తగిన గుర్తింపునిచ్చింది. 2010లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టే అవకాశం కల్పించింది. అదే సంవత్సరం బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలిగా స్మృతి ఇరానీ నియమించారు. 2011లో గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. అయితే ఆమె 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నుంచి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓడిపోయినప్పటికి పోరాట పటిమను కనబరిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి.. మోదీ అధికారం చేపట్టాక స్మృతి ఇరానీకి కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించారు. తొలుత హెచ్ఆర్డీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమెను.. 2016లో జౌళి శాఖ మంత్రిగా నియమించారు. స్మృతి తన రాజకీయ ప్రస్థానంప్రారంభించినప్పటి నుంచి సామాజిక సమస్యలపైనే కాకుండా..మహిళల హక్కుల కోసం కూడా పోరాటం కొనసాగిస్తున్నారు. జై బోలో తెలంగాణ చిత్రంతో పాటు ఆమె పలు చిత్రాలో నటించారు. స్మృతి ఇరానీకి ఇద్దరు పిల్లలున్నారు. అబ్బాయి జోహ్ర్, అమ్మాయి జోయిష్. వివాదాలు.. బీజేపీలో అతి తక్కువ కాలంలోనే ఉన్నత పదవులు చేపట్టిన స్మృతి ఇరానీని పలు వివాదాలు చట్టుముట్టాయి. 2014కు ముందు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోను, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. ఎన్నికల అఫిడవిట్లో ఆమె వెర్వేరుగా విద్యార్హతలను పేర్కొనడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగింది. ఆమె తప్పుడు డిగ్రీ సమర్పించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కానీ దానిపై స్మృతి ఇరానీ తన డిగ్రీ పట్టా ఒరిజినల్ అని స్పష్టమైన ప్రకటన చేయలేదు. స్మృతి ఇరానీ హెచ్ఆర్డీ మంత్రిగా ఉన్న కాలంలో హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల మృతి చెందారు. ఆ సమయంలో రోహిత్ మృతిపై ఆమె పార్లమెంట్లో చేసిన ప్రసంగంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆమెను హచ్ఆర్డీ నుంచి జౌళి శాఖకు మార్చారు. -సుమంత్ -
వామపక్ష ఉద్యమ ప్రకాశం
వెబ్ ప్రత్యేకం : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ (సీపీఎం) ఉద్యమ నిర్మాణంలో ప్రకాశ్ కారత్‌ది కీలక పాత్ర. విద్యావంతుడిగా పేరొందిన కారత్.. కరడుగట్టిన మార్క్సిస్ట్ వాదిగా, విమర్శకుడిగా గుర్తింపుపొందారు. డెభై ఏళ్ల వయసులో కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూ మార్క్సిస్ట్ సిద్ధాంతానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. బూర్జువా, ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికరంగాన్ని ఏకం చేయడం కోసం ఎర్రజెండా పట్టి వామపక్ష ఉద్యమానికి ప్రకాశ్ కారత్ ఊపిరిలూదారు. విద్యార్థి నాయకుడిగా మార్క్సిజంలోకి అడుగుపెట్టిన కరత్.. సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టి పార్టీలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో అసువులుబాసిన ఎందరో అమరవీరులు చూపిన బాటను అనుసరిస్తూ.. ప్రతీక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపిస్తూ పోరాడేతత్వం కారత్‌ది. ప్రముఖ మార్క్సిస్ట్ మహిళా నేత బృందా కారత్ను (1975)ను వివాహం చేసుకుని దంపతులిద్దరూ ప్రజాసమస్యలకై పోరాడుతున్నారు. కేవలం ప్రజా ఉద్యమాలతోనే కాక .. పదునైన రచనలతో కమ్యూనిస్టు ఉద్యమాన్ని చరిత్రలోకి ఎక్కించారు కారత్. తానే స్వయంగా రచయితగా అవతారమెత్తి ఎన్నో పుస్తకాలను రచించి కమ్యూనిస్ట్‌ల ఔనత్యాన్ని ప్రపంచాన్నికి పరిచయం చేశారు. దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉచ్చస్థితిలో ఉన్నప్పటి నుంచి పార్లమెంట్లో కమ్యూనిస్ట్‌ల ప్రాతినిథ్యం కోల్పోయే రెండు రకాల విభిన్నమైన పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం కరత్కుంది. బూర్జువా పార్టీల ఆధిపత్యం ఓవైపు, దశాబ్దాల చరిత్రగల కమ్యూనిస్ట్ కంచుకోటలు బీటలు బారుతూ.. ఎర్రజెండా ఉద్యమాలు బలహీనపడుతున్న పరిస్థితి మరోవైపు. ఈ నేపథ్యంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎర్రజెండాను ఎగరేసేందుకు సీనియర్ నేతగా ప్రకాశ్ ఏవిధంగా వ్యూహాలు రచిస్తారో వేచిచూడాలి. రాజకీయ నేపథ్యం ఐదు దశాబ్దాల ప్రజాజీవితంలో కమ్యూనిస్ట్‌గా అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొని మార్స్ సిద్ధాంతానికే కట్టుబడి నిలిచారు. దేశంలో పేరొందిన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో (జేఎన్‌యూ) విద్యార్థి నాయకుడిగా 1971లో మార్క్సిజంలోకి అడుగుపెట్టిన ప్రకాష్ కారత్.. సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి వరకు ఎదిగారు. సీపీఎంకు చెందిన విద్యార్థి సంఘం సంస్థ ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) వ్యవస్థాపకుల్లో ఇతను కూడా ఒక్కరు. మాజీ ప్రధాని ఇంధిరా గాంధీ విధించిన ఎమర్జన్సీకి వ్యతిరేకంగా పోరాడి.. ఏడాది పాటు అజ్ఞాతంలో గడిపాడు. జేఎన్‌యూలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు సీపీఎం ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి, కమ్యూనిస్ట్ అగ్రనేత ఏకే గోపాలన్‌ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి ఆడుగుపెట్టారు. 1974-79 మధ్య విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అ తరువాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన కారత్ 1985లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులైన్నారు. 1992లో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా పార్టీలో అనేక సంస్కరణలను అమలుచేసిన ప్రకాష్.. 2005లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 2015 వరకు ఆ పదవిలో కొనసాగారు. ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో మార్స్సిస్ట్ పార్టీ అధికారంలో ఉండి.. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ బలంగా ఉంది. యూపీఏ-1 ప్రభుత్వంలో సీపీఎం ప్రధానమైన భాగస్వామి కావడంలో కేంద్ర ప్రభుత్వంలోను ఆయన చక్రం తిప్పారు. ఆయన విజ్ఞప్తి మేరకు సోమనాథ్ చటర్జీని లోక్‌సభ స్పీకర్‌గా సోనియా గాంధీ నియమించారు. అమెరికాతో న్యూక్లీయర్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వం నుంచి బయటకొచ్చి సంచలనం సృష్టించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 9 తొమ్మిది స్థానాల్లోనే విజయం సాధించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు సీపీఎంకు కంచుకోటాలా ఉన్న బెంగాల్లో ఈ నాయకత్వంలోనే దారుణ ఓటమి చవిచూసి కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. ఆయన స్థానంలో సీతారాం ఏచూరి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరువాత వారిద్దరి మధ్య విభేదాలు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. ఏచూరి, కరత్ మధ్య విభేదాలు పార్టీని రెండు వర్గాలుగా చీల్చే పరిస్థితి వరకు వెళ్లింది. కుటుంబ నేపథ్యం ప్రకాశ్ కరత్ 1948 ఫిబ్రవరి 8న బర్మాలో జన్మించారు. అనంతరం కేరళలో స్థిరపడ్డారు. తండ్రి బర్మా రైల్వేస్‌లో ఉద్యోగి. తన పాఠశాల విద్య అంతా మద్రాస్‌లో కొనసాగించారు. ఉన్నత విద్యవంతుడైన ప్రకాశ్ తనకు కాబోయే సహచరి కూడా తన ఆలోచనలకు దగ్గరగా ఉండాలని మొదటి నుంచి అనుకునే వారు. ఆ నేపథ్యంలో లండన్‌లో విద్యనభ్యసించిన సామాజిక కార్యకర్త బృందా కరత్‌ను 1975లో వివాహం చేసుకున్నారు. భర్త అడుగుజాడల్లోనే నేను కూడా అంటూ మార్స్సిస్ట్ ఉద్యమంలోకి ప్రవేశించారు బృందా. 2005లో బెంగాల్ నుంచి ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. సీపీఎం పొలిట్‌బ్యూరోకు ఎన్నికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. - సురేష్ అల్లిక -
సోషలిస్టు దారిలో నితీష్
(సాక్షి వెబ్ ప్రత్యేకం) : నితిష్ కుమార్.. పేరు కాదు, ఇట్స్ ఏ బ్రాండ్.. అవును ఈ డైలాగ్ బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్‌కు సరిగ్గా సరిపోతుంది. దాదాపు 34 ఏళ్ల రాజకీయ జీవితం, అవినీతి మచ్చలేని మనిషి. పార్టీలు మారినా ప్రజల్లో తనకున్న ఫాలోయింగ్‌లో మాత్రం మార్పు రాలేదు. ఉన్నత కులాలకే ఉన్నత పదవులు అన్న మాటల్ని తిరగరాసి ఉన్నతమైన భావాలున్నవారందరికి అనిపించాడు. రౌడీలు రాజ్యమేలుతున్న బీహార్‌కు ఓ రాథోడ్.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కరెక్టుగా తెలిసిన రాజకీయనాయకుడు నితిష్‌కుమార్. రాజకీయ జీవితం నితిష్‌పై జయప్రకాశ్ నారాయణ్, రామ్మనోహర్ లోహియా సిద్ధాంతాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయన 1971లో రాజకీయ రంగప్రవేశం చేసి, రామ్మనోహర్ లోహియా పార్టీ సంజీవాది యువజన్ సభలో చేరారు. 1974-1977 వరకు జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.1977లో తన (కుర్మీ) సామాజిక వర్గం బలంగా ఉన్న హర్నాత్ నియోజకవర్గంలో పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. ఆ ఎన్నికల ద్వారా ఆయన ఓ గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. 1985లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1987 యువలోక్ దల్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. రెండు సంవత్సరాల అనంతరం జనతా దల్ పార్టీ సెక్రటరీ జనరల్ ఎన్నికయ్యారు. 1994లో సమతా పార్టీ పేరిట సొంత పార్టీని స్థాపించారు. జనతాదల్ యునైటెడ్ ప్రారంభమైన తర్వాత సమతా పార్టీని అందులో విలీనం చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉండగా1998-1999 మధ్య కాలం కేంద్ర మంత్రిగా రైల్వేశాఖ, వ్యవసాయ శాఖల బాధ్యతలు చేపట్టారు. 2000 సంవత్సరంలో మొదటి సారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన ఒక వారంలో నితిష్ తన పదవి కోల్పోవడం గమనార్హం. 2005లో బీజేపీతో పొత్తుపెట్టుకుని మరోసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. 2013లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. 2015లో లాలూప్రసాద్ యాదవ్, కాంగ్రెస్‌తో మహాకూటమి ఏర్పాటు చేశారు. 2016లో మహాకూటమితో తెగదింపెలు చేసుకుని పాత మిత్రుడైన బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీ సహాయంతో మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వ్యక్తిగత జీవితం మార్చి 1, 1951లో బీహార్‌లోని భక్తియార్‌పూర్‌లో కబిరాజ్ రామ్ లక్ష్మణ్ సింగ్, పరమేశ్వరి దేవి దంపతులకు జన్మించారు. తండ్రి కబిరాజ్ రామ్ లక్ష్మణ్ సింగ్ స్వాతంత్ర సమరయోధులు, ప్రముఖ ఆయుర్వేదనిపుణులు. నితిష్‌ను అందరూ ముద్దుగా మున్నా అని పిలిచేవారు. భక్తియార్‌పూర్‌లోని గణేష్ హైస్కూల్లో పదవతరగతి వరకు చదువుకున్నారు. చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. నితిష్ పాట్నాలోని బీహార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందారు. రాజకీయాల్లోకి రాకముందు బీహార్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశారు. 1973లో మంజుకుమారీ సిన్హాన అనే ఉపాధ్యాయురాలిని వివాహమాడారు. వారికి నిశాంత్ అనే ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 2007 సంవత్సరంలో నితిష్ తన భార్యను కోల్పోయారు. జీవనశైలి నితిష్ కుమార్ ఆరోగ్యం విషయంలో కచ్చితంగా ఉంటారు. అలాగని తన కోరికలను చంపుకోరు. ఓ సారి బేటియాలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో పిజ్జా ఆర్డర్ చేసుకుని మరీ తిన్నారు. తన రోజును యోగాతో ప్రారంభిస్తారు. ఉదయాన్నే మొలకలు తినటం ఆయనకు అలవాటు. ఆహారంలో కూడా కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. ‘ఆలూ బూజియా’ ఇష్టంగా తినే ఆహారం. మధ్యాహ్నం వేళల్లో చపాతీ, పరాతాలు తీసుకుంటారు. నితిష్ రూటే సఫరేటు నితిష్ కుమార్ మొత్తం పన్నేండేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్‌ను అభివృద్ధి పథంలో నడిపించారు. ఆయన సంక్షేమ పథకాలకే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. ఆడపిల్లలను బడికి రప్పించడానికి సైకిళ్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టాడు. దీంతో ఆడపిల్లలు చదువుకోవటం పెరిగింది. అంతేకాదు బీహార్‌లో మధ్యాహ్న భోజన పథకాన్ని సైతం ఆయనే ప్రవేశపెట్టాడు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని తెలిసినా రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి శభాష్ అనిపించుకున్నారు. కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నపుడే రైల్వే టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. తత్కాల్ టికెట్ల రిజర్వేషన్ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఇక నేరాల అడ్డాగా ఉన్న బీహార్‌లో నేరాలు అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకున్నాడు. తప్పు చేసింది ఎవరైనా శిక్షపడేవరకు వదిలిపెట్టలేదు. కొన్ని సందర్భాల్లో తన పార్టీ నాయకులను సైతం జైలుకు పంపించారు. ఇక మొత్తం 85వేల మందిపై క్రిమినల్ కేసులు పెట్టించాడు. దీంతో నేరాలు చాలా వరకు తగ్గాయి. - బండారు వెంకటేశ్వర్లు -
చట్టాలతో చిట్టా పద్దులు
సాక్షి వెబ్ ప్రత్యేకం : విపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షాలను ముప్పితిప్పలు పెట్ట గల సమర్థమైన నాయకుడు అరుణ్ జైట్లీ. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా అందరికి సుపరిచితులైన జైట్లీ.. కీలకమైన అనేక కేసులను వాదించిన చరిత్ర గల న్యాయకోవిధుడు. ప్రస్తుతం బీజేపీలో అత్యంత కీలకమైన నాయకుల్లో ఒకరైన అరుణ్ జైట్లీ... కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీకి నమ్మిన బంటు. మోదీ కేబినెట్లో అత్యంత కీలకమైన శాఖలు చేపట్టిన సమర్థుడైన నేత. న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. కేంద్రమంత్రి, రాజ్యసభ ప్రతిపక్షనేత, క్యాబినేట్ హోదా వంటి అనేక అత్యున్నత పదవులను జైట్లీ అధిరోహించారు. 1991లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జైట్లీ.. అనతికాలంలోనే బీజేపీలో ముఖ్యనేతగా ఎదిగారు. మాజీ ప్రధాని వాజపేయి మంత్రివర్గంలో తొలిసారి కేంద్రమంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీకి న్యాయవాద వృత్తిలో విశేష అనుభవం ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో జైట్లీ తొలుత రక్షణ శాఖ, ఆ తరువాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో అమృత్సర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం రాజ్యసభ నుంచి ప్రాతినిథ్యం వ్యవహరిస్తున్నారు. కేంద్రమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షాలపై విమర్శనాస్ర్తాలు సందించడంలో జైట్లీ దిట్ట. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా విశేష అనుభవం ఉండడంతో పార్టీ లీగల్ సెల్‌కు వ్యూహకర్తగా కూడా వ్యవహరిస్తారు. 2009 నుంచి 2014 మధ్య కాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకడి పాత్రను జైట్లీ సమర్థవంతంగా పోషించారు. విపక్ష హోదాలో ఉన్నప్పుడు అధికార పక్షంను ఇరకాట పెట్టడంలో జైట్లీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఎదిగారు. ప్రత్యర్థిపై వ్యహాలు రచించడంలో దిట్టగా పేరొందిన జైట్లీ.. ఈసారి పార్టీ గెలుపుకు ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో వేచి చూడాలి. రాజకీయ ప్రస్థానం.. విద్యార్థి దశలోనే అరుణ్ జైట్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అనేక పోరాటాలకు జైట్లీ నాయకత్వం వహించారు. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ) లో చేరారు. న్యాయవాదిగా అనుభవం ఉండటంతో మాజీ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ హయంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో తొలిసారి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సమాచార శాఖమంత్రిగా ఆయన సేవలందించారు. పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో అమృత్సర్ నియోజకవర్గం నుంచి పోటీపడి... కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్‌కు చైర్మన్‌కు ఉన్న సమయంలో జైట్లీ అవినీతికి పాల్పడ్డారంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు అప్పట్లో పెద్ద దుమారం చెలరేగాయి. దీంతో కేజ్రీవాల్‌పై జైట్లీ ఢిల్లీ హైకోర్టులో పరవునష్టం దావావేసి కోర్టుముందు నిల్చోబెట్టారు.. ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచ్చర్‌పై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేసి సంచలనం సృష్టించారు. కొచ్చర్ వీడియోకాన్ సంస్థకు అక్రమంగా నిధులను మళ్లించారని జైట్లీ ఆరోపించారు. కుటుంబ నేపథ్యం.. అరుణ్ జైట్లీ నవంబర్ 28, 1952న కొత్త ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం గుజరాత్లో స్థిరపడ్డారు. ఇతని తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ ప్రముఖ న్యాయవాది. జమ్మూ కశ్మీర్ మాజీ ఆర్థిక మంత్రి గిరిదాల్ లాల్ కుమార్తె సంగీత జైట్లీని 1982లో వివాహం చేసుకున్నారు. పిల్లలు సోనాలీ జైట్లీ, రోహన్ జైట్లీ. ఇద్దరూ కూడా లాయర్లే కావడం విశేషం. కిడ్నీ సంబందిత వ్యాధితో భాదపడుతున్న జైట్లీ ఇటీవల అమెరికాలో శస్త్ర చికిత్స కూడా తీసుకున్నారు. దాని కారణంగానే 2019 ఓటాన్ ఎకౌంట్ బడ్జెన్‌ను ప్రవేశపెట్టలేక పోయారు. -సురేష్ అల్లిక -
ఒడిసా (పట్) "నాయక్"
సాక్షి వెబ్ ప్రత్యేకం : సాదాసీదా ఆహార్యం, సాత్వికాహారం, నిరాడంబర జీవనం, రాజీలేని పనితీరు ఒడిషాలో వరుసగా నాలుగు పర్యాయాలు అధికారాన్ని నిలుపుకున్న నవీన్ పట్నాయక్ వ్యవహార శైలి. రాష్ట్రానికి చాలాకాలం దూరంగా ఉండటంతో మాతృభాష ఒడియాపై పట్టులేకున్నా కష్టించి పనిచేయడంపై మమకారమే ఆయనను ప్రజలకు చేరువ చేసింది. ఐదేళ్ల పరిపాలనతోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న నేతలకు నవీన్ పట్నాయక్ నిరంతరాయంగా ఎలా నెగ్గుకొస్తున్నారన్నది ఓ పట్టాన అంతుపట్టదు. అధికారులతో వారి సామర్ధ్యానికి అనుగుణంగా పనిచేయించడమే అభివృద్ధికి బాటలు వేస్తుందని నవీన్ పట్నాయక్ చెబుతుంటారు. కవి, రచయితగా.. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ గత నాలుగు పర్యాయాలుగా బిజూ జనతాదళ్‌ను రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టే దిశగా నడిపించడంలో విజయవంతమై దేశ రాజకీయాల్లోనే అరుదైన ఘనత సాధించారు. కవి, రచయితగానూ పేరొందిన నవీన్ పట్నాయక్ నాలుగు పుస్తకాలను ప్రచురించారు. కుటుంబ సభ్యులు, బాల్యస్నేహితులు పప్పూగా పిలుచుకునే నవీన్ పట్నాయక్ 1946 అక్టోబర్ 16న కటక్‌లో ఒడిషా మాజీ సీఎం బిజూ పట్నాయక్, గ్యాన్ పట్నాయక్ దంపతులకు జన్మించారు. డెహ్రాడూన్‌లో వెల్హాం బాయ్స్ స్కూల్, ది డూన్ స్కూల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కిరోరి మాల్ కలేజ్ నుంచి నవీన్ పట్నాయక్ బీఏ డిగ్రీ పొందారు. పాఠశాల స్ధాయి నుంచే నవీన్ పట్నాయక్ చరిత్ర, ఆయిల్ పెయింటింగ్, అథ్లెటిక్స్‌పై మక్కువ పెంచుకున్నారు. డూన్ స్కూల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నవీన్ పట్నాయక్ మూడేళ్ల జూనియర్. పట్నాయక్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) వ్యవస్ధాపక సభ్యుడిగానూ వ్యవహరిస్తున్నారు. తండ్రి మరణంతో రాజకీయ అరంగేట్రం.. ఒడిషా రాష్ట్రానికి, రాజకీయాలకు చాలాకాలం దూరంగా ఉన్న పట్నాయక్ తండ్రి బిజూ పట్నాయక్ మరణంతో అమెరికా నుంచి తిరిగివచ్చి1997లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత బీజేడీ పేరుతో పార్టీని స్ధాపించి బీజేపీ తోడ్పాటుతో 1998లో ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఒడిషా సీఎంగా నవీన్ పట్నాయక్ తనదైన పేదల అనుకూల విధానాలు, అభివృద్ధి రాజకీయాలతో రాష్ట్ర రాజకీయాల్లో కుదురుకున్నారు. ఆ తర్వాత వరుసగా నాలుగు పర్యాయాలు ఒడిషాలో అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. తండ్రి బిజూ పట్నాయక్ మరణానంతరం ఒడిషాలోని అస్కా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలో నవీన్ పట్నాయక్ పోటీచేసి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అటల్ బిహారి వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన కేంద్ర గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఒడిషా సీఎంగా.. 2000 సంవత్సరంలో జరిగిన ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో బీజేడీ అధికారంలోకి రావడంతో నవీన్ పట్నాయక్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఒడిషా సీఎం పగ్గాలు చేపట్టారు. ఇక 2004, 2009, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒడిషాలో నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ తిరుగులేని విజయాలు సాధించి అధికారాన్ని నిలుపుకుంది. తండ్రి తరహాలోనే అధికార యంత్రాంగంపై గట్టి పట్టుకలిగిన పట్నాయక్ వారిని అభివృద్ధి పనుల్లో నిరంతరం శ్రమించేలా పర్యవేక్షించడంలో విజయం సాధించారు. పట్నాయక్ తన బాల్య, యవ్వన దశలు ఎక్కువగా ఒడిషాకు దూరంగా గడపడంతో ఒడియా భాష రాయడంలో, పలకడంలో ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశంలోనే తమ ప్రాంతీయ భాష మాట్లాడటం రాని తొలి సీఎం నవీన్ పట్నాయక్ కావడం గమనార్హం. ఒడియా మాట్లాడటం రాని సీఎంగా ఆయన విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పట్నాయక్‌కు హిందీ, ఫ్రెంచ్, ఆంగ్ల భాషల్లో మంచి నైపుణ్యం ఉంది. ఇక ర్యాలీలు, బహిరంగ సమావేశాల్లో రోమన్ అల్ఫాబెట్‌లో ఆయన ఒడియా ప్రసంగాలు సాగుతాయి. హాబీలు : పుస్తక పఠనం, సాంస్కృతిక, చారిత్రక, పర్యావరణ కార్యక్రమాలు వీక్షించడం, రచనా వ్యాసంగం ఇష్టమైన ఆహారం : మసాలా కూర్చిన బెండకాయ ఫ్రై, వైట్‌సాస్‌తో ఫ్రైడ్ చికెన్ -మురళి -
కాషాయ దిగ్గజం..!
సాక్షి వెబ్ ప్రత్యేకం : బీజేపీ భీష్ముడు. దేశాన్నేలుతున్న భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి అత్యంత సన్నిహితుడు లాల్‌కృష్ణ అద్వాణీ. దేశభక్తి భావాలతో 14 ఏళ్ల ప్రాయంలోనే ఆరెస్సెస్‌లో చేరి భారత రాజకీయాల్లో చక్రం తిప్పిన దిగ్గజ నాయకుడు. కేంద్ర హోంమంత్రిగా, ఉప ప్రధానిగా సేవలందించిన ఒకప్పటి కమలదళాధిపతి. రామ్ జన్మభూమి-బాబ్రి ఉద్రిక్తతల నేపథ్యంలో రథయాత్ర చేపట్టి బీజేపీ శ్రేణుల్లో సరికొత్త జవసత్వాలు నింపిన దూకుడు మనిషి. రెండు స్థానాలున్న బీజేపీని 86 స్థానాలకు చేర్చిన కాషాయ ధీరుడు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికి వాజ్‌పేయి ప్రధాని కావడానికి పాటుపడిన రాజకీయ చతురుడు. ఏనాటికైనా ప్రధానమంత్రి పదవి చేపట్టడం ఆయన కల. 1999లో ఎన్డీయే అధికారంలోకి రాగానే.. సంకీర్ణ రాజకీయాల రీత్యా మృదుస్వభావి వాజ్‌పేయి ప్రధాని కావడంతో ఉప ప్రధాని, హోంమంత్రి పదవికి పరిమితమైన అద్వాణీ.. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నడుమ తన కలను నెరవేర్చుకలేకపోయారు. గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోదీ బీజేపీలో అనూహ్యంగా ఎదిగి రావడం.. 2014 ఎన్నికల్లో ఆయన బీజేపీ ప్రచారసారథిగా పగ్గాలు చేపట్టి.. ఆ పార్టీకి అద్భుతమైన విజయాన్ని చేకూర్చడంతో రాజకీయాల్లో, పార్టీలో అద్వాణీకి, ఆయన తరానికి ప్రాధాన్యం తగ్గిపోయింది. నరేంద్రమోదీ ప్రధాని కావడం.. ఆయన అనుచరుడైన అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు కావడంతో.. బీజేపీ నుంచి అద్వాణీ తరం క్రమంగా తెరమరుగైంది. ఈ నేపథ్యంలో 92 ఏళ్ల కురువృద్ధుడైన అద్వాణీ రానున్న రాజకీయాల్లో ఏ పాత్ర పోషిస్తారా? ఆయన ప్రభావమెంతా? రాజకీయాల నుంచి తప్పుకుంటారా? మళ్లీ పోటీ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. కుటుంబ నేపథ్యం... సింధీ ఫ్యామిలీకి చెందిన కిషన్‌చంద్ డీ.అద్వాణీ, జ్ఞానీదేవీ దంపతులకు 1927, నవంబర్ 8 న కరాచీలో లాల్‌క్రిష్ణ అద్వాణీ జన్మించారు. దేశ విభజన అనంతరం కిషన్‌చంద్ కుటుంబం పాక్ నుంచి భారత్‌కు తిరిగొచ్చింది. కమలా ఎల్కే అద్వాణీ వివాహం 1965 లో జరిగింది. వీరికి కుమారుడు జయంత్, కూతురు ప్రతిభ ఉన్నారు. ఆయన తోబుట్టువు షీలా అద్వాణీ. చదువు... కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ పాఠశాలలో హైస్కూల్ చదువు పూర్తి చేశారు. పాకిస్తాన్‌లోని హైదరాబాద్ డీజీ నేషనల్ కాలేజీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. కరాచీలోని మోడల్ హైస్కూల్లో 1944లో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. రాజకీయ జీవితం దేశ విభజన అనంతరం కుటుంబంతో కలిసి పాకిస్తాన్ నుంచి భారత్‌కు చేరుకున్న ఎల్కే అద్వాణీ భారత పునర్నిర్మాణానికై తనవంతు కృషి చేయాలనుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో వలంటీర్‌గా చేరారు. అనంతరం రాజకీయాల వైపు అడుగులేశారు. 1951లో శ్యామప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ (బీజేఎస్) లో చేరారు. 1957లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సహాయకుడిగా పనిచేశారు. 1958 నుంచి 1963 వరకు జనసంఘ్ ఢిల్లీ శాఖకు కార్యదర్శిగా సేవలందించారు. బీజేఎస్ రాజకీయ పత్రిక ’ఆర్గనైజర్’ ఉపసంపాదకుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా ఎన్నికయ్యారు.1970లో మొదటిసారిగా లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు. 1972లో జనసంఘ్‌కు అధ్యక్షత వహించారు. మిత్ర పక్షాలతో కలిసి 1977లో జనసంఘ్ జనతా పార్టీగా ఆవిర్భవించింది. జనతా పార్టీ విచ్చిన్నంతో వాజ్ పేయి అధ్యక్షతన 1980లో ఏర్పాటైన బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో అద్వాణీ ఒకరిగా ఉన్నారు. అదే సంవత్సరం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ స్థాపించిన అనంతరం 1984 లోకసభ ఎన్నికల్లో రెండు సీట్లకే పరిమితమైన బీజేపీ.. అద్వాణీ సారధ్యంలో 1989 ఎన్నికల వరకు ఘణమైన వృద్ధి సాధించింది. ఆ ఎన్నికల్లో 86 సీట్లు గెలుచుకుంది. ఇక హిందుత్వం ప్రధాన ఎజెండాగా.. లౌకికవాదం నేపథ్యంగా..1990లో ఆయన చేపట్టిన రామజన్మభూమి రథయాత్ర దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. 1997లో 50 ఏళ్ల స్వతంత్ర భారత 'గోల్డెన్ జుబ్లీ' వేడుకలను నిర్వహించేందుకు అద్వాణీ దేశం నలుమూలల నుంచి స్వర్ణ జయంతి రథయాత్ర చేసి బీజేపీని మరో మెట్టు ఎక్కించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావడానికి తనవంతు కృషి చేశారు. వాజ్‌పేయి క్యాబినెట్లో 1998లో హోం మంత్రిగా, 2002 నుంచి 2004 వరకు ఉప ప్రధానిగా సేవలందించారు. 2004లో బీజేపీ ఓటమి పాలవడం.. పదేళ్లపాటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో అద్వాణీ నాయకత్వం ప్రభ కోల్పోయింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అద్వాణీని ప్రధానిగా అభ్యర్థిగా ప్రకటించింది. కానీ, ఆయన పార్టీని విజయపథంలో నడపించలేకపోయారు. 2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని బీజేపీ ప్రచారంలోకి దింపింది. దీనిని వ్యతిరేకిస్తూ అద్వాణీ రాజీనామా చేశారు. పార్టీ నాయకులంతా నచ్చజెప్పడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. గాంధీనగర్ లోకసభ నుంచి అద్వాణీ ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇటీవల లోక్‌సభలో ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. 1976 నుంచి 1982 వరకు అద్వాణీ గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. నా జీవితం.. నాదేశం.. ఆరు భారతీయ భాషల్లో విడుదలైన ఎల్కే అద్వాణీ జీవిత చరిత్ర ‘మై కంట్రీ మై లైఫ్’ 2008లో విడుదలై ప్రాచుర్యం పొందింది. ఈ పుస్తకాన్ని భారత్ మిస్సైల్ మేన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విడుదల చేశారు. ఈ పుస్తకంలో వాజ్‌పేయితో తన 65 ఏళ్ల అనుబంధాన్ని పంచుకున్నారు అద్వాణీ. వాజ్‌పేయి భారతరత్నకు అన్ని విధాల అర్హుడని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అద్వానీ లేఖ కూడా రాశారు. -వేణు.పి -
గ్వాలియర్ మహారాజు
సాక్షి వెబ్ ప్రత్యేకం : యువరాజుగా రాజభోగాలు అనుభవించాల్సిన వాడు రాజభవంతులు, పట్టుపరుపులు వదిలి ప్రజల కోసం ఎర్రటి ఎండలో తిరిగాడు. వివాదాలు, విమర్శలు, ఎదురు దాడులతో సహావాసం చేశాడు. తండ్రి మరణంతో అనుకోకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టినా తను మాత్రం అనుకున్నది చేసుకుంటూపోయాడు. తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. ఆనతి కాలంలో ముఖ్యమంత్రి పదవికి అర్హుడనిపించకున్నాడు. చేతివరకు వచ్చిన సీఎం పదవి నోటికందకపోయినా బాధపడకుండా తనపనితాను చేసుకుపోతున్నాడు రాసబిడ్డ జ్యోతిరాదిత్య సింధియా. వ్యక్తిగత జీవితం జ్యోతిరాదిత్య సింధియా గ్వాలియర్ మహారాజు జీవాజీరావ్ సింధియా మనవడు. 1జనవరి 1971లో మాధవ్‌రావ్ సింధియా, మాధవి రాజే సింధియా దంపతులకు ముంబై నగరంలో జన్మించారు. ముంబైనగరంలోని కాంపియన్ స్కూల్, డెహ్రడూన్‌లోని డూన్ స్కూల్లలో పదవతరగతి వరకు చదువుకున్నారు. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి ఎకనమిక్స్‌లో డిగ్రీ పట్టాపొందారు. స్టాన్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ చేశారు. 1994లో మరాఠా గైక్వాడ్ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజేను వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు మహానార్యమన్, కుమార్తె ఉన్నారు. రాజకీయ జీవితం తండ్రి మరణంతో రాజకీయాలలోకి ప్రవేశించారు జ్యోతిరాదిత్య సింధియా. మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాధవ్‌రావ్ విమాన ప్రమాదంలో మరణించగా 2001 డిసెంబర్ 18న కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2002లో తండ్రి మరణంతో ఖాళీ పడ్డ స్థానంలో బై ఎలక్షన్లో గుణ ఎంపీగా గెలుపొందారు. దేశంలోనే అత్యంత ధనవంతులైన మంత్రులలో ఈయన కూడా ఒకరు. 2008లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా సేవలందించారు. 2009లో స్టేట్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2013 మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల తర్వాత సీఎంగా జ్యోతిరాధిత్య సింధియా, కమల్‌నాథ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే సింధియా అభ్యర్థిత్వాన్ని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకించటంతో ముఖ్యమంత్రి పదవి చేజారింది. వివాదాలు తండ్రి మాధవ్‌రావ్ సింధియాకు చెందిన 20వేల కోట్ల అస్తి తనకే చెందాలని జ్యోతిరాదిత్య సింధియా కోర్టులో కేసువేశారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ జ్యోతిరాదిత్య మేనత్తలు కోర్టులో కేసు వేశారు. దళిత నేతకు అవమానం జరిగేలా ప్రవర్తించారని ఆరోపిస్తూ బీజేపీ నేత నంద కుమార్ సింగ్ చౌహాన్ జ్యోతిరాదిత్య సింధియాపై కేసు పెట్టారు. రాజకీయాల రాజవంశం సింధియా కుటుంబం దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా మొదట జన్ సంఘ్ నుంచి పోటీ చేసినప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారారు. కాగా అదే కుటుంబానికి చెందిన బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు విజయ రాజే సింధియా, ఆమె కుమార్తెలు వసుంధరా రాజే(రాజస్తాన్ మాజీ సీఎం), యశోదర రాజే(మధ్యప్రదేశ్ ఎంపీ) బీజేపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ సింధియాలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు పోటీకి నిలబడలేదు. గ్వాలియర్ సంస్థానాధీశుల వారసుడు జ్యోతిరాదిత్య సింధియా. ఆయన నానమ్మ రాజమాత విజయరాజే సింధియా జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1971 ఎన్నికల్లో జనసంఘ్ తరఫున విజయరాజేతోపాటు మాధవ్‌రావు సింధియా కూడా పోటీ చేసి, గెలుపొందారు. అప్పట్లో ఇందిర ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన అతికొద్ది మందిలో వీరు కూడా ఉన్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విజయరాజేను కూడా ప్రభుత్వం జైలుపాలు చేసింది. అయితే, మాధవ్‌రావు సింధియా 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన తోబుట్టువులు వసుంధరా రాజే, యశోధరా రాజే బీజేపీలో చేరారు. ఇష్టాఇష్టాలు జ్యోతిరాదిత్య సింధియాకు క్రికేట్, స్విమ్మింగ్, రీడింగ్ అంటే చాలా ఇష్టం. - బండారు వెంకటేశ్వర్లు -
నాడు కండక్టర్‌గా టికెట్లిచ్చి..!!
సాక్షి, వెబ్ ప్రత్యేకం : పైన దేవుడు శాసిస్తాడు.. కింద రజనీకాంత్ పాటిస్తాడు.. అని చెప్పే తలైవాకు ఇన్నేళ్లకు దేవుడి శాసించాడు. గత రెండు దశాబ్దాలుగా తన రాజకీయ ప్రస్థానంపై ఊగిసాలాటాడిన రజనీ.. ఎట్టకేలకు పార్టీ పెట్టబోతోన్నట్లు ప్రకటించారు. మరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనే తన పార్టీ పోటీ చేయనుందని ప్రకటించిన రజనీ వ్యూహం ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. చకచకా సినిమాలు చేస్తోన్న రజనీ.. రాజకీయాల్లో మాత్రం చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. మరి రజనీ రాజకీయాల్లో పెను విప్లవం తీసుకోస్తాడని భావిస్తోన్న అభిమానులు ఆశ నెరవేరుతుందా? ఆ దిశగా తలైవా దూసుకుపోతారా లేదా చూడాలి. కండక్టర్‌గా లైఫ్ సాగుతోన్న వేళ.. తన మిత్రుడు రాజ్ బహదుర్ ఇచ్చిన సలహా.. తనను ఇంతటి వాడ్ని చేసిందని ఎన్నో వేదికలపై చెప్పారు తలైవా. అందుకే ఇప్పటికీ ఆ మిత్రుడి సలహా తీసుకుంటారు రజనీ. కర్ణాటకను వదిలి చెన్నైలో అడుగుపెట్టిన ఓ సాధారణ వ్యక్తి.. అసాధరణ శక్తిగా ఎదిగి తమిళ దైవంగా ఆరాధించే స్థాయికి చేరుకున్నారు. ఆయన ఒక్కసారి చెబితే.. జయలలిత పీఠం కదిలిందంటేనే ఆయన పవరేంటో అర్థమవుతుంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో.. రజనీ కూడా ఆమె ఇంటికి దగ్గర్లోనే ఉండేవారు. అయితే ఓనాడు సీఎం బయలుదేరుతోందని ఆమె సెక్యురిటీ రజనీని రోడ్డుపై ఎదురు చూసేలా చేశారట. అయితే రజనీ పక్కకు వచ్చి కార్లోంచి దిగి సిగరెట్ తాగుతూ ఉండగా.. రజనీని చూసిన అభిమానులు అక్కడికి తండోప తండాలుగా వచ్చారట. ఇక ముఖ్యమంత్రి పోవడానికి దారిలేక పోయేసరికి సిబ్బంది వచ్చి రజనీని వెళ్లాల్సిందిగా ప్రార్థించారట. అప్పటి నుంచి రజనీ-జయలలిత మధ్య వైరం మొదలైందని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. 1996 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఓ సినీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, రాష్ట్రంలో అసహన ధోరణలు నెలకొన్నాయని ప్రకటించడం ద్వారా రజనీ అదే వేదికపై ఉన్న ముఖ్యమంత్రి జయలలితకు కోపం తెప్పించారు. 1996 ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే-తమిళ మానిల కాంగ్రెస్ కూటమికి ఓటేయాలని ప్రజలకు పిలుపు ఇస్తూ, ‘‘జయలలితకు మళ్లీ అధికారం అప్పగిస్తే దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడు,’’ అని రజనీకాంత్ చేసిన ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది. జయలలిత మరణం.. అటుపై చోటుచేసుకున్న పరిణామాలు.. రాజకీయాల్లో ఏర్పడిన అనిశ్చితిని తొలగించడానికి రజనీ సిద్దమైనట్లు తన రాజకీయ ప్రవేశాన్ని నిర్దారించారు. వచ్చే లోక్‌సభలో కాకుండా.. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మరాఠి మూలాలున్న శివాజీ రావ్ గైక్వాడ్ (రజనీకాంత్).. 1950 డిసెంబర్ 12న కర్ణాటకలో పుట్టి, పెరిగిన రజనీ కాంత్.. తమిళనాడులో సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగారు. లతా రంగాచారిని రజనీ వివాహామాడగా.. వీరికి ఇద్దరు కుమార్తెలు (సౌందర్యా రజనీకాంత్, ఐశ్వర్యా ధనుష్) ఉన్నారు. రజనీకాంత్ నిత్యం హిమాలయాలకు వెళ్తారు. అక్కడ ప్రశాంతంగా గడపడమంటే తలైవా ఇష్టమని చెబుతూ ఉంటారు. - బండ కళ్యాణ్ -
మాటల మాంత్రికుడు
సాక్షి వెబ్ ప్రత్యేకం : చూస్తే బక్క పలుచగుంటడు కానీ.., తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అన్న నినాదంతో ఉద్యమాన్ని ఉప్పెనలా మార్చిన ధీరుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తన ప్రసంగాలతో ప్రజలను మంత్రముగ్ధులను చేసే ఓ మాటల మాంత్రికుడు. ప్రజల సమస్యలను నిశితంగా అర్థం చేసుకుని మళ్లీ వాటిని వారికే సులువైన మాటల్లో వినిపించడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమకారుడు. తన వాక్చాతుర్యంతో ప్రత్యుర్థులకు ముచ్చెమటలు పట్టించే రాజకీయ నాయకుడు. ప్రత్యర్థుల బలాన్ని కూడా తన బలంగా మార్చుకోగల యుక్తిపరుడు. భావజాలాన్ని వినిపించడం కాదు, ప్రజల గుండెల్లో నాటగల సమర్థుడు. ఏదీ చిన్నగా ఆలోచించకూడదు. పెద్ద ఆలోచన చేయాలనే చెప్పే వ్యూహకర్త. పార్టీ పెట్టి.. ఉద్యమం చేసి, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రి అయిన లీడర్. ముందస్తు ఎన్నికలకెళ్లి ఒంటి చేత్తో రెండోసారి భారీ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన వీరుడు. ఓటమితో మొదలై... ఓటమి ఎరుగని నేతగా ఐఏఎస్ కావాలని కల కన్న కేసీఆర్‌కు.. ఇంటర్ చదివేప్పుడే పెళ్లి కావడం, ఇతర వ్యాపకాలతో అది కలగానే మిగిలింది. సిద్ధిపేట డిగ్రీ కాలేజిలో ఆయన హిస్టరీ, తెలుగు లిటరేచర్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులతో బిఏ పూర్తి చదివారు. ఆ సమయంలో ఆయన విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ నేత అనంతుల మదన్ మోహన్ శిష్యుడిగా ఉంటూ రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. డిగ్రీ పూర్తి కాగానే అసలు రాజకీయాలు రాష్ట్రంలో కాదు ఢిల్లీలోనే జరుగుతున్నాయని భావించిన కేసీఆర్ ఎమర్జెన్సీ విధించిన ఏడాదే ఢిల్లీకి వెళ్లి సంజయ్ గాంధీ నాయకత్వంలోని యూత్ కాంగ్రెస్‌లో చేరారు. సంజయ్ గాంధీ ప్రమాదంలో చనిపోవడంతో 1980లో సిద్ధిపేటకు తిరిగి వచ్చారు. ఎన్టీఆర్ 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కేసీఆర్ ఆ పార్టీలో చేరారు. సిద్ధిపేట నియోజకవర్గం నుంచి తన రాజకీయ తొలి గురువు మదన్ మోహన్ మీదే పోటీ చేసి కేవలం 877 వోట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత 1985లో మళ్ళీ టీడీపీ తరఫున బరిలోకి దిగి తన రాజకీయ జీవితంలో తొలి కీలక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత కేసీఆర్ మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. వరుసగా ఎనిమిదిసార్లు అసెంబ్లీకి, ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1987లో ఎన్టీఆర్ క్యాబినెట్లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1997లో చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1999-2001 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటి స్పీకర్‌గా పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. 2004 ఎన్నికల్లో తన సొంత పార్టీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 14వ లోక్‌సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి మద్దతు ప్రకటించి 5 లోక్‌సభ సభ్యులున్న టీఆర్ఎస్ తరఫున కేసీఆర్ మంత్రి పదవి పొందారు. 2004 నుంచి 2006 వరకు కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి పదవిని నిర్వహించిన అనంతరం మారిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో మంత్రి పదవులకు రాజీనామా చేయడమే కాకుండా యూపీఏ కూటమికి మద్దతు కూడా ఉపసంహరించుకున్నారు. 2008లో మళ్లీ రాష్ట్రమంతటా టీఆర్ఎస్ సభ్యులు చేసిన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలలో మళ్లీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి 15,000 పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 15వ లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఠల్ రావుపై గెలుపొందాడు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. సాధారణ ఎన్నికల్లోనే కాకుండా పలుమార్లు రాజీనామాలు చేయగా వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్‌ను తిరిగి భారీ మెజారిటీలతో ఎన్నుకుని ప్రజలు విజయాలు కట్టబెట్టారు. ఒక దశలో రాజీనామా కేసీఆర్‌కు రాజకీయంగా పెద్ద అస్త్రంగా మారింది. రాష్ట్రమంతటా పోటీ దేశంలో అనేక మంది నాయకులను, వారి రాజకీయ జీవితాలను పరిశీలిస్తే వారి వారి నియోజకవర్గాలు, జిల్లాలకే పరిమితమై అక్కడినుంచే అనేకమార్లు గెలిచేవారు ఎక్కువ. కానీ కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ప్రత్యేకం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పోటీ చేసి ఘన విజయాలు సాధించిన చరిత్ర ఆయనకే సొంతం. ఒకే నియోజకవర్గానికి పరిమితం కాకుండా తెలంగాణవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి సునాయాసంగా గెలిచిన చరిత్ర ఆయనది. సిద్దిపేట మొదలు కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, గజ్వేల్ల నుంచి ఆయన విజయదుందుభి మోగించారు. పదవుల్లోనూ ప్రత్యేకతలు పదవుల్లో పని చేయడంలో కూడా కేసీఆర్ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన. ఎన్టీఆర్ మంత్రివర్గంలో డ్రాట్ అండ్ రిలీఫ్, చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు .ఉమ్మడి రాష్ట్రంలో ఉప సభాపతిగా పనిచేశారు. కేంద్రంలో ప్రధాని మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో కార్మిక శాఖ విధులు నిర్వహించారు. తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ జూన్ 2, 2014న ప్రమాణం చేశారు. ‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం’ అనే నినాదంతో పరిపాలన కొనసాగించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆసరా, రైతుబంధు, కల్యాణ లక్ష్మీ లాంటి వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఒంటిచేత్తో టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొచ్చి రెండోసారి సీఎం పదవిని చేపట్టారు. ముందస్తుకెళ్లి.. చరిత్ర సృష్టించాడు దేశంలో గుణాత్మక మార్పు రావాలని ఫెడరల్ ఫ్రంట్‌కు స్వీకారం చుట్టిన కేసీఆర్... సెపెట్టంబర్ 6, 2018న అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెరలేపారు. ఒక్కడే రాష్ట్రమంతా తిరిగి ఒంటిచేత్తో విజయాన్ని సాధించాడు. ప్రజా కూటమి పేరిట కాంగ్రెస్, టీడీపీలు ముకుమ్మడిగా దాడి చేసినా.. ఓ వర్గం మీడియా చంద్రబాబుకు దన్నుగా నిలిచి తనపై విష ప్రచారానికి దిగినా.. మొక్కవోని దీక్షతో టీఆర్ఎస్ని అధికార పథంలో నిలిపారు. 119 స్థానాలకు పోటీ చేసి 88 స్థానాల్లో విజయ దుందుభి మోగించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఇందిరాగాంధీ లాంటి హేమాహేమీలు పరాభావం చెందినా కేసీఆర్ మాత్రం భారీ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. అయితే నియంతృత్వ పోకడ, బంధుప్రీతి వంటి అంశాల్లో ఆయనపై విమర్శలున్నాయి. ఇష్టాయిష్టాలు కేసీఆర్‌కు ఎన్టీఆర్, అమితాబ్ సినిమాలంటే చాలా ఇష్టం. పౌరాణిక చిత్రాలను బాగా ఎంజాయ్ చేసేవారు. ఘంటసాల పాటలంటే ప్రాణం, ఆ పాటలు విని మంచిమూడ్‌లో వాటిని ఎదుటివారికి వినిపించడమంటే ఆయనకు ఇష్టం. పుస్తక ప్రియుడు. ఓల్గా నుంచి గంగ వరకు పుస్తకాలన్ని ఎన్నిసార్లు చదివారో ఆయనకే గుర్తు లేదు.దూర ప్రయాణాల్లో కారు డ్రైవింగ్ చేయడం ఆయనకో సరదా. సాహిత్య పుస్తకాలు విపరీతంగా చదువుతారు. పుస్తక ప్రియులతో గంటల తరబడి చర్చల్లో గడుపుతారు. నిత్వం అన్ని పేపర్లు చదవనిదే తర్వాత పనిలోకి వెళ్లరు.గల్లీ రాజకీయం నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు ఆసక్తిగా తెలుకుంటారు. కుటుంబం వివరాలు కుటుంబంలోని 11 మందిలో ఒకరు. ఒక అన్నా, తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. 1954 ఫిబ్రవరి ,17న చింతమడక (సిద్దిపేట)లో జన్మించిన కేసీఆర్‌కు ఒక కుమారుడు, ఒక కూతురు. ఇద్దరూ రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. కూతురు కవిత నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కుమారుడు కేటీఆర్ మంత్రిగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకున్నారు. కుమార్తె కవిత పుట్టిన తర్వాతే రాజకీయాల్లో కలిసొచ్చిందని కేసీఆర్ గట్టి నమ్మకం. కొడుకు (కేటీఆర్) తొట్టిలప్పుడు (1975లో) ఇంటికి కూడా వెళ్లలేదు. కుంటుంబ సభ్యులతో తక్కువగా గడుపుతారు. 'గొప్పవాళ్లందరూ కుటుంబానికి ద్రోహులే ' అని ఆయన సమర్థించుకుంటారు కూడా. - అంజి శెట్టె -
ఆమె ఒక మహిళా జాగృతి
సాక్షి వెబ్ ప్రత్యేకం : మహిళా రాజకీయ నేతల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుని, తండ్రి కేసీఆర్ తగ్గ తనయ, అన్న కేటీఆర్‌కు దీటుగా ఎదుగుతోన్న నాయకురాలు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. ఆమె మాటల తూటాలను ప్రత్యర్థి పైకి వదిలితే.. ఎంతటి వారైనా కంగు తినాల్సిందే. రాజకీయ ప్రసంగాల్లో తన వాగ్ధాటితో జన సమూహాన్ని ఆకర్షించే కవిత.. లోక్‌సభలో మన రాష్ట్ర హక్కులకై నిరంతరం పోరాడుతున్నారు. అనితర సాధ్యమైన వాక్పటిమతో.. జాతీయస్థాయిలో మన రాష్ట్ర గొంతును వినిపిస్తున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించేందుకు సిద్దమయ్యారు. నర్సు అవ్వాలన్నది తన చిన్నప్పటి కల అని.. ఆస్పత్రులకు వెళ్లినప్పుడు నర్సులు తెల్ల గౌను వేసుకొని రోగులకు వైద్యసేవలు అందించడాన్ని చూసి పెద్దయ్యాక నర్సు వృత్తిలోనే చేరాలని అనుకున్నాను ఓ సందర్భంలో కవిత చెప్పుకొచ్చారు. అయితే పరిస్థితుల కారణంగా తాను ఇంజనీరింగ్ చదివి, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించానని చెప్పారు. వ్యాపారవేత్తగా రాణించాలనుకున్నా అదీ సాధ్యపడలేదని, విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం తన భవిష్యత్తునే మార్చేసిందన్నారు. కుటుంబంతో పాటు తానూ ఉద్యమంలో పాలుపంచుకుని రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ జాగృతిని స్థాపించి.. ప్రపంచస్థాయిలో తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారు. సమాజంలోని అన్నీ వర్గాల వారికి చేరువ అయ్యేలా దీనిని కవిత తీర్చిదిద్దారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలతో మమేకమవుతూ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల గొప్పదనాన్ని చాటిచెబుతూ వారిని ఉద్యమంలో పాల్గొనేలా చేయడంలో తెలంగాణ జాగృతి విజయవంతమైంది. తెలంగాణ జాగృతి ఇటీవలే పదేళ్ళ సంబరాన్ని పూర్తి చేసుకుంది. కేవలం తెలంగాణలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఏకం చేసేందుకు తెలంగాణ జాగృతిని ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్ళడంలో కవిత సక్సెస్ అయ్యారు. పలు దేశాల్లో నేడు తెలంగాణ జాగృతి విస్తృతమైంది. విద్య, వైద్యం, ఉపాది రంగాల్లో బాగా వెనకబడి ఉన్న మనవాళ్ళను జాగృత పరచాలని కవిత నిర్ణయించు కున్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ జాగృతి ద్వారా కొన్ని ప్రాజెక్టులను ఆమె చేపట్టారు. మహిళలకు, యువకులకు స్వయంఉపాధి, విద్యలో ప్రతిభ కనబరిచిన పేదవాళ్ళకు స్కాలర్షిప్లు, చదువు పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు నైపుణ్యాభి వృద్ధిలో శిక్షణ ఇచ్చి వారికి తగిన ఉపాధి లభించేలా చేయడం వంటివి చేస్తున్నారు. సేవ్ ఫార్మర్ పేరిట వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు రాక ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు వీలుగా 2500 రూపాయలను పెన్షన్‌గా వారికి అందిస్తున్నారు. ప్రతి యేడాది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలు దేశవిదేశాల్లో ప్రాచుర్యం పొందాయి. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ.. మహిళా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. యేటా ట్యాక్‌బండ్‌పై నిర్వహించే బతుకమ్మ పండుగలో కవిత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఉద్యమ సమయంలోనూ పలుమార్లు ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఆడుతూ స్వరాష్ట్ర కాంక్షను చాటిచెప్పారు. తండ్రి కేసీఆర్ నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుని రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారు. సినిమా రంగం విషయానికొస్తే.. చిరంజీవి తన అభిమాన హీరో అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. చిన్నతనంలో తన అన్నే ఎప్పుడైనా సినిమాలకు తీసుకెళ్లేవాడని ఓ ఇంటర్వ్యూలో చెబుతూ అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 1978 మార్చి13న జన్మించిన కవిత.. ఇంజనీరింగ్ విద్యనభ్యసించి.. అటుపై మాస్టర్స్ డిగ్రీని అమెరికాలో పూర్తి చేశారు. దేవన్‌పల్లి అనిల్‌కుమార్‌ను వివాహామాడిన కవితకు ఇద్దరు కుమారులు(ఆదిత్య,ఆర్య) ఉన్నారు. - బండ కళ్యాణ్ -
వెండి తెర నాయకుడిగా
సాక్షి వెబ్ ప్రత్యేకం : స్వాతి ముత్యం లాంటి స్వచ్చమైన నటనైనా.. సాగర సంగమంలాంటి విషాదమైనా.. విచిత్ర సోదరుల్లాంటి ప్రయోగానికైనా తన నటనతో ప్రాణం పోసే నటుడు కమల్‌హాసన్. రీల్ లైఫ్‌లో నాయకుడు, క్షత్రియ పుత్రుడు లాంటి సినిమాల్లో తన చుట్టూ ఉన్న జనం కోసం పోరాడిన కమల్.. రియల్ లైఫ్‌లోనూ జనం తరపున నిలబడేందుకు సిద్దమయ్యారు. మరి ఈ దశావతార పురుషుడు.. రాజకీయ చదరంగంలో నిలదొక్కుకునేందుకు రెడీ అయ్యారు. తన ప్రత్యర్థులకు చెక్ పెట్టి.. రియల్ లైఫ్‌లోనూ ‘నాయకుడు’గా ప్రజల ముందుకొస్తున్నారు కమల్ హాసన్. చిత్ర పరిశ్రమలో గొప్ప నటుడిగా జాతీయ స్థాయిలోనే గాక ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది యూనివర్సల్ హీరోగా కీర్తి గడించారు కమల్ హాసన్. తన సినిమాలతో, నటనతో అంతులేని అభిమాన గణాన్ని సొంతం చేసుకుని.. నటుడు, దర్శకుడు, నిర్మాత, డ్యాన్సర్, సింగర్‌గా అనేక విభాగాల్లో తనదైన ముద్రను వేశారు. బుల్లితెరపైనా బిగ్‌బాస్ షోతో.. తన చతురతను ప్రదర్శించారు. రాజకీయ రంగంలో మార్పులు తెచ్చి, ప్రజలు మెచ్చే పాలనను అందించేందుకు అడుగులు వేస్తున్నారు. జయలలిత మరణంతో ఏర్పడిన శూన్యాన్ని పూరించడానికి, రాజకీయ అవినీతిని రూపుమాపేందుకు రాజకీయ పార్టీని స్థాపించారు. నాస్తికత్వ భావనలు కల కమల్ హాసన్ బ్రాహ్మణ సమాజానికి చెందినవారు. దేవుడి ఉనికి ప్రశ్నిస్తూ.. సెక్యులర్ భావజాలం ఉన్న కమల్ హాసన్.. మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించి.. రాజకీయం అరంగేట్రం చేశారు. కాంగ్రెస్, డీఎంకేతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ విధానాలపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ.. ముక్కు సూటిగా వ్యవహరించడం కమల్ శైలి. కుటుంబ నేపథ్యం శ్రీనివాసన్-రాజ్యలక్ష్మీ దంపతులకు 1954 నవంబర్ 7న రామనాథపురంలోని పరమక్కుడిలో కమల్ హాసన్ జన్మించారు. కమల్ హాసన్.. బాల నటుడిగా ‘కలత్తూర్ కన్నమ్మ’తో సినీ రంగంలోకి ప్రవేశించారు. తన సినిమాల్లోని వివాదాలతో ఆయన కంటతడి పెట్టిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. నాటి క్షత్రియ పుత్రుడు సినిమా నుంచి మొన్నటి విశ్వరూపం వరకు వివాదాలతో సహవాసం చేశారు. సినిమాల్లోని కథ, పాటలు, మాటలు ఇలా ఏదో ఒకటి ఏదో ఒక వర్గాన్ని వెలేత్తి చూపడంతో వివాదాలు రాజుకునేవి. ప్రభుత్వాలు కూడా కక్ష కట్టేవి. కమల్ తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ప్రపంచ ఖ్యాతీ గడించిన భరతనాట్య కళాకారిణి వాణీ గణపతిని 1978లో వివాహామాడి 1988లో విడాకులు తీసుకున్నారు కమల్. అటుపై 1988లో సినీ నటి సారికను వివాహం చేసుకుని 2004లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి శ్రుతీ హాసన్, అక్షర హాసన్‌లు జన్మించారు. అటుపై మళ్లీ నటి గౌతమితో కొంతకాలం సహజీవనం చేశారు. కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతీ హాసన్.. అక్షర హాసన్‌లు బాగానే రాణిస్తూ ఉన్నారు. అయితే వీరు సోషల్ మీడియాలోని కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. స్వతంత్ర భావాలు కలిగిన కమల్.. తన కూతుళ్లను కూడా అదే విధంగా పెంచానని.. తమకు కుల, మత, ప్రాంత బేధాలు ఉండవని చెబుతారు. - బండ కళ్యాణ్ -
కాంగ్రెస్ తెర వెనుక శక్తి
సాక్షి వెబ్ ప్రత్యేకం : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. అసలు పేరు సోనియా మైనో. ఆమె 1946, డిసెంబర్ 9వ తేదీన ఇటలీలోని టూరిన్ పట్టణానికి సమీపంలో ఉన్న ఒర్బసానో గ్రామంలో సంప్రదాయ రోమన్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఇంగ్లీషు, ఫ్రెంచ్, రష్యన్ భాషలను అభ్యసించారు. ఇంగ్లీషు భాషను అధ్యయనం చేస్తున్నప్పుడే ఆమెకు రాహుల్ గాంధీ పరిచయం అయ్యారు. వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 1968, ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీలో వసంత పంచమి రోజున పెళ్లి చేసుకున్నారు. రాజీవ్ గాంధీ తల్లి ఇందిరాగాంధీ–ఫిరోజ్ గాంధీని కూడా అదే రోజు చేసుకున్నారు. రాజీవ్ గాంధీ మరణానంతరం అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సోనియా గాంధీ ‘నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్’ చైర్మన్‌గా యూపీఏ ప్రభుత్వాన్ని నడిపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పార్టీకి దశ దిశ నిర్దేశించారు. ఆమె ‘రాజీవ్’, ‘రాజీవ్స్ వరల్డ్’ రెండు పుస్తకాలను రచించారు. 1922 నుంచి 1964 మధ్య పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల మధ్య నడచిన ఉత్తర ప్రత్యుత్తరాలను ‘ఫ్రీడమ్స్ డాటర్’, ‘టు ఎలోన్, టు టుగెదర్’ అనే రెండు సంపుటాలను ఎడిట్ చేసి ప్రచురించారు. ఆమెకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లతో ఇద్దరు పిల్లలున్న విషయం తెల్సిందే. తొలిచూపులోనే ప్రేమలో సోనియా గాంధీ 1965లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో అడుగు పెట్టారు. అప్పటికి మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న రాజీవ్ గాంధీ ఆమెకు అనుకోకుండా తారసపడ్డారట. తొలిచూపులోనే వారు ప్రేమించుకున్నారట. అలా వారి ప్రేమాయణం మూడేళ్లపాటు సాగింది. రాజీవ్ గాంధీ హిందూ మతానికి చెందిన వారే కాకుండా పలుకుబడి, అధికారంగల రాజకీయ కుటుంబానికి చెందిన వారవడం వల్ల ముందుగా సోనియా కుటుంబ సభ్యులు వారి పెళ్లికి అసలు ఒప్పుకోలేదట. అంతకన్నా పెళ్లి ప్రతిపాదనను ఇందిరా గాంధీ వరకు తీసుకెళ్లాలంటే సోనియా కుటుంబ సభ్యులు భయపడి చచ్చారట. రాజీవ్ గాంధీ అన్నింటికి ధైర్యంగా నిలబడి తల్లిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారట. పెళ్లి రోజు అత్తగారు ఇందిరాగాంధీ ఇచ్చిన ఆమె పెళ్లి నాటి గులాబీ రంగు చీరనే సోనియా గాంధీ ధరించారట. రాజీవ్ గాంధీ మరణానంతరం 1984–1991 (కొద్ది కాలం లోక్‌సభ నాయకుడిగా) మధ్య రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వెంట సోనియా గాంధీ దేశ, విదేశాలు తిరిగారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని అమేథి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన పనులు చూసుకునేవారు. ఆరోగ్య శిబిరాలు, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేవారు. రాజీవ్ హత్యానంతరం ఆమె రాజీవ్ గాంధీ పేరిట ఓ స్వచ్ఛందంగా ఓ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. ‘రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ స్టడీస్’కు చైర్‌పర్సన్‌గా, పలు స్వచ్ఛంద సంస్థలకు హెడ్‌గా బిజీ బిజీగా గడిపారు. రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఒత్తిడి 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు కొంతకాలం ముందు నుంచి ప్రత్యక్ష క్రియాశీలక రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆమెపై ఒత్తిడి వచ్చింది. 1998, ఏప్రిల్‌లో పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1999లో అమేథి నుంచి పోటీచేసి మొదటి సారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోయినప్పటికీ అత్యధిక సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఆమెనే తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు. ఆమెనే ప్రధాన మంత్రి అవుతారని అనుకున్నారు. ఇటలీలో జన్మించి, అక్కడి పౌరసత్వాన్ని కలిగిన సోనియాకు ఆ అర్హత లేదంటూ బీజేపీ, దాని మిత్రపక్షాలు పెద్ద ఎత్తున వివాదం లేవదీయడంతో ఆమె అనూహ్యంగా ప్రధాని పదవికి మన్మోహన్ సింగ్ పేరును ప్రతిపాదించారు. యూపీఏ సంకీర్ణ కూటమి చైర్మన్‌గా, పార్లమెంట్లో పార్టీ నాయకురాలిగా ఆమె తన సేవలందించారు. ముఖ్యమైన విధాన నిర్ణయాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కనీసం వంద రోజులపాటు ఉపాధి కల్పించడం కోసం సోనియా గాంధీ ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాథి గ్యారంటీ చట్టం’ను 2005లో తీసుకొచ్చారు. ఈ పథకాన్ని 2006 నుంచి అమలు చేశారు. ప్రభుత్వ పాలనలో అవినీతిని అరికట్టేందుకు 2009లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. 2004 నుంచి 2014 వరకు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ‘రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ స్టడీస్’ చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడే సోనియా గాంధీ, పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ద్వారా దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకరావడానికి కషి చేశారని రాజకీయ పరిశీలకులు చెబుతారు. ఆసక్తికరమైన అంశాలు సోనియా గాంధీ పాఠశాల రోజుల్లో మంచి ఫుట్‌బాల్ ప్లేయర్. పెళ్లికి ముందు వెల్లింఘ్టన్ క్రిసెంట్ హౌజ్‌లో బచ్చన్ కుటుంబంతో కొద్దికాలం కలిసి ఉన్నారు. 1968, జనవరి 26వ రోజు, దేశ రిపబ్లిక్ దినోత్సవం నాడు రాజీవ్ గాంధీతో సోనియాకు నిశ్చితార్థం జరిగింది. ఆమె మెహంది పండుగ కూడా బచ్చన్ల ఇంటిలోనే జరిగింది. పెళ్లి నాటికి సోనియాకు హిందీ రాదు. ఇంట్లో హిందీ టీచర్‌ను పెట్టుకొని హిందీ నేర్చుకొని, ఆ తర్వాత ఇనిస్టిట్యూట్‌కు వెళ్లి నేర్చుకున్నారు. భారతీయ చేనేత, చేతి వత్తుల అధ్యయనంపై ఆసక్తి. జానపద, శాస్త్రీయ సంగీతాలను ఇష్టపడతారు. ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో ఆయిల్ పెయింటింగ్స్‌ను ఎలా సంరక్షించాలన్న అంశంపై డిప్లమో చేశారు. - వి. నరేందర్ రెడ్డి -
నిరాడంబర నిప్పుకణిక మమతా బెనర్జీ
(సాక్షి వెబ్ ప్రత్యేకం) విద్యార్థి దశ నుంచే చిచ్చర పిడుగు లక్షణాలతో పట్టుదలకు, గుండె నిబ్బరానికి మారు పేరుగా నిలిచిన ధీర మహిళ 'ఫైర్ బ్రాండ్' మమతా బెనర్జీ. 1970వ దశకంలో రాజకీయ జీవితం ప్రారంభించి శరవేగంగా అడుగులు వేస్తూ తనదైన వ్యక్తిత్వంతో దూసుకుపోతున్నారు. నందిగ్రామ్ ఉద్యమం, సింగూరులో టాటాలకు ఎదురొడ్డి, బలవంతపు భూసేకరణను నిలువరించి రైతుబంధుగా ప్రజలకు దగ్గరైన తీరు, సాధించిన అఖండ విజయం ఆమె రాజకీయ ప్రస్థానంలో కీలక మైలురాళ్లు. 2011లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 34 ఏళ్ల కమ్యూనిస్టుల కంచుకోటకు ఎదురెళ్లి నిలిచి గెలిచిన నాయకురాలు. ఇపుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వ్యూహరచనలో తలమునకలైవున్నారు. ప్రధానంగా బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షా ద్వయానికి చెక్ చెప్పే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2019 ఎన్నికల సమరానికి సమర శంఖం పూరించారు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మమతా బెనర్జీ ఒక మహిళగా రాజకీయాల్లో నిలదొక్కుకున్నవైనం అంత అషామాషీగా ఏమీ సాగలేదు. అనేక రకాల సవాళ్లకు ధీటుగా ఎదుర్కొంటూ, అవరోధాలను అధిగమించుతూ రాజకీయాల్లో తన ముద్రను సాధించుకున్నారు. 1970లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మమతా బెనర్జీ అనతికాలంలోనే మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 1984 ఎన్నికల్లో కమ్యూనిస్టు మహాయోధుడు సోమనాధ ఛటర్జీని ఓడించి అందరి దృష్టినీ తనవైపునకు తిప్పుకున్నారు. అలా పార్లమెంటులో అడుగుపెట్టిన అతి చిన్నవారిలో ఒకరిగా నిలిచారు. అంతేకాదు కాంగ్రెస్ హయాంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో దీదీ తొలి మహిళా రైల్వే మంత్రి ఖ్యాతి దక్కించుకున్నారు. అలాగే మొదటి మహిళా బొగ్గు శాఖా మంత్రి కూడా దీదీనే. కాంగ్రెస్ వ్యతిరేక పవనాల్లో 1989లో ఓడిపోయినా ఆ తరువాతి నుంచి ఆమె ప్రభంజనానికి ఎదురే లేదు. 1991, 1996, 98, 99, 2009 ఎన్నికల్లో తన హవాను చాటుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీతో తీవ్ర విభేదాల కారణంగా 1997లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వాల్లో కీలక భూమికను నిర్వహించారు. అయితే 2004 లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది. మమత ఒక్కరే ఎంపీగా గెలిచారు. ఆ సమయంలో సీపీఎం పారిశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా బెంగాల్లో వ్యూహాత్మక పోరాటానికి శ్రీకారం చుట్టారు. సింగూర్ లో టాటా మోటార్స్ ప్లాంట్ కు వ్యతిరేకంగా 2006లో అసెంబ్లీ మార్చ్ విజయవంతంగా నిర్వహించారు. నందిగ్రామ్‌లో జరిగిన హింసను అడ్డుకున్నారు. ఇదే ఆమె రాజకీయ జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. సామాన్యులకు నిజమైన దీదీగా మారారు. 2011ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా అధికారాన్ని కైవసం చేసుకున్నారు. సొంత కుంపటిని ఏర్పాటుచేసుకున్న అనంతరం ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు మమతకు సుమారు 14 ఏళ్లు పట్టింది. ఏ ఉద్యమమైతే తనకు సీఎం కుర్చీని అప్పగించిందో అదే సింగూరు ఉద్యమ రైతులకు 400 ఎకరాల భూమిని తిరిగి ఇస్తూ తొలి సంతకం చేశారు. ఈ నిర్ణయమే 2016 వరుసగా రెండవసారి కూడా అఖండ మెజార్టీని ఆమెకు కట్టబెట్టింది. ప్రస్తుతం దీదీ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటం విశేషం. వ్యక్తిగత వివరాలు తల్లిదండ్రులు ప్రోమిలేశ్వర్ బెనర్జీ, గాయత్రి బెనర్జీ జనవరి 5 1955న మమతా బెనర్జీ (బందోపాధ్యాయ) జన్మించారు. ఎమ్.ఏ (ఇస్లామిక్ చరిత్ర) తో పాటు న్యాయశాస్త్ర విద్యను అభ్యసించారు. ఇక్కడో ఇంకో గమ్మత్తైన విషయం ఏమింటటే పదవతరగతి పరీక్షలు రాయడానికి మమతకు వయసు సరిపోకపోతే ఐదేళ్లు ఎక్కువగా వేసి రాయించారట. నిజానికి మమత పుట్టింది 1960 అక్టోబర్ 5వ తదీ అనే వాదన ప్రచారంలో ఉంది. అయితే రికార్డులలో ఉన్న తేదీ మాత్రం 1955 జనవరి 5. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రయివేటు టీచర్‌గా, సేల్స్ గర్ల్‌గా, స్టోనోగ్రాఫర్గా పనిచేశారు. ఇష్టాలు వ్యక్తిగతంగా మమతా బెనర్జీ నిరాడంబర నాయకురాలు. ఆత్మస్థైర్యమే ఆమెకు ఆభరణం. ఆమె ఆహార్యమే ఆమెకు గుర్తింపు. అన్నట్టు దీదీ మంచి రచయిత కూడ. కవిత్వం రాయడమంటే ఆమెకు వల్లమాలిన ప్రేమ. ప్రకృతి అంటే ప్రాణం. సమయం దొరికితే హిమాలయ పర్వతాలు, మేదినీపూర్ అడవులను సందర్శించడం అలవాటు. ప్రకృతి ఫోటోగ్రఫీ, పెయింటింగ్స్ వేయడం అన్నా చాలా ఇష్టం. పోరిబోర్టాన్ (మార్పు) పేర ఓ కవిత్వ సంకలనాన్ని కూడా తీసుకొచ్చారు. కొబిత (కవితలు) పేర మరో పుస్తకం కూడా వచ్చింది. మై అన్ఫర్గెటెబుల్ మెమొరీస్ (మర్చిపోలేని నా జ్ఞాపకాలు) ఆమె రాసిన మరో పుస్తకం. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న మమత దుర్గా దేవీ పూజ కోసం ప్రత్యేకంగా పాటలుతో‘రౌద్రాచార్య’ ను ఆల్బమ్‌ను కూడా తీసుకొచ్చారు. వివాదాలు తన కాలంలో వెలుగులోకి వచ్చిన శారదా స్కాం, నారద స్టింగ్, రోజ్‌వ్యాలీ ఆర్థిక కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన మంత్రుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణలకు, ఇటీవల సీబీఐ అధికారుల అరెస్టు వ్యవహారం ఈ వివాదాలకు మరింత ఆజ్యం పోసింది. అలాగే పార్క్ స్ట్రీట్ సామూహిక అత్యాచార బాధితురాలు సుజెట్టే జోర్డాన్‌పై ముఖ్యమంత్రి హోదాలో ‘అదంతా ఓ కట్టుకథ’ అంటూ మమత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రాజేశాయి. మృత్యుంజయురాలు కాంగ్రెస్ నేతగా మమతా బెనర్జీపై1990 ఆగస్టు 16న, ఒక ర్యాలీలో సీపీఎం కార్యకర్త లాలూ అలాం ఆమెపై హత్యాయత్నం చేశాడు. కర్రతో బలంగా కొట్టడంతో, ఆమె తలపగిలింది. దీంతో దాదాపు నెల రోజులపాటు ఆమె ఆసుపత్రిలోనే ఉన్నారు. సీపీఎం ప్రోద్బలంతోనే తానీ దురాగతానికి పాల్పడ్డాననీ, క్షమించాలని కోరుకున్నా అతణ్ని దీదీ క్షమించలేదు. - టి. సూర్యకుమారి -
చదువు కోసం మారుపేరుతో చలామణి
సాక్షి వెబ్ ప్రత్యేకం : లోక్‌సభ సాక్షిగా దేశ ప్రధానమంత్రిని కౌగిలించుకుని ఆ తర్వాత తన స్థానం నుంచి కన్నుగీటి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ చర్యతో ఆయనపై సోషల్ మీడియాలో లెక్కలేనన్ని సెటైర్లు. ఈమధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. భారత తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు ముని మనవడు. తొలి మహిళా ప్రధాన మంత్రి ఇందిరాగాంధీకి మనవడు. ఎల్టీటీఈ తీవ్రవాదుల దాడిలో మరణించిన రాజీవ్ గాంధీకి, రెండు యూపీఏ ప్రభుత్వాలను తెర వెనకనుంచి నడిపించిన సోనియా గాంధీకి స్వయాన పుత్రుడు. 2004 లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అంతకుముందు తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచి పోటీ చేశారు. 2007 సెప్టెంబర్ 24వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పదేళ్లకుపైగా అదే పదవిలో కొనసాగిన ఆయన 2017 డిసెంబర్ 16వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర వహించి, ఆ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను కూల్చారు. పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో చురుకైన పాత్ర వహించారు. ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన పోటీని సోదరి ప్రియాంక గాంధీ చొరవతో పరిష్కరించి, వ్యూహాత్మకంగా ఆమెను పార్టీ క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. విద్యాభ్యాసం రాహుల్ గాంధీ 1970 జూన్ 19వ తేదీన ఢిల్లీలో పుట్టారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. తర్వాత డెహ్రూడూన్ వెళ్లారు. ఆ తర్వాత ఫ్లోరిడాలోని హార్వర్డ్ కాలేజీ, రోలిన్స్ కాలేజీల్లో ‘బ్యాచిలర్ ఆఫ్ ఫైనాన్స్’లో డిగ్రీ పూర్తి చేశారు. అక్కడి నుంచి కేంబ్రిడ్జి యూనివర్శిటీకి వెళ్లి ట్రినిటీ కాలేజీ నుంచి డెవలప్మెంట్ స్టడీస్‌లో ఎంఫిల్ పూర్తి చేశారు. విద్యాభ్యాసం పట్ల అంతగా ఆసక్తి చూపక పోవడం వల్ల, ఎల్టీటీఈ తీవ్రవాదులు చేతుల్లో ఆయన తండ్రి రాజీవ్ గాంధీ హత్యకు గురవడం వల్ల, మరో పక్క సిక్కు ఉగ్రవాదుల నుంచి తన కుటుంబానికే ముప్పు పొంచి ఉన్నందు వల్ల రాహుల్ పలు కళాశాలలతోపాటు పలు ప్రాంతాలకు మారాల్సి వచ్చింది. ఆసక్తికర అంశాలు 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం భద్రతా కారణాల రీత్య రాహుల్ గాంధీని ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీకి మార్చారు. అక్కడ రాహుల్ గాంధీ, రాహుల్ విన్సీ అనే మారు పేరుతో చెలామణి అయ్యారు. ఆయన ఎవరో కాలేజీ ఉన్నతాధికారులు, భద్రతా ఏజెన్సీలకు తప్ప మరెవరికి తెలియనీయలేదు. రాహుల్ గాంధీ, అదితి సింగ్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నారంటూ 2017లో సామాజిక మీడియా కోడై కూసింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఐదు సార్లు విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అఖిలేష్ కుమార్తె అదితి సింగ్ (29) 2017లో రాయబరేలి అసెంబ్లీ సీటుకు పోటీ చేసి సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థిపై 90 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల సందర్భంగా, ఆ తర్వాత కూడా రాహుల్ గాంధీ, ఆమె రాసుకుపూసుకు తిరుగుతున్నారంటూ వదంతులు వచ్చాయి. వీటిపై రాహుల్ గాంధీ స్పందించలేదు. తమ మధ్య ఎలాంటి వ్యవహారం లేదంటూ అధిత సింగ్ ఆ తర్వాత తేల్చి పారేశారు. ఆమె అమెరికాలోని డ్యూక్ యూనివర్శిటీలో మేనేజ్మెంట్లో డిగ్రీ చేశారు. రాహుల్ గాంధీ 2012లో నోవల్ జహర్ అనే అమ్మాయితో పలు చోట్ల కనిపించడంతో వారిరువు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వదంతులు వచ్చాయి. 40 ఏళ్లపాటు అఫ్ఘాన్ రాజుగా అధికారంలో ఉన్న మొహమ్మద్ జహిర్ షాకు ఆమె మనవరాలు అవడం, ఆమె తండ్రి ఇటాలియన్ మదర్‌ను చేసుకోవడం, సోనియా గాంధీ ఇటలీ ఇంట్లో, ఢిల్లీలోని ఓ జిమ్‌లో రాహుల్‌తో కలిసి ఆమె కనబడడంతో పెళ్లంటూ వార్తలు వచ్చాయి. 2013లో ఆమె ఈజిప్టు యువరాజు మొహమ్మద్‌ను పెళ్లి చేసుకోవడంతో ఆ వార్తలకు తెరపడింది. రాహుల్ గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాకముందు, వచ్చాక కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, సంజయ్ గాంధీ మెమోరియల్ ట్రస్ట్, రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమాలతో ఆయనకు అనుబంధం ఉంది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లో ఆయన లాభాపేక్ష లేకుండా కంటి చికిత్స కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. 2009 లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా సుడిగాలిలా తిరుగుతూ ఆరు వారాల్లో 125 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ముఖ్యమైన ఘట్టాలు రాహుల్ గాంధీ 2004లో మొదటి సారి అమేథి నుంచి లోక్‌సభకు పోటీ చేసి లక్షకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2004 నుంచి 2006 వరకు హోం వ్యవహరాల పార్లమెంట్ స్థాయీ సంఘంలో సభ్యునిగా ఉన్నారు. 2007లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అలాగే యువజన కాంగ్రెస్, విద్యార్థి సంఘాలకు జనరల్ సెక్రటరీ ఇంచార్జిగా వ్యవహరించారు. 2007 నుంచి 2009 వరకు పార్లమెంట్లో మానవ వనరుల అభివద్ధి స్థాయీ సంఘంలో సభ్యునిగా కొనసాగారు. 2009లో మళ్లీ అమేథి నుంచి లోక్‌సభలో రెండోసారి ఎన్నికయ్యారు. ఈ సారి ఆయన అనూహ్యంగా సమీప ప్రత్యర్థిపైన 3,70,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నాడు యూపీలో కాంగ్రెస్ పార్టీ 21 లోక్‌సభ సీట్లను గెలుచుకోవడం రాహుల్ సాధించిన ఘనతగా పేరు వచ్చింది. 2013లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా రాహుల్ గాంధీ నియమితులయ్యారు. 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీ మరోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు, కన్సల్టేటివ్ కమిటీ అనే మూడు పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యునిగా చేరారు. రాహుల్ గాంధీ 2017 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. - వి. నరేందర్ రెడ్డి -
చీపురుకూ చెత్త అంటుతోందా !
సాక్షి వెబ్ ప్రత్యేకం : ఉన్నత చదువులు చదవి, ఉన్నత ఉద్యోగాల్లో చేరి, ఆ ఉద్యోగాలను కూడా తణప్రాయంగా త్యదించి, ప్రజా సంక్షేమం కోసం సామాజిక కార్యకర్త అవతారం ఎత్తడమే కాకుండా అవినీతి రహిత భారతాన్ని ఆవిష్కరించాలనే సమున్నత లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్ కేజ్రివాల్ది సాధారణ నేపథ్యం కాదు. అనన్య సాధ్యం కానిది. అటడ్డుగు జనంలో చైతన్యం తీసుకొచ్చి సమాచార హక్కు అనే ఆయుధాన్ని ఎలా వాడాలో వారికి నేర్పించి ‘మెగసెసే’ అవార్డు అందుకున్న ఘన కీర్తి ఆయనది. మొదటిసారి మెజారిటీలేక 49 రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చినా తదుపరి ఎన్నికల్లో 70 అసెంబ్లీ సీట్లకుగాను ఏకంగా 67 సీట్లు సాధించి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఘన చరిత్ర ఆయనది. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ ప్రజా నాయకుడిగా ఎదుగుతున్నారనుకున్న గ్రాఫ్ ఆయనది. నియంత్రత్వ పోకడలతో స్వీయ పార్టీలోనే కలహాలు చెలరేగి, మహా మహలు పార్టీనీ వీడిపోగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చలేక తడబడుతున్న వర్తమానం ఆయనది. అన్ని అధికారాలను కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవడం వల్లనే ఢిల్లీ ప్రజలను అన్ని విధాల ఆదుకోలేకపోతున్నానంటూ కేంద్రంపై కన్నెర్ర చేసి నిరవధిక దీక్ష చేస్తానంటూ నినదించిన ఆయనది భవిష్యత్తు బంగారు బాటేం కాదు. విద్యాభ్యాసం ఆయన హర్యానాలోని బివానిలో 1968, ఆగస్టు 16వ తేదీన జన్నించారు. ఖరగ్‌పూర్‌లోని ఐఐటీ నుంచి 1989లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం టాటా స్టీల్ కంపెనీలో ఇంజనీరుగా పనిచేశారు. సివిల్స్ రాయలనే సంకల్పంతో ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పారు. సివిల్స్ రాసి ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో చేరారు. తనతోపాటు ముస్సోరిలోని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడ్మినిస్ట్రేషన్’లో శిక్షణ పొందిన తన బ్యాచ్ అధికారి సునీతను పెళ్లి చేసుకున్నారు. ఆదాయం పన్ను శాఖలో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న కేజ్రివాల్ 2006లో ఆ పదవికి రాజీనామా చేసి పూర్తి సామాజిక కార్యకర్తగా మారిపోయారు. ఆయన ఆదాయం పన్ను శాఖలో పనిచేస్తున్నప్పుడే 1999లో ‘పరివర్తన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. 2006లో ఉద్యోగానికి రాజీనామా చేసి సంస్థ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. పేదలకు సరసమైన ధరలకు రేషన్ బియ్యం అందించడంతో పాటు సబ్సిడీ ధరలపై విద్యుత్ సౌకర్యం కల్పించాలంటూ పోరాటం జరిపారు. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. అందుకు గుర్తింపుగా 2006లో మెగాసెసే అవార్డును అందుకున్నారు. ఆ అవార్డు ద్వారా వచ్చిన డబ్బును కార్పస్ ఫండ్‌గా పెట్టి ‘పబ్లిక్ కాజ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. అన్నా హజారే ఆధ్వర్యంలో 2012లో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆధ్వర్యంలో అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో అరవింద్ కేజ్రివాల్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అందుకు జన్ లోక్‌పాల్ బిల్లును తేవాలనే డిమాండ్‌కు ఆమోదం తెలిపారు. ఈ విషయంలోనే ఆయనకు అన్నా హజారేతో విభేదాలు వచ్చాయి. రాజకీయ నేతలు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి బిల్లును తీసుకరావాలన్నది హజారే పంథా కాగా, తామే ప్రభుత్వుంలోకి వస్తే తప్ప అది సాధ్యం కాదన్న అభిప్రాయంతో కేజ్రివాల్ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆవిర్భావం 2012 అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి రోజున తాను పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు కేజ్రివాల్ ప్రకటించారు. 2012 నవంబర్ 26వ తేదీన (భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు) ఢిల్లీ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. 2013 డిసెంబర్ 4వ తేదీన జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటికీ మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగిన షీలా దీక్షిత్పైనే పోటీచేసి గెలిచారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆయన పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా ఆవిర్భవించినప్పటికీ కావాల్సిన మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 2013 డిసెంబర్ 23వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జన్ లోక్‌పాల్ బిల్లు విషయమై కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడం, ఇదే బిల్లు ఇష్టం లేక బీజేపీ మద్దతు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో కేజ్రివాల్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అఖండ మెజారిటీతో అధికారంలోకి 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఢిల్లీ నుంచి కాకుండా యూపీలోని వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోటీ చేసి కేజ్రివాల్ ఓడిపోయారు. ఆ తర్వాత 2015 ఫిబ్రవరి 7వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 67.14 శాతం ఓట్లతో 70 సీట్లకుగాను 67 సీట్లలో తన పార్టీని విజయపథాన నడిపించారు. ఫిబ్రవరి 14వ తేదీన రెండోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు పేదలకు అనుకూలంగా రాష్ట్రం విద్యుత్, రేషన్ సరకుల రంగాల్లో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. పార్టీ అంతర్గత కలహాల కారణంగా యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటి సామాజిక కార్యకర్తలు కూడా పార్టీని వీడిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాంగా ప్రధాని అభ్యర్థిగా ఎదుగుతారనుకున్న ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. అవార్డులు – రివార్డులు అరవింద్ కేజ్రివాల్‌కు 2004 లో అశోక ఫెల్లో 2005 లో కాన్పూర్ ఐఐటీ నుంచి సత్యేంద్ర దూబే స్మారక అవార్డు 2006 లో రామన్ మెగసెసె అవార్డు 2006 లో సీఎన్ఎన్–ఐబీఎన్ నుంచి ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు 2009 లో ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి ‘డిస్టింగ్ష్డ్ అలుమ్నుస్ అవార్డ్’ 2009 లో భారతీయ అభివద్ధి సంస్థ ఫెల్లోషిప్ 2010 లో ‘ఎకనామిక్ టైమ్స్’ నుంచి కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డు 2010 లో ఎన్డీటీవీ నుంచి హజారేతోపాటు ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు కేజ్రివాల్ రాసిన పుస్తకం : స్వరాజ్ నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉండాలో కేజ్రివాల్ ఇందులో వివరించారు. జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సిద్ధించాలంటే ఢిల్లీలోని కొద్ది మంది పెద్దల చేతుల్లో అధికారం కేంద్రీకతమై ఉండరాదని, గ్రామ సభలకు, మొహల్లా సభలకు ఎక్కువ అధికారాలు ఉండాలంటూ ఆయన వాదించారు. కేజ్రివాల్ పైన పుస్తకాలు ది మేన్ విత్ ఏ విజన్–అరవింద్ కేజ్రివాల్ ది జర్ని ఆఫ్ అరవింద్ కేజ్రివాల్ ఫ్రమ్ ఏ స్టూడెంట్ టు ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ - వి. నరేందర్ రెడ్డి -
సాదా సీదా ప్రియాంక గాంధీ
సాక్షి, వెబ్ ప్రత్యేకం : ‘నేనేమి అద్భుతాలు సష్టించలేను. పార్టీ కార్యకర్తలే పార్టీని బూతు స్థాయి నుంచి అభివృద్ధి చేయాలి. పార్టీని బలోపేతం చేయడంలో నాకు మీ సహకారం కావాలి. ఎవరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదు. అలాంటి వారిని పార్టీ నుంచి బయటకు పంపిస్తాం’ అని ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతం ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజులకే యూపీలోని బులంద్‌షహర్‌లో పార్టీ కార్యకర్తలనుద్దేశించి వ్యాఖ్యానించారు. కఠిన పదాలను కూడా మదువుగా చెప్పే మృదుభాషిణి. చెప్పదల్చుకున్న మాటలను సూటిగాను, అర్థవంతంగాను చెప్పగలిగే మాటల నేర్పరి. హిందీలో రాహుల్ గాంధీకన్నా, అనర్గళంగా మాట్లాడే వాక్చాతుర్యం ఆమె సొంతం. ఆమె బాలివుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తల్లి తేచి బచ్చన్ (తేజ్వంత్ కౌర్) వద్ద హిందీ కవిత్వాన్ని నేర్చుకున్నారు. ఇక ఆహార్యంలో ఆమె నిరాడంబరత చూస్తే గాంధీ వారసత్వం గుర్తుకు వస్తుంది. ఎక్కువగా తెల్లటి పొడువు చేతుల చొక్కా, నల్లటి పాయింట్ ధరించే ప్రియాంక గాంధీ ఎక్కువ వరకు చేనేత చీరలనే ధరిస్తారు. నుదిటన బొట్టు, మెడలో నగా నట్ర ధరించకుండా, మొఖాన పౌడరు తప్ప ఎలాంటి మేకప్ లేకుండా సంచరించే ప్రియాంకలో ఎప్పుడూ చురుకుదనం కనిపిస్తుంది. సన్నటి సొట్ట పడే ఆమె బుగ్గల మీద కనిపించే చిద్విలాసమే ఆమెకు ప్రధాన అలంకారం. ఇందిర వారసత్వం ‘నేను ఎంతమాత్రం నరేంద్ర మోదీ కూతుర్ని కాను, నేను రాజీవ్ గాంధీ కూతుర్ని’ అని ఆమె ముక్కు సూటిగా మాట్లాడడం ’ప్రియాంక గాంధీ ఇంకేమాత్రం చిన్న పిల్ల కాదు. రాజకీయ స్ఫురద్రూపి’ అన్న ఆమె తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మాటలను గుర్తు చేస్తాయి. 2014, మే నెలలో దూరదర్శన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ, ప్రియాంక తన కూతురు లాంటిదని వ్యాఖ్యానించడం తెల్సిందే. పొట్టి జుట్టు, ముక్కు సూటిగా మాట్లాడంలోనే కాకుండా అనేక అంశాల్లో తన నానమ్మ ఇందిరాగాంధీలాగానే ఆమె ఉంటారని, ఆమె వారసురాలిగా రాజకీయాల్లోకి వస్తే ఎంతో రాణించగలరని మిత్రులు, శ్రేయోభిలాషులు ఆమెకు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. ‘రాజకీయాల్లో అందరు రాణించలేరు. ఇప్పుడు నేను గడుపుతున్న జీవితం నాకు ఎంతో ఆనందంగా ఉంది. కొందరికి కొన్ని పడవు. అది అంతే. దయచేసి నన్ను క్రియాశీలక రాజకీయాల్లోకి లాగకండి’ ఎన్డీడీవీ తరఫున సీనియర్ జర్నలిస్ట్ బార్కాదత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేశారు. ప్రియాంక రాజకీయ నేపథ్యం 2004లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా యూపీలో సోనియా గాంధీకి ఎన్నికల ప్రచార మేనేజర్‌గా, రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార పర్యవేక్షకురాలిగా పనిచేశారు. 2007లో జరిగిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమేథి, రాయబరేలి ప్రాంతంలోని పది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. 2009లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అమేథి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. 2012లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా రంగ ప్రవేశం చేశారు. ఇదివరకటిలా అమేథి, రాయ్‌బరేలీలకు పరిమితం కాకుండా అమేథి నుంచి సుల్తాన్పూర్ వరకు పార్టీ తరఫున ప్రచారం చేశారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కూడా ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. జగదీష్పూర్లో ఆమె సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి ప్రజల్లోకి చొచ్చుకు పోవడం చర్చనీయాంశం అయింది. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమేథి ప్రాంతానికే పరిమితమై ప్రచారం చేశారు. 2019లో ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జనవరి 23వ తేదీన నియమితులయ్యారు. యూపీ తూర్పు ప్రాంతం పార్టీ ఇంచార్జిగా బాధ్యతలను ఆమె ఫిబ్రవరి 4వ తేదీన స్వీకరించారు. ఆ సందర్భంగా రాహుల్‌తో కలిసి ఆమె నిర్వహించిన రోడ్డు షోకు ప్రజలు విశేషంగా తరలి వచ్చారు. జీవిత నేపథ్యం 47 ఏళ్ల ప్రియాంక గాంధీ 1972, జనవరి 12వ తేదీన ఢిల్లీలో సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ దంపతులకు జన్మించారు. ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ కాన్వెంట్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె జీసస్ అండ్ మేరీ కాలేజీలోనే సైకాలోజీలో డిగ్రీ చేశారు. ఢిల్లీ యూనివర్శిటీ నుంచి బౌద్ధంలో ఎంఏ (2010)లో పట్టభద్రులయ్యారు. ఢిల్లీ వ్యాపార వేత రాబర్ట్ వాద్రాను 1997, ఫిబ్రవరి 18వ తేదీన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. బౌద్ధంలో ఆమె ఎంఏ పూర్తిచేశాక ఆమె బౌద్ధం స్వీకరించారు. ఆమెకు రాయ్హాన్, కూతురు మిరయా ఉన్నారు. -వి. నరేందర్ రెడ్డి -
బహుజన కిరణం మాయావతి
సాక్షి, వెబ్ ప్రత్యేకం : దేశంలోనే అత్యధిక లోక్సభస్థానాలున్న మెగా (ఉత్తరప్రదేశ్) రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎన్నికై ఖ్యాతికెక్కిన తొలి మహిళ మాయావతి. మూడుస్లారు సీఎంగా తన పాలనా దక్షత, శాంతి భద్రతల పరిరక్షణలో తెగువ చూపించి విపక్షాల ప్రశంసలను సైతం దక్కించుకున్నారు. తన హయాంలో రాష్ట్రంలో కరుడు గట్టిన నేరస్తులకు ఆమె సింహ స్వప్నం. ముఖ్యంగా 2010లో అయోధ్య తీర్పు సందర్భంగా హై ప్రొఫైల్డ్, మాఫియా డాన్లను సైతం కటకటాల వెనక్కి పంపించారు. 2007లో భూమి ఆక్రమణ కేసులో సొంత పార్టీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయించిన సాహసం ఆమెది. ఆమె ఏది చేసినా సంచలనమే. కోటానుకోట్లు ఖర్చు చేసి నివాస భవనాన్ని నిర్మించుకున్నా, తన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రత్యేక విమానంలో చెప్పులు తెప్పించుకున్నా, గెస్ట్ హౌస్ వివాదాన్ని ధీటుగా ఎదుర్కొన్నా.. కరెన్సీ మాల వేయించుకున్నా.. ప్రాజెక్టుల అమలులో ప్రపంచ బ్యాంకుకే చుక్కలు చూపించినా, ప్రతిపక్షాల విమర్శలకు సైతం వెరవకుండా వేలాది విగ్రహాలను ఏర్పాటు చేసినా ఆమెకు ఆమే సాటి. ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకురాలిగా ప్రస్తుతం దేశ ప్రధానమంత్రి పదవికి పోటీలో వినిపిస్తున్న పేరు మాయావతి. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మాయావతి ఐఏఎస్ కావాలనుకుని అధినేత అయ్యారు. చిన్నప్పటినుంచి మాయావతికి ఐఏఎస్ కావాలని కనేవారు. అందుకే మూడు పరీక్షలు ఒకేసారి పాస్ కావాలని భావించి, అధికారులు అనుమతితో 9వ, 10వ ,11 వ తరగతి పరీక్షలను ఒకేసారి విజయవంతంగా పూర్తి చేశారు. అలా మూడేళ్లు జంప్ చేసి 16 ఏళ్ళ వయస్సులో (1972)12వ తరగతి పాసయ్యారు. అనంతరం ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో 1977లో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాంతో పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. తదనంతర కాలంలో పార్టీ అధినేత్రిగా పగ్గాలు చేపట్టిన ఆమె రాజకీయ జీవితం నల్లేరు మీద నడకేమీకాదు. ఎంపీగా, డైనమిక్ సీఎంగా మాయావతి తన ప్రాధాన్యతను చాటుకున్నప్పటికీ పురుషాధిక్య సమాజంలో ఒక దళిత మహిళగా జాతి, కుల వివక్షను ఎదుర్కోక తప్పలేదు. అయినా అనేక అడ్డంకులను, అవమానాలను తోసి రాజన్నారు. 2008లో ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళల ఫోర్బ్స్ జాబితాలో 59వ స్థానంలో నిలిచారు. 20017లో న్యూస్ వీక్స్ విజయవంతమైన టాప్ మహిళల్లో ఒకరుగా బరాక్ ఒబామా ఆఫ్ ఇండియాగా మాయావతిని అభివర్ణించడం విశేషం వ్యక్తిగత వివరాలు 1956, జనవరి 15న రాంరాఠి, ప్రభుదాస్ దంపతులకు జన్మించారు. బీఈడీ, అనంతరం లాకోర్సు చదివారు. ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్న సమయంలోఢిల్లీలో కొంతకాలం ఉపాధ్యాయురాలిగా కూడా పనిచేశారు. తన తాతాగారు మంగళసేన్ తనకు ఆదర్శమని మాయావతి స్వయంగా చెప్పేవారు. ఆయన చూపించే మానవతా దృక్పథం, కుటుంబంలోని పిల్లలపట్ల ఆడ, మగ అనే వివక్ష లేకుండా సమానంగా చూసే విధానం తనను ప్రభావితం చేసిందనేవారు. రచనలు బహుజన్ సమాజ్ ఔర్ ఉస్కి రాజ్‌నీతి (హిందీ). బహుజన్ సమాజ్ ఔర్ ఉస్కి రాజ్‌నీతి (ఇంగ్లీషు) మేరా సంఘర్ష్ మే జీవన్ అవమ్ బహుజన్ మూమెంట్ కా సఫర్నామా (హిందీ). దీనితోపాటు సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ జమీల్ అక్తర్‘ ఐరన్ లేడీ కుమారి మాయావతి’ అనే పుస్తకాన్ని రాయగా, మరో ప్రఖ్యాత జర్నలిస్టు అజయ్ బోస్ ‘బెహన్జీ’ అనే పొలిటికల్ బయోగ్రఫీని ప్రచురించారు. వివాదాలు రాష్ట్రవ్యాప్తంగా తన విగ్రహాలతోపాటు, తమ పార్టీ వ్యవప్థాపకుడు కాన్షీరాం, పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాలు, మాయావతి ఏర్పాటు చేయడం అప్పట్లో పెను దుమారం రేపింది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై సుప్రీం కోర్టు మొట్టికాయలేసింది. మరోవైపు ఆమెపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు కూడా ఇంకా కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చక్కెర మిల్లులను అతి తక్కువ ధరకు అమ్మేశారన్న కేసూ ప్రస్తుతం కోర్టులో ఉంది. అలాగే ఆమె సోదరుడు ఆనంద్ కుమార్ నకిలీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాడన్న కేసులు ఎదుర్కొంటున్నారు. - టి. సూర్యకుమారి -
గల్లీ నుంచి ఢిల్లీకి...
సాక్షి వెబ్ ప్రత్యేకం : ‘భాయియోం.. ఔర్ బెహనోం’ అంటూ 2016 నవంబర్ 8 రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం ప్రజల చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఆ మాటే జనం మధ్యన అప్పట్లో మార్మోగింది. భాయియోన్... ఔర్ బెహనోం... తో ఆయనపై అనేక సెటైర్లు మొదలయ్యాయి. ఏ సభలోనైనా ఆయన తన ప్రసంగం మొదలుపెట్టడంతో పాటు ప్రతి పేరా ప్రారంభంలో అన్నట్టు ఈ పదం మధ్యమధ్యలో ఉపయోగిస్తూనే ఉంటారు. ఇలా అనూహ్య నిర్ణయాలు ప్రకటించే ముందే కాదు... తన ఆహార్యంలోనూ మోదీ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. రాజకీయ రంగంలో కుర్తా పైజమాతో పాటు వాటిపై భిన్న రంగుల జాకెట్లతో ఆయన వేషధారణ మిగిలిన నేతల కంటే భిన్నంగా కనిపిస్తుంది. సంకీర్ణ రాజకీయాలకు స్వస్తి సంకీర్ణ రాజకీయాలను తోసిరాజని 2014 లోక్‌సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో సత్తా చాటి ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టిన నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ 1950 సెప్టెంబర్ 17న ప్రస్తుత గుజరాత్‌లోని వాద్నగర్లో దామోదర్‌దాస్ మూల్‌చంద్ మోది, హీరాబెన్ మోదీకి జన్మించారు. బాల్యంలో వాద్నగర్ రైల్వే స్టేషన్లో తండ్రి నిర్వహించే టీ దుకాణంలో పనిచేసిన మోదీ ఆ తర్వాత బస్ టెర్మినల్‌లో తన సోదరుడి టీ స్టాల్లోనూ పనిచేశారు. 1967లో పాఠశాల విద్యను పూర్తిచేసుకున్న మోదీ ఎనిమిదేళ్ల వయసు నుంచే స్ధానిక ఆరెస్సెస్ శాఖా సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1968లో అత్యంత చిన్నవయసులో యశోదాబెన్‌ను వివాహమాడారు. ఇక 1978లో మోదీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి సార్వత్రిక విద్య ద్వారా పొలిటికల్ సైన్స్‌లో బీఏ పట్టా పొందారు. 1983లో గుజరాత్ యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పట్టా పొందారు. ఛాయ్‌వాలా... ఆరెస్సెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన మోదీ 1985లో బీజేపీలో అడుగుపెట్టారు. 1986లో ఎల్కే అద్వానీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ గుజరాత్ బీజేపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయ్యారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన మోదీ 1990లో బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ సభ్యుడి స్ధాయికి ఎదిగారు. 1994లో అద్వానీ ప్రోద్బలంతో ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మోదీ పార్టీ కార్యదర్శిగా 1995 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి తనదైన వ్యూహాలతో ముందుకెళ్లారు. ఇక గుజరాత్ బీజేపీ నేత శంకర్‌సింగ్ వాఘేలా కాంగ్రెస్‌లోకి ఫిరాయించడంతో పార్టీని కాపాడేందుకు మోదీ చొరవ చూపుతూ 1998లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి బాటలు పరిచారు. గుజరాత్ సీఎంగా.. 2001లో గుజరాత్ సీఎం కేశూభాయ్ పటేల్ అనారోగ్యానికి గురికావడం, అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో పటేల్ స్దానంలో మోదీని గుజరాత్ సీఎంగా బీజేపీ అగ్రనేతలు ఎంపిక చేశారు. రాజ్‌కోట్ 2 నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిని ఓడించడం ద్వారా 2002 ఫిబ్రవరి 24న మోదీ గుజరాత్ అసెంబ్లీలోకి ప్రవేశించారు. ఇక 27 ఫిబ్రవరి 2002 గోద్రా అల్లర్లు అనంతరం చెలరేగిన హింసాకాండతో మోదీ అపప్రద మూటగట్టుకున్నారు. గోద్రా అనంతర హింసలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు మరణించారని స్వయంగా గుజరాత్ ప్రభుత్వమే వెల్లడించగా, మృతుల సంఖ్య 2000 పైనేని ఇతర సంస్థలు పేర్కొన్నాయి. 2002 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలో బీజేపీ గుజరాత్లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇక 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గుజరాత్లో బీజేపీని మోదీ గెలిపించుకుని పార్టీలో తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా మోదీ పార్టీని విజయతీరాలకు చేర్చడంలో సఫలీకృతమయ్యారు. మోదీ వారణాసి నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. హాబీలు : యోగాసనాలు, బ్రాండెడ్ వాచీల సేకరణ, ఫోటోగ్రఫీ, సోషల్ మీడియా ఇష్టమైన ఆహారం : వైట్ కట్టా దోక్లా, కిచిడీ, బేసన్ ఖాండ్వి, ఉంధియో -మురళి పులిజాల -
నిండుతనం..చెరగని చిరునవ్వు సుష్మా స్వరాజ్
సాక్షి వెబ్ ప్రత్యేకం : భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతల్లో ప్రముఖంగా వినిపించే పేరు సుష్మాస్వరాజ్. పలు సందర్భాల్లో పార్టీ కీలక నేతగా తన ప్రాధాన్యతను చాటుకున్నారు. చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న సుష్మ రాజకీయాల్లోకి ప్రవేశానంతరం వెనుదిరిగి చూడలేదు. హరియాణా అసెంబ్లీలో అడుగుపెట్టిన అతి చిన్న వయస్కురాలిగా, ఢిల్లీకి బీజేపీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా, లోక్‌సభలో తొలి మహిళా ప్రతిపక్షనేతగా, అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు స్వీకరించిన తొలి మహిళగా, క్రియాశీలకమైన రాజకీయవేత్తగా తనదైన శైలిలో రాణించారు. సుష్మా స్వరాజ్ దేశంలో అనేక రాజకీయ అనిశ్చితులను, ముఖ్యంగా ఎమర్జెన్సీ, పదమూడు రోజుల సంకీర్ణ ప్రభుత్వం లాంటి ఒడిదుడుకులను ఆమె చాలా దగ్గరినుంచి పరిశీలించారు. సంప్రదాయం, మానవత కలగలిసిన రాజనీతిజ్ఞురాలుగా వన్నెకెక్కి తనదైన వాక్పటిమతో విపక్ష నేతలను సైతం ఆకట్టుకునే చాతుర్యం ఆమె సొంతం. అందుకే బెస్ట్ లవ్డ్ పొలిటీషియన్’, ‘బెస్ట్ అవుట్‌స్టాండింగ్ పార్లమెంటేరియన్’. అవార్డులు ఆమెను వరించాయి. దీంతోపాటు విదేశాంగ మంత్రిగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ట్విటర్‌ద్వారా పలు సమస్యలను పరిష్కరిస్తూ స్మార్ట్ లీడర్‌గా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా 2016లో ఆమెకు జరిగిన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స నేపథ్యంలో ట్విటర్ ద్వారా ఆమెకు లభించిన సానుభూతి, ఊరట ప్రస్తావించదగింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకే కాదు, మన దేశంలో చిక్కుకుపోయిన విదేశీయులకూ అంతే స్మార్ట్‌గా సాయం అందించి అనేకమంది హృదయాలను గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2015లో నేపాల్ భూకంపం సందర్భంగా సుష్మ స్పందించిన తీరు, అందించిన సేవలకు గాను స్పెయిన్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డును 'గ్రాండ్ క్రాస్‌ను ఇటీవల అందుకోవడం విశేషం. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంటులో బీజేపీ తరపున గట్టిగా వాదించి ‘తెలంగాణ చిన్నమ్మ’ గా పేరు గడించారు. రాజకీయ ప్రస్థానం 1977-82 హర్యానా శాసనసభ సభ్యురాలిగా క్రీయాశీల రాజకీయాల్లో ప్రవేశించి, పార్లమెంటు (రాజ్యసభ, లోక్‌సభ) సభ్యురాలిగా కాలిడి, 2014లో 16వ లోక్‌సభకు ఎంపికవరకూ ఆమె రాజకీయ పయనం అప్రతిహతమే. బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వాని స్థానంలో ప్రతిపక్షనేతగా ఎంపికకావడం ఒక ఎత్తు అయితే..పలుమార్లు కేంద్రమంత్రిగా విజయవంతంగా సేవలందించడం మరో ఎత్తు. విప్లవాత్మక నిర్ణయాలు దేశ రాజధాని నగరం ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రిగా, విదేశాంగ మంత్రిగా సాహసోపేతమైన, విప్లవాత్మక నిర్ణయాలతో ఆకట్టుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ల తనిఖీలు చేపట్టి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సమాచార ప్రసార మంత్రిగా పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆరు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటు చేశారు. వ్యక్తిగత వివరాలు సుష్మాస్వరాజ్ తండ్రి హర్దేవ్ శర్మ (ఆర్ఎస్ఎస్ సభ్యుడు), తల్లి లక్ష్మీదేవి. సుష్మ బాల్యం, కాలేజ్ చదువు అంతా అంబాలాలో సాగింది. మూడేళ్లు వరుసగా బెస్ట్ ఎన్సీసీ క్యాడెట్ అవార్డు నుంచి బెస్ట్ హిందీ స్పీకింగ్ అవార్డు, బెస్ట్ స్టూడెంట్ అవార్డులను సుష్మ గెల్చుకున్నారు. న్యాయవాది పట్టా పొందిన అనంతరం 1973లో సుప్రీంకోర్టు న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. జార్జి ఫెర్నాండెజ్ లీగల్ డిఫెన్స్ టీమ్‌లో చేరడం... ఆమె జీవితంలో అటు రాజకీయంగా, ఇటు వ్యక్తిగతంగా కీలక మార్పులకు నాంది పలికింది. 1975, జూలై 13న సహచర న్యాయవాది కౌశల్ స్వరాజ్‌ను ఆమె పెళ్లి చేసుకుని సుష్మా స్వరాజ్గా మారడం అందులో ఒకటి. సుష్మ, స్వరాజ్ కౌశల్ దంపతులకు బన్సూరి కౌశల్ కుమార్తె ఉన్నారు. వివాదాలు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి వీసా పత్రాలు త్వరగా మంజూరయ్యేలా సిఫారసు చేశారన్న ఆరోపణలు అప్పట్లో ప్రకంపనలు రేపాయి. 2014లో భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలంటూ మరో వివాదంలో ఇరుక్కున్నారు. దీంతోపాటు ఆమె భర్త స్వరాజ్ కౌశల్, కూతురు బాంసూరి స్వరాజ్లను మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయవాదులుగా నియమించుకున్నారన్న వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై సుష్మ రాజీనామాను డిమాండ్ చేస్తూ 2015తలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. గత ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆరోగ్యరీత్యా రాబోయే 2019 ఎన్నికల్లో పోటీ చేయలేనంటూ అనూహ్యంగా ప్రకటించారు. ఇష్టాలు సంగీతం, సాహిత్యం, లలిత కళలు, నాటకాలు. సుష్మ స్వరాజ్‌కు జ్యోతిషశాస్త్రంపై ధృడమైన నమ్మకం. భోంచేసినా, దుస్తులు ధరించినా అన్నీ దీనికనుగుణంగానే చేస్తారట. - టి. సూర్యకుమారి