(సాక్షి వెబ్ ప్రత్యేకం) : నితిష్ కుమార్.. పేరు కాదు, ఇట్స్ ఏ బ్రాండ్.. అవును ఈ డైలాగ్ బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్‌కు సరిగ్గా సరిపోతుంది. దాదాపు 34 ఏళ్ల రాజకీయ జీవితం, అవినీతి మచ్చలేని మనిషి. పార్టీలు మారినా ప్రజల్లో తనకున్న ఫాలోయింగ్‌లో మాత్రం మార్పు రాలేదు. ఉన్నత కులాలకే ఉన్నత పదవులు అన్న మాటల్ని తిరగరాసి ఉన్నతమైన భావాలున్నవారందరికి అనిపించాడు. రౌడీలు రాజ్యమేలుతున్న బీహార్‌కు ఓ రాథోడ్.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కరెక్టుగా తెలిసిన రాజకీయనాయకుడు నితిష్‌కుమార్.
రాజకీయ జీవితం
నితిష్‌పై జయప్రకాశ్ నారాయణ్, రామ్‌మనోహర్ లోహియా సిద్ధాంతాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయన 1971లో రాజకీయ రంగప్రవేశం చేసి, రామ్‌మనోహర్ లోహియా పార్టీ సంజీవాది యువజన్ సభలో చేరారు. 1974-1977 వరకు జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.1977లో తన (కుర్మీ) సామాజిక వర్గం బలంగా ఉన్న హర్‌నాత్ నియోజకవర్గంలో పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. ఆ ఎన్నికల ద్వారా ఆయన ఓ గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. 1985లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1987 యువలోక్ దల్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. రెండు సంవత్సరాల అనంతరం జనతా దల్ పార్టీ సెక్రటరీ జనరల్ ఎన్నికయ్యారు. 1994లో సమతా పార్టీ పేరిట సొంత పార్టీని స్థాపించారు. జనతాదల్ యునైటెడ్ ప్రారంభమైన తర్వాత సమతా పార్టీని అందులో విలీనం చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉండగా1998-1999 మధ్య కాలం కేంద్ర మంత్రిగా రైల్వేశాఖ, వ్యవసాయ శాఖల బాధ్యతలు చేపట్టారు. 2000 సంవత్సరంలో మొదటి సారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన ఒక వారంలో నితిష్ తన పదవి కోల్పోవడం గమనార్హం. 2005లో బీజేపీతో పొత్తుపెట్టుకుని మరోసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. 2013లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. 2015లో లాలూప్రసాద్ యాదవ్, కాంగ్రెస్‌తో మహాకూటమి ఏర్పాటు చేశారు. 2016లో మహాకూటమితో తెగదింపెలు చేసుకుని పాత మిత్రుడైన బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీ సహాయంతో మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
వ్యక్తిగత జీవితం
మార్చి 1, 1951లో బీహార్‌లోని భక్తియార్‌పూర్‌లో కబిరాజ్ రామ్ లక్ష్మణ్ సింగ్, పరమేశ్వరి దేవి దంపతులకు జన్మించారు. తండ్రి కబిరాజ్ రామ్ లక్ష్మణ్ సింగ్ స్వాతంత్ర సమరయోధులు, ప్రముఖ ఆయుర్వేదనిపుణులు. నితిష్‌ను అందరూ ముద్దుగా మున్నా అని పిలిచేవారు. భక్తియార్‌పూర్‌లోని గణేష్ హైస్కూల్‌లో పదవతరగతి వరకు చదువుకున్నారు. చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. నితిష్ పాట్నాలోని బీహార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందారు. రాజకీయాల్లోకి రాకముందు బీహార్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశారు. 1973లో మంజుకుమారీ సిన్హాన అనే ఉపాధ్యాయురాలిని వివాహమాడారు. వారికి నిశాంత్ అనే ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 2007 సంవత్సరంలో నితిష్ తన భార్యను కోల్పోయారు.
జీవనశైలి
నితిష్ కుమార్ ఆరోగ్యం విషయంలో కచ్చితంగా ఉంటారు. అలాగని తన కోరికలను చంపుకోరు. ఓ సారి బేటియాలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో పిజ్జా ఆర్డర్ చేసుకుని మరీ తిన్నారు. తన రోజును యోగాతో ప్రారంభిస్తారు. ఉదయాన్నే మొలకలు తినటం ఆయనకు అలవాటు. ఆహారంలో కూడా కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. ‘ఆలూ బూజియా’ ఇష్టంగా తినే ఆహారం. మధ్యాహ్నం వేళల్లో చపాతీ, పరాతాలు తీసుకుంటారు.
నితిష్ రూటే సఫరేటు
నితిష్ కుమార్ మొత్తం పన్నేండేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్‌ను అభివృద్ధి పథంలో నడిపించారు. ఆయన సంక్షేమ పథకాలకే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. ఆడపిల్లలను బడికి రప్పించడానికి సైకిళ్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టాడు. దీంతో ఆడపిల్లలు చదువుకోవటం పెరిగింది. అంతేకాదు బీహార్‌లో మధ్యాహ్న భోజన పథకాన్ని సైతం ఆయనే ప్రవేశపెట్టాడు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని తెలిసినా రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి శభాష్ అనిపించుకున్నారు. కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నపుడే రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. తత్కాల్ టికెట్ల రిజర్వేషన్ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఇక నేరాల అడ్డాగా ఉన్న బీహార్‌లో నేరాలు అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకున్నాడు. తప్పు చేసింది ఎవరైనా శిక్షపడేవరకు వదిలిపెట్టలేదు. కొన్ని సందర్భాల్లో తన పార్టీ నాయకులను సైతం జైలుకు పంపించారు. ఇక మొత్తం 85వేల మందిపై క్రిమినల్ కేసులు పెట్టించాడు. దీంతో నేరాలు చాలా వరకు తగ్గాయి.
- బండారు వెంకటేశ్వర్లు
Comments
Please login to add a commentAdd a comment