పాట్నా: బీహార్‌లో ఎన్డీయే కూటమికి బీటలు వారుతోందా?. జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను బీజేపీ పదే పదే అవమానిస్తోందా?. వరుసగా ఒకదాని వెనుక ఒకటి జరుగుతుండడంతో ఆయన కలత చెందుతున్నారా?.. బీజేపీకి కావాలనే దూరం పెడుతున్నారా? ఆ పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా? ఎన్డీయే కూటమి నితీశ్ గుడ్ బై చెప్పే టైం దగ్గర పడిందా?.. గత పదిరోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆ దిశగానే సంకేతాలు అందిస్తున్నాయి.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పదేపదే బీజేపీ చేతిలో అవమానానికి గురవుతున్నారు. బీజేపీ తీరు పట్ల తన అసంతృప్తిని, అసహనాన్ని ఆయన బలంగానే కేంద్రంలోని బీజేపీ నాయకత్వానికి చేరవేస్తున్నారు. ఇందుకోసం బీజేపీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా.. ఎన్డీయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం ఆయన వెళ్లడం లేదు. ఓ సంక్షేమ పథకానికి సంబంధించి భేటీ ఉన్న కారణంగా వెళ్లడం లేదంటూ సీఎంవో ద్వారా కేంద్రానికి బదులు పంపించారు ఆయన.
వారంలో మూడోసారి..
బీజేపీ పార్టీ, స్వయంగా ఆ పార్టీ పెద్దలు ఆహ్వానం పంపుతున్నప్పటికీ.. సీఎం నితీశ్ కుమార్ ఆయా కార్యక్రమాలను ఎగ్గొడుతూ వస్తున్నారు. జులై 17వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ముఖ్యమంత్రుల భేటీ-జాతీయ జెండా చర్చ కోసం సీఎం నితీశ్ కుమార్ వెళ్లలేదు. బదులుగా బీజేపీ నేత తర్‌కిషోర్ ప్రసాద్ హాజరయ్యాడు. ఆపై నిన్నగాక మొన్న ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు విందుకు సైతం గైర్హాజరు అయ్యారు. బీహార్ అసెంబ్లీలో ఎమ్మెల్సీల ప్రమాణ కార్యక్రమం ఉందంటూ వెళ్లలేదు. అయితే ఆ కార్యక్రమం సాయంత్రం 4గం. లోపే ముగిసింది.
అవమానాలు భరించలేకే?
బీహార్ శాసనసభ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగం కార్యక్రమం నితీశ్ అవమాన భారం మరింత పెరగడానికి కారణమైంది. ఒకవైపు బీజేపీ నేతలు.. నితీశ్ సర్కారుపైనే బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తీరు.. పెద్ద తలనొప్పిగా మారింది. ఈ తరుణంలో.. బీహార్ శాసనసభ శతాబ్ది ఉత్సవాలు ఈ అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. స్పీకర్ విజయ్ కుమార్.. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీని ఒప్పించారు. అయితే.. విజయ్ కుమార్ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ వస్తున్నారు. అంతేకాదు.. శతాబ్ది ఉత్సవాల్లో నితీశ్ పేరు ప్రస్తావన లేకుండా ప్రసంగం చేశారాయన. వీటికి తోడు శతాబ్ది ఉత్సవాల స్మారక చిహ్నంపై కూడా ఐదుసార్లు సీఎం అయిన నితీశ్ కుమార్ ఫొటో పబ్లిష్ చేయలేదు. దీంతో నితీశ్‌కు బీజేపీ చేస్తున్న వరుస అవమానాలపై జేడీయూలో సీరియస్‌గా చర్చ మొదలైంది.
ప్రధాని మోదీకి అభివాదం చేస్తున్న స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా
వీటికి తోడు జేడీయూ సర్కార్‌పై బీజేపీ నేతల బహిరంగ విమర్శలు, ముఖ్యంగా స్పీకర్ విజయ్ కుమార్‌ను తొలగించాలన్న నితీశ్ కుమార్ డిమాండ్‌ను బీజేపీ అధిష్టానం పెద్దగా పట్టించుకోకపోవడం, అధికారిక కార్యక్రమాలను తన అనుమతి లేకుండా బీజేపీ వాళ్లు నిర్వహించుకోవడంపై ఆయన మరింతగా రగిలిపోతున్నారు. అయితే బీజేపీ అగ్రనేతల వ్యాఖ్యలపై నితీశ్‌కుమార్ కౌంటర్లు ఇస్తుండడం, పైగా అగ్నిపథ్ నిరసనలను అదుపు చేయడంలో నితీశ్ సర్కార్ ఘోరంగా విఫలం కావడం.. సొంత నేతలతోనే నితీశ్ ఆ పథకంపై విమర్శలు చేయిస్తున్నారంటూ ప్రధానంగా ఆరోపిస్తోంది బీజేపీ. ఈ ఆరోపణలు ప్రత్యారోపణల నడుమ ఎన్డీయూ కూటమి నుంచి త్వరలోనే జేడీయూ బయటకు వచ్చేయొచ్చన్న చర్చ జోరందుకుంది.
ఇదీ చదవండి: స్మృతి ఇరానీ కూతురిపై ఆరోపణలు.. లీగల్ నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment