అతిత్వరలో బీహార్‌లోనూ మహారాష్ట్ర తరహా రాజకీయ సంక్షోభం నెలకొంటుంది. అదీ అధికార పక్షంలోనే!. నితీశ్ కుమార్ వైఖరి నచ్చక కొందరు ఎమ్మెల్యేలు జేడీయూ నుంచి బయటకు వచ్చేస్తారు. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితుల నడుమ నితీశ్ మరో దారి లేక తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి అడుగు పెడతారు!!.
మహారాష్ట్రలో అజిత్ పవార్‌తో పాటు ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల జంపింగ్ పరిణామం నడుమ.. తర్వాతి వంతు బీహార్‌దేనంటూ రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. పైగా ప్రభుత్వం కూలిపోయే తరుణంలో గత్యంతరం లేని స్థితిలో నితీశ్ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరతారంటూ పలు మీడియా విశ్లేషణలు జరుగుతున్నాయి. దీనికి తోడు గత నాలుగైదు రోజులుగా నెలకొన్న పరిస్థితులూ ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉండడంతో.. నితీశ్ వైఖరిపైనా అనుమానాలు కలుగుతూ వస్తున్నాయి.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికలను విపక్షాలు నిర్వహించదల్చిన భేటీ.. మహారాష్ట్ర ఎన్సీపీ ఎపిసోడ్ కారణంగా వాయిదా పడింది. అదే సమయంలో బీహార్ గత నాలుగు పర్యటనలో నితీశ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఆశ్చర్యంగా తాజా పర్యటనలో మాత్రం పన్నెత్తి మాట అనలేదు. పైగా అవినీతి పక్షంతో పొత్తు(జేడీయూ మిత్రపక్షం ఆర్జేడీకి) దేనికి అంటూనే.. దానిని దూరంగా ఉండాలంటూ నితీశ్ సర్కార్‌కు పరోక్ష సూచన చేశారు కూడా. ఈ నేపథ్యంలోనే నితీశ్.. పాత మిత్ర కూటమికి మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.
2017లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై బీజేపీ అవినీతి ఆరోపణలు చేయగా.. నితీశ్ కుమార్ ఆర్జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో పొత్తుకు ముందుకు వెళ్లారు.
అయితే.. తాజా ఊహాగానాలను పటాపంచల్ చేశారు బీహార్ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అదంతా మీడియా సృష్టేనని తేల్చిపడేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నితీశ్‌ను బీజేపీ దగ్గరకు తీయబోదని స్పష్టం చేశారాయన. ‘‘బీజేపీకి ఆయన(నితీశ్) దూరం జరిగాక అమిత్ షా ఓ స్పష్టత ఇచ్చారు. ఇకపై బీజేపీ ఎప్పటికీ నితీశ్‌ను అంగీకరించబోదని. అలాంటప్పుడు నితీశ్ మళ్లీ ఎన్డీయేలో చేరే ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుంది! అని సుశీల్ మోదీ మీడియాతో స్పష్టం చేశారు. అయితే..
బీజేపీకి చెందిన మరో సీనియర్, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావాలే మాత్రం మరో తరహా ప్రకటన ఇచ్చారు. బీహార్‌లోనే కాదు.. యూపీలోనూ మహారాష్ట్ర పరిణామాలు ఏర్పడొచ్చని చెబుతున్నారాయన. సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీహార్ జేడీయూలో, ఉత్తర ప్రదేశ్ ఎస్పీలోనూ ఆయా పార్టీ చీఫ్‌ల మీద ఉన్న అసంతృప్తితో కొందరు బయటకు రావడం ఖాయం. ఎస్పీలో జయంత్ చౌద్రి ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం లేకపోలేదు అని సంచలన ప్రకటన చేశారు అథావాలే. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో జేడీయూతోగానీ, నితీశ్ కుమార్‌ను గానీ దగ్గరకు తీయొద్దంటూ ఏకంగా ఓ తీర్మానం పాస్ చేసింది పార్టీ.
ఇదిలా ఉంటే.. మహా పరిణామాల నేపథ్యంలో విపక్షాల భేటీ వాయిదా పడిందనే ప్రచారానికి చెక్ పెడుతూ.. ఈ నెలలోనే భేటీ ఉంటుందని విపక్షాల తరపున ఒక ప్రకటన వెలువడింది కూడా.
ఇదీ చదవండి: ఎన్పీసీని బలోపేతం చేస్తాం.. పునర్నిర్మిస్తాం!
Comments
Please login to add a commentAdd a comment