పట్నా/న్యూఢిల్లీ: బిహార్ రాజకీయం రసకందాయంలో పడింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాఘట్‌బంధన్ సంకీర్ణానికి జేడీ(యూ) సారథి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గుడ్‌బై చెప్పి ఎన్డీఏ కూటమిలో చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. పాత నేస్తం బీజేపీతో మళ్లీ జట్టు కట్టి ఆయన కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారమే నితీశ్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయవచ్చని జేడీ(యూ) వర్గాలంటున్నాయి.
రాష్ట్ర బీజేపీ అగ్ర నేత సుశీల్‌కుమార్ మోదీకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుందని సమాచారం. ‘‘(నితీశ్‌కు ఇంతకాలంగా బీజేపీలోకి) మూసుకుపోయిన తలుపులు తెరుచుకోవచ్చు. రాజకీయాంటేనే అవకాశాల ఆటస్థలి. కనుక ఏదైనా సాధ్యమే’’ అంటూ శుక్రవారం సుశీల్ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. బిహార్ తాజా పరిణామాలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, సుశీల్‌కుమార్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితర బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరిపి వచ్చారు.
ఈ నేపథ్యంలో జేడీ(యూ)ను ఎన్డీఏలోకి తీసుకోవడంపై శని, ఆదివారాల్లో బిహార్ బీజేపీ రెండు రోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. ఆదివారమే పొత్తు నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. ఆ రోజు ఉదయమే జేడీ(యూ) ఎమ్మెల్యేలతో నితీశ్ సమావేశం కానుండటం విశేషం! మరోవైపు 10 మంది దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలు అధికార సంకీర్ణంలో కలకలం రేపుతున్నాయి.
నితీశ్ స్పష్టత ఇవ్వాలి: ఆర్జేడీ
సంకీర్ణంలో ప్రధాన భాగస్వామి అయిన ఆర్జేడీతో నితీశ్‌కు విభేదాల నేపథ్యంలో బిహార్‌లో రెండు రోజులుగా రాజకీయ రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన ఎన్డీఏలో చేరతారన్న వార్తలు గురువారం కలకలం రేపాయి. జేడీ(యూ) ని్రష్కమిస్తే సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. దాన్ని కాపాడుకునేందుకు అవసరమైన 8 మంది ఎమ్మెల్యేల కోసం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
నలుగురు ఎమ్మెల్యేలున్న ఎన్డీఏ భాగస్వామి హిందూస్తానీ అవామ్ మోర్చా చీఫ్ జితిన్‌రామ్ మాంఝీతో శుక్రవారం మంతనాలు జరిపారు. మాంఝీ మాత్రం నితీశ్ కూడా త్వరలో ఎన్డీఏలోకి వస్తారని మీడియాతో చెప్పుకొచ్చారు! ఘట్‌బంధన్ సర్కారు ఒకట్రెండు రోజుల్లోనే కుప్పకూలడం ఖాయమని ఆయన కుమారుడు సంతోష్ జోస్యం చెప్పారు. మొత్తం ఉదంతంపై నితీశ్ తక్షణం స్పష్టమైన ప్రకటన చేసి ఊహాగానాలకు తెర దించాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కోరడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment