RJD - JD(U)
-
ముఖ్యమంత్రి చేతులు జోడించి వేడుకున్నా.. మరోసారి ఆ తప్పు చేయం
బీహార్‌లో రాజకీయాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. జనతాదళ్(యూ) చీఫ్, సీఎం నితీష్ కుమార్.. బీహార్ అసెంబ్లీలో విపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌తో భేటీ అయ్యారు. ఆ భేటీపై తేజస్వీ యాదవ్ స్పందించారు. సీఎం నితీష్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు.నితీష్‌కుమార్‌కు విశ్వసనీయత లేదు. ఆయన చర్మిషా తగ్గింది. ఇప్పటికే మద్దతు కోరి రెండుసార్లు మా వద్దకు వచ్చారు. సపోర్ట్ చేయమని చేతులు జోడించి వేడుకున్నారు. మద్దతు ఇచ్చాం. కానీ ఈ సారి ఆ తప్పు చేయం’అని చెప్పారు. భవిష్యత్తులో నితీష్ కుమార్‌తో చేతులు కలిపే అవకాశం గురించి అడిగినప్పుడు పార్టీ మరోసారి ఆ తప్పు చేయదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి : ట్రంప్ దేశాన్ని అమ్మేశారుబీహార్లో నితీష్ కుమార్ విశ్వసనీయత, ప్రభావం ముగిసింది. శాంతిభద్రతలు అదుపు తప్పాయి. వాటిని నిర్మూలించే సామర్ధ్యం సీఎం నితీష్ కుమార్లో లేవని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తరచూ పొత్తులు మారుతున్నారని యాదవ్ విమర్శించారు. నితీష్ ఆర్జేడీతో ఉన్నప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. బీజేపీలో ఉన్నప్పుడు ఆర్జీడీని విమర్శిస్తారు. ఇవేం రాజకీయాలు. ఫలితమే అతని విశ్వసనీయత నాశనం అయ్యిందని తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. తేజస్వీయాదవ్‌తో నితీష్ కుమార్ భేటీపైతేజస్వీయాదవ్తో నితీష్ కుమార్ భేటీపై బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. కేవలం సమాచార కమిషనర్ నియామకానికి సంబంధించి వీరిద్దరూ భేటీ అయ్యారని స్పష్టం చేసింది. సమాచార కమిషనర్ నియామక కమిటీలో విపక్ష నేత కూడా సభ్యుడేనని గుర్తుచేసింది. అందులో ఎలాంటి రాజకీయాలు లేవని వెల్లడించింది. -
Lok Sabha Election 2024: పాటలీపుత్ర లాలుకు లిట్మస్ టెస్టు
పాటలీపుత్ర లోక్‌సభ స్థానం బీజేపీ, ఆర్జేడీ మధ్య హోరాహోరీ పోరుకు వేదికైంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ రామ్ కృపాల్ యాదవ్ హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. ఆయన చేతిలో రెండుసార్లు ఓడిన ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి ముచ్చటగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కూతురిని ఎలాగైనా గెలిపించుకోవాలని లాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు... బిహార్‌లోని పాటలీపుత్ర లోక్‌సభ స్థానం 2008లో డీలిమిటేషన్ తర్వాత ఏర్పాటైంది. 2009లో లాలు కూడా ఇక్కడ ఓటమి చవిచూడటం విశేషం. అది కూడా ఒకప్పటి తన శిష్యుడు జేడీ(యూ) నేత రంజన్ ప్రసాద్ యాదవ్ చేతిలో! తర్వాత మీసా భారతిని బరిలో దింపారు. తనను కాదని కూతురికి టికెటివ్వడంతో లాలుతో విభేదించిన రామ్‌కృపాల్ 2014లో ఆర్జేడీని వీడి బీజేపీలో చేరారు. 2014, 2019ల్లో రెండుసార్లు మీసా భారతిని ఓడించారు. విద్యార్థి సంఘాల నుంచి ఎదిగిన రామ్ కృపాల్ 1993లో ఆర్జేడీ టికెట్‌పై తొలిసారి ఎంపీగా గెలిచారు. తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 1996లో, 2004లో కూడా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఐదుసార్లు ఎంపీగా చేసిన ఆయనకు బిహార్‌లో గట్టి రాజకీయ బలం ఉంది. పాటలీపుత్ర నియోజకవర్గ ప్రజలతో మంచి అనుబంధముంది. పిలిస్తే పలికే నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గమంతా కలియదిరుగుతూ ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. రామమందిర నిర్మాణ ప్రభావం కూడా ఇక్కడి ఓటర్లపై బాగా ఉండటం ఆయనకు మరింత కలిసి రానుంది.మీసా... మూడోసారిపాటలీపుత్రలో ఆర్జేడీ ఓటమి పరంపరకు ఈసారి ఎలాగైనా బ్రేక్ వేయడానికి మీసా ప్రయతి్నస్తున్నారు. లాలు, భార్య రబ్రీ, కుమారుడు తేజస్వీ యాదవ్‌తో సహా కుటుంబమంతా ఆమె గెలుపు కోసం పని చేస్తోంది. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం 2019లో మీసాకు బాగా మైనస్‌గా మారింది. ప్రజలకు అందుబాటులో ఉండరన్న అపప్రథను కూడగట్టుకున్నారు. ఈసారి కూడా ఎన్నికలవగానే మాయమవుతారా, గెలుపోటములతో నిమిత్తం లేకుండా నియోజకవర్గంలో ఉండి పని చేస్తారా అంటూ ప్రచారం పొడవునా ప్రజలు ఆమెను నిలదీస్తున్న పరిస్థితి! అయితే ఇక్కడ మోదీ ఫ్యాక్టర్ 2019లో ఉన్నంత బలంగా లేకపోవడం మీసాకు కాస్త ఊరట. పైగా పాటలీపుత్ర లోక్‌సభ స్థానం పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలూ ఆర్జేడీ, దాని మిత్రపక్షాల చేతిలోనే ఉన్నాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితరాలను ప్రచారా్రస్తాలుగా సంధిస్తున్నారామె.కుల సమీకరణాలు... బీజేపీకి మద్దతిచ్చే బ్రాహ్మణులతో సహా అగ్రవర్ణాల ఓట్లు పాటలీపుత్రలో లక్షకు పైగా ఉన్నాయి. దాదాపు 4 లక్షల ఓట్లున్న భూమిహార్ ఓటర్లలోనూ ఆ పార్టీకి బలముంది. 5 లక్షల యాదవ, 1.7 లక్షల కుర్మీ, 3 లక్షల దళిత ఓట్లు రామ్ కృపాల్, మీసా మధ్య చీలనున్నాయి. యాదవులతో పాటు 1.5 లక్షల ముస్లిం ఓట్లను మీసా నమ్ముకున్నారు. కాకపోతే మజ్లిస్ బరిలో ఉండటంతో ముస్లిం ఓట్లు చీలి ఆర్జేడీకి గట్టి నష్టమే చేసేలా కన్పిస్తోంది. హోరాహోరీ పోరు లో ఈసారి పాటలీపుత్రలో లాంతరు వెలుగుతుందో, ముచ్చటగా మూడోసారీ కమలమే వికసిస్తుందో చూడాలి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బిహార్‌లో ఆసక్తికరంగా మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్
పట్నా: ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహా కూటమి నుంచి వైదొలిగి బీజేపీలో చేరి.. మళ్లీ సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి బిహార్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా జేడీ(యూ), ఆర్జేడీ పార్టీల్లో జరగుతున్న చర్చలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పక్క పార్టీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు నితీష కుమార్ పార్టీ జేడీ(యూ) తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 10 మందితో జేడీయూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో 13 మందిని లాగేందుకు ఆర్జేడీ అధినేత లాలూ సైతం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా పట్నాలో అందుబాటులో ఉండాలని లాలూ ఆదేశించారు. నితీష్ కుమార్ మహా కూటమిని మారే సమయంలో బిహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. శనివారం రాత్రి 7 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలతో నితీష్ చర్చలు జరపనున్నారు. అయితే ఈ రాత్రికి నితీష్ సీఎంగా రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ మద్దతుతో రేపు(ఆదివారం) మరోసారి బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆదివారం తెలంగాణలో పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు బిహార్ వెళ్లనున్నారు. ఆదివారం పట్నాలో బీజేపీ ఎమ్మెల్యేలతో వారు సమావేశం కానున్నారు. చదవండి: ‘ఇండియా కూటమి ఎక్కడ? అందరూ వెళ్లిపోతున్నారు’ -
Bihar Politics: రేపే ఎన్డీఏలోకి నితీశ్?
పట్నా/న్యూఢిల్లీ: బిహార్ రాజకీయం రసకందాయంలో పడింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాఘట్బంధన్ సంకీర్ణానికి జేడీ(యూ) సారథి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గుడ్‌బై చెప్పి ఎన్డీఏ కూటమిలో చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. పాత నేస్తం బీజేపీతో మళ్లీ జట్టు కట్టి ఆయన కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారమే నితీశ్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయవచ్చని జేడీ(యూ) వర్గాలంటున్నాయి. రాష్ట్ర బీజేపీ అగ్ర నేత సుశీల్‌కుమార్ మోదీకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుందని సమాచారం. ‘‘(నితీశ్‌కు ఇంతకాలంగా బీజేపీలోకి) మూసుకుపోయిన తలుపులు తెరుచుకోవచ్చు. రాజకీయాంటేనే అవకాశాల ఆటస్థలి. కనుక ఏదైనా సాధ్యమే’’ అంటూ శుక్రవారం సుశీల్ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. బిహార్ తాజా పరిణామాలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, సుశీల్‌కుమార్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితర బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరిపి వచ్చారు. ఈ నేపథ్యంలో జేడీ(యూ)ను ఎన్డీఏలోకి తీసుకోవడంపై శని, ఆదివారాల్లో బిహార్ బీజేపీ రెండు రోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. ఆదివారమే పొత్తు నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. ఆ రోజు ఉదయమే జేడీ(యూ) ఎమ్మెల్యేలతో నితీశ్ సమావేశం కానుండటం విశేషం! మరోవైపు 10 మంది దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలు అధికార సంకీర్ణంలో కలకలం రేపుతున్నాయి. నితీశ్ స్పష్టత ఇవ్వాలి: ఆర్జేడీ సంకీర్ణంలో ప్రధాన భాగస్వామి అయిన ఆర్జేడీతో నితీశ్‌కు విభేదాల నేపథ్యంలో బిహార్‌లో రెండు రోజులుగా రాజకీయ రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన ఎన్డీఏలో చేరతారన్న వార్తలు గురువారం కలకలం రేపాయి. జేడీ(యూ) ని్రష్కమిస్తే సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. దాన్ని కాపాడుకునేందుకు అవసరమైన 8 మంది ఎమ్మెల్యేల కోసం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలున్న ఎన్డీఏ భాగస్వామి హిందూస్తానీ అవామ్ మోర్చా చీఫ్ జితిన్‌రామ్ మాంఝీతో శుక్రవారం మంతనాలు జరిపారు. మాంఝీ మాత్రం నితీశ్ కూడా త్వరలో ఎన్డీఏలోకి వస్తారని మీడియాతో చెప్పుకొచ్చారు! ఘట్బంధన్ సర్కారు ఒకట్రెండు రోజుల్లోనే కుప్పకూలడం ఖాయమని ఆయన కుమారుడు సంతోష్ జోస్యం చెప్పారు. మొత్తం ఉదంతంపై నితీశ్ తక్షణం స్పష్టమైన ప్రకటన చేసి ఊహాగానాలకు తెర దించాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కోరడం విశేషం. -
కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో జేడీ(యూ), ఆర్జేడీ విలీనం!
జనతాదళ్ యునైటెడ్ జేడీ(యూ), రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) పార్టీలు త్వరలో విలీనం అవుతాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీ(యూ)అధినేత, సీఎం నితీష్ కుమార్.. ఇండియా కూటమిలో భాగంగా సీట్ల పంపిణీపై పట్టబడుతున్నారన్న మీడియా ప్రశ్నకు కేంద్రమంత్రి ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో పలు వ్యక్తిగత సమీకరణాలు పంచుకున్నా. ఆయన కూడా చాలా విషయాలు నాకు చెప్పారు. అయితే వాటిని మీడియా ముందు ప్రజలకు వెల్లడించడం సరికాదు. కానీ, మీకు నేను ఒకటి చెప్పగలను. త్వరలో జేడీ(యూ), ఆర్జేడీ పార్టీలు విలీనం అవుతాయి. అప్పడు ఇండియా కూటమిలో సీట్ల పంపిణీకి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కావు’ అని అన్నారు. అయితే గురవారం పార్లమెంట్ సమావేశాలు ముగించుకొని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఇడియా కూటమి సమావేశం అనంతరం లలూ ప్రసాద్ ఇరువురు ఒకే విమానంలో ఢిల్లీ నుంచి పట్నాకు ప్రయాణం చేశారు. ప్రస్తుతం బీహార్ డిప్యూటీ సీఎం ఉన్న తన కుమారు తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసే సమయం ఆసన్నమైందని లాలూప్రసాద్.. తనతో చెప్పాడని కేంద్ర మంత్రి గిరిరాజ్ అన్నారు. కేంద్ర మంత్రి ‘విలీనం’ వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అసాధారణమైన వ్యాఖ్యలు చేస్తారు. ఆయనకి ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలవాలని ఉంటుంది. ఆయన్ను ఎవరు గుర్తించరు కావును అసాధారణ వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు’ అని మండిపడ్డారు. చదవండి: Alcohol Ban Exemption: గుజరాత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్ -
ఆ కూటమి అపవిత్రమైంది: అమిత్ షా
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను టార్గెట్ చేస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధాన మంత్రి కావాలనే కోరికతోనే నితీష్ కుమార్ కాంగ్రెస్, ఆర్జేడీతో చేతులు కలిపారని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రధాని కావాలనే ఆశయాలకోసం అభివృద్ధి కారకుడి నుంచి అవకాశవాది అయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, హోం మంత్రి అమిత్ షా బీహార్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా పశ్చిమ చంపారన్‌లో బీజేపీ శ్రేణులు తలపెట్టిన సభలో అమిత్ షా ప్రసంగించారు. సభలో అమిత్ షా మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని ప్రజలు అతిపెద్ద పార్టీగా నిలబెట్టారు. ప్రధాని మోదీ తాను ఇచ్చిన మాట కోసం నితీష్‌కు సీఎంను చేశారు. కానీ నితీష్ మాత్రం మూడేళ్లకోసారి ప్రధాని కావాలనే కలలు కంటున్నారు. నితీశ్ కుమార్‌కు బీజేపీలో తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి. కేవలం పదవీ కాంక్ష కోసమే నితీష్.. కాంగ్రెస్, ఆర్జేడీతో చేతులు కలిపారు. ఆర్జేడీ, జేడీ(యూ) కలయిక చమురు, నీరు వంటిది. ఈ రెండు పార్టీల కూటమి అపవిత్ర కూటమి అంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. నితీశ్ ప్రధాని కావాలనే ఆశయం బీహార్ ను విభజించిందని ఘాటు విమర్శలు చేశారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఫైరయ్యారు. బీహార్‌ను జంగిల్ రాజ్‌గా మార్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో కల్తీ మద్యం తాగి ప్రజలు మరణిస్తుంటే నితీష్ సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. బీహార్‌ను నితీష్, లాలూ కూటమి అభివృద్ధి చేయలేదని అన్నారు. బీహార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. పూర్తి మెజార్టీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని ఆసక్తికర కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో కూడా జేడీయూ కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. -
అవిశ్వాసం పెట్టినా.. రాజీనామా చెయ్యను
పాట్నా: బీహార్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామంపై జోరుగా చర్చ నడుస్తోంది. నితీశ్ కుమార్ సర్కార్‌కు బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా ఝలక్ ఇచ్చారు. మొదటి నుంచి నితీశ్‌కు కొరకరాని కొయ్యగా తయారైన విజయ్.. తనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టినా రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాకు వ్యతిరేకంగా మహాఘట్బంధన్ కూటమి నుంచి 55 ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. నేనొక పక్షపాతినని, నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తున్నానని అందులో వాళ్లు ఆరోపించారు. అవన్నీ ఉత్తవే. అలాంటి ఆరోపణల నేపథ్యంతో రాజీనామా చేయాల్సి వస్తే.. అది నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే అంశమే. అందుకే నేను రాజీనామా చేయదల్చుకోలేదు అని విజయ్ కుమార్ సిన్హా తెలిపారు. బీజేపీ నేత అయిన విజయ్ కుమార్ సిన్హా వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. జేడీయూతో కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన నిర్ణయాలు ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండేవి. సభాముఖంగా నితీశ్‌ను ఎన్నోసార్లు మందలించారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన్ని మార్చేయాలంటూ బీజేపీ అధిష్టానానికి నితీశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. ఫలితం లేకుండా పోయింది. సాధారణంగా.. ప్రభుత్వాలు మారిన సందర్భాల్లో స్పీకర్ పదవి నుంచి సదరు వ్యక్తి వైదొలగాల్సి ఉంటుంది. కానీ, మహాఘట్బంధన్ ప్రభుత్వం ఏర్పడి రెండు వారాలు గడుస్తున్నా విజయ్ కుమార్ సిన్హా రాజీనామాకు నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. బీహార్ అసెంబ్లీ వ్యవహారాల నిబంధనల్లో రూల్ నెంబర్ 110 ప్రకారం సిన్హా పదవి నుంచి తప్పుకోవాలంటూ ఆగస్టు 10వ తేదీనే 55 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన తీర్మానాన్ని అసెంబ్లీ సెక్రటేరియెట్‌కు అందించింది కూటమి ప్రభుత్వం. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు బీజేపీ కూడా ఈ వ్యవహారంపై గప్‌చుప్‌గా ఉంటోంది. మరోవైపు ఆయన స్వచ్ఛందంగా వైదొలిగితే బాగుంటుందని జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి ముందు నుంచి చెబుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 24న(ఇవాళ) నుంచి రెండు రోజులపాటు బీహార్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్లోనే బలనిరూపణతో పాటు స్పీకర్ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ విజయ్ కుమార్ సిన్హా గనుక ఈ సమావేశాలకు గైర్హాజరు అయితే డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారి(జేడీయూ) సభా వ్యవహారాలను చూసుకుంటారు. ఇదీ చదవండి: బీజేపీ మాకు భయపడుతోంది -
నితీశ్ సర్కార్‌కు పీకే బంపరాఫర్
పాట్నా: జన్ సురాజ్ అభియాన్ ద్వారా బీహార్‌లో ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులేస్తారని భావిస్తున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ప్రకటన చేశారు. బీహార్ ప్రజలకు ఇచ్చిన ఒక హామీని నెరవేరిస్తే.. తన జన్ సురాజ్ అభియాన్ క్యాంపెయిన్‌ను ఆపేస్తానని, నితీశ్ సర్కార్‌కు మద్దతు ప్రకటిస్తానని పేర్కొన్నారాయన. సమస్తిపూర్‌లో బుధవారం తన మద్దతుదారులతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్.. మహాగట్బంధన్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో అంతగా ఆదరణ లేదని వ్యాఖ్యానించారాయన. అంతేకాదు.. నితీశ్ కుమార్ సీఎం కుర్చీకి ఫెవికల్ అంటించుకుని కూర్చుంటే.. మిగతా పార్టీలు ఆయన చుట్టూరా తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్.. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీహార్ యువతకు పది లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే నితీశ్ కుమార్ కూడా మొన్న స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలోనూ 20 లక్షల ఉద్యోగాల కల్పన ఉంటుందని ప్రకటించారు. ఈ ఇద్దరూ రాబోయే ఏడాది, రెండేళ్లలో తమ తమ హామీని నెరవేరిస్తే చాలూ.. నా జన్ సురాజ్ అభియాన్‌ను ఆపేస్తా. అంతేకాదు నితీశ్ కుమార్ ప్రభుత్వానికి నా మద్దతు ప్రకటిస్తా అని మీడియా ముఖంగా తెలిపారు పీకే. ప్రత్యక్ష రాజకీయ పార్టీగా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ.. ప్రాంతాల వారీగా సమస్యలు తెలుసుకోవడం, వాటికి పరిష్కారాలు చూపెట్టడం లాంటివి చేస్తుందని జన్ సురాజ్ అభియాన్‌పై గతంలోనే పీకే ఒక స్పష్టత ఇచ్చారు. అయితే నితీశ్ కుమార్‌కు మాత్రం జేఎస్ఏ గుబులు పుట్టిస్తూ వస్తోంది. ఇదీ చదవండి: మూడొంతుల మందిపై క్రిమినల్ కేసులు! -
బిహార్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 31 మంది ప్రమాణం
పాట్నా: ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకుని పాత మిత్రులతో కలిసి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. సీఎంగా నితీశ్, ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణం చేశారు. తాజాగా కేబినెట్ విస్తరణ చేపట్టారు సీఎం నితీశ్ కుమార్. 31 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన మంత్రుల చేత ప్రమాణం చేయించారు గవర్నర్ ఫాగు చౌహాన్. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సైతం ఉన్నారు. బిహార్ కేబినెట్లో మొత్తం 36 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ తరుణంలో కేబినెట్లో తేజస్వియాదవ్ ఆర్జేడీకి 16, నితీశ్ కుమార్ జేడీయూకు 11 స్థానాలు కేటాయించారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందుస్థానీ ఆవామ్ మోర్చా జితిన్ రామ్ మాంఝీకి, మరో ఇండిపెండెట్ అభ్యర్థికి సైతం కేబినెట్ బెర్త్‌లు ఇచ్చారు. Tej Pratap Yadav, RJD leader and brother of Deputy CM Tejashwi Yadav, takes oath as a minister in the Bihar cabinet. #BiharCabinetExpansion pic.twitter.com/68zpjRUuPO — ANI (@ANI) August 16, 2022 ఇదీ చదవండి: బీహార్‌లోనూ మహారాష్ట్ర సీన్ రిపీట్??.. షిండేలాగే నితీశ్ కూడా.. -
బీహార్‌లోనూ మహారాష్ట్ర సీన్ రిపీట్??
రాంచీ: బీహార్‌లోనూ మహారాష్ట్ర పరిస్థితులు పునరావృతం కానున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగి.. తిరిగి పాత మిత్రులతో జత కట్టిన నితీశ్ కుమార్.. ఇప్పటికే కేబినెట్ కూర్పును ఓ కొలిక్కి తెచ్చారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే.. ఇక్కడ కూడా మహారాష్ట్ర తరహా పరిస్థితులే కనిపించబోతున్నాయా? అనే చర్చ జోరందుకుంది. బీహార్ సీఎం నితీశ్ ఇవాళ కేబినెట్‌ను విస్తరించబోతున్నారు. మొత్తం బీహార్ కేబినెట్లో 36 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ తరుణంలో కేబినెట్లో తేజస్వియాదవ్ జేడీయూకు 16, నితీశ్ కుమార్ జేడీయూకు 12 స్థానాలు కేటాయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందుస్థానీ ఆవామ్ మోర్చా జితిన్ రామ్ మాంఝీకి, మరో ఇండిపెండెట్ అభ్యర్థికి సైతం కేబినెట్ బెర్త్‌లు దాదాపుగా ఖరారు అయ్యాయి. కానీ, కీలకమైన విభాగాలు మాత్రం ఆర్జేడీ, ఇతరులకు తరలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మహారాష్ట్రలోనూ బీజేపీ కీలకమైన శాఖలన్నీ ఉంచేసుకుని.. షిండే వర్గానికి మిగిలిన పోస్టులను మిగిల్చింది. గతంలో ఈ శాఖలు ఎన్సీపీ, కాంగ్రెస్‌లు అనుభవించాయి. ఇప్పుడు.. బీహార్‌లోనూ మిత్రపక్షాల కోసం జేడీయూ అదే తరహా త్యాగం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తేజస్వి యాదవ్.. హోం లేదంటే ఆర్థిక శాఖను చేజిక్కించుకోవచ్చనే ప్రచారం నడుస్తోంది. ఇంతకు ముందు హోం శాఖను నితీశ్ కుమారే స్వయంగా పర్యవేక్షించడం విశేషం. అంతేకాదు తన పేషీలోని కీలకమైన, సీనియర్ ఎమ్మెల్యేలకు ఆర్జేడీ తేజస్వి యాదవ్.. ముఖ్యమైన పోస్టులు అప్పజెప్పబోతున్నారనే ప్రచారం అక్కడి స్థానిక మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇంతకు ముందు బీజేపీకి జేడీయూ కేటాయించిన ఆరోగ్యం, ఆర్థికం, రోడ్లు భవనాల శాఖల మీదే ఆర్జేడీ ఫోకస్ చేసిందని.. వాటి కోసమే పట్టుబడుతోందన్నది ఆ కథనాల సారాంశం. ఇదిలా ఉంటే.. మహాకూటమి నేతృత్వంలోని నితీశ్ సర్కార్ వచ్చే వారం.. అసెంబ్లీలో బలనిరూపణకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మీ రాజకీయాల కోసం.. చరిత్రను వక్రీకరించకండి: సోనియా గాంధీ -
2024 ఎన్నికలు: ప్రధాని రేసులో నితీష్ కుమార్.. పీకే హాట్ కామెంట్స్
Prashant Kishor Comments.. బీహార్‌లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని జేడీయూ చీఫ్ నితీష్ కుమార్.. కాంగ్రెస్, ఆర్జేడీతో పొత్తుపెట్టుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం బీహార్ సీఎంగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, నితీష్ కుమార్ వ్యవహారంపై ఎట్టకేలకు జేడీయూ మాజీ నేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ స్పందించారు. బీహార్‌లో గత 10 పదేళ్లుగా రాజకీయ అస్థిరత యుగం కొనసాగుతోందని, ప్రస్తుత పరిణామాలు కూడా ఆ దిశగానే ఉన్నాయని తెలిపారు. నితీశ్ కుమార్ 2017లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సంతోషంగా కనిపించలేదని తాజాగా బాంబు పేల్చారు. బలవంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా ఆయన ఫీల్ అయ్యారని చెప్పుకొచ్చారు. ఒకరి రాజకీయ లేదా పరిపాలనా అంచనాలు నెరవేరనప్పుడు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయాని అన్నారు. ఇదిలా ఉండగా.. కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మెరుగ్గా పనిచేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉందన్నారు. అయితే, 2015 కూటమి ప్రభుత్వం , ప్రస్తుత మహాకూటమి ప్రభుత్వం పూర్తిగా వేరని ప్రశాంత్ కిషోర్ అన్నారు. కొత్త ప్రభుత్వం బీహార్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని, బీహార్ రాజకీయాల్లో స్థిరత్వం తిరిగి నెలకొంటుందని తాను ఆశిస్తున్నానట్టు స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం యువనేత తేజస్వి యాదవ్ ప్రధాన పాత్ర పోషిస్తారని తాను అనుకుంటున్నానని తెలిపారు. ఈ క్రమంలో నితీష్ కుమార్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారా అన్న ప్రశ్నకు పీకే బదులిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం నితీష్‌కు అలాంటి ఆశ లేదని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. బీహార్ రాజకీయాల్లోనే కీలకంగా ఉంటారని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. Next chapter of political instability has started in Bihar: Prashant Kishor on Mahagathbandhan 2.0 https://t.co/TpfqCGGnFM — MSN India (@msnindia) August 10, 2022 ఇది కూడా చదవండి: ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? -
Nitish Kumar: తొలుత ఇంజనీర్‌గా..
వెనకబడిన కుర్మీ కులానికి చెందిన నేత అయిన నితీశ్ తొలుత బిహార్ విద్యుత్ బోర్డులో ఇంజనీర్‌గా పని చేశారు. నాటి సోషలిస్టు నేత రాంమనోహర్ లోహియా సారథ్యంలో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. 1970ల్లో లోక్‌నాయక్ జయప్రకాశ్ చేపట్టిన అన్ని రాజకీయ ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. 2000లో జేడీ(యూ) నేతగా తొలిసారి బిహార్ సీఎం పదవి చేపట్టినా ఆ ప్రభుత్వం కొంతకాలానికే కుప్పకూలింది. అనంతరం కేంద్రంలో వాజ్‌పేయీ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా తన పనితీరుతో ఆకట్టుకున్నారు. 2005లో రెండోసారి బిహార్ సీఎం అయ్యారు. అత్యంత వెనకబడ్డ రాష్ట్రాల్లో ఒకటిగా పేరుపడ్డ బిహార్‌కు సుపరిపాలన రుచి చూపించిన సీఎంగా మన్ననలు అందుకున్నారు. 2013లో బీజేపీకి గుడ్‌బై చెప్పారు. 2015లో రాజకీయ ప్రత్యర్థులైన ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో చేతులు కలిపి మరోసారి సీఎం పీఠమెక్కారు. రెండేళ్లకే మహా ఘట్‌బంధన్‌తో తెగదెంపులు చేసుకుని మళ్లీ ఎన్డీఏ గూటికి చేరారు. ఐదేళ్ల తర్వాత తాజాగా ఈ సీన్‌ను రివర్స్ చేసి తన గోడ దూకుడు నాటకాన్ని మరోసారి రక్తి కట్టించారు. చదవండి: (పిల్లిమొగ్గల రాజకీయం) -
సీఎంగా మరోసారి నితీష్ కుమార్.. ప్రమాణానికి ముహుర్తం ఫిక్స్!
బీహార్‌లో అనూహ్య పరిణామాల మధ్య నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేసిన అనంతరం.. లాలూ ప్రసాద్ సతీమణి రబ్రీదేవి నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్జేడీ-కాంగ్రెస్- లెఫ్ట్ పార్టీలతో కూడిన మహాఘట్బంధన్ కూటమి నేతగా నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ క్రమంలో కూటమి నేతలంతా మరోసారి సీఎంగా నితీశ్ కుమార్‌ను ఎన్నుకున్నారు. మహాఘట్బంధన్ సమావేశంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల ఎమ్మెల్యేలు నితీశ్‌కు మద్దతు తెలుపుతూ రాసిన లేఖపై సంతకాలు చేశారు. Nitish Kumar To Take Oath As Bihar Chief Minister At 4 Pm Tomorrow, Tejashwi Yadav To Be Deputy https://t.co/dqwLAK2uRe — joinnoukri (@joinnoukri) August 9, 2022 అనంతరం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో కలిసి నితీష్ కుమార్ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో మొత్తం 160 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్‌కు నితీశ్‌కుమార్ అందజేశారు. దీంతో, ఆయన బుధవారం బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణం స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. దీనికి గాను బుధవారం సాయంత్రం 4 గంటలకు ముహుర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: నితీష్ రాజీనామా.. ‘బీజేపీ భగావ్’ అంటూ అఖిలేష్ షాకింగ్ కామెంట్స్ -
Bihar Crisis: నితీశ్‌కు ఇది బాగా అలవాటే!
#BiharPoliticalCrisis: ‘‘ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశా.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశాం’’ అంటూ స్వయంగా జనతా దళ్(యునైటెడ్) సీనియర్ నేత నితీశ్ కుమార్ ప్రకటనతో ఉత్కంఠకు తెరపడింది. బీహార్ రాజకీయాలను మలుపు తిప్పుతూ.. బీజేపీతో తెగదెంపుల ప్రకటన చేసిన నితీశ్.. ప్రభుత్వ ఏర్పాటులో సాయానికి ఆర్జేడీ, వామపక్ష, కాంగ్రెస్‌లు ముందుకు రావడంతో కొండంత ధైర్యం ప్రదర్శించారు. అయితే.. బీజేపీ అయితేనేం మరో పార్టీ అయితేనేం నితీశ్‌కు తెగదెంపులు చేసుకోవడం ఇలా కొత్తేం కాదు! రాజకీయాల్లో శాశ్వత శత్రువులెవరూ ఉండరు.. అలాగే మిత్రులు కూడా ఉండరు. బీహార్ సీనియర్ నేత నితీశ్ కుమార్ విషయంలో అదే నిజం అనిపిస్తోంది. నితీశ్ కుమార్లో నిలకడలేనితనం.. రాజకీయాల్లోకి వచ్చిన తొలి నాళ్ల నుంచే అలవడింది. జయప్రకాశ్ నారాయణ్ స్ఫూర్తితో సత్యేంద్ర నారాయణ్ సిన్హా నేతృత్వంలోని జనతా దళ్‌లో చేరాడు నితీశ్ కుమార్. తొలినాళ్లలో ప్రతిపక్ష నేతగా ఉంటూనే నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌తో దోస్తీ కట్టాడు. అది 1989లో.. ► 1994లో.. లాలూతో కటీఫ్ చెప్పి జార్జి ఫెర్నాండేజ్ నేతృత్వంలోని సమతా పార్టీతో జట్టు కట్టాడు. ► 1996లో బర్హ్ లోక్ సభ సీటు గెలిచిన తర్వాత.. సమతా పార్టీకి దూరం జరిగి బీజేపీతో చేతులు కలిపాడు. ► అంతేకాదు అటల్ బిహారీ వాజ్‌పేయి కేబినెట్లో మంత్రిత్వ శాఖను(రైల్వే మంత్రిత్వ శాఖ) దక్కించుకున్నాడు. ఈ పరిణామం.. అప్పటి జనతాదళ్ ప్రెసిడెంట్ శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్ మధ్య చిచ్చుపెట్టిందని అంటారు. ఈ దెబ్బకు లాలూ సొంతగా ఆర్జేడీని ఏర్పాటు చేశారు. అలా నితీశ్ తన రాజకీయ స్వార్థం కోసం చిచ్చురగిల్చాడనే అపవాదు ముద్రపడిపోయింది. ► 2000 సంవత్సరంలో.. ఎన్డీయే కూటమి తరపున నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. కానీ, మ్యాజిక్ ఫిగర్(163 సీట్లు) కంటే 12 సీట్లు తక్కువ ఉండడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రమాణం చేసిన వెంటనే రాజీనామా చేయాల్సి వచ్చింది. ► 2003లో నితీశ్ సమక్షంలోనే సమతా పార్టీ, శరద్ యాదవ్ నేతృత్వంలోని జనతా దళ్‌లో విలీనం అయ్యింది. అదే సమయంలో బీజేపీ కూటమితో పొత్తు సైతం కొనసాగింది. అలా జేడీ(యూ) ఏర్పడి.. నితీశ్‌కు మళ్లీ సీఎం అయ్యే అవకాశం కలిగించింది. ► 2005లో.. ఎన్డీయే కూటమిలోని జేడీయూ పార్టీ అధికారంలోకి వచ్చింది. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. ► 2010లో.. మళ్లీ ఎన్డీయే కూటమి-బీజేపీ అండతోనే నితీశ్ కుమార్ జేడీయూ అధికారం కైవసం చేసుకుంది. ► 2013లో.. ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల కోసం నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ క్యాంపెయిన్ కమిటీని ఏర్పాటు చేసింది. అది జీర్ణించుకోలేని నితీశ్ కుమార్.. బీజేపీతో పదిహేడేళ్ల బంధాన్ని తెంచేసుకున్నాడు. ► బీజేపీకి దూరంగా జరిగినప్పటికీ.. కాంగ్రెస్ సహకారంతో విశ్వాస తీర్మానంలో నెగ్గాడు సీఎం నితీశ్ కుమార్. అయితే.. లోక్‌సభ ఎన్నికల్లో దారుణమైన పరాభవం(20 నుంచి 2 సీట్లకు పడిపోవడం) తర్వాత ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. ► ఏడాది తిరిగే లోపే.. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మద్దతుతో జేడీయూలో తనకు కొరకరాని కొయ్యగా మారిన జితన్ రామ్‌ను ఢీ కొట్టి.. మళ్లీ ముఖ్యమంత్రి గద్దెపై కూర్చున్నారు నితీశ్ కుమార్. ► 2017.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని.. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ఒకటిగా అభివర్ణిస్తుంటారు విశ్లేషకులు. ఈ సమయంలోనే బీహార్‌లో బీజేపీ వ్యతిరేక మహా కూటమి ఏర్పడింది. అదే మహాఘట్బంధన్. ఆర్జేడీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లి ఘన విజయాన్ని కైవసం చేసుకున్నాడు నితీశ్. ఆ సమయంలో బీజేపీపై, ప్రధాని మోదీపై వాడీవేడి విమర్శలు గుప్పించారు ఆయన. రాజకీయ-ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహకారంతో తిరిగి అధికారంలోకి రాగలిగారు. అయితే ఈ బంధం రెండేళ్లకే తెగిపోయింది. ► లాలూ కొడుకు, అప్పటి బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ తేజస్విని ఒత్తిడి చేశాడు నితీశ్. అందుకు ఆర్జేడీ అంగీకరించకపోవడంతో.. సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేశారు. ► ఈ తరుణంలో.. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని మహాఘట్బంధన్ నుంచి బయటకు వచ్చేసి.. 24 గంటలు గడవక ముందే తిరిగి పాత మిత్రుడు బీజేపీ(ఎన్డీయే) సాయంతో ప్రభుత్వాన్ని పడిపోకుండా కాపాడుకున్నాడు. ► 2022లో.. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలని, తనను సీఎం గద్దె నుంచి దించేయాలని బీజేపీ కుట్రకు పాల్పడుతోందన్న అనుమాన ఆరోపణలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి తెగదెంపులు చేసుకుని మళ్లీ ఆర్జేడీ, వామపక్ష, కాంగ్రెస్ మద్దతు తీసుకుంటున్నాడు. #BiharPolitics #NitishKumar #JDU #BJP #Bihar Nitish Kumar after every few months pic.twitter.com/WiPJnvMBO5 — g0v!ñD $#@®mA (@rishu_1809) August 8, 2022 ఇదీ చదవండి::: సీఎం పదవికి నితీష్ రాజీనామా -
బిహార్: ప్రతిపక్షపార్టీ నాయకుడిగా తేజస్వీ యాదవ్
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ బిహార్‌లో ప్రతిపక్ష కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవహరించనున్నారు. మహాకూటమిలో చర్చల అనంతరం రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో 243 సీట్లకు గాను 144 సీట్లను ఆర్జేడీకి కేటాయించారు. కాంగ్రెస్ పార్టీకి 70, లెఫ్ట్ పార్టీలకు 29, జార్ఖండ్ ముక్తి మోర్చాకు ఆర్జేడీ కోటా నుంచి సీట్లు కేటాయించామని కూటమి శనివారం ప్రకటించింది. అయితే ఈ విభజనతో కలత చెందిన చిన్న పార్టీలలో ఒకటైన వీఐపీ పార్టీ కూటమి నుంచి వైదొలింగి. తాము మోసపోయామని ఆ పార్టీ నేతలు విచారణ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ, ఇది ప్రజలకు, డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి మధ్య పోరాటమని పేర్కొన్నారు. ఇక కరోనా సమయంలో దేశంలో అతి పెద్ద బీహార్ ఎలక్షన్లు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా అక్టోబర్ 8తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. బీహార్‌లో అక్టోబర్ 28, నవంబర్ 3, 7వ తేదీలలో పోలింగ్ జరగనుంది. కాగా ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న ప్రకటించనున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నితీశ్‌కుమార్ ప్రభుత్వం నాలుగవసారి కూడా తాము అధికారాన్ని చేజిక్కించుకుంటామని ధీమాగా ఉంది. ఇక వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం రైతు వ్యతిరేకమని ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని ఆర్జేడీ వ్యూహం రచిస్తోంది. దానితో పాటు కరోనాను ఎదుర్కోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ప్రచారం చేయాలని కూడా ప్రతిపక్షం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా సమయంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఎలక్షన్ కమిషన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఓటు వేసే సమయాలను కూడా మార్పు చేసింది. చదవండి: బిహార్‌లో ఎల్జీపీ దూకుడు.. కీలక భేటీ -
రావణుడిగా సీఎం.. రాముడిగా ప్రతిపక్షనేత
పట్నా : దసరా పండుగ సందర్భంగా బిహార్‌లో ఆర్జేడీ ఏర్పాటు చేసిన ఓ పోస్టర్ రాజకీయంగా దుమారం రేపుతోంది. జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్‌ను రావణుడిగా, ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్‌ను రాముడిగా చిత్రీకరిస్తూ ఆర్జేడీ పోస్టర్‌ను ఆవిష్కరించింది. తేజస్వీ ఇంటి సమీపంలోనే ఏర్పాటు చేసిన ఈ పోస్టర్‌పై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ నడుస్తోంది. నితీష్ కుమార్ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేశారని, ప్రజలకు ఆయనపై ఉన్న కోపంతోనే ఈ పోస్టర్‌ను తయారు చేశారని తేజస్వీ పేర్కొన్నారు. ఆర్జేడీ తీరుపై అధికార పక్షం తీవ్రంగా మండిపడుతోంది. సీఎం స్థాయిని దిగజార్చే విధంగా పోస్టర్ ఉందని మండిపడుతోంది. ఈ నెల 21 నుంచి తేజస్వీ నాలుగో విడత ‘‘సంవిధాన్ బచావో న్యాయ్ యాత్ర’ను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే ఆర్జేడీ మద్దతుదారులు ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేశారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా దీనిపై జేడీయూ మిత్రపక్షం బీజేపీ ఇప్పటి వరకూ ఏలాంటి ప్రకటన చేయకపోగా.. కాంగ్రెస్ మాత్రం ఈ పోస్టర్‌పై భిన్నంగా స్పందించింది. రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తిని రావణుడిగా చిత్రీకరించడం సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. -
సీఎంగారూ.. మీ ఎమ్మెల్యే డాన్స్ చూశారా?
-
సీఎంగారూ.. మీ ఎమ్మెల్యే డాన్స్ చూశారా?
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధికారిక ట్విటర్ పేజీలో పోస్ట్ చేసిన వీడియో బిహార్ రాజకీయాల్లో కలకలం రేపింది. జేడీ(యూ) ఎమ్మెల్యే డాన్స్ చేసిన చూడంటూ ఆర్జేడీ ఒక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘మీ ఎమ్మెల్యే ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి’ అంటూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ఉద్దేశించి పేర్కొంది. ఒక బహిరంగ కార్యక్రమంలో జేడీ(యూ) ఎమ్మెల్యే అభయ్ కుమార్ సిన్హాలా కనిపిస్తున్న వ్యక్తి కురచ దుస్తుల భామతో ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నట్టు వీడియోలో ఉంది. అంతేకాదు సదరు మహిళను ఎమ్మెల్యే అభ్యంతరకరంగా తాకుతూ కనిపించారు. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనే వివరాలను ఆర్జేడీ వెల్లడించలేదు. వీడియోలో ఉన్నది అభయ్ కుమార్ అవునో, కాదో స్పష్టం కాలేదు. గయ జిల్లాలోని టికారి నియోజకవర్గానికి అభయ్ కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహాకూటమి నుంచి బయటకు వెళ్లిపోయి తనదారి తను చూసుకోవడంతో జేడీ(యూ), ఆర్జేడీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. లాలూ తనయుడు తేజశ్వి యాదవ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో మహాకూటమితో బంధాన్ని నితీశ్ తెంచుకున్నారు. తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో చేతులు కలిపారు. ఆత్మప్రబోధానుసారమే మహాకూటమి నుంచి బయటకు వచ్చానని నితీశ్ అప్పట్లో చెప్పారు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ జేడీ(యూ) ఎమ్మెల్యే డాన్స్ వీడియోను ఆర్జేడీ ట్విటర్లో పెట్టింది. దీనిపై సీఎం నితీశ్ ఎలా స్పందింస్తారో చూడాలి. नैतिकता बाबू @NitishKumar के टिकारी से प्रिय विधायक अभय कुमार सिन्हा अपनी अंतरात्मा की धुन पर थिरकते हुए! pic.twitter.com/tL1TbcCOW5 — Rashtriya Janata Dal (@RJDforIndia) October 11, 2017 -
కూటమిగా ఏర్పడ్డ ఆర్జేడీ, జేడీ(యూ)
న్యూఢిల్లీ: త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, అధికార పార్టీ జేడీ(యూ)లు కలిసి పోటీచేయనున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ రెండు గంటల పాటు చర్చించి ఈ నిర్ణయాన్ని వెల్లడించారని సమాజ్ వాదీ పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ గోపాల్ యాదవ్ తెలిపారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సమక్షంలో నితీష్, లాలు ప్రసాద్ సమావేశమయ్యారని తెలుస్తోంది. 6 మంది సభ్యులు ఉండే ప్యానల్ ఆయా పార్టీలకు సీట్ల కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటుందని, ప్యానల్ సభ్యుల పేర్లను వెల్లడించేందుకు రామ్ గోపాల్ నిరాకరించారు. ఆర్జేడీ, జేడీ(యూ) రెండు పార్టీల నుంచి ముగ్గురు చొప్పున సభ్యులు ఈ ప్యానల్లో ఉంటారని ఆయన తెలపారు. సీఎం అభ్యర్ధి విషయాన్ని మీడియా ఆయన వద్ద ప్రస్తావించగా ఈ విషయంలో ఎటువంటి వివాదాలు లేవని పేర్కొన్నారు.