పట్నా: ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహా కూటమి నుంచి వైదొలిగి బీజేపీలో చేరి.. మళ్లీ సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి బిహార్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా జేడీ(యూ), ఆర్జేడీ పార్టీల్లో జరగుతున్న చర్చలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పక్క పార్టీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు నితీష కుమార్ పార్టీ జేడీ(యూ) తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 10 మందితో జేడీయూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో 13 మందిని లాగేందుకు ఆర్జేడీ అధినేత లాలూ సైతం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా పట్నాలో అందుబాటులో ఉండాలని లాలూ ఆదేశించారు. నితీష్ కుమార్ మహా కూటమిని మారే సమయంలో బిహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
శనివారం రాత్రి 7 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలతో నితీష్ చర్చలు జరపనున్నారు. అయితే ఈ రాత్రికి నితీష్ సీఎంగా రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ మద్దతుతో రేపు(ఆదివారం) మరోసారి బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆదివారం తెలంగాణలో పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు బిహార్ వెళ్లనున్నారు. ఆదివారం పట్నాలో బీజేపీ ఎమ్మెల్యేలతో వారు సమావేశం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment