పాట్నా: బీహార్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామంపై జోరుగా చర్చ నడుస్తోంది. నితీశ్ కుమార్ సర్కార్‌కు బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా ఝలక్ ఇచ్చారు. మొదటి నుంచి నితీశ్‌కు కొరకరాని కొయ్యగా తయారైన విజయ్.. తనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టినా రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
నాకు వ్యతిరేకంగా మహాఘట్‌బంధన్ కూటమి నుంచి 55 ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. నేనొక పక్షపాతినని, నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తున్నానని అందులో వాళ్లు ఆరోపించారు. అవన్నీ ఉత్తవే. అలాంటి ఆరోపణల నేపథ్యంతో రాజీనామా చేయాల్సి వస్తే.. అది నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే అంశమే. అందుకే నేను రాజీనామా చేయదల్చుకోలేదు అని విజయ్ కుమార్ సిన్హా తెలిపారు.
బీజేపీ నేత అయిన విజయ్ కుమార్ సిన్హా వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. జేడీయూతో కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన నిర్ణయాలు ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండేవి. సభాముఖంగా నితీశ్‌ను ఎన్నోసార్లు మందలించారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన్ని మార్చేయాలంటూ బీజేపీ అధిష్టానానికి నితీశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. ఫలితం లేకుండా పోయింది.
సాధారణంగా.. ప్రభుత్వాలు మారిన సందర్భాల్లో స్పీకర్ పదవి నుంచి సదరు వ్యక్తి వైదొలగాల్సి ఉంటుంది. కానీ, మహాఘట్‌బంధన్ ప్రభుత్వం ఏర్పడి రెండు వారాలు గడుస్తున్నా విజయ్ కుమార్ సిన్హా రాజీనామాకు నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. బీహార్ అసెంబ్లీ వ్యవహారాల నిబంధనల్లో రూల్ నెంబర్ 110 ప్రకారం సిన్హా పదవి నుంచి తప్పుకోవాలంటూ ఆగస్టు 10వ తేదీనే 55 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన తీర్మానాన్ని అసెంబ్లీ సెక్రటేరియెట్‌కు అందించింది కూటమి ప్రభుత్వం. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు బీజేపీ కూడా ఈ వ్యవహారంపై గప్‌చుప్‌గా ఉంటోంది.
మరోవైపు ఆయన స్వచ్ఛందంగా వైదొలిగితే బాగుంటుందని జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి ముందు నుంచి చెబుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 24న(ఇవాళ) నుంచి రెండు రోజులపాటు బీహార్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్‌లోనే బలనిరూపణతో పాటు స్పీకర్ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ విజయ్ కుమార్ సిన్హా గనుక ఈ సమావేశాలకు గైర్హాజరు అయితే డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారి(జేడీయూ) సభా వ్యవహారాలను చూసుకుంటారు.
ఇదీ చదవండి: బీజేపీ మాకు భయపడుతోంది
Comments
Please login to add a commentAdd a comment