#BiharPoliticalCrisis: ‘‘ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశా.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశాం’’ అంటూ స్వయంగా జనతా దళ్(యునైటెడ్) సీనియర్ నేత నితీశ్ కుమార్ ప్రకటనతో ఉత్కంఠకు తెరపడింది. బీహార్ రాజకీయాలను మలుపు తిప్పుతూ.. బీజేపీతో తెగదెంపుల ప్రకటన చేసిన నితీశ్.. ప్రభుత్వ ఏర్పాటులో సాయానికి ఆర్జేడీ, వామపక్ష, కాంగ్రెస్‌లు ముందుకు రావడంతో కొండంత ధైర్యం ప్రదర్శించారు. అయితే.. బీజేపీ అయితేనేం మరో పార్టీ అయితేనేం నితీశ్‌కు తెగదెంపులు చేసుకోవడం ఇలా కొత్తేం కాదు!
రాజకీయాల్లో శాశ్వత శత్రువులెవరూ ఉండరు.. అలాగే మిత్రులు కూడా ఉండరు. బీహార్ సీనియర్ నేత నితీశ్ కుమార్ విషయంలో అదే నిజం అనిపిస్తోంది. నితీశ్ కుమార్‌లో నిలకడలేనితనం.. రాజకీయాల్లోకి వచ్చిన తొలి నాళ్ల నుంచే అలవడింది. జయప్రకాశ్ నారాయణ్ స్ఫూర్తితో సత్యేంద్ర నారాయణ్ సిన్హా నేతృత్వంలోని జనతా దళ్‌లో చేరాడు నితీశ్ కుమార్. తొలినాళ్లలో ప్రతిపక్ష నేతగా ఉంటూనే నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌తో దోస్తీ కట్టాడు. అది 1989లో..
► 1994లో.. లాలూతో కటీఫ్ చెప్పి జార్జి ఫెర్నాండేజ్ నేతృత్వంలోని సమతా పార్టీతో జట్టు కట్టాడు.
► 1996లో బర్హ్ లోక్ సభ సీటు గెలిచిన తర్వాత.. సమతా పార్టీకి దూరం జరిగి బీజేపీతో చేతులు కలిపాడు.
► అంతేకాదు అటల్ బిహారీ వాజ్‌పేయి కేబినెట్‌లో మంత్రిత్వ శాఖను(రైల్వే మంత్రిత్వ శాఖ) దక్కించుకున్నాడు. ఈ పరిణామం.. అప్పటి జనతాదళ్ ప్రెసిడెంట్ శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్ మధ్య చిచ్చుపెట్టిందని అంటారు. ఈ దెబ్బకు లాలూ సొంతగా ఆర్జేడీని ఏర్పాటు చేశారు. అలా నితీశ్ తన రాజకీయ స్వార్థం కోసం చిచ్చురగిల్చాడనే అపవాదు ముద్రపడిపోయింది.
► 2000 సంవత్సరంలో.. ఎన్డీయే కూటమి తరపున నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. కానీ, మ్యాజిక్ ఫిగర్(163 సీట్లు) కంటే 12 సీట్లు తక్కువ ఉండడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రమాణం చేసిన వెంటనే రాజీనామా చేయాల్సి వచ్చింది.
► 2003లో నితీశ్ సమక్షంలోనే సమతా పార్టీ, శరద్ యాదవ్ నేతృత్వంలోని జనతా దళ్‌లో విలీనం అయ్యింది. అదే సమయంలో బీజేపీ కూటమితో పొత్తు సైతం కొనసాగింది. అలా జేడీ(యూ) ఏర్పడి.. నితీశ్‌కు మళ్లీ సీఎం అయ్యే అవకాశం కలిగించింది.
► 2005లో.. ఎన్డీయే కూటమిలోని జేడీయూ పార్టీ అధికారంలోకి వచ్చింది. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు.
► 2010లో.. మళ్లీ ఎన్డీయే కూటమి-బీజేపీ అండతోనే నితీశ్ కుమార్ జేడీయూ అధికారం కైవసం చేసుకుంది.
► 2013లో.. ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల కోసం నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ క్యాంపెయిన్ కమిటీని ఏర్పాటు చేసింది. అది జీర్ణించుకోలేని నితీశ్ కుమార్.. బీజేపీతో పదిహేడేళ్ల బంధాన్ని తెంచేసుకున్నాడు.
► బీజేపీకి దూరంగా జరిగినప్పటికీ.. కాంగ్రెస్ సహకారంతో విశ్వాస తీర్మానంలో నెగ్గాడు సీఎం నితీశ్ కుమార్. అయితే.. లోక్‌సభ ఎన్నికల్లో దారుణమైన పరాభవం(20 నుంచి 2 సీట్లకు పడిపోవడం) తర్వాత ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు.
► ఏడాది తిరిగే లోపే.. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మద్దతుతో జేడీయూలో తనకు కొరకరాని కొయ్యగా మారిన జితన్ రామ్‌ను ఢీ కొట్టి.. మళ్లీ ముఖ్యమంత్రి గద్దెపై కూర్చున్నారు నితీశ్ కుమార్.
► 2017.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని.. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ఒకటిగా అభివర్ణిస్తుంటారు విశ్లేషకులు. ఈ సమయంలోనే బీహార్‌లో బీజేపీ వ్యతిరేక మహా కూటమి ఏర్పడింది. అదే మహాఘట్‌బంధన్. ఆర్జేడీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లి ఘన విజయాన్ని కైవసం చేసుకున్నాడు నితీశ్. ఆ సమయంలో బీజేపీపై, ప్రధాని మోదీపై వాడీవేడి విమర్శలు గుప్పించారు ఆయన. రాజకీయ-ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహకారంతో తిరిగి అధికారంలోకి రాగలిగారు.
అయితే ఈ బంధం రెండేళ్లకే తెగిపోయింది.
► లాలూ కొడుకు, అప్పటి బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ తేజస్విని ఒత్తిడి చేశాడు నితీశ్. అందుకు ఆర్జేడీ అంగీకరించకపోవడంతో.. సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేశారు.
► ఈ తరుణంలో.. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని మహాఘట్‌బంధన్ నుంచి బయటకు వచ్చేసి.. 24 గంటలు గడవక ముందే తిరిగి పాత మిత్రుడు బీజేపీ(ఎన్డీయే) సాయంతో ప్రభుత్వాన్ని పడిపోకుండా కాపాడుకున్నాడు.
► 2022లో.. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలని, తనను సీఎం గద్దె నుంచి దించేయాలని బీజేపీ కుట్రకు పాల్పడుతోందన్న అనుమాన ఆరోపణలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి తెగదెంపులు చేసుకుని మళ్లీ ఆర్జేడీ, వామపక్ష, కాంగ్రెస్ మద్దతు తీసుకుంటున్నాడు.
#BiharPolitics #NitishKumar #JDU #BJP #Bihar
— g0v!ñD $#@®mA (@rishu_1809) August 8, 2022
Nitish Kumar after every few months pic.twitter.com/WiPJnvMBO5
ఇదీ చదవండి::: సీఎం పదవికి నితీష్ రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment