పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను టార్గెట్ చేస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధాన మంత్రి కావాలనే కోరికతోనే నితీష్ కుమార్ కాంగ్రెస్, ఆర్జేడీతో చేతులు కలిపారని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రధాని కావాలనే ఆశయాలకోసం అభివృద్ధి కారకుడి నుంచి అవకాశవాది అయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, హోం మంత్రి అమిత్ షా బీహార్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా పశ్చిమ చంపారన్‌లో బీజేపీ శ్రేణులు తలపెట్టిన సభలో అమిత్ షా ప్రసంగించారు. సభలో అమిత్ షా మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని ప్రజలు అతిపెద్ద పార్టీగా నిలబెట్టారు. ప్రధాని మోదీ తాను ఇచ్చిన మాట కోసం నితీష్‌కు సీఎంను చేశారు. కానీ నితీష్ మాత్రం మూడేళ్లకోసారి ప్రధాని కావాలనే కలలు కంటున్నారు. నితీశ్ కుమార్‌కు బీజేపీలో తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి. కేవలం పదవీ కాంక్ష కోసమే నితీష్.. కాంగ్రెస్, ఆర్జేడీతో చేతులు కలిపారు. ఆర్జేడీ, జేడీ(యూ) కలయిక చమురు, నీరు వంటిది. ఈ రెండు పార్టీల కూటమి అపవిత్ర కూటమి అంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. నితీశ్ ప్రధాని కావాలనే ఆశయం బీహార్ ను విభజించిందని ఘాటు విమర్శలు చేశారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఫైరయ్యారు. బీహార్‌ను జంగిల్ రాజ్‌గా మార్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీహార్‌లో కల్తీ మద్యం తాగి ప్రజలు మరణిస్తుంటే నితీష్ సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. బీహార్‌ను నితీష్, లాలూ కూటమి అభివృద్ధి చేయలేదని అన్నారు. బీహార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. పూర్తి మెజార్టీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని ఆసక్తికర కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో కూడా జేడీయూ కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment